జంషెడ్‌పూర్... భారత కలల నగరం

26 Oct, 2014 01:07 IST|Sakshi
జంషెడ్‌పూర్... భారత కలల నగరం

గాంధీ చెప్పారు. ఇప్పుడు మోడీ కూడా చెప్పారు. శుభ్రత అనేది నాగరికతకు సూచికని, ఆరోగ్యానికి హేతువని. వారు చెప్పింది సామాజిక శుభ్రత గురించి. అయితే ‘సామాజిక శుభ్రత’ అనే మాట వినిపిస్తే ఎంతసేపూ మనకు సస్యశ్యామలంగా ఉండే హర్యానాలోని చంఢీఘర్, లేక రాజరికపు ఆనవాళ్లున్న మైసూరు.. ఇవే ఎందుకు గుర్తొస్తాయి? మన చెవిన పెద్దగా పడని ఒక అందమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరం కూడా ఒకటుంది. అదే జంషెడ్‌పూర్ (జార్ఖండ్). ఈ పేరును మనం బాగా విన్నా కూడా, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.  

 నిర్మాణం
 ‘‘ఏ దేశమైతే ఇనుముపై ఆధిపత్యం సాధిస్తుందో, ఆ దేశం బంగారంపై కూడా ఆధిపత్యం సాధిస్తుంది.’’ స్కాట్లాండ్ తత్వవేత్త థామస్ కార్లైల్ 1867లో ఈ వాక్యం చెప్పి ఉండకపోతే ‘జంషెడ్‌పూర్’ అనే ఒక నగరం మన దేశంలో ఉండేదే కాదేమో! బరోడా పారిశ్రామికవేత్త జంషెడ్‌జీ నెస్సర్వాన్జీ టాటా ఈ వాక్యంతో ప్రభావితమై ఒక స్టీల్ ప్లాంట్ స్థాపించాలని నిశ్చయించుకున్నారు. దానికోసం కొందరు నిపుణులను నియమించి దేశంలో ఇనుప ఖనిజ నిల్వలుండి, పక్కనే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాన్ని కూడా వెతకండి అని సూచించారు. వారు మూడు సంవత్సరాల పాటు భారతదేశంలో జరిపిన అధ్యయనాల ఫలితంగా ఇనుముతో పాటు మాంగనీస్, లైమ్, బొగ్గు గనులున్న ‘సాక్‌చి’ (నేటి జంషెడ్‌పూర్) అనే గ్రామం గురించి వారికి తెలిసింది.

ఆ గ్రామపరిధిలో విలువైన గనులు, సముద్రమట్టానికి దాదాపు 140 మీటర్ల ఎత్తులో చక్కటి వాతావరణం ఉన్న చోటానాగ్‌పూర్ పీఠభూమి వారిని బాగా ఆకట్టుకుంది. పైగా చుట్టూ రెండు నదులు. అటువంటి సాక్‌చి ప్రాంతాన్ని పరిశీలించిన టాటా ఇంతకంటే అనువైన ప్రదేశం దొరకదని అక్కడ ఒక మంచి ఊరుని నిర్మించమని సూచించారు. కొత్తగా నిర్మించే నగరం ఎలా ఉండాలని ఆయన కలగన్నారో తెలుసా? ఇరువైపులా చెట్లతో కూడిన విశాలమైన రహదారులు, అవికూడా త్వరగా పెరిగే లక్షణం గల చెట్లు, నిర్మించే ప్రతి భవన, వ్యాపార సముదాయంలో విశాలమైన లాన్‌తో కూడిన కాంపౌండ్‌లు, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలకు ప్రతి పెద్ద కాలనీల్లో స్థలాలు, ప్రతి కాలనీలో పార్కులు, అక్కడక్కడా కొన్ని పెద్ద పార్కులు, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన వాతావరణంలో విశాలమైన స్థలంలో గుడి, మసీదు, చర్చి కచ్చితంగా ఉండేలా పట్టణాన్ని రూపొందించమని ఆయన సూచించారు.

కలలు చాలామంది కంటారు. కానీ టాటా కన్న కల నిజమైంది. ఆయన కోరినట్టే పట్టణం నిర్మితమైంది. ఒక చిత్రకారుడు గీసిన అందమైన చిత్రంలా రూపుదిద్దుకుంది ఆ పట్టణం. ఆయన అంత క్రాంతదర్శి కాబట్టే బ్రిటిష్ పాలకులు కూడా ఆయన దృష్టికి ముగ్ధులై సాక్‌చి పట్టణానికి టాటా పేరు మీదుగానే జంషెడ్‌పూర్ అని పెట్టారు. సహజమైన నీటి వనరులు వినియోగించుకుని కృత్రిమ సరస్సులను కూడా నిర్మించారిక్కడ.
 
నగరం ప్రత్యేకతలు
సుమారు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జంషెడ్‌పూర్ చక్కటి వాతావరణం ఉన్న నివాస ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి ‘ప్లాన్డ్ ఇండస్ట్రియల్ సిటీ’. సమృద్ధిగా ఉపాధినిచ్చే జంషెడ్‌పూర్‌లో అత్యధికులు ఉద్యోగులే. ఉద్యోగులు కాకుండా ఎవరైనా ఉన్నారంటే వారు కొందరు కాంట్రాక్టర్లు, అక్కడి ఉద్యోగులకు అవసరమైన వస్తువులు, సదుపాయలు, సేవలు అందించే వ్యక్తులు, చిన్న వ్యాపారులు. ఈ నగరానికి ఉన్న కొన్ని విశిష్టతల కారణంగా ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. దీనికింకా చాలా ప్రత్యేకతలున్నాయి.
 
ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన నగరం. జనాభా  పది లక్షలు దాటినా నగరపాలక సంఘం లేని నగరం.భారతదేశంలో సంపన్న నగరం. అంటే (ఏడాదికి పదిలక్షలు ఆపైన ఆదాయం వచ్చేవాళ్లు అత్యధికంగా ఉన్న నగరం.స్థానికులు అతితక్కువగా ఉండి, అన్నిరాష్ట్రాల ప్రజలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం. భాషాపరంగా ఏర్పడిన సంఘాల ద్వారా కమ్యూనిటీ లివింగ్ ఉన్న ఏకైక నగరం. ప్రభుత్వ ప్రమేయం లేకుండా అత్యంత పరిశుభ్రంగా ఉన్న నగరం. ప్రపంచంలోని వంద వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. తూర్పు ఉత్తర భారతంలో కోల్‌కతా, పాట్నా తర్వాత పెద్దనగరం. జార్ఖండ్ రాష్ర్టంలో తూర్పు సింగ్భమ్ జిల్లా కేంద్రమే అయినా, ఇది మాత్రం రాష్ర్టంలో భౌగోళికంగా, జనాభా పరంగా అతిపెద్ద నగరం. ఈ నగరానికి చాలాపేర్లున్నాయి. టాటా, స్టీల్ సిటీ, టాటానగర్, జాంపాట్, జమ్‌స్టెర్‌డామ్, ఇండియా పిట్స్‌బర్గ్ ఇలా అనే కరకాలుగా పిలుస్తారు.

మరిన్ని వార్తలు