అమ్మ ఆరోగ్యం

13 May, 2018 00:28 IST|Sakshi

అమ్మల రోజు... అదేనండీ మదర్స్‌డే రోజున అందరూ అమ్మలకు శుభాకాంక్షలు చెబుతారు. అమ్మలకు ఏవోవో కానుకలు ఇస్తారు. ‘మాతృదేవోభవ’ అంటూ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ‘అనురాగానికి మారుపేరు అమ్మ’ అంటూ పొగడ్తలు కురిపిస్తారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఫొటోలు షేర్‌ చేసుకుంటారు. అక్కడితో సంబరాన్ని సరిపెట్టేసుకుంటారు. మళ్లీ మర్నాటి నుంచి ఎవరి రొటీన్‌ వాళ్లదే. గజి‘బిజీ’ జీవితాల్లో పడి కొట్టుకుపోతూ అమ్మల్ని అంతగా పట్టించుకోవడం మానేస్తారు. తొమ్మిదినెలలు తన కడుపులో భద్రంగా మోసి, కని, కంటికి రెప్పలా పెంచిన అమ్మల కోసం ఏడాదికో రోజు సంబరం చేసుకుంటే అక్కడితో తీరిపోతుందా తల్లి రుణం. పిల్లలను కని పెంచే క్రమంలో అమ్మలు చాలా చాలా త్యాగాలు చేసి ఉంటారు. చివరకు వాళ్ల ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా, పిల్లల ఎదుగుదల కోసం అహర్నిశలు పాటు పడి ఉంటారు. అంతగా శ్రమించిన తల్లులకు ఈసారి అమ్మల రోజున ‘ఆరోగ్య’ కానుక ఇవ్వండి. నడి వయసు మొదలుకొని ముదిమి మీరిన వయసు వరకు వారికి సాధారణంగా అవసరమయ్యే ఆరోగ్య పరీక్షలు జరిపించండి. పెరిగి పెద్దయిన పిల్లలు తల్లులకు ఇవ్వదగిన సరైన కానుక ఇదే.

కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి, ప్రమాదకర పరిస్థితులను నివారించడానికి కాలానుగుణంగా కొన్ని సర్వసాధారణ ఆరోగ్య çపరీక్షలను జరిపించుకుంటూ ఉండటమే మేలు. ముఖ్యంగా ఆరోగ్యాలను పణంగా పెట్టి మరీ కుటుంబాన్ని చక్కదిద్దే తల్లులకు ఇలాంటి పరీక్షలు మరింత అవసరం. మదర్స్‌ డే రోజున తల్లులకు వారి పిల్లలు చేయించదగ్గ కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు, వాటి వివరాలు...

మూత్రపరీక్ష
మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు పురుషుల కంటే మహిళల్లోనే చాలా ఎక్కువ. మహిళల శరీర నిర్మాణమే ఇందుకు కారణం. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో పాటు కిడ్నీల్లో రాళ్లు, కిడ్నీలకు సంబంధించిన ఇతర వ్యాధులు, కాలేయ సమస్యలు, డయాబెటిస్‌ వంటి వ్యాధుల జాడ, వాటి తీవ్రత తెలుసుకోవడానికి మూత్రపరీక్ష తప్పనిసరి. తేలికగా జరిపించుకోగల ఈ పరీక్షతో చాలా సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

థైరాయిడ్‌ పరీక్ష
థైరాయిడ్‌ గ్రంథిలోని లోపాలను, ఆ లోపాల వల్ల తలెత్తే సమస్యలను తెలుసుకోవడానికి టీ3, టీ4, టీఎస్‌హెచ్‌ పరీక్ష చేస్తారు. ఇది ఒకరకమైన రక్తపరీక్ష. హైపో థైరాయిడిజమ్‌ లేదా హైపర్‌ థైరాయిడిజమ్‌ సమస్యలను గుర్తించ డానికి ఈ పరీక్ష చేయించుకోవడం అవసరం. థైరాయిడ్‌ సమస్యలు పురుషుల్లోనూ తలెత్తుతుంటాయి. అయితే, ఈ సమస్యలు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ. థైరాయిడ్‌ గ్రంథి పని చేయకపోవడం లేదా చాలా తక్కువగా పనిచేయడాన్ని హైపోథైరాయిడిజమ్‌ అంటారు. రోగనిరోధక వ్యవస్థలో లోపాల కారణంగా హైపోథైరాయిడిజమ్‌ పరిస్థితి తలెత్తుతుంది. హైపోథైరాయిడిజమ్‌తో బాధపడేవారిలో మందకొడిగా ఉండటం, త్వరగా అలసట చెందడం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, రుతుక్రమం అస్తవ్యస్తం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు, రక్తంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగి, గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మైక్సిడిమా కోమా అనే ప్రాణాంతక పరిస్థితి సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక థైరాయిడ్‌ గ్రంథి అతిగా పని చేయడం వల్ల హైపర్‌ థైరాయిడిజమ్‌ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు బరువు తగ్గి, సన్నగా మారిపోతారు. జుట్టురాలడం, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. థైరాయిడ్‌ లోపాలను పరీక్షల ద్వారా మొదట్లోనే గుర్తిస్తే తగిన చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు.

విటమిన్‌– బి 12 పరీక్ష
నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేయాలన్నా, ఎర్రరక్తకణాలు తయారు కావాలన్నా విటమిన్‌– బి 12 చాలా కీలకమైన పోషకం. నీటిలో కరిగే విటమిన్లలో ఒకటైన విటమిన్‌– బి 12ను ‘సైనకోబాలమిన్‌’ అంటారు. శరీరంలో విటమిన్‌– బి 12 పరిమాణం బాగా తగ్గిపోయే పరిస్థితిని ‘హైపోకోబాలమినియా’ అంటారు. వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే ఆహారం నుంచి విటమిన్‌– బి 12ను గ్రహించే శక్తి క్షీణిస్తుంది. ఇది విటమిన్‌– బి 12 లోపానికి దారితీస్తుంది. దీనివల్ల మెదడు పనితీరు మందగించడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వయసు మళ్లుతున్న దశలో ఉన్న మహిళల్లో ఒకవేళ నీరసం, నిస్సత్తువ, నడుము నొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించినట్లయితే విటమిన్‌– బి 12 స్థాయిని తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. లోపం ఉన్నట్లు తేలితే విటమిన్‌– బి 12 సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకునే వీలుంటుంది.

విటమిన్‌–డి పరీక్ష
సూర్యరశ్మి నుంచి లభించే పోషకం విటమిన్‌–డి. పురుషులతో పోలిస్తే మహిళలు ఆరుబయటి వాతావరణానికి బహిర్గతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల మహిళల్లో విటమిన్‌–డి లోపం తరచుగా తలెత్తుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో చాలామంది మహిళలు విటమిన్‌–డి లోపానికి లోనవుతున్నారు. విటమిన్‌–డి లోపం వల్ల ఎముకలు పెళుసుబారడం, చిన్న చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్‌ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లోపాన్ని రక్తపరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. లోపం ఉన్నట్లు తేలితే, విటమిన్‌–డి పుష్కలంగా ఉండే పాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అవసరం మేరకు సప్లిమెంట్లు వాడటం, సూర్యరశ్మి సోకేలా ఉదయం, సాయంత్రం ఆరుబయట సంచరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు.

సుగర్‌ పరీక్ష
చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి... ఫాస్టింగ్‌ సుగర్‌ టెస్ట్‌: ఈ పరీక్ష చేయించుకోవడానికి కనీసం ఎనిమిది గంటల సేపు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. పోస్ట్‌ ఫుడ్‌ సుగర్‌ టెస్ట్‌: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా ఈ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ర్యాండమ్‌ సుగర్‌ టెస్ట్‌: ఆహారం తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ చేసే పరీక్ష ఇది. ఇవే కాకుండా, రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉన్న వారికి గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌ (జీటీటీ) చేస్తారు. వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి మూత్రపరీక్ష కూడా చేస్తారు. ఒక వయసు దాటిన తర్వాత మహిళలు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయి తెలుసుకోవడానికి వైద్యుల సలహా మేరకు తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 

దంత పరీక్షలు
నడి వయసు దాటిన మహిళల్లో దంతాలు, చిగుర్లు తదితర నోటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. నిజానికి మహిళలనే కాకుండా ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం అని దంత వైద్యులు చెబుతుంటారు. అలాంటప్పుడు నడి వయసు దాటిన మహిళలకు నోటి పరీక్షలు ఎంతగా అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నోటి ఆరోగ్యం బాగుంటేనే గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యా«ధులు దరిచేరకుండా ఉండటమే కాకుండా, అన్ని అవయవాల పనితీరు సక్రమంగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు
రక్తంలో కొవ్వుల పరిమాణం మోతాదుకు మించితే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వారికి ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొవ్వులు, కొలెస్ట్రాల్‌ పరిమాణం తెలుసుకోవడానికి లిపిడ్‌ ప్రొఫైల్‌ రక్తపరీక్ష చేస్తారు. ఇందులో ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్‌ వంటి అనేక కొవ్వుల పరిమాణం నిర్దిష్టంగా తెలుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌గా చెప్పుకొనే ఎల్‌డీఎల్‌ మోతాదు ఎక్కువగా ఉంటే, ధమనుల్లో కొవ్వు చేరి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌గా పిలిచే హెచ్‌డీఎల్‌ రక్తనాళాల్లో కొవ్వులు పేరుకుపోకుండా అరికడుతుంది. అందువల్ల హెచ్‌డీఎల్‌ తగిన మోతాదులో ఉండటం అవసరం. ఇక ట్రైగ్లిజరైడ్స్‌ కూడా ఎల్‌డీఎల్‌లాగానే హాని కలిగించేవి. లిపిడ్‌ ప్రొఫెల్‌ పరీక్షలో తేలే ఫలితాల బట్టి వైద్యులు ఆహారంలో మార్పులు సూచిస్తారు. అవసరమైన మందులు ఇస్తారు. తల్లుల ఆయురారోగ్యాలు బాగుండాలంటే పిల్లలు వారికి ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.

ఈస్ట్రోజెన్‌ పరీక్ష
నడి వయసులోని మహిళల్లో రుతుక్రమం నిలిచిపోయే దశలో తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల ఒంట్లోంచి ఆవిర్లు రావడం, తరచు భావోద్వేగాల్లో మార్పులు రావడం, ఎముకలు బలహీనపడటం, గుండెజబ్బులు తలెత్తడం, గర్భసంచి కిందకు జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. మహిళల్లో తలెత్తే హార్మోన్ల మార్పులను తెలుసుకునేందుకు ఒక రకమైన రక్తపరీక్ష చేస్తారు. రుతుక్రమం నిలిచిపోయిన మహిళల ఆరోగ్యంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, ఈస్ట్రోజెన్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది. లోపాలు ఏవైనా ఉన్నట్లు తేలితే వైద్యులు అవసరం బట్టి హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలు అందిస్తారు. 

పాప్‌ స్మియర్‌ టెస్ట్‌
 సర్వికల్‌ క్యాన్సర్‌ను తెలుసుకోడానికి చేయించే పరీక్ష ఇది. సర్విక్స్‌ అనేది మనలను కనడానికి తల్లిలోని గర్భసంచిలోని ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లలోనూ అత్యంత ఎక్కువగా వచ్చేది ఇదే. పైగా దీనికి ప్రీ–క్యాన్సర్‌ దశ చాలా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. అందుకే పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. అలా  ముందుగానే కనుక్కుంటే దీన్ని తప్పక నయం చేయవచ్చు. అందుకే 35 ఏళ్లు దాటాక రొటీన్‌గా మహిళలకు ఈ పరీక్ష చేయిస్తుంటారు. ఇటీవల 30 ఏళ్లకే చేయిస్తున్నారు. ఇది ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష. 

మామోగ్రామ్‌  
మహిళల్లో సాధారణంగానూ, ఎక్కువగానూ కనిపించే బ్రెస్ట్‌క్యాన్సర్‌ను కనుగొనే పరీక్ష ఇది. దీన్ని తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఇది కూడా నొప్పి లేని సులువైన పరీక్ష. అమ్మకు 40 ఏళ్లు దాటినప్పటి నుంచి తప్పక తరచూ చేయించాల్సిన పరీక్ష ఇది. మహిళల రొమ్ములో గడ్డలాంటిది ఏదైనా తగులుతూ ఉన్నా, రొమ్ములలో నొప్పి, సలపరం ఉన్నా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్‌ వచ్చిన దాఖలా ఉన్నా తప్పక చేయించాల్సిన పరీక్ష ఇది.

ఊపిరితిత్తుల పరీక్షలు
ఇదివరకటి కాలంలో మహిళలు కట్టెల పొయ్యి మీదే వంట చేసేవాళ్లు. పొగకు ఉక్కిరిబిక్కిరయ్యేవాళ్లు. ఇటీవలి రెండు దశాబ్దాలుగా గ్యాస్‌ వాడకం చాలా వరకు అందుబాటులోకి వచ్చింది. కట్టెల పొయ్యి బాధ కొంతవరకు తగ్గినా, కాలుష్యం వల్ల మహిళలకు ఊపిరితిత్తుల సమస్యలు తప్పడం లేదు. ఇంటిని శుభ్రం చేయడానికి వాడే రకరకాల రసాయనాలు, ఇళ్ల పరిసరాల్లోని కాలుష్యం కారణంగా ఆస్తమా, సీపీఓడీ, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యల బారిన పడే మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పీఎఫ్‌టీ, స్పైరోమెట్రీ వంటి పరీక్షలు చేయించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులను నివారించవచ్చు. 


కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ)
ఇది చాలా సర్వసాధారణమైన రక్తపరీక్ష. ఈ ఒక్క పరీక్ష ద్వారానే చాలా అంశాలను తెలుసుకోవచ్చు. మన దేశంలో దాదాపు 85 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న వారే. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ రక్త పరీక్ష ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని తెలుసుకోవచ్చు. అంతేకాదు, తెల్ల రక్తకణాల్లోని బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, నూట్రోఫిల్స్‌ వంటివి సాధారణ స్థితిలో ఉన్నాయో, లేదో తెలుసుకోవచ్చు. ప్రమాదాల్లో గాయపడినప్పుడు రక్తాన్ని గడ్డకట్టించి ప్రాణాలు నిలిపే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య ఉండాల్సినంత ఉన్నదీ, లేనిదీ కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలోని దాదాపు అన్ని అంశాల పరిస్థితినీ సమగ్రంగా తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. రక్తహీనత వంటి సమస్యలు ఉన్నట్లు ఈ పరీక్షలో తేలితే తేలికపాటి చికిత్సతోనే పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. 

బోన్‌డెన్సిటీ టెస్ట్‌
యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. మన దేశంలోని మహిళల్లో మెనోపాజ్‌ దాటాక దాదాపు అందరిలోనూ కనిపించే సమస్య ఇది. ఆస్టియోపోరోసిస్‌ వచ్చిన వారి ఎముకలు పెళుసుగా మారి, చిన్నపాటి దెబ్బలకే విరుగుతుంటాయి. మెనోపాజ్‌ దశ దాటాక ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ సమస్య వచ్చిపడుతుంది. అరవయ్యేళ్లు దాటిన మహిళల్లో 50 శాతం మందిలో, 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది. బోన్‌డెన్సిటీ పరీక్ష ద్వారా ఆస్టియోపోరోసిస్‌ను కనుక్కోవడం చాలా సులభం. ఆస్టియోపోరోసిస్‌ వచ్చినవారిలో ఎక్కువగా మణికట్టు, వెన్నుముక, తుంటిఎముక భాగాలను ఈ బోన్‌డెన్సిటో మీటర్‌ (డెక్సా స్కాన్‌) ద్వారా పరీక్షిస్తారు. ఆస్టియోపోరోసిస్‌ను నివారించడానికి వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం.  

మరిన్ని వార్తలు