జాక్... ద కిల్లర్

24 May, 2015 01:15 IST|Sakshi
జాక్... ద కిల్లర్

మిస్టరీ
ప్రశాంతతకు నిలయంలా ఉండేది లండన్‌లోని ఆ ప్రాంతం. కానీ ఉన్నట్టుండి అక్కడ రక్తం ఏరులై పారడం మొదలుపెట్టింది. భయం రెక్కలు విప్పుకుని అందరినీ వణికించడం ప్రారంభించింది. అసలేం జరిగింది?

ఏప్రిల్ 3, 1888... వైట్‌చాపెల్ డిస్ట్రిక్ట్... లండన్.
ఆస్బార్న్ స్ట్రీట్... జీపు సైరన్లు, పోలీసుల బూట్ల టకటకలతో మార్మోగుతోంది. జనం ఒక్కొక్కరుగా వచ్చి గుమిగూడుతున్నారు.

అక్కడి దృశ్యాన్ని చూసి భయంతో బిక్కచచ్చిపోతున్నారు.
 ‘‘ఓ గాడ్... ఇన్నేళ్ల సర్వీసులో ఇంత దారుణమైన హత్యని నేను చూడలేదు’’... ఇన్‌స్పెక్టర్ ఫ్రెడెరిక్ స్వరం వణికింది.
 ‘‘నిజం సర్. ఓ మనిషి మరో మనిషిని ఇంత కర్కశంగా చంపగలర ంటే నమ్మబుద్ధి కావడం లేదు’’... తన మనసులో భావాన్ని బయటపెట్టాడు అసిస్టెంట్.
 వాళ్లిద్దరూ రెప్ప వేయకుండా తమకు ఎదురుగా నేలమీద పడివున్న యువతి మృతదేహాన్నే చూస్తున్నారు. ఇరవై అయిదేళ్లు మించని వయసు. అందగత్తె అని చూడగానే తెలిసిపోతోంది. అయితే అంత అందమైన శరీరాన్ని చీల్చి పారేశాడు హంతకుడు.

పొట్ట కోసి ఉంది. పేగులు బయటకు వచ్చాయి. రక్తం ధార కట్టింది. ఆమె రహస్యాంగాలను సైతం ఛిద్రం చేసిన విధానం చూస్తుంటే, ఎంత హింసించి చంపారో అర్థమవుతోంది. ఆ చంపినవాణ్ని పట్టుకుని వెంటనే మరణశిక్ష విధించాలనిపిస్తోంది. తక్షణం మృత దేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి ఆ పనిలోనే పడ్డారు పోలీసులు.
   
ఏప్రిల్ 22, 1888... జార్జ్ యార్డ్.
 ‘‘ఓ మై గాడ్... ఏంటిది?’’... నమ్మలేనట్టుగా అన్నాడు ఫ్రెడెరిక్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూస్తూ.
 ‘‘ముప్ఫై తొమ్మిది కత్తిపోట్లు సర్. బాడీ అంతా జల్లెడలా అయిపోయింది. ఒంట్లో ఒక్క చుక్క రక్తం మిగల్లేదు. మరో విషయమేంటంటే... పొట్ట కోసి తన గర్భసంచిని తొలగించారు.’’
 ‘‘వ్వాట్’’... డాక్టర్ చెప్పింది వింటూనే షాకైపోయాడు ఫ్రెడెరిక్. వెంటనే అతనికి ఏప్రిల్ 3న జరిగిన హత్య గుర్తొచ్చింది. ఆ అమ్మాయి శరీరంలో ఒక కిడ్నీ లేదు. ఇప్పుడు గర్భసంచి లేదు. ఇదేమైనా అవయవాలను అక్రమ రవాణా చేసే ముఠా పని కాదు కదా! అదే అన్నాడు తన అసిస్టెంట్‌తో.
 
‘‘కాకపోవచ్చు సర్. ఎందుకంటే... అవయవాలే కావాలనుకుంటే అంత కసిగా చంపాల్సిన పని లేదు. అలాగే ఒక అవయవమే తీసుకెళ్లాల్సిన అవసరమూ లేదు. కళ్లు, కిడ్నీలు, లివర్... అన్నీ తీసుకుపోవచ్చు కదా!’’తన అసిస్టెంట్ అనాలసిస్‌కి ముచ్చటపడ్డాడు ఫ్రెడెరిక్. మెచ్చుకోలుగా చూశాడు అతనివైపు. అంతలోనే అతడికి ఓ విషయం గుర్తు వచ్చింది. నెలరోజుల క్రితం హత్యకు గురైన అమ్మాయి ఓ సెక్స్ వర్కర్. ఇప్పుడు చనిపోయిందీ సెక్స్ వర్కరే. ఇది యాదృచ్ఛికమా? లేక పక్కా ప్లానింగా?
 
ఆరోజు ఇన్‌స్పెక్టర్ ఫ్రెడెరిక్ మనసులో తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చాలా త్వరగానే దొరికింది. వారం తిరిగేసరికల్లా మరో సెక్స్ వర్కర్ హత్యకు గురయ్యింది. అదే రీతిలో. అంతే భయంకరంగా. లండన్ మొత్తం వణికిపోయింది. మహిళలు బయటకు రావాలంటే భయపడసాగారు. ఆడపిల్లల్ని బడికి పంపడానికి కూడా బెంబేలెత్తిపోయారు. ఇక సెక్స్ వర్కర్లయితే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతకసాగారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు.

వీధుల్లో గస్తీ తిరగడం మొదలు పెట్టారు. అయినా కూడా... జరగాల్సిన అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. వైట్ చాపెల్ ప్రాంతంలో వరుసగా హత్యలు జరగసాగాయి. ఒకటి కాదు రెండు కాదు.. పదమూడు హత్యలు. అందరూ సెక్స్ వర్కర్లే. వాళ్లనే ఎందుకు చంపుతున్నట్టు? ఆ వృత్తి పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్లెవరైనా అలా చేస్తున్నారా?         
 
హత్యకు గురైన ఏ అమ్మాయిపైనా అత్యాచారం జరగలేదు. కానీ తీవ్రమైన హింస మాత్రం జరిగింది. మెడ కోసి, కత్తులతో పొడిచి, చిత్రహింసలు పెట్టి చంపాడు హంతకుడు. పైగా ప్రతి అమ్మాయి శరీరంలోంచీ ఒక్కో అవయవాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నట్టు?
 ప్రశ్నలే తప్ప జవాబులు లేకుండా పోయాయి పోలీసుల దగ్గర. హంతకుడెవ్వరో వాళ్లకి అంతు పట్టలేదు.

స్పాట్‌లో కాకుండా ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు తమను చంపిన వ్యక్తి లెదర్ కోటు, పొడవు బూట్లు, గ్లౌజులు వేసుకుని ఉన్నాడని, టోపీ పెట్టుకున్నాడని చెప్పారు. దాంతో అతడి చిత్రాన్ని గీయించి అన్ని స్టేషన్లకూ పంపారు. అన్నిచోట్లా పోస్టర్లు అంటించారు. కానీ ఫలితం లేకపోయింది. అనుమానించి కొందర్ని అరెస్ట్ చేసినా కానీ అతడే జాక్ అని నిరూపించలేక పోయారు. మరేం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది.
 
వైట్ చాపెల్ విజిలెన్స్ కమిటీ అధ్యక్షుై డెన జార్జ్ లస్క్‌కి ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ లోపల ఓ కిడ్నీ ముక్క ఉంది. హంతకుడు రాసిన ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో... కిడ్నీ ముక్క తను చంపిన ఓ అమ్మాయిదని, మిగతా ముక్క వండుకుని తినేశానని రాశాడు కిల్లర్. దమ్ముంటే తనను పట్టుకోమని చాలెంజ్ చేశాడు. ఆ ఉత్తరం తాను నరకం నుంచి రాస్తున్నానని పరిహాసం కూడా ఆడాడు. చివర్లో ‘జాక్ ద రిప్పర్’ అని సంతకం చేశాడు.
 
ఆ ఉత్తరాన్ని చూసిన పోలీసులకి మతి పోయినట్టయ్యింది. అంతవరకూ వైట్‌చాపెల్ మర్డరర్ అని పిలిచిన అతణ్ని నాటి నుంచీ ‘జాక్ ద రిప్పర్’ అని సంబోధించడం మొదలుపెట్టారు. అతణ్ని పట్టుకోవాలని నిద్ర లేకుండా తిరిగారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే... ఆ తర్వాత అక్కడ మరే అమ్మాయి హత్యా జరగలేదు. జాక్ జాడ కనిపించలేదు. అతడు ఏమైపోయాడో ఎవరికీ తెలియలేదు. దాంతో ‘జాక్ ద రిప్పర్ గాథ’... చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది!
- సమీర నేలపూడి

అతనే కిల్లరా...?
క్యాథరీన్ ఎడ్డోస్ అనే యువతి మృతదేహం పక్కన ఓ శాలువా దొరికింది. అది చాలా యేళ్ల పాటు లండన్ క్రైమ్ మ్యూజియంలో ఉంది. 2007లో దాన్ని వేలం వేస్తే... రసెల్ ఎడ్వర్డ్స్ అనే వ్యాపారస్తుడు సొంతం చేసుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అతడు దాన్ని క్యాథరీన్ శాలువా అనుకోలేదు. ఎందుకంటే ఆ షాల్ చాలా ఖరీదైనది. కానీ క్యాథరీన్ పేద అమ్మాయి. కడుపు నింపుకోవడం కోసం పడుపు వృత్తిలోకి దిగింది.

అలాంటి అమ్మాయికి అంత ఖరీదైన శాలువా ఎలా వస్తుంది! కాబట్టి అది హంతకుడిది కూడా అయివుండొచ్చు కదా అనిపించింది రసెల్‌కి. వెంటనే దాన్ని డీఎన్‌ఏ పరీక్షకు పంపించాడు. గతంలో జాక్ అయివుంటాడు అని పోలీసులు అనుమానించినవారందరి డీఎన్‌ఏతోటీ దాన్ని మ్యాచ్ చేయించాడు. వారిలో ఒకడైన ఆరోన్ కాస్మిన్‌స్కీ డీఎన్‌ఏ మ్యాచ్ కావడంతో అతడే హంతుకుడని తేల్చాడు. మిస్టరీని ఛేదించానంటూ 2014లో ప్రపంచానికి సగర్వంగా తెలియజేశాడు.

అయితే ఆ విషయాన్ని చాలామంది ఒప్పుకోవట్లేదు. డీఎన్‌ఏ మ్యాచ్ అయినంత మాత్రాన హంతకుడు అనేస్తే ఎలా, అయినా ఆ శాలువా హంతకుడితే ఎందుకయ్యుండాలి అంటున్నారు. పైగా ఆరోన్ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుడు. పోలెండ్ నుంచి వచ్చిన అతడు తన వాళ్లెవరో మర్చిపోయాడు. తానెవరో కూడా గుర్తు లేదు తనకి.

అలాంటివాడు ఇంత దారుణమైన హత్యలెందుకు చేస్తాడు? పైగా సెక్స్ వర్కర్లనే ఎంచుకుని మరీ ఎందుకు చంపుతాడు? ఇలా ఆలోచించే అరెస్ట్ చేసినవాళ్లందర్నీ పోలీసులు వదిలేశారు. కానీ ఇన్నేళ్ల తర్వాత రసెల్ మళ్లీ ఆరోన్‌ని వేలెత్తి చూపిస్తున్నాడు. డీఎన్‌ఏ మ్యాచ్ అయ్యింది కాబట్టి అతడు చెప్పిందే నిజమని నమ్ముదామా? ఆ సాక్ష్యమొక్కటే సరిపోదు కాబట్టి నిజం కాదని అనుకుందామా?!

వైట్‌చాపెల్ హత్యలు ప్రపంచం మొత్తాన్నీ వణికించాయి. ఆ ఉదంతాలను ఆధారంగా చేసుకుని పలు సినిమాలు, టెలివిజన్ షోలు రూపొందాయి. 1988లో ‘జాక్ ద రిప్పర్’ పేరుతో యూకే టెలివిజన్‌లో ఓ చిత్రం ప్రసారమైంది. 2001లో ‘ఫ్రమ్ హెల్’ అనే చలనచిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ప్రముఖ నటుడు జానీ డెప్ ప్రధాన పాత్రధారి కావడంతో మాంచి హిట్ అయ్యింది. బీబీసీ సైతం ‘రిప్పర్ స్ట్రీట్’ పేరుతో ఒక సిరీస్‌ని ప్రసారం చేసింది.

మరిన్ని వార్తలు