ప్రతి బుల్లెట్ మీదా ఒక పేరు

9 Apr, 2016 22:14 IST|Sakshi
ప్రతి బుల్లెట్ మీదా ఒక పేరు

కవర్ స్టోరీ
జలియన్‌వాలా బాగ్ బ్లడ్ స్టోరీ
ఏప్రిల్ 13 - జలియన్‌వాలా బాగ్ మారణకాండ జరిగిన దినం

 
పసిపిల్లలు, పాలు మరువని శిశువులు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులు అనే విచక్షణ లేకుండా, అసలు కారణమే లేకుండా కేవలం అధికార దురహంకారంతో డయ్యర్ జరిపించిన కాల్పులకు అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రత్యక్ష సాక్షి. వందలాది మంది భారతీయుల ఉసురు తీసిన డయ్యర్ కూడా చివరిదశలో ఆ బుల్లెట్ దెబ్బకే కుప్పకూలిపోయాడు. అయితే అది తుపాకీ బుల్లెట్ కాదు.

అంతరాత్మ అనే బుల్లెట్! జలియన్‌వాలా బాగ్‌లో తను చేసింది కరెక్టా కాదా అనే అంతర్మథనంతో సతమతమై, అనారోగ్యాల బారిన పడి, 62 ఏళ్ల వయసులో 1927లో అతడు మరణించాడు. అనేకసార్లు అతడికి స్ట్రోక్ వచ్చింది. కాళ్లూ చేతులూ చచ్చు పడిపోయాయి. మాట పడిపోయింది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. చివరికి గుండెపోటుతో చనిపోయాడు.
 
‘‘ఆ రోజు అమృత్‌సర్‌లో నేను చేసింది ‘సరైన పనే’ అనేవారు ఉన్నారు. ‘కాదు. తప్పు పని చేశాడు’ అనేవారూ ఉన్నారు. నేను చేసింది కరెక్టా కాదా అని ఆ దేవుడిని అడిగేందుకు నేను నా మరణం కోసం నిరీక్షిస్తున్నాను’ అని డయ్యర్ అన్నట్లు ‘ది బుచర్ ఆఫ్
అమృత్‌సర్ : జనరల్ రెజినాల్డ్ డయ్యర్’ గ్రంథంలో నిగెల్ కొలెట్ రాశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ‘కాలం’ అనే సాక్షిని అడుగుదాం.
   
 1919 ఏప్రిల్ 13... ఆదివారం. బైశాఖీ పర్వదినం. పంజాబీలకు సంవత్సర ఆరంభం. తూర్పు, పడమర.. ఉత్తరం, దక్షిణం... దేశంలోని నాలుగు దిశలూ అప్పుడప్పుడే చిగురిస్తున్నాయి. ఏ వైపు చూసినా పచ్చని కచేరీలు. ఏ రాగాన్నీ మెచ్చని గడుసు కోయిలలు. అవి పాడిందే పాట. అవి తీసిందే రాగం మరి! నింగి తేటగా ఉండే కాలం కదా.. హరివిల్లులకు ఆ సమయంలో పెద్దగా పని ఉండదు. అన్నీ కిందికి వచ్చేస్తాయి. చిన్నారుల లేత పెదవులపై విరబూస్తాయి. దివిలోని పూలతోట ఎలా ఉంటుందో... భువిని చూస్తూ వైశాఖంలో ఊహించుకోవచ్చు. పంట చేతికి వచ్చి ఉంటుంది. పాట గొంతులో ఆడుతుంటుంది. పెద్దవాళ్లు పిల్లల్లో కలిసిపోతారు. అంతా ప్రకృతి బిడ్డల్లా పరవశించి ఆడిపాడుతారు.
 
ఆ రోజు కూడా చిన్నా పెద్దా అందరూ ఇళ్లల్లోంచి వచ్చారు. కొత్త బట్టలు వేసుకుని వచ్చారు. కొత్త ఆశలతో కళకళలాడుతూ బంధుమిత్రులతో కలిసి వచ్చారు. ఒక్కొక్కరూ అమృత్‌సర్‌లోని ‘జలియన్‌వాలా బాగ్’కి  చేరుకుంటున్నారు. బాగ్ అంటే తోట. అందులోనే ఆటలు, పాటలు. అందులోనే వన భోజనాలు. సూర్యుడు అలసిపోవాల్సిందే కానీ పంజాబ్ ప్రజల ఉల్లాసం చీకటి పడినా సరే.. ‘బల్లే బల్లే’మని సాగుతూనే ఉంటుంది. సిక్కులు, హిందువులు, ముస్లింలు.. ఆ రోజు అందరి మతమూ, అభిమతమూ ఒక్కటే. ఉల్లాసం... ఉత్సాహం.
   
ఉదయం 9 గంటలు : నాలుగు భాషల్లో చాటింపు
అమృత్‌సర్ లేవడమే పండగ కళతో లేచింది. కానీ ఆ కళలో ఏదో ఆందోళన. ఓ వ్యక్తి హడావుడి చేస్తున్నాడు. ఆ వ్యక్తి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్. బ్రిటిష్ ఆర్మీ అధికారి. అమృత్‌సర్‌కు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మిలిటరీ కమాండర్. ముందురోజు రాత్రి నుంచే అతడు.. ‘అనుమతి లేకుండా ఎవరూ ఊళ్లోకి రావడానికి లేదు. ఎవరూ ఊళ్లోంచి పోవడానికి లేదు’ అని ఆజ్ఞలు జారీ చేయించాడు.

‘పండగ చేస్కోండి. కానీ ఎవరికి వారే చేస్కోండి. బయట తిరక్కండి. బంధువులతో కలవకండి. ఊరేగింపులు జరపకండి. ముచ్చట్లు పెట్టకండి. చెట్ల కిందికి, రచ్చబండల కిందికి చేరకండి’ అని చాటింపు వేయించాడు. ఇంగ్లిష్‌లో, ఉర్దూలో, హిందీలో, పంజాబీలో.. వీధివీధికీ చెప్పించాడు. అయినా ప్రతి వీధిలోనూ ఇళ్లలోంచి బయటికి వస్తున్న మహిళలే, చిన్న పిల్లలే. డయ్యర్ డప్పు ఎంత మంది విన్నారో, ఎంతమందికి అర్థమయిందో!
 
మధ్యాహ్నం 12 గంటలు : బాగ్‌లోకి డయ్యర్ మనుషులు
అమృత్‌సర్ వీధుల్లో ఎవ్వరూ ఒకరుగా కనిపించడం లేదు! ఎక్కడ చూసినా గుంపులే. ఎటు చూసినా కోలాహలమే. డయ్యర్ గుండె దడదడమంది. ఒక శక్తిమంతమైన మిలిటరీ ఆఫీసర్.. సామాన్య జనాన్ని చూసి భయపడుతున్నాడంటే చేయకూడనిదేదో అతడు చేయబోతున్నాడనే!
 
ఆ గుంపుల్లోకి మెల్లిగా తన మనుషుల్ని వదిలిపెట్టాడు డయ్యర్. వాళ్లంతా తెల్లచొక్కాల్లో ఉన్నారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో విని డయ్యర్‌కు చేరవేయడం వాళ్ల పని. కానీ వాళ్లు డయ్యర్ మెప్పు కోసం తప్పుడు సమాచారం అందించారు. జలియన్‌వాలా తోటలో ప్రభుత్వాన్ని కూల్చివేయబోయే కుట్ర జరగబోతోందని లేనిది కల్పించి చెప్పారు!
 
మధ్యాహ్నం 2 గంటలు : తెరిచి ఉన్నది ఒకటే దారి
వేలాదిమంది స్థానికులు హర్‌మందిర్ సాహిబ్ (ఇప్పటి స్వర్ణాలయం) దగ్గర్లో ఉన్న జలియన్‌వాలా బాగ్ చేరుకున్నారు. వాళ్లలో చాలామంది స్వర్ణాలయంలో ప్రార్థనలు ముగించుకుని వచ్చినవారు. అంతా నిరాయుధులు. అమాయకులు. భక్తులు. సామాన్య ప్రజలు. యువతీ యువకులు, స్త్రీలు, పిల్లలు. బాగ్‌లో వేడుకలయ్యాక ఎవరిళ్లకు వారు చేరుకోవలసినవారు. బాగ్ సువిశాల ప్రదేశం. ఆరేడు ఎకరాల స్థలం. చతురస్రాకారంలో 200 గజాల విస్తీర్ణం. బాగ్ బయట చుట్టూ ఇళ్లు, భవనాలు. బాగ్ చుట్టూ 10 మీటర్ల ఎత్తున ప్రహారీ గోడలు. ఐదు చోట్ల ఇరుకైన ద్వారాలు.  ఆ రోజు మాత్రం ఒక ద్వారం తెరిచి ఉంది.
 
మధ్యాహ్నం 2.30 గంటలు : వేడుకలు ముగించాలని ఆదేశం
బాగ్‌లో నిత్యం ఆధ్యాత్మిక ప్రసంగాలు. ప్రవచనాలు. కష్టసుఖాల కలబోతలు. బాగ్ మధ్యలో సమాధులు. వాటి మధ్యలో 20 మీటర్ల వ్యాసంలో నీళ్లు ఉండీ లేనట్లుండే బావి. అప్పుడప్పుడూ బాగ్‌లో సంత కూడా జరుగుతుంది. రైతులు, వ్యాపారులు వస్తారు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. అలా బాగ్ ఏళ్లుగా అమృత్‌సర్ సాంస్కృతిక కూడలి అయింది.

మామూలు రోజుల్లోనే నిండుగా ఉండే బాగ్... పండగ రోజు నిండు పున్నమిలా ఉంటుంది. ఆరోజూ అలాగే ఉండాల్సింది కానీ.. అక్కడేదో జరగబోతోందని సిటీ పోలీసులకు అనుమానం రాగానే మధ్యాహ్నం రెండు కల్లా అందర్నీ బయటికి వచ్చేయమన్నారు. వచ్చినవారు వచ్చారు. మిగిలినవారు మిగిలారు. పండగ ఇంకా మొదలే కాలేదు.. మధ్యలో ముగుస్తుందని ఎవరనుకుంటారు?
 
సాయంత్రం 4.30 గంటలు : బాగ్‌పైన విమానం చక్కర్లు
డయ్యర్ పంపిన విమానం బాగ్ పైన ఒక రౌండ్ వేసి లోపల ఎంతమంది ఉన్నారో ఒక అంచనాకు వచ్చింది. ఇరవై ఇరవై ఐదు వేలు. పెద్ద మొత్తమే. ఆ సంగతి కల్నల్ డయ్యర్‌కి, అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ ఇర్విన్‌కి చేరింది. అంతమంది అక్కడ గుమిగూడతారని వారికి ముందే తెలుసు. అయితే అంతమంది గుమికూడకుండా ముందుగా వారేం చర్యలు తీసుకోలేదు. ఎంతమంది చేరతారు చేరనిద్దాం అన్నట్లు ఉండిపోయారు.

బాగ్ లోపల సమావేశం నాలుగున్నరకు మొదలైంది. గంట తర్వాత గుట్టు చప్పుడు కాకుండా బాగ్ దగ్గరికి వచ్చాడు డయ్యర్. అతడితో పాటు తొంభై మంది సైనికులు ఉన్నారు. వాళ్లలో యాభై మంది దగ్గర రైఫిల్స్ ఉన్నాయి. నలభై మంది దగ్గర పిడిబాకులు ఉన్నాయి. వాళ్లంతా బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయులైన భారతీయ సైనికులు. సిక్కులు ఎక్కువగా ఉండే దళాల నుంచి కాకుండా వేరే రెజిమెంట్‌ల నుంచి రప్పించిన వాళ్లు. వాళ్ల వెనుక రెండు వాహనాల నిండా ఆయుధాలు.

మెషీన్ గన్‌లు. బాగ్‌లోకి వాహనాలు పట్టేంత  దారులు లేకపోవడంతో వాటిని బాగ్ బయటే నిలిపివేసి, సైనికులు ముందుకు కదిలారు. బాగ్ ద్వారాలన్నీ ఎప్పటిలా మూసే ఉన్నాయి. ప్రధాన ద్వారం ఒక్కటే తెరిచి ఉంది. మిగతావాటితో పోలిస్తే అది కొంచెం వెడల్పుగా ఉంటుంది. డయ్యర్‌తో పాటు వచ్చిన సాయుధ దళాలు, వాహనాలు ఆ ద్వారం బయట ఆగాయి.
 
సాయంత్రం 4.30 - 5-30 మధ్య : ఆకస్మాత్తుగా కాల్పులకు ఆదేశం
నిజానికైతే డయ్యర్ చేయవలసిన పని... లోపల ఉన్నవాళ్లందరినీ బయటికి వచ్చేయమని హెచ్చరించడం. కానీ అతడు ఆ పని చేయలేదు! పైగా లోపల ఉన్నవారు బయటికి వచ్చే ప్రధాన ద్వారపు తలుపులను మూసేయించాడు! ఆ తర్వాత కాల్పులు జరపమని సైనిక దళాలను ఆదేశించాడు.  పది నిమిషాల పాటు ఆపకుండా కాల్పులు జరుపుతూనే ఉన్నాయి దళాలు.

మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఆ తర్వాత లెక్క తేలింది. కానీ కాల్పులలో మరణించివారి లెక్కే తేలలేదు. కాల్పులలో కొంతమంది, ఇరుకు సందులలో జరిగిన తొక్కిసలాటలో కొంతమంది, కాల్పుల నుంచి తప్పించుకో డానికి బావిలో దూకి కొంతమంది చనిపోయారు. బావిలోంచి 120 మృతదేహాలను బయటికి తీసినట్లు స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో రాశారు. అప్పటివరకు కచ్చితమైన లెక్క ఎవరికీ తెలీదు. తీవ్రంగా గాయపడిన వారిని ఆ రాత్రి కర్ఫ్యూలో బయటికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవంతో వారిలో కొంతమంది చనిపోయారు.
 
అయితే నిజానికి కాల్పుల్లో ఎంతమంది చనిపోయారన్న లెక్క ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ తేల్లేదు! బ్రిటిష్ ప్రభుత్వం 379 మంది అంటోంది. ఆ లెక్కను కూడా చాలా అన్యాయంగా రాబట్టింది. మారణకాండ జరిగిన మూడు నెలల తర్వాత ఇంటింటికీ వెళ్లింది. మీ వాళ్లెవరైనా ఆనాటి దుర్ఘటనలో చనిపోయారా అని వివరాలు రాసుకుంది. చాలామంది నిజం చెప్పలేదు. చెబితే తమ మీద నిఘా ఉంటుందన్న భయంతో ఇంట్లో వ్యక్తి చనిపోయిన విషయాన్ని వారు దాచిపెట్టారు.
 
చిత్రం ఏమిటంటే ఈ కాల్పుల సంగతి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎనిమిది నెలల తర్వాత గానీ తెలియలేదు. దేశంలోనే ఉన్న రవీంద్రనాథ్ టాగూర్‌కి ఈ సంగతి మే 22 వరకు తెలియదు. గాంధీకీ వెంటనే తెలియలేదు. తెలిసిన వెంటనే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టారు. ఆ ఉద్యమంతోనే స్వతంత్ర భారత సమరానికి బీజాలు పడ్డాయి. అవి తెల్ల దొరల గుండెల్లో బుల్లెట్‌లై పేలాయి.

మరిన్ని వార్తలు