అది వృథాప్యం కాదు...!

10 Jan, 2016 03:03 IST|Sakshi
అది వృథాప్యం కాదు...!

ఫ్యామిలీ పర్వం
‘‘పాపం... పుంజును చూస్తే జాలేస్తోంది. మెడ మీది ఈకలను నిక్కబొడిచేలా లేపుతుందా? వాటిని గొంతు చుట్టూరా గుండ్రంగా చక్రంలా తిప్పుతుందా? కత్తుల్ని కాళ్లకు కట్టుకొని మరీ పోరాడుతుంటుందా? అలాంటి కత్తులే తన మెడకు చుట్టుకుంటాయని ఎరగదు పాపం. గొంతు చుట్టూరా లేచిన  ఈకల్లాగే... కాసేపట్లో కీర్తిశేషురాలు కాబోయే పుంజు తలచుట్టూరా మహనీయుల ఫొటోల్లోని కాంతి వలయంలా ఒకటి తిరగబోతోందని దానికి తెలియదు. ఏమిటో చిత్రం’’ అంటూ జాలిపడ్డాను నేను.
 
‘‘పండగ నాటి పందెం కోడిని తలవడం సరే. పండగకు కూతురు వస్తుందన్న సంతోషం కంటే అల్లుడొస్తాడంటేనే కల్లోలంగా ఉంది నాకు’’ అంది మా ఆవిడ.  ‘‘వచ్చే వాడు వస్తాడూ, పోతాడు. వాడి కోసం వృథా ఏమీ వద్దురా’’ అన్నాడు మా స్వామీ వృథానంద. ముసలోడయ్యాక మా నాన్నలో కాస్త చాదస్తం పెరిగిందంటుంటారు అందరూ. పెద్దవాడయ్యాడు కదా అని ఊరుకోడు. ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. అందుకే మా పిల్లలూ, కాలనీ అమ్మాయిలూ, కుర్రాళ్లూ కలిసి ఆయనకు స్వామీ వృద్ధానంద అని పేరు పెట్టారు. అది కాస్తా కాలక్రమాన స్వామీ వృథానందగా మారిపోయింది. అదెలాగంటే...
 
వస్తువులను వేస్ట్ చేయవద్దంటారు మా నాన్నగారు. ఆమ్లెట్ వేశాక మా ఆవిడ ఖాళీ గుడ్లను చెత్తకుండీలో వేస్తే... వాటిని అక్కడి నుంచి తీసి, పౌడర్ అయ్యేలా చిదిమి, గులాబీ కుండీల్లో వేసేవరకూ అదే పని మీద ఉంటారాయన.  ‘‘సో... పెంకు జర్నీ చెత్తకుండీ టు గులాబీకుండీ అన్నమాట’’ అంటూ ఆయనను ఆటపట్టిస్తుంటారు మా చిన్నమ్మాయీ, కాలనీలోని ఆమె ఫ్రెండ్స్.
 
‘వస్తువులు సరే... ప్లేస్ కూడా వేస్ట్ చేయకండి’ అంటూ చుక్కంత జాగా కనిపించినా మొక్క నాటేస్తుంటారు మా నాన్న. గచ్చు లేని స్థలం అంగుళం అందుబాటులో లేదు. అయినా ఆరు కుండీలు దొరికితే, వాటిని అటకలెక్కించి, అందులోని తీగల్ని కిటికీల మీద పారించి నానా హంగామా చేస్తారు. ఆయనకే ఆరెకరాల భూమి దొరికితే ఎలా ఉండేదా అని జోకులేసుకుంటారు నా కూతురూ, దాని ఫ్రెండ్స్. ఆరుకుండీల ఫామ్ యజమాని అంటారు. ఇలా తమ మాటల్ని గాలిపటాల్లా ఎగరేస్తూ, సెటైర్ల లడాయి పెట్టుకుంటూ... ఒకరి మాటను మరొకరు ఖీంచ్ కాట్ పద్ధతిలో జోక్స్ కట్ చేసుకుంటారు ఆ అమ్మాయిలంతా.
 
‘‘నాన్నా... మరీ అంత చాదస్తంగా ఉండకు. నీ మనవరాళ్లూ, దాని ఫ్రెండ్సూ  నీకు పెట్టిన పేరేమిటో తెలుసా?... స్వామీ వృథానంద అట’’ అన్నాను. దానికి ఆయన నవ్వుతూ... ‘‘నా వయసుకు వచ్చాక, నా వయసు వాళ్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘ముసలోడు నసపెడుతుంటా’డని అనడం మామూలేలేరా. చాలామందికి నాది ‘వృథాప్యం’ అనిపిస్తుంది. ఈ పిల్లలంతా కలిసి ‘స్వామీ వృద్ధానంద’ను వృథానంద చేసేశారు’’ అని నవ్వేశాడు మా నాన్న.
   
మా నాన్నకు ఎంతో సెన్సాఫ్ హ్యూమర్, ఆయనది మోడ్రన్ ఔట్‌లుక్. ‘‘బిడ్డ వస్తుందన్న ఆనందం కొద్దీ... అరిసెల కోసం గరిసెలు తోడివేయకు. బొబ్బట్లు, నిప్పట్లు అంటూ ఉట్లు నేలకు దించకు. ఉన్నంతలో పెట్టు. ఉత్సవం చెయ్యి. అంతేగానీ అందలంలో అట్లపెనం పరచకు’’ అన్నారు మా నాన్న... తన కోడలిని ఉద్దేశించి.
 ‘‘సరేనండీ’’ అంది ఆమె వినయంగా.
 
మళ్లీ చాటుగా నా దగ్గరికి వచ్చి... ‘‘ఇంటల్లుడొస్తుంటే వంట దగ్గర కూడా ఈ తంటా ఏమిటండీ?’’ అంది.
 ‘‘తినే ప్లేటులో డేగిశాలో ఉండేంత గంటె కాకుండా కాస్త పట్టుకోడానికి అనువుగా ఉండే చెంచా పెట్టమంటున్నారు మా నాన్న. అంతే’’ అన్నాన్నేను. ఈ మాటలేవీ వినపడకపోయినా ఇలాంటిదేదో సంభాషణ జరుగుతున్నట్టు కనిపెట్టారాయన. మా దగ్గరికి వస్తూ... ‘‘మీకో విషయం తెలుసా? ప్లూటో స్టేటస్ రద్దు చేశారట’’ అన్నారు.
 
‘‘ప్లూటో స్టేటస్ ఏమిటి మామయ్యా?’’ అంది మా ఆవిడ. ‘‘మనకు నవగ్రహాలు కదమ్మా. అందులో చివరిదైన ప్లూటోకు గ్రహానికి ఉండాల్సిన లక్షణాలేమీ లేవని గ్రహించారట సైంటిస్టులు. గ్రహాల సంఖ్య తగ్గినా జామాత మాత్రం పదో గ్రహమే.  ఏ గ్రహానికి ఆగ్రహం వచ్చినా భయపడరు గానీ దశమగ్రహ జామాత అలుగుతారేమోనని పెళ్లికూతురి మాతకు తెగ బెంగ’’ అని కోడలివైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు మా నాన్న. ‘‘అది కాదండీ...’’ అంటూ ఏదో చెప్పబోయింది మా ఆవిడ.
 
‘‘ఏం పర్లేదమ్మా... మేకులేవీ మిగలక కొత్త ఏడాదికి వచ్చిన క్యాలెండర్లూ,  రాయని డైరీలూ అలా టేబుల్ మీద వేస్ట్‌గా పడి ఉన్నప్పుడు గానీ తెలియదు ఎంతెంత సంపద వేస్ట్‌పోతోందో అన్న విషయం. కొత్త అల్లుడనే గౌరవంతో పరబ్రహ్మస్వరూపాన్ని గౌరవించకుండా పారేయకండి’’ అన్నారాయన. ‘‘ఆయన వృథానందా కాడూ... ఆయనది వృథాప్యమూ కాదు. నా దృష్టిలో  ఆయన ‘స్వామి వృద్ధి ఆనంద. సంపూర్ణ సంవృద్ధి ఆనంద ’!’’ అమిత గౌరవంగా ఆయనవైపు చూస్తూ అంది మా ఆవిడ.
- యాసీన్

>
మరిన్ని వార్తలు