సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!

27 Apr, 2014 00:48 IST|Sakshi
సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!

ప్రతిభకు కొలమానం లేదు అన్న మాట విశ్వ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడు పాట రాస్తాడు, కంపోజ్ చేస్తాడు, పాడతాడు... పాటకు సంబంధించిన ప్రతి అంశం మీద తన ముద్ర వేయాలని తపిస్తాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా... గీత రచయితగా అతడిదో ప్రత్యేక శైలి. వెస్టర్న్ సాంగ్‌కి సైతం తెలుగు సువాసనని అద్దే అతడిది ఓ వైవిధ్యభరితమైన దారి. పాటల పూబాటలో తన పయనం గురించి విశ్వ చెబుతోన్న విశేషాలు...
 
మణిశర్మగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు ఓ సినిమాలో టైటిల్‌సాంగ్ రాసి, పాడే చాన్సిచ్చారాయన. నా పర్‌ఫార్మెన్స్ నచ్చి... ‘నీలో మంచి గాయకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు’ అన్నారు. నేను పాట రాస్తాను, కంపోజ్ చేస్తాను, పాడతాను, కీబోర్డ్ వాయిస్తాను, రికార్డ్ చేస్తాను, మిక్సింగ్ కూడా చేస్తాను.
 
ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కంపోజ్ చేశారు, ఎన్ని పాడారు?
 ‘రేసుగుర్రం’లో రాసిన ‘డౌన్ డౌన్’ పాటతో నూట యాభై పూర్తయ్యాయి. హైదరాబాద్ నవాబ్స్, మంగళ, నేను నా రాక్షసి, పోలీస్ పోలీస్, క్షత్రియ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. చాలా పాటలు పాడాను. ‘సంతోషం’లో మెహబూబా మెహబూబా, ‘అతడు’ టైటిల్‌సాంగ్, ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో మొదలైనవి పేరు తెచ్చాయి. అయితే రచయితగానే ఎక్కువ సక్సెస్ అయ్యాను.

అసలు సంగీత, సాహిత్యాల మీద ఇంత ప్రీతి ఎలా ఏర్పడింది?
నాన్న హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగి. ఆయనకు సాహిత్యమంటే చాలా మక్కువ. అమ్మకు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉంది. వాళ్లిద్దరి అభిరుచులూ కలిపి నాకు వచ్చాయి. బీహెచ్‌ఈఎల్‌లో ‘శ్రీకళా నిలయం’ అనే ఆర్ట్ అసోసియేషన్ ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నేను వాటిలో పాల్గొనేవాడిని. నెమలికంటి రాధాకృష్ణమూర్తిగారని యద్దనపూడి సులోచనారాణిగారి సోదరుడు... ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటనే పలు నాటకాల్లో నటించాను. ఏడో యేటనే ఆంధ్ర నాటక కళా పరిషత్తు అవార్డును అందుకున్నాను. ఆ అనుభవం నాకు సంగీత, సాహిత్యాల పట్ల మక్కువను పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికి ఆ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇటు వచ్చేశాను.

మరి మీ టాలెంట్‌కి తగిన సక్సెస్ వచ్చిందంటారా?
నేనెప్పుడూ సక్సెస్‌ని ప్రామాణికంగా తీసుకోను. చేతి నిండా అవకాశాలు ఉంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది!
 
మీరు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకుంటారట... నిజమేనా?
 నిజమే. పాటకి ఓ స్థాయి ఉండాలనుకుంటాను. దిగజారి రాయలేను. అలా చేయలేక పెద్ద పెద్ద సంగీత దర్శకులిచ్చిన అవకాశాలు వదిలేసుకున్నాను. వారి దగ్గర పొగరుబోతుననిపించుకున్నాను.
 
అంటే... దిగజారి రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా?
 కచ్చితంగా ఉన్నాయి. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’ అంటూ రాసిన వేటూరికే ‘ఆకు చాటు పిందె తడిసె’ అంటూ రాయాల్సి వచ్చింది. తన స్థాయికి తగని పాటలు రాయాల్సి వచ్చినందుకు వేటూరి గారు కూడా ఎన్నోసార్లు బాధపడటం మనం చూశాం కదా!
 అలా ఎందుకు జరుగుతోందంటారు?
 కొందరు సంగీత దర్శకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండదు. అయినా జోక్యం చేసుకుంటారు. కొన్ని పదాలు తీసేస్తారు. తమకు నచ్చినవి చేర్చేస్తారు. రచయితలకి స్వాతంత్య్రం లేదు. వారి అభిరుచికి విలువా లేదు. ఇది పాటకి శ్రేయస్కరం కూడా కాదు.
 
 మరి ఈ పరిస్థితి మారేదెలా?
 అది నేను చెప్పలేను. కానీ పాటకి నావంతు న్యాయం నేను చేస్తానని మాత్రం చెప్తాను. అందుకే నా పాటల్లో అశ్లీలత, అసభ్యత లేకుండా చూసుకుంటాను. మోడర్న్ సాంగ్స్ రాసినా కూడా అచ్చ తెలుగు పదాలనే వాడుతుంటాను. మంచి పాటను గుర్తించగలిగే విజ్ఞత ఉన్న శ్రోతలు... మంచి అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకులు కూడా మనకింకా ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు.
 
మీరూ ప్రయోగాలు చేస్తారుగా?

 అవును. కానీ ఆ ప్రయోగం ప్రయోజనకరంగానే ఉండేలా చూసుకుంటాను. ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటలు రాస్తుంటే ఏఎన్నార్ వచ్చారు. ‘‘కొత్త పంథాలో పాటలు బాగానే రాస్తున్నావు’’ అంటూ  కాళిదాసు శ్లోకం ఒకటి చెప్పారు. దాని భావమేమిటంటే... ‘‘కొత్త ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే కొత్తవన్నీ గొప్పవని కాదు, పాతవన్నీ తీసి పారేసేవీ కాదు. తెలివైన రచయిత పాతదనంలోని మంచిని తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల పేరిట వింత పోకడలు పోకూడదు.’’ ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా భాషను పాడు చేయను.
 
ఎప్పటికీ ఈ మాట మీదే నిలబడతారా?

 కచ్చితంగా. దిగజారి రాయాల్సి వచ్చిన రోజున పాట రాయడం మానుకుంటాను. పాచిపని చేసుకుని అయినా బతుకుతాను గానీ కళకు ద్రోహం చేయను.
 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా