జికా తర్వాత మయారో...!

30 Oct, 2016 16:33 IST|Sakshi
జికా తర్వాత మయారో...!

 ఈ ఏడాది మొదట్లో జికా ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ‘మయారో’ అనే జబ్బు పొంచి ఉందని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు... వరసగా రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, క్రిమియన్-కాంగో హ్యామరేజిక్ ఫీవర్ వంటివి క్యూలో నిలబడి తమ వంతుకోసం వేచి చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మయారో అనేది దాదాపు చికన్‌గున్యా వ్యాధి లక్షణాలనే పోలి ఉంటుందని చెబుతున్నారు.
 
 
  ఇది కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుందనీ, ఇలా చికన్‌గున్యాతో పోలికలు ఉన్నందున కీళ్లనొప్పులతో ఇది మానవాళిని వేధించనుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ‘సైంటిఫిక్ అమెరికన్’ అనే మ్యాగజైన్ వెల్లడించింది. అలాగే ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’  అంచనాల ప్రకారం... ‘రిఫ్ట్ వ్యాలీ ఫీవర్’ అనేది ఇతర జంతుజాలాల్లో చాలా సాధారణంగా కనిపిస్తుందనీ, ఇలా ఇతర జంతువుల్లో కనిపించే వ్యాధులు... ఆ తర్వాత మానవాళిలో (హ్యూమన్ బీయింగ్) కనిపించాయి కాబట్టి ఇది కూడా మనుషుల్లో కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 
 ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‘క్రిమియన్-కాంగో హేమరేజిక్ ఫీవర్’ అనే వ్యాధి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతోంది. జంతుజాలం మీద ఉండే కీటకాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో జ్వరం, ఒంటినొప్పులు, మగతగా ఉండటం, మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. డెంగ్యూలాగే అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇది వచ్చినప్పుడు చాలా  అపాయకరంగా పరిణమించవచ్చని ఆందోళన చెందుతోంది డబ్ల్యూహెచ్‌ఓ. ‘మయారో’ లాగే ‘యుసుటు’ అనే మరో జబ్బు కూడా వచ్చే అవకాశం ఉందనీ, ఇది ‘వెస్ట్ నైల్ వైరస్’లాగే ఉంటుందని హెచ్చరిస్తోంది ‘సైంటిఫిక్ అమెరికన్’ మ్యాగజైన్. పక్షుల్లో ఇది అప్పటికే ఉంది. క్యూలెక్స్ దోమ ద్వారా మనుషులకూ వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆ సైన్స్ జర్నల్.
 

మరిన్ని వార్తలు