తార్కిక ఆలోచన ముఖ్యం

7 Aug, 2016 08:26 IST|Sakshi
తార్కిక ఆలోచన ముఖ్యం

సమస్య చిన్నదైనా... పెద్దదైనా... పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ బాధల నుంచి బయటపడొచ్చు
 
జీవన గమనం
ఈ శీర్షికలో ప్రశ్నలు చూస్తూ ఉంటే... ఇంత చిన్నచిన్న సమస్యల కోసం మనుషులు ఇంత వేదన అనుభవిస్తున్నారా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎంతోమంది ఇంతకన్నా పెద్ద సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి పరిష్కారాలు చెబితే బాగుంటుందని నా ఉద్దేశం.   
 - సోమశేఖర్, విశాఖపట్నం
 
ఎవరి సమస్య వారికి పెద్దగానే తోస్తుంది. పద్నాలుగేళ్ల అమ్మాయి ప్రేమ సమస్య మనకు నవ్వు తెప్పించవచ్చు. అరవయ్యేళ్ల వృద్ధురాలికి మనవడితో ఆర్థిక సమస్య మనకి అసలు సమస్యే కాదనిపించవచ్చు. నల్లగా ఉన్నాను కాబట్టి పెళ్లి కావటం లేదన్న యువతి సమస్య మనకు చిన్నదిగా కనిపించవచ్చు.
 ‘‘సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వమూ, తార్కిక ఆలోచనా ముఖ్యం. వ్యక్తిత్వం పెంచుకునే కొద్దీ ఇలాంటి బాధల నుంచి బయటపడొచ్చు’’ అని మోటివేట్ చెయ్యడమే ఈ శీర్షిక ఉద్దేశం. అయిదు నిమిషాల్లో చర్మ సౌందర్యాన్ని మార్చే క్రీముల బారి నుంచి, తాయెత్తు కట్టి కష్టాల నుంచి బయటకు తప్పిస్తాము... మంత్రం చదివి డబ్బు రెట్టింపు చేస్తాము అనే బాబాల బారి నుంచి రక్షించేదే వ్యక్తిత్వం.
 
నేను ఎమ్.బి.ఏ చేశాను. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నలభై వేలకు పైనే వస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే నా ఇంటర్ క్లాస్‌మేట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. జీతం నాకంటే చాలా తక్కువ. దానికి నేనేం బాధపడటం లేదు. మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈ మధ్య తను లోలోపల కుమిలిపోతున్నాడని అనిపిస్తోంది. తనకంటే నాది మంచి ఉద్యోగం అని, ఎక్కువ జీతం అని చాలాసార్లు అనేస్తుంటాడు. అది మామూలుగా అనడం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఇది మా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుందేమో అని కూడా భయంగా ఉంది. తన మనసులో నుంచి ఆ ఫీలింగ్‌ను ఎలా తీసేయాలి?                         
 - ఉష, రాజమండ్రి

 
మీ భర్త మనస్తత్వం ఎటువంటిది? సున్నిత మనస్కుడా? లేక ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడా? అతడు ఎలాంటి వాడైనా, ముందు అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను పోగొట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ముందు మీరు మీ బాధనీ, భయాన్నీ తనకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అతడు ప్రాక్టికల్ అయితే, ‘‘నాకన్నా నీకు జీతం తక్కువని నువ్వు బాధపడుతున్నావ్! నేనేం చేయాలో నువ్వే చెప్పు. ఉద్యోగం మానేయనా?’’ అనండి. కంగారుపడి వద్దు వద్దంటాడు. అతడు బాగా సున్నిత మనస్కుడైతే, ఒక పది రోజుల పాటు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లండి. హాయిగా గడపండి.

మెల్లిగా మీ భావాలను తనతో పంచుకోండి. ‘తన కన్నా మీ జీతం ఎక్కువన్న కారణం వల్ల మీరు కూడా బాధపడుతున్నారు’ అన్న సంగతిని అతనికి తెలిసేలా చేయండి. పనిలో పనిగా... (ప్రేమ వివాహం అంటున్నారు కాబట్టి) డబ్బు లేకపోవటం వల్ల వచ్చే కష్టనష్టాల గురించి కూడా అతనితో డిస్కస్ చేయండి. అతడు మీ బాధను, మీలో జరిగే సంఘర్షణను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కాబట్టి, మీ బాధను తప్పకుండా తీర్చడానికి ప్రయత్నిస్తాడు.
 
ఖాళీగా ఉండి అనవసరపు ఆలోచనలతో సతమతమవ్వకుండా, తీరిక వేళల్లో ఏదైనా హాబీ పెంపొందించుకునేలా ప్రోత్సహించండి. చిత్రలేఖనం నుంచి పత్రికలకు వ్యాసాలు రాయటం వరకు ఏదైనా కావొచ్చు. ఏ మంచి హాబీ లేనివాళ్లకు నిరాశాపూరితమైన ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏమో ఎవరు చెప్పొచ్చారు... అతడి హాబీనే అతన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాల మీద నిలబెట్టవచ్చేమో!

మరిన్ని వార్తలు