ఐస్‌క్రీమ్ కిల్లర్

25 Oct, 2015 19:36 IST|Sakshi
ఐస్‌క్రీమ్ కిల్లర్

క్రైమ్ ఫైల్
 జూన్ 10, 2011... వియెన్నా (ఆస్ట్రియా)
 ‘‘టిమ్... లే త్వరగా. మిట్ట మధ్యాహ్నం ఏంటీ నిద్ర?’’... భర్తని పట్టి కుదిపింది మార్గరెట్.
 ‘‘ఏంటి మ్యాగీ నువ్వు?  శెలవు కదా అని హాయిగా పడుకుంటే, ఏం కొంప మునిగిపోయిందని లేపుతున్నావ్?’’... విసుక్కున్నాడు టిమ్.
 ‘‘కొంప మునిగిందనే లేపుతున్నాను. లే ముందు’’ అంటూ చెయ్యిపట్టి లాగింది. ఇక తప్పదని లేచాడు టిమ్. ‘‘రా నాతో’’ అంటూ బయటకు లాక్కెళ్లింది మార్గరెట్. పక్కింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు.
 
 ‘‘ఏం జరిగింది? ఇంతమంది ఉన్నా రేంటి? పోలీసులెందుకు వచ్చారు?’’ అంటూ అటు పరుగెత్తాడు టిమ్. ఆ ఇంటి బేస్‌మెంట్‌లో పోలీసులు ఏదో వెతుకు తున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లాడు టిమ్. ‘‘ఏంటి సర్ ఇదంతా?’’ అన్నాడు.
 టిమ్‌ని పరికించి చూశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మీరెవరు?’’ అన్నాడు.
 ‘‘నా పేరు టిమ్. నాది పక్కిల్లే.’’
 అలాగా అన్నట్టు తలూపాడు. ‘‘ఈ ఇంట్లో వాళ్ల గురించి మీకేమైనా తెలుసా?’’... అడిగాడు.
 ‘‘ఈ ఇంట్లో మ్యాన్‌ఫ్రెడ్ హింటర్ బర్గర్, అతని భార్య ఎలిజబెత్ ఉంటున్నారు. వాళ్లది ఐస్‌క్రీమ్ వ్యాపారం. ఇద్దరూ చాలా మంచివాళ్లు.’’

 ‘‘వాళ్లతో మీకెప్పటి నుంచి పరిచయం? క్లోజ్‌గా ఉంటారా?’’
 ‘‘మరీ క్లోజేమీ కాదు సర్. హలో అంటే హలో అనుకుంటాం. మేమిక్కడికి వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. కానీ వాళ్లు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారట. ఇంతకీ ఏం జరిగింది సర్? వాళ్లకేమైనా అయ్యిందా కొంపదీసి?’’
 ‘‘ఎవరికో ఏదో జరిగింది మిస్టర్ టిమ్. కానీ ఎవరికో తెలియదు. ఓసారి అలా చూడండి .’’
 ఇన్‌స్పెక్టర్ చూపించిన వైపు చూశాడు టిమ్. అక్కడ... గోడ పక్కగా రెండు ఐస్‌క్రీమ్ టబ్స్ ఉన్నాయి. ‘‘ఐస్‌క్రీమ్ టబ్స్... మ్యాన్‌ఫ్రెడ్ వాళ్ల షాపులోవి అయ్యుంటాయి’’ అన్నాడు టిమ్ వాటిలో వింతేముంది అన్నట్టు. ‘‘నేను చూడమంది వాటిని కాదు. వాటిలోంచి కింద దిమ్మ రించిన కాంక్రీట్‌ని’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్.

అప్పుడు అటువైపు దృష్టి సారించాడు టిమ్. అక్కడ పొడి కంకర ఉంది. ఏమీ అర్థం కాలేదు. ఏంటన్నట్టు ఇన్‌స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్‌స్పెక్టర్ అన్నాడు... ‘‘అర్థం కాలేదు కదూ! అది మామూలు కంకర కాదు మిస్టర్ టిమ్. ఆ కంకర అక్కడక్కడా తడిసి గడ్డ కట్టింది. అది నీటి తడి కాదు... రక్తం. కంకర నిండా కుళ్లిపోయిన మాంసపు ముక్కలు.. ఎముకలు.. ఏవేవో ఉన్నాయి. అవన్నీ ఏ కోడివో, కుక్కవో కాదు.. మనిషివి! కాదు.. మనుషులవి. రెండు గుండెలు, నాలుగు ఊపిరితిత్తులు ఉన్నాయి. అంటే అవి ఇద్దరు మనుషుల శరీర భాగాలన్నమాట’’.
 
వింటుంటేనే కడుపులో దేవినట్ట య్యింది టిమ్‌కి. ‘‘ఏంటి సర్ ఈ దారుణం? ఎవరివా శరీర భాగాలు?’’
 ‘‘తెలియదు. బేస్‌మెంట్‌ని బాగు చేస్తుంటే వర్కర్‌కి ఈ టబ్స్ కనిపించాయి. తెరిచి చూస్తే కంకర. తీసి వాడదామను కుంటే భయంకరమైన దుర్వాసన. వెంటనే మాకు ఫోన్ చేశారు. మేం వచ్చి చూస్తే ఇవన్నీ కన్పించాయి. ఇంతకీ ఈ ఇంట్లో వాళ్లని మీరెప్పుడు చూశారు?’’
 ‘‘మ్యాన్‌ఫ్రెడ్‌ని చూసి చాలా రోజు లయ్యింది సర్. ఎలిజబెత్ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సర్?’’
 
ఇన్‌స్పెక్టర్ మాట్లాడలేదు. తాళం పగులగొట్టి, ఇంటి లోపలంతా పరిశీలిం చాడు. కొన్నిచోట్ల గోడల మీద రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లున్నాయి. వంటింట్లో ఓ మూల రంపం ఉంది. దాని చెక్క పిడి మీదా రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో పలు సందేహాలు తలెత్తాయి. హాల్లో ఉన్న మ్యాన్‌ఫ్రెడ్, ఎలిజబెత్‌ల ఫొటోలు తీసుకుని స్టేషన్‌కి బయలుదేరాడు.
     
వియెన్నా ప్రధాన రహదారి... ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. అంతలో ఉన్నట్టుండి మరో కారు అడ్డుగా రావడంతో దానికి ఠక్కున బ్రేకు పడింది.
 ‘‘ఏయ్... బతకాలని లేదా? ఏంటా చెత్త డ్రైవింగ్? బ్రేక్ పడటం ఆలస్యమై ఉంటే చచ్చి ఉండేవాడివి’’... అరిచింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామె.
 ‘‘మనుషుల్ని చంపడం మీకు అలవాటేగా మిసెస్ ఎలిజబెత్ కరాన్జా’’ అంటూ కారు దిగాడు ఇన్‌స్పెక్టర్. ఖంగు తింది ఎలిజబెత్. ‘‘సారీ సర్... ఎవరో అనుకుని అలా మాట్లాడాను’’ అంది ఎంతో మృదువుగా.
 
ఆమె కారు దగ్గరకు వచ్చాడు ఇన్‌స్పెక్టర్. డోరు తెరిచాడు. ఎలిజబెత్ చేతిని పట్టుకుని బేడీలు వేశాడు. అవాక్క యిపోయింది ఎలిజబెత్. ‘‘ఏంటి సర్... నేనేం చేశాను?’’ అంది కంగారుగా.
 ‘‘స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం. రోడ్డుమీద ఏం బాగుంటుంది?’’ అంటూ ఆమెను తీసుకెళ్లి కారెక్కించాడు.
     
‘‘ఇక వాదించి లాభం లేదు. నాకు సగం నిజం తెలిసింది. మిగతా సగం నువ్వు చెప్పేస్తే మంచిది.’’
 తల అడ్డంగా ఊపింది ఎలిజబెత్. ‘‘మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సర్. నేను...’’
 ‘‘ఏ తప్పూ చేయలేదు అంటావ్. కానీ అది నమ్మడానికి నేనంత పిచ్చోణ్ని కాదు. నీ భర్త హోల్జర్ హాల్జ్ మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి మాయమైపోయాడు. వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడన్నావ్. తర్వాత నీ జీవితంలోకి వచ్చిన ప్రియుడు మ్యాన్‌ఫ్రెడ్ మాయ మయ్యాడు. ఎవరైనా అడిగితే బ్రేకప్ అయ్యిందన్నావ్. కానీ వాళ్లిద్దరూ మాంసపు ముద్ద లుగా కాంక్రీటులో దాగివున్నా రని నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇక అడ్డంగా బొంకొద్దు. నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పకపోతే ఆడపిల్లవని కూడా చూడకుండా మా ట్రీట్‌మెంట్ రుచి చూపించాల్సి ఉంటుంది.’’
 
‘‘వద్దు సార్’’... అరిచినట్టే అంది ఎలిజబెత్. ‘‘ఆ పని మాత్రం చేయకండి. నేనిప్పుడు గర్భవతిని.’’
 ఉలిక్కిపడ్డాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఏంటీ... గర్భవతివా? ఎవరి బిడ్డకి... హాల్జ్ బిడ్డకా, మ్యాన్‌ఫ్రెడ్ బిడ్డకా?’’
 ‘‘వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరని మీరే అన్నారు కద సార్. ఇక వాళ్ల బిడ్డకి తల్లినెలా అవుతాను? నా కడుపులో ఉన్నది నా కొత్త బాయ్‌ఫ్రెండ్ బిడ్డ’’
 ‘‘అంటే వాళ్లిద్దరినీ...’’
 ‘‘నేనే చంపాను. చంపి ముక్కలు ముక్కలు చేసేశాను.’’
 ‘‘ఎందుకు?’’
 
ఇన్‌స్పెక్టర్ అలా అడగ్గానే పెద్దగా నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వికృతంగా ఉంది. ‘‘ఎందుకేమిటి సర్? ఒకణ్ని నేను పెళ్లి చేసుకున్నాను. మంచి భార్యగా నడచుకున్నాను. కానీ వాడు మాత్రం మంచి భర్త కాలేకపోయాడు. నా మీద ప్రేమ లేదు. ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిజ్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఓ పెళ్లామూ ఉంది అన్నట్టుగా ప్రవర్తించేవాడు. వాడెలా ఉన్నా ఒక బిడ్డను ఇస్తే చాలనుకున్నాను. కానీ ఆ సంతోషమూ లేకుండా పోయింది. ఓరోజు రాత్రి వాడితో నాకో బిడ్డ కావాలన్నాను. ముఖం తిప్పుకున్నాడు.

అటువైపు తిరిగి పడుకున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. నేను, నా ఫీలింగ్స్ వాడికి పట్టవని అర్థమైంది. అలాంటివాడు నాకెందుకని చంపి పారేశాను.’’
 నోరు తెరచుకుని వింటున్నాడు ఇన్‌స్పెక్టర్. ఎంతో కూల్‌గా, రిలాక్స్‌డ్‌గా తను చేసిన దారుణాన్ని వివరిస్తోన్న ఎలిజబెత్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదతనికి. ఎలిజబెత్ మాత్రం చెప్పుకుంటూ పోతోంది.
 
‘‘ఆ తర్వాత మ్యాన్‌ఫ్రెడ్ పరిచయ మయ్యాడు. ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. సహజీవనం మొదలు పెట్టాడు. పెళ్లి కాక పోయినా ప్రపంచానికి వాడు నా భర్త అనే చెప్పాను. వాడినీ నేనెంతో ప్రేమించాను. వాడయినా నాకో బిడ్డను ఇస్తాడని ఆశపడ్డాను. కానీ నా కల నెరవేరలేదు. పైగా వాడు వేరే అమ్మాయితో ప్రేమాయణం మొదలెట్టాడు. దాంతో వాడినీ నా భర్త దగ్గరకే పంపేశాను.’’
 ‘‘వాళ్లనలా ముక్కలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది?’’
 ‘‘నన్ను బాధ పెట్టడానికి వాళ్లకు మనసొప్పినట్టే నాకూ ఒప్పింది. చంపాక బాడీస్‌ని ఏం చేయాలో తోచలేదు.

ఐస్ క్రీమ్స్ పెట్టే బాక్సుల్లో ఉంచాను. అయినా కంపు కొట్టాయి శవాలు. ఎన్ని స్ప్రేలు వాడినా ఫలితం లేకపోయింది. అందుకే ముక్కలు చేసేసి, కాంక్రీట్‌లో కలిపి టబ్బుల్లో పెట్టాను. తీసుకెళ్లి బేస్‌మెంట్‌లో పడేశాను. కానీ పొద్దున్న అవి పనివాళ్ల కంటబడ్డాయి. వాళ్లు మీకు ఫోన్ చేయడం విన్నాను. విషయం బయటపడుతుందని అర్థమై వేరే చోటికి పారిపోదామనుకునే లోపే మీరు నన్ను పట్టుకున్నారు.’’
 ‘‘ఛ... ఓ ఆడదానివై ఉండి ఇంత దారుణం చేశావా? ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నావ్. ఒకవేళ అతడూ నిన్ను తల్లిని చేయకపోతే చంపేసేదానివా?’’
 
నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వెనుక అర్థమేమిటో ఇన్‌స్పెక్టర్‌కి అర్థమయ్యింది. ‘‘సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన నీలో అమ్మ మనసు ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక ప్రాణికి జన్మనివ్వడానికి రెండు ప్రాణాలు తీసిన నిన్నెలా అర్థం చేసు కోవాలి?’’ అనేసి వెళ్లిపోతోన్న ఇన్‌స్పెక్టర్ వైపు చూసి తనలో తనే నవ్వుకుంది ఎలిజబెత్... నాలుగు నెలల బిడ్డ ఉన్న తన పొట్టని తడుముకుంటూ!
 2012, నవంబర్ 23న ఎలిజబెత్ కరాన్జాకి జీవిత ఖైదును విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తీప్పు వెలువడే లోపే బిడ్డకు జన్మనిచ్చింది ఎలిజబెత్. ఆ బిడ్డ తండ్రిని జైలు అధికారుల సమక్షంలోనే పెళ్లాడింది కూడా.

ఈ  కేసు ఆస్ట్రియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ‘ఐస్‌క్రీమ్ కిల్లర్’ అంటూ మీడియా విరివిగా కథనాలు ప్రసారం చేసింది. 2011లో ‘ఎడిషన్ ఎ’ అనే పబ్లిషింగ్ కంపెనీ ‘ద ఐస్ కిల్లర్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. దీనిలో ఎలిజబెత్ కథ మొత్తం ఉంది. ఆమె జీవితంలో ఏం జరిగింది, ఎలా తన భర్తనీ ప్రియుణ్నీ చంపింది వంటి విషయాలన్నీ కూలంకషంగా ఉన్నాయి. తర్వాత స్వయంగా కర్జానాయే తన జీవితం ఆధారంగా ‘మై టూ లైవ్స్’ అనే పుస్తకం రాసింది. ఈ పుస్తకం విరివిగా అమ్ముడయ్యింది.
- సమీర నేలపూడి

మరిన్ని వార్తలు