ఐటీ రంగంలో 'అ'సామాన్యుడు

22 May, 2016 18:24 IST|Sakshi
ఐటీ రంగంలో 'అ'సామాన్యుడు

నేను సగటు మనిషిని... అయితే, నా విజయగాథ సామాన్యుడికి స్ఫూర్తినిస్తుంది
 
మన దిగ్గజాలు
‘నేను సగటు మనిషిని... అయితే, నా విజయగాథ సామాన్యుడికి స్ఫూర్తినిస్తుంది’ అని సగర్వంగానే కాదు, వినమ్రంగానూ చెబుతారు ఆయన. దేశంలో కంప్యూటర్ల గురించి సామాన్యులకు ఏమాత్రం అవగాహన లేని కాలంలో కంప్యూటర్లే లోకంగా పరిశోధనలు సాగించిన శాస్త్ర పరిశోధకుడు ఆయన. సొంత సంస్థను స్థాపించడమే కాకుండా, దానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన పారిశ్రామికవేత్త ఆయన.

అలాగని ఆయన పుడుతూనే నోట్లో వెండి చెంచాతో పుట్టిన వాడు కాదు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి, విద్యనే నమ్ముకుని విజయాలు సాధించిన అసామాన్యుడు ఆయన. పరిశోధకుడుగా, పారిశ్రామికవేత్తగా ఆయన సాధించిన విజయాలు సామాన్యులకు స్ఫూర్తినిస్తాయి.
 
‘ఇన్ఫోసిస్’ ఇంటిపేరు
నారాయణమూర్తి... అంటే ఎవరైనా ఏ నారాయణమూర్తి? అని అడుగుతారు. నాగవర రామారావు నారాయణమూర్తి అంటే కన్ఫ్యూజింగ్‌గా బుర్ర గోక్కుంటారు. అదే ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. భారత ఐటీ రంగంలో ఎన్.ఆర్.నారాయణమూర్తి తిరుగులేని హీరో. భార్య నుంచి తీసుకున్న పదివేల రూపాయలతో మరో ఆరుగురు మిత్రులతో కలసి నారాయణమూర్తి పునాదులు వేసిన సంస్థ ‘ఇన్ఫోసిస్’.

అదే ఆయన ఇంటిపేరుగా మారిందంటే, ఆ సంస్థతో ఆయన అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవాల్సిందే. ‘ఇన్ఫోసిస్’ సీఈవోగా ఆయన దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సేవలందించారు. ఆయన సారథ్యంలో ‘ఇన్ఫోసిస్’ సాధించిన ఘన విజయాలు భారత ఐటీ చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాదు.
 
చురుకైన విద్యార్థి
నారాయణమూర్తి కర్ణాటకలోని కోలార్ జిల్లా సిదియఘట్ట గ్రామంలో 1946 ఆగస్టు 20న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. పాఠశాల చదువు పూర్తయ్యాక మైసూరు వర్సిటీ పరిధిలోనే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత ఐఐటీ-కాన్పూర్ నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు.

చదువు పూర్తయ్యాక ఐఐఎం-అహ్మదాబాద్‌లో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించారు. అప్పటి నుంచి కంప్యూటర్లపై పరిశోధనలే ఆయన లోకంగా మారాయి. ఐఐఎంలో పనిచేస్తున్నప్పుడే ఆయన భారత్‌లోని తొలి షేరింగ్ కంప్యూటర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కోసం ‘బేసిక్’ ఇంటర్‌ప్రెటర్‌ను రూపొందించారు.
 
తొలియత్నంలో వైఫల్యం
ఉద్యోగంలో కొనసాగితే అనుకున్న పనులు సాధించలేమని భావించి, ‘సాఫ్ట్రానిక్స్’ పేరిట నారాయణమూర్తి సొంత కంపెనీని ప్రారంభించారు. అంతకు ముందు ఆయనకు ఎలాంటి వ్యాపారానుభవం లేకపోవడంతో ఏడాదిన్నరలోగానే కంపెనీ మూతపడింది. మళ్లీ ఉద్యోగపర్వమే శరణ్యమైంది. ఈసారి పుణేలోని ‘పత్ని కంప్యూటర్ సిస్టమ్స్’లో చేరారు. పుణేలో పనిచేస్తుండగానే, సుధా కుల్కర్ణితో పరిచయమైంది. కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ అయిన సుధ రచయిత్రి కూడా. అప్పట్లో ఆమె టాటా కంపెనీలో పనిచేసేవారు.

ఇద్దరి మనసులూ కలవడంతో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె సుధామూర్తిగా ప్రసిద్ధి పొందారు. మళ్లీ సొంత కంపెనీ పెట్టుకునేలా నారాయణమూర్తిని ఆమె ప్రోత్సహించడమే కాదు, మూలధనంగా పదివేల రూపాయలు కూడా ఇచ్చారు. దాంతో ఆయన నందన్ నీలేకనితో పాటు మరో ఆరుగురు మిత్రులను కలుపుకొని 1981లో ‘ఇన్ఫోసిస్’ను స్థాపించారు. అప్పటి నుంచి 2002 వరకు సీఈవోగా ఆ సంస్థను ముందుకు నడిపించారు.

ఆ తర్వాత 2006 వరకు ఇన్ఫోసిస్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత చైర్మన్, చీఫ్ మెంటర్‌గా సేవలందించి, 2011లో రిటైరయ్యారు. రెండేళ్ల తర్వాత కంపెనీ మళ్లీ ఆహ్వానించడంతో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అడిషనల్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ప్రస్తుతం చైర్మన్ ఎమిరిటస్‌గా ‘ఇన్ఫోసిస్’కు దిశానిర్దేశం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు