దేశానికి రెక్కలిచ్చినవాడు

25 Feb, 2018 00:21 IST|Sakshi
జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా

ధ్రువతారలు

1920 నాటి మాట. లూయీ బ్లీరియో ఫ్రాన్స్‌లోనే ప్రఖ్యాత పైలట్‌. ఇంగ్లిష్‌ చానెల్‌ మీది గగనతలంలో  మొదటిసారి విమానం నడిపి చరిత్ర ప్రసిద్ధుడైన వ్యక్తి ఆయనే. ఆయన నివాసం దగ్గరే ఉండేది ఫ్రెంచ్‌ దేశపు కోటీశ్వరులలో ఒకరి ఇల్లు. ఆ కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు బ్లీరియోను ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండేవాడు. పైగా వేసవి, ఇతర సెలవుల సందర్భంలో ఆ కోటీశ్వరుల కుటుంబంతో గడిపేవాడు. తను కూడా ఎప్పటికైనా విమానాలు నడపాలని ఆ పిల్ల కోటీశ్వరుడు కోరుకునేవాడు. అలాంటి సమయంలోనే బ్లీరియో కో–పైలట్‌ ఆ కుర్రవాడిని తనతో పాటు విమానంలో తిప్పాడు. తరువాత నిజంగానే అతడు పైలట్‌ అయ్యాడు. ఒక దేశపు గగనయాత్రా చరిత్రకు ఆద్యుడిగా నిలిచాడు. నిజం చెప్పాలంటే ఆ దేశానికి సొంత రెక్కలు ఇవ్వాలని కలగన్నాడు. తర్వాతి కాలంలో దానిని నిజం చేశాడు. ఇదంతా భారతదేశం బ్రిటిష్‌ వలసగా ఉన్న కాలంలో జరిగింది. ఆ పైలట్‌ పేరు జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఘనుడు. ఫ్రాన్స్‌ ఇచ్చే అత్యున్నత పురస్కారం లీజియన్‌ ఆఫ్‌ ఆనర్, భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా ఆయన స్వీకరించారు. జేఆర్‌డీ తండ్రి బొంబాయి పార్సీ. తల్లి ఫ్రెంచ్‌ జాతీయురాలు. ఆయన బాల్యం ఫ్రాన్స్‌లోనే ఎక్కువగా గడిచింది. 

1932లో జేఆర్‌డీ టాటా(జూలై 29, 1904– నవంబర్‌ 29, 1983) టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ఇండియాలో ఆరంభమైన తొలి వాణిజ్య, పౌర విమానయాన సంస్థ అదే. అప్పటికి గగనతలం విమానాలతో రద్దీగా మారిపోలేదు. బ్రిటిష్‌ పాలనలో ఉన్న భారత్‌ వంటి దేశానికి విమానయానం అంటే అక్షరాలా గగనకుసుమమే. అలాంటి సమయంలో సాహసించి జేఆర్‌డీ విమానయాన సంస్థను నెలకొల్పారు. మద్రాసు– కరాచీ మధ్య మొదటి సర్వీసు తిరిగింది. కేవలం గాగుల్స్‌తో ఎలాంటి ప్రత్యేక దుస్తులు లేకుండా ఆ తొలి విమానాన్ని ఓ పైలట్‌ నడిపారు. అంత సాహసం చేసినవారు ఎవరో కాదు, జేఆర్‌డీ. ఈ విమానయాన సంస్థ తొలి ఏటి లాభం రూ.60వేలు. బ్రిటిష్‌ జాతీయులు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి తిరిగి వెళ్లిపోయిన సమయంలో కొన్ని రంగాలకు అద్భుతమైన వ్యక్తుల నాయకత్వం లభించింది. పారిశ్రామిక రంగం వరకు అలాంటి వ్యక్తి జేఆర్‌డీ. టాటా ఎయిర్‌లైన్స్, టాటా స్టీల్‌ వంటి కీలక పరిశ్రమలను స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అభివృద్ధి చేసి దేశానికి ఆధునికతను అద్దిన వ్యక్తి జేఆర్‌డీ.

 టాటా కుటుంబంలో స్ఫూర్తిమంతమైన సాహసం ఉంటుందని చెప్పేవారు britishగాంధీజీ. అలాంటి ఖ్యాతిని కుటుంబానికి తెచ్చినవారు జేఆర్‌డీ అయి ఉండాలి. పాతికేళ్ల వయసులో ఆయనను తండ్రి ఇండియాకు పిలిపించారు. 14 కంపెనీలతో కూడా టాటా అండ్‌ సన్స్‌ సామ్రాజ్యాన్ని ఆయనకు అప్పగించారు. జేఆర్‌డీలో మొదటి అక్షరం జహంగీర్‌ను సూచిస్తుంది. జహంగీర్‌ అంటే విశ్వ విజేత. టాటాల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని జేఆర్‌డీ 14 కంపెనీల నుంచి ఆ 95 కంపెనీలకు విస్తరింపచేశారు. భారతదేశ పారిశ్రామికరంగ చరిత్రలోనే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగంలోనే జేఆర్‌డీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విలువలు ఉన్న పారిశ్రామికవేత్త కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆయన వృత్తికి పారిశ్రామికవేత్త. కానీ ఆయనలో ఒక ద్రష్ట ఉన్నాడు. సామాన్యుల జీవితాలలోకి తొంగి చూసిన శ్రేయోభిలాషి కూడా ఉన్నాడు.

 కార్మికుల సంక్షేమంతోనే పారిశ్రామక ప్రగతి ఆధారపడి ఉందని విశ్వసించినవారు జేఆర్‌డీ. సంపాదన, సంతోషం వేర్వేరు స్థితులని గ్రహించి చెప్పినవారాయన. పారిశ్రామిక రంగాన్ని తాత్విక దృష్టితో చూసినవారు జేఆర్‌డీ. అప్పటికి దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఐదు దశాబ్దాల పాటు నిర్వహించారాయన. ‘నీవు నాయకుడివి కావాలంటే మానవులను ప్రేమతో నడిపించాలి’ అన్నారాయన. సంస్థ నిర్వహణలో, విస్తరణలో జేఆర్‌డీ అనుసరించిన ఒక పద్ధతి ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపనలో గాని, కాలానికి అనుగుణమైన ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకోవడంలో గానీ, మళ్లీ తన కుటుంబ గతం నుంచే ఆయన ప్రేరణ పొందేవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు హౌస్‌ ఆఫ్‌ టాటాస్‌ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటానే ఆయన ఆదర్శంగా తీసుకునేవారు. తనకు ప్రేరణ అవసరమైతే జంషెడ్‌జీ జీవిత చరిత్రనే కొద్దిసేపు చదువుకునేవారు. ప్రజలే కాదు, పరిశ్రమలు కూడా ముందంజ వేయాలంటే గతంతో లంకె అత్యవసరమని నిరూపించారాయన. తమ పారిశ్రామిక సామ్రాజ్యంలో సైనికులు, అంటే కార్మికుల సంక్షేమం కోసం జేఆర్‌డీ తీసుకున్న చర్యలు కూడా జంషెడ్‌జీ నుంచి పొందిన ప్రేరణతో అమలు చేసినవే.1880–1890 మధ్య అత్యధిక పెట్టుబడులు పెట్టి బొంబాయిలో పరిశ్రమలను విస్తరించిన జంషెడ్‌జీ ఆ కాలంలోనే ప్రమాద బీమా అమలు చేశారు. పింఛను నిధిని ఏర్పాటు చేశారు. పనిచేసే చోట వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేశారు. జేఆర్‌డీ మరో అడుగు ముందుకు వేశారు. దేశంలో తొలిసారిగా సిబ్బంది వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. బోనస్‌గా లాభాలలో వాటా ఇవ్వడం, సంయుక్త సలహా మండలి ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. తమ సంక్షేమం, భద్రతల గురించిన విధానాల రూపకల్పనలో కార్మికులకు తప్పనిసరిగా భాగస్వామ్యం ఉండాలన్నది కూడా జేఆర్‌డీ నిశ్చితాభిప్రాయం. పరిశ్రమలను స్థాపించడానికి పట్టణాలు, నగరాలే తగినవన్న భావన సరికాదని 1969లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలోనే జేఆర్‌డీ చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల నిపుణులు కూడా – ఇంజనీర్లు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మేనేజర్లు అంతా గ్రామాలకు వెళ్లి అక్కడి బాగోగులు చూడవలసిన అవసరం ఉందని చెప్పిన వారు జేఆర్‌డీ. గ్రామాలూ, పట్టణాలూ మధ్య పెరిగి పోతున్న అంతరాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రయోజనాల విషయంలో పెరిగిపోతున్న ఆగాధం గురించి జేఆర్‌డీ ఆలోచించారన్నమాట. 

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సయోధ్య అనివార్యమన్నదే జేఆర్‌డీ సిద్ధాంతం. దీని గురించి ఈ దేశంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. టాటా ఎయిర్‌లైన్స్‌ను ఇదే సిద్ధాంతం మేరకు ఎయిర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ (1946 నుంచి) పేరుతో నిర్మించారు కూడా. ఆయన ఆధ్వర్యంలో  ఈ ప్రయోగంతో నడిచిన మొదటి విజయం, ఆఖరి విజయం కూడా ఎయిర్‌ ఇండియా ప్రయోగమేనని చెబుతారు. ఆయన ప్రభుత్వం దగ్గరకు ఎప్పుడు వెళ్లినా భారత పారిశ్రామిక రంగ ప్రతినిధిగానే వెళ్లారని ఎందరో రాశారు. అంతే తప్ప టాటా కంపెనీ ప్రతినిధిగా ఆయన వెళ్లలేదు. తన సంస్థల కోసం ప్రత్యేక రాయితీలు అడిగినవారు కాదు జేఆర్‌డీ. పన్ను ఎగవేతకు ఏనాడూ పాల్పడలేదు. అలాగే రాజకీయ పార్టీలకు చాటుగా విరాళాలు ఇవ్వలేదు. జేఆర్‌డీ వాణిజ్యం జాతిహితాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ ఆశించడంతో పాటు, విశాల దృష్టిని కూడా కలిగి ఉందని ఒక సందర్భంలో పీవీ నరసింహారావు అన్నారు. ఒక దేశం లేదా సమాజం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేని, లేదా వారి అవసరాలకు అక్కరకు రాని ఏ ఆవిష్కరణ అయినా, పరిశ్రమ అయినా విజయాన్ని సాధించడం సాధ్యం  కాదని ఒక సభలో జేఆర్‌డీ చెప్పారు. ఒక ప్రాంతంలో పెట్టే పరిశ్రమ స్థానికులకు ఉపయోగపడక పోతే ఎదరయ్యే ప్రతిస్పందన ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా గమనిస్తూనే ఉన్నాం. 

పారిశ్రామికవేత్త అయినప్పటికీ పర్యావరణ కాలుష్యంలో పరిశ్రమల వాటాను జేఆర్‌డీ నిజాయితీగానే గమనించారు. ‘ది క్రియేషన్‌ ఆఫ్‌ వెల్త్‌’ అన్న పుస్తకానికి ముందుమాటలో ఆ విషయం ఉంది. ‘‘ప్రస్తుతం పారిశ్రామికవేత్తల బాధ్యత ప్రజల శ్రేయస్సు అనే పరిధిని దాటాలి, పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని తగినంతగా గుర్తించినా, మన సేవలు మనుషుల పరిధి దాటి నింగీనేల, అడవులకు, నీటి రక్షణకి, భూమ్మీద ఉండే జంతుకోటికి కూడా విస్తరించాలి’’ అని రాశారాయన. 

ప్రఖ్యాత ఐటీ నిపుణుడు, పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తన జీవితంలో జరిగిన ఒక గొప్ప అనుభవాన్ని ఒక సందర్భంలో వివరించారు. మొదట ఆమె టాటా సంస్థలలో పనిచేసేవారు. ఒకసారి ఆమె ఒక్కరే కార్యాలయం ఆవరణలో కనిపించారు. ఆమెను చూస్తే ఎవరి కోసమో ఎదురు చూస్తున్న సంగతి అర్థమవుతోంది కూడా. అప్పటికే చీకట్లు పడుతున్నాయి. అంతా ఖాళీ అవుతోంది. అప్పుడు ఒక కారు వచ్చి ఆమె దగ్గర ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి సాక్షాత్తు జేఆర్‌డీ. సుధామూర్తి కొంచెం కంగారు పడ్డారు. చీకటి పడుతుండగా ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారని జేఆర్‌డీ టాటా అడిగారు. తన భర్త వస్తారని (అప్పటికి ఇన్ఫోసిస్‌ ఆవిర్భవించలేదు) చెప్పింది. నిమిషాలు గడుస్తున్నాయి. ఆయన నిలబడే ఉండిపోయారు. అది మరింత ఇబ్బందిగా అనిపించిందామెకు. చెప్పిన సమయం కంటే కొంచెం ఆలస్యంగానే నారాయణమూర్తి వచ్చారు. అప్పుడు జేఆర్‌డీ తిరిగి కారు ఎక్కుతూ, ‘‘భార్యకు వేచి ఉండే పరిస్థితి ఇంకెప్పుడు కల్పించనని నీ భర్త దగ్గర హామీ తీసుకో’ అని వెళ్లిపోయారు. ఒక ఉద్యోగి, అందునా మహిళా ఉద్యోగి పట్ల ఆయన చూపిన బాధ్యతాయుతమైన ధోరణి నిజంగా అసాధారణమే. సుధామూర్తి పెద్ద చదువులు చదివిన ఇంజనీరు. ఆమె విషయంలోనే కాదు, తన కారు డ్రైవర్‌ విషయంలో కూడా జేఆర్‌డీ మానవతా దృక్పథంతో ఉండేవారు. ఒకసారి ఒక సమావేశంలో పాల్గొన్న జేఆర్‌డీ తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు దాటిపోయింది. డ్రైవర్‌ని భోజనం చేశావా అని అడిగారాయన. లేదని చెప్పాడతడు. కొంచెం నొచ్చుకున్నారు జేఆర్‌డీ. తరువాత మళ్లీ ఒకసారి ఆయన కారు దిగి లోపలికి వెళ్లిన వారే వెనక్కి వచ్చి, కారు డ్రైవర్‌ను పిలిచి, ‘ఇవాళ నాకు ఆలస్యమవుతుంది. నీవు వెళ్లి భోజనం చేసి వచ్చేయ్‌’ అని చెప్పి మళ్లీ లోపలికి వెళ్లారు. 

1992లో భారత ప్రభుత్వం టాటాను భారతరత్నతో సత్కరించింది. ఆ సమయంలో ఆయనను టాటా కంపెనీల ఉద్యోగులు సత్కరించారు. ఆ సమయంలో అన్నమాట చాలా గొప్పది. ‘అమెరికా ఆర్థిక నిపుణుడు భవిష్యత్తులో భారతదేశం ఆర్థిక సూపర్‌పవర్‌ అవుతుందని జోస్యం చెప్పాడు. కానీ నేను భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లే దేశంగా ఉండాలని అనుకుంటాను’ అన్నారు. జేఆర్‌డీ భారత గగనయాన సేవలకు పితామహుడని పేరు. కానీ ఆయన ఆకాశానికే పరిమితం కాలేదు. నేల మీద మాత్రమే నడవగలిగేవారి గురించి కూడా ఆలోచించారు. 
- డా. గోపరాజు నారాయణరావు 

మరిన్ని వార్తలు