ఇన్వర్టర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

12 Feb, 2017 22:36 IST|Sakshi
ఇన్వర్టర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

ఢిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు కున్వర్‌ సచ్‌దేవ్‌. చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. ఏదో ఒకరోజు తాను పెద్ద వ్యాపారవేత్తను అవుతానని కలలు కనేవాడు. అలా అని ఆ కలల ప్రపంచంలోనే ఉండిపోలేదు. ఒక్కొక్క అడుగు వేస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. చిన్నప్పుడు అన్నతో పాటు స్టేషనరి షాపులో పెన్నులు అమ్మాడు. కాలేజీ రోజుల్లో ఈవెంట్స్, ప్రోగ్రామ్స్‌ నిర్వహించేవాడు.

ఢిల్లీ యూనివర్శిటీలో లా చదివిన సచ్‌దేవ్‌ ఒక కేబుల్‌ కమ్యూనికేషన్‌ కంపెనీ సేల్స్‌ విభాగంలో పనిచేశారు. కొద్దికాలం తరువాత ఉద్యోగం మానేసి ఢిల్లీలో సొంతంగా కేబుల్‌ టీవీ ఎక్విప్‌మెంట్‌ తయారీ వ్యాపారంలోకి దిగారు. ‘సు–కమ్‌’ పవర్‌ సిస్టం పేరుతో  డైరెక్షనల్‌ కప్లర్స్, మాడ్యులేటర్స్, కేబుల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ ప్రారంభించారు. కొన్ని విజయాల కోసం దారి వెదుక్కుంటూ వెళ్లాలి. కొన్ని విజయాలు అదృష్టం కొద్దీ మన దారి దగ్గరికే వస్తాయి. ‘ఇన్వర్టర్‌ దిగ్గజం’ కున్వర్‌ సచ్‌దేవ్‌ ‘ఇన్వర్టర్‌ వ్యాపారం’లోకి రావడం అనుకోకుండా జరిగింది.

సచ్‌దేవ్‌ ఇంట్లోని ఇన్వర్టర్‌ తరచుగా బ్రేక్‌ డౌన్‌ అవుతూ ఉండేది. ఇన్వర్టర్‌ ఉన్న మాటేగానీ ఎప్పుడూ సమస్యే. ఒకసారి ఇంట్లోని ఇన్వర్టర్‌కు సమస్య వచ్చినప్పుడు బయటి నుంచి ఎలక్ట్రిషియన్‌ను పిలిపించడం కాకుండా తానే స్వయంగా రంగంలోకి దిగారు సచ్‌దేవ్‌.తన పరిశీలనలో తెలిసింది ఏమిటంటే నాణ్యత లేని పీసీబి బోర్డ్‌లు ఉపయోగిస్తున్నారని. మార్కెట్‌లో ఎటు చూసినా నాణ్యత లేని ఇన్వర్టర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే సచ్‌దేవ్‌కు  ఒక ఆలోచన వచ్చింది.

‘విశ్వసనీయమైన ఒక ఇన్వర్టర్‌కు రూపకల్పన చేస్తే ఎలా ఉంటుంది?’
‘విశ్వసనీయతే విజయానికి తిరుగులేని సూత్రం’ అనే విషయం పుస్తకాలు బాగా చదివే సచ్‌దేవ్‌కు తెలుసు.టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేని వ్యక్తి సరికొత్త ఇన్వర్టర్‌ రూపకల్పన గురించి ఆలోచించడం పెద్ద సాహసమే అని చెప్పాలి.  అయితే..ఆ సమయంలో ప్రతికూలతలు, పరిమితుల గురించి  ఆలోచించ లేదు సచ్‌దేవ్‌. ఎన్నో దేశాల ఇన్వర్టర్ల గురించి ఆరా తీశారు. తన సిబ్బందితో కొన్ని ప్రయోగాలు చేయించారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో ‘నాణ్యమైన ఇన్వర్టర్‌’కు రూపకల్పన చేయించి  ‘సు–కమ్‌’ పవర్‌ పేరుతో ఇన్వర్టర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అనతి కాలంలోనే సు–కమ్‌ ఇన్వర్టర్‌ అమ్మకాలు ఊపందుకున్నాయి. మార్కెట్‌ స్ట్రాటెజీతో మరింత దూసుకు వెళ్లింది సు–కమ్‌.

ప్రపంచంలోనే ప్లాస్టిక్‌ బాడీ ఇన్వర్టర్లు తయారుచేసిన కంపెనీగా ‘సు–కమ్‌’ తన ప్రత్యేకత చాటుకుంది. చిన్న స్థాయిలో ప్రారంభమైన సు–కమ్‌...కొద్ది సంవత్సరాల్లోనే ‘పవర్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌’గా తన సత్తాను చాటి 70 దేశాలకు విస్తరించింది. ఒకప్పుడు పదివేల రూపాయలతో మొదలైన కున్వర్‌ సచ్‌దేవ్‌ వ్యాపారం ఇప్పుడు వేయి కోట్ల టర్నోవర్‌ దాటింది. ఇప్పుడు సు–కమ్‌ మేజర్‌ ప్రొడక్ట్స్‌... హోమ్‌ ఇన్వర్టర్స్, హోమ్‌ యుపిఎస్, బ్యాటరీస్, బ్యాటరీ ఛార్జర్స్, బ్యాటరీ ఈక్వలైజర్స్‌...వీటితో పాటు సోలర్‌ ఛార్జ్‌ కంట్రోలర్, సోలార్‌ గ్రిడ్‌–టై  ఇన్వర్టర్స్‌... మొదలైనవి.

‘‘మీకు  టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా...ఈ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి’’ అనే ప్రశ్నకు సచ్‌దేవ్‌ ఇలా ఆసక్తికరమైన సమాధానం ఇస్తారు...

‘‘టెక్నాలజీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడం వల్ల హద్దులు తెలియవు. మూస సూత్రాలు తెలియవు. ఇలాంటి సమయంలో ఇమాజినేషన్‌ను నమ్ముకుంటాం. అది క్రియేటివిటీగా మారుతుంది. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది.  చెప్పొచ్చేదేమిటంటే... టెక్నికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోవడం వల్ల... ఇలా మాత్రమే వెళ్లాలి, అలా మాత్రమే వెళ్లాలి అనే ఆలోచన రాదు. మనలోని సృజనాత్మకత ప్రకారం వెళతాం. కొన్నిసార్లు అది చెడ్డ ఫలితాలు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. నాకు రెండో ఫలితం అందింది. మనం ఏ రంగం ఎంచుకున్నాం, ఎంత అవగాహన ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ రంగంపై మనకు ఎంత ఆసక్తి ఉంది, ఏ మేరకు అధ్యయనం చేస్తున్నాం. ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం’’కున్వర్‌ సచ్‌దేవ్‌ అనుభవాలు... నేటి యువతకు గెలుపు పాఠాలుగా ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని వార్తలు