ఎవరిది?

27 Feb, 2016 23:03 IST|Sakshi
ఎవరిది?

 మిస్టరీ
రైలు వేగంగా పరిగెడుతోంది. ‘‘అబ్బా... గుండె పట్టేసినట్టుగా ఉంది’’... తనలో తనే అనుకుంది మిషెల్లా. ఏదో ఇబ్బంది. గుండెను ఎవరో పట్టి నొక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. వెంటనే బ్యాగ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి రెండు గుటకలు తాగింది. కాస్త నెమ్మదించినట్టుగానే ఉంది.
 ‘‘ఏంటండీ... ఒంట్లో బాలేదా?’’ అంది ఎదురుగా కూర్చున్నామె. అవు నన్నట్టు తలూపింది మిషెల్లా. ‘‘ఏంటో నండీ... సడెన్‌గా గుండె పట్టేసినట్టు అవుతోంది’’ అంది. ‘‘అవునా? ఇదే మొదటిసారా ఇంతకుముందెప్పుడైనా ఇలా అయ్యిందా?’’ అందామె.

ఆవిడా ప్రశ్న ఎందుకడిగిందో తెలియదు కానీ, మనసులో ఏదో మెదిలి నట్టయ్యింది మిషెల్లాకి. తనకు ఇంతకు ముందు ఇలా అయ్యిందా? అయ్యింది. గత వారం. సరిగ్గా రైల్లోనే. కరెక్ట్‌గా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడే. తనకేం అనా రోగ్యం లేదు. కానీ గతవారం ఈ రైల్లో ప్రయాణించినప్పుడు ఉన్నట్టుండి గుండె పట్టినట్టయ్యింది. చెమటలు పోశాయి. రైలు దిగీ దిగగానే ఆస్పత్రికి పరుగెత్తింది. మొత్తం చెకప్ చేసి ఏమీ లేదన్నాడు డాక్టర్. కానీ ఇప్పుడు మళ్లీ ఇలా అయ్యింది. ఏంటిది? ఏం జరుగుతోంది?
 
మైండ్ డైవర్ట్ చేసుకోడానికి పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. అర గంట తిరిగేసరికల్లా గమ్యస్థానం చేరు కుంది. ఆ విషయం మర్చిపోయింది. కానీ దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం సరిగ్గా వారం తర్వాత వచ్చింది. తాను డొనేషన్స్ ఇచ్చే పక్క ఊరి అనాథాశ్రమంలోని పిల్లలతో గడపడానికి రెలైక్కింది మిషెల్లా. మళ్లీ అదే రైలు. అదే ప్రదేశం. అదే సమయం. అదే అవస్థ. గుండె పట్టింది. వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఏదో ఉంది.

ఈ ప్రదేశానికి వచ్చేసరికి తనకేదో అవుతోంది. చెబుదామంటే బోగీలో ఎవరూ లేరు. దాంతో మరింత భయం వేసింది. చల్లగాలి కోసం కిటికీ తెరిచింది. అంతే... ఉలిక్కిపడింది. తెల్లని గౌను... చిన్న జుత్తు... తన వైపే చూస్తోందామె. రైలుతో పాటు సాగు తోంది. కాళ్లు కనబడవే. నేల మీద నిల బడదే. గాలిలో తేలుతోంది. దెయ్యమా? అవును దెయ్యమే. గుండె జారిపోయింది మిషెల్లాకి. రెప్ప వేయడం మర్చిపో యింది. అప్పుడు కనిపించింది ఆమె ముఖం స్పష్టంగా. శాండీ!
 విస్తుపోయింది మిషెల్లా. ‘‘శాండీ’’ అంది వణుకుతోన్న స్వరంతో.
 
‘‘గుర్తుపట్టావా అమ్మా! నేను అక్కడే ఉన్నాను. నేను నీకు అక్కడే దొరుకుతాను. రామ్మా... తప్పకుండా వస్తావు కదూ?’’
 ఆమె రూపం దూరంగా వెళ్లిపోతోంది. మెల్లగా చీకటిలో కలిసిపోతోంది. ‘శాండీ’ అంటూ మిషెల్లా అరుస్తోంది. కానీ ఆమె ఆగలేదు. మాయమైపోయింది. ఎప్పటికో తేరుకుంది మిషెల్లా. ఎంతోకాలంగా తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతున్నట్టుగా అనిపించింది.
   
‘‘అయామ్ సారీ మిసెస్ మిషెల్లా’’... జాలిగా అన్నాడు ఇన్‌స్పెక్టర్. మిషెల్లా మాట్లాడలేదు. అటవీ ప్రాంతంలో వెతికి వెతికి తుప్పల మధ్య నుంచి తీసిన ఆ అస్తిపంజరాన్ని చూస్తోంది. తన కూతురు శాండీ. నెల రోజుల క్రితం... పని మీద పక్క సిటీకి వెళ్లింది. తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి ఆమె ఆత్మ వచ్చి జాడ తెలిపింది. ఆమెను ఎవరో అత్యాచారం చేసి చంపేశారని పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించింది. ఎవరో రైల్లోనే రేప్ చేసి చంపేసి, బయటకు విసిరేసి ఉంటారని పోలీసులు అన్నారు.  

మిషెల్లా అమ్మ మనసు అల్లాడి పోయింది. తర్వాతి వారం రైలులో వెళ్తు నప్పుడు ఆ ప్రాంతానికి ఎప్పుడు చేరు కుంటానా అని ఆమె తహతహలాడింది. రైలు అక్కడికి చే రుకుంది. కానీ ఈసారి మిషెల్లా గుండె పట్టెయ్యలేదు. ఆతృతగా కిటికీ తీసి చూసింది మిషెల్లా. చుట్టూ వెతికింది. ఎక్కడా శాండీ కనిపించలేదు. ఇక కనిపించదేమో. తనకు ఏమయ్యిందో తల్లికి తెలియజేయడానికే అన్నాళ్లూ అక్కడ సంచరించిందేమో.

ఇక తన పని పూర్త య్యిందని పై లోకానికి వెళ్లిపోయిందేమో.  ఆకాశం వైపు చూసింది మిషెల్లా. ‘‘నా బిడ్డ నరకం అనుభవించి చచ్చిపోయింది. మనశ్శాంతి లేకుండా ఆత్మగా తిరుగా డింది. కనీసం అక్కడైనా దానికి శాంతి కలిగించు తండ్రీ’’ అంటూ మనసులోనే ప్రార్థించింది!  

మరిన్ని వార్తలు