ఇదిగో నీడ... అదిగో దెయ్యం!

21 Aug, 2016 15:57 IST|Sakshi
ఇదిగో నీడ... అదిగో దెయ్యం!

39 దె గ్రే స్ట్రీట్, ఈస్ట్ యార్క్ షైర్(బ్రిటన్)లోని తెల్లటి భవంతి చూడడానికి... ‘నో కామెంట్’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. అయితే ఆ భవంతిలో బస చేసిన వారిని కామెంట్ ప్లీజ్ అని అడిగితే...
 పుంఖాను పుంఖాలుగా దెయ్యాల కథలు వినిపిస్తాయి.
 ఈ ఇంట్లో పిల్లల ఆత్మలు తిరుగాడుతున్నాయని కొందరి నమ్మకం. ఈ ఇంట్లో అద్దెకు దిగిన వారు రెండు వారాలకు మించి ఉండకపోవడంతో... సాదాసీదా ఈ ఇల్లు  కాస్తా వార్తల్లోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గోడలపై పిల్లల నీడలు, కిటికిల్లో నుంచి ఏవో  ఆకారాలను చూశామని...ఈ ఇంట్లో అద్దెకుండి వెళ్లిపోయిన వారు చెబుతున్నారు.
 
ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో నివసించిన ఒక వ్యక్తి...
 ‘‘ దుష్టశక్తులు నన్ను బెడ్ మీది నుంచి కిందికి లాగి హత్య చేయడానికి ప్రయత్నించాయి. అదృష్టవశాత్తు బతికిబయటపడ్డాను. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను’’ అన్నారు.
 నిజానిజాల మాట ఎలా ఉన్నా... ఈ ఇంట్లో నివసించడానికి ఇప్పుడు ఎవరూ సాహసించడం లేదు.
 ఇతరుల దగ్గరి నుంచి ఈ ఇంటిని కొనుగోలు చేసిన అండీ యేట్స్ కొంత కాలం పాటు ఇందులోనే నివసించాడు. అయితే అతడికి విచిత్రమైన అనుభవాలు  ఎదురుకావడంతో... త్వరలోనే ఇంటిని అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టాడు. అయితే అద్దెకు వచ్చిన వాళ్లు పట్టమని వారం తిరక్కుండానే ఇల్లు ఖాళీ చేయడం ప్రారంభించారు. కొందరైతే రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయి సామాన్ల కోసం కూడా తిరిగివచ్చేవారు కాదు. ఇదండీ ఈ ఇంటి సంగతి!

మరిన్ని వార్తలు