నా మనసులో కొందరు ఉన్నారు

12 Apr, 2020 06:59 IST|Sakshi

పొరుగింటి అమ్మాయి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌కు వచ్చి అప్పుడే పదిసంవత్సరాలు దాటిపోయింది! ‘అలాద్దీన్‌’(2009) సినిమాతో వెండితెరకు పరిచయమైన జాకీ... సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లాంటి అగ్రహీరోలతో నటించింది. ‘హీరోయిన్‌గా మాత్రమే’ అని పట్టుబట్టకుండా ‘ఐటమ్‌ సాంగ్స్‌’తోనూ అలరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఫిల్మ్‌ ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’లో నటిస్తోంది. ‘సాహో’లో ప్రభాస్‌ పక్కన ఒక పాటలో మెరిసిన ఈ అందాల సుందరి త్వరలో క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ సరసన నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె గురించి కొన్ని ముచ్చట్లు..

‘జయాపజయాలు అనేవి జీవితంలో సర్వసాధారణం కదా... మరి మీరు ‘ఓటమి’ని ఎలా తీసుకుంటారు?
కంగారు పడిపోతారా? నిరాశ చీకట్లోకి వెళ్లిపోతారా?’ అని అడిగితే... జయాపజయాలను సమానంగా చూసిన జాకీ ఇలా చెబుతోంది...
సక్సెస్‌ ఎప్పుడూ శాశ్వతం కాదు. అలాగే ఫెయిల్యూర్‌ కూడా శాశ్వతం కాదు. ‘కిక్‌’ సినిమాతో పెద్ద సక్సెస్‌ వచ్చింది. ‘ఇక నాకు తిరుగులేదు’ అని సన్నిహితులందరికీ చెప్పి మురిసిపోయాను. దురదృష్టవశాత్తు అది నిజం కాలేదు. చెప్పొచ్చేదేమిటంటే ‘కిక్‌’ సక్సెస్‌ను నేను సరిగ్గా వినియోగించుకోలేకపోయాను. అంతమాత్రాన దిగులుపడి కూర్చోలేదు. ‘నెక్స్ట్ ఏమిటి!’ అంటూ ముందుకువెళ్లాను.

‘ఇది టెక్నాలజీ కాలం. ఎలా అప్‌డేట్‌ అవుతారు?’ అని అడిగితే
‘ఎంత వరకు అవసరమో అంతవరకు’ మాత్రమే అని చెబుతూనే సోషల్‌ మీడియాలో సినిమాలు,స్టార్‌లపై జరిగే ట్రోలింగ్‌పై ఇలా స్పందిస్తోంది...
విమర్శలను ఎలా స్వీకరిస్తామనేది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. మరో కోణం నుంచి చూస్తే వాటిలో హాస్యాన్ని ఆస్వాదించవచ్చు. ‘ఓపెన్‌మైండ్‌’తో నిర్మాణాత్మకమైన విమర్శను స్వీకరించవచ్చు. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా నా వరకైతే ట్రోల్స్, మీమ్స్‌ను సీరియస్‌గా తీసుకోను. సోషల్‌ మీడియా యుగంలో ఏది చెప్పినా విపరీతార్థాలకు, రకరకాల వ్యాఖ్యలకు దారి తీసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం!

‘కేమ సూత్ర’ అనే విచిత్రమైన పేరుతో జాకీకి శ్రీలంకలో ఒక రెస్టారెంట్‌ ఉంది. ‘‘శ్రీలంకలో దర్శించాల్సిన ప్రదేశాలలో కేమ సూత్ర కూడా ఒకటి’’ అని చమత్కరిస్తుంటాడు హీరో అక్షయ్‌కుమార్‌. ఈ రెస్టారెంట్‌ గురించి ఆమె ఇలా చెబుతోంది...
శ్రీలంక వంటకాలు అంటే నాకు చాలా ఇష్టం. సంప్రదాయమైన పాతవంటకాలకే కొత్త టచ్‌ ఇచ్చి ఆ రుచిని అందరికీ పరిచయం చేయడానికి షెఫ్‌ దర్శన్‌ మునిదాసతో కలిసి ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది.

ఇది బయోపిక్‌ల కాలం కదా!
‘మీకో ఛాన్స్‌ వస్తే ఎవరి బయోపిక్‌లో నటిస్తారు?’ అని అడిగితే ఆమె నుంచి వెంటనే సమాధానం రాదు.
‘అదేమిటి!’ అని ఆశ్చర్యపడేలోపే ‘నా మనసులో కొందరు ఉన్నారు. వారి బయోపిక్‌లలో నటించాలని ఉంది. వారి పేర్లు తరువాత చెబుతాను’ అంటూ ఊరిస్తుంది!
 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా