35 ఏళ్లు మౌనంగా...

19 Jul, 2015 01:01 IST|Sakshi
35 ఏళ్లు మౌనంగా...

చేయని నేరం
‘నాకెవరి మీదా కోపం లేదు.. దేవుడు నాతోనే ఉన్నాడు’... కోర్టు వెలుపలకు రాగానే తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులతో అన్నాడు జేమ్స్ బెయిన్. ముదిమి మీదపడ్డా ఉత్సాహంగానే కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ, ప్రశాంతంగా మాట్లాడాడు. ఇంకెవరైనా అతడి పరిస్థితులనే ఎదుర్కొన్నట్లయితే, వ్యవస్థపై పగ పెంచుకొనేవారు. చేయని నేరానికి జైలుగోడల వెనుక ముప్ఫై ఐదేళ్లు మగ్గిపోయినా, అతడు ప్రశాంతంగా మాట్లాడటం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యం కలిగించింది.

ముప్ఫై ఐదేళ్లలోనూ అతడు ఒక జైలు కాదు, ఏకంగా ఆరు జైళ్లు మారాడు. అయినా, ఏమాత్రం ఆవేశం లేకుండా ప్రశాంతంగానే ఉన్నాడు. డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా ఫ్లోరిడా కోర్టు అతడిని నిర్దోషిగా నిర్ధారించి విడుదల చేసింది. చట్టం ముందు నిర్దోషిగా రుజువు కావడానికి ఇన్నేళ్లు పట్టింది.
 
ఇలా ఇరుక్కున్నాడు...
అది 1974వ సంవత్సరం. అప్పటికి జేమ్స్ పద్దెనిమిదేళ్ల కుర్రాడు. ఫ్లోరిడాలోని బార్టో పట్టణంలో సొంత ఇంట్లోనే అమ్మా నాన్నలతో కలసి ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఇంటికి పోలీసులొచ్చారు. కాస్త మాట్లాడాలని చెప్పి జేమ్స్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు. పోలీసులు ఎందుకు పిలిచారో అతడికి తెలియదు. చుట్టుపక్కల ఏదైనా సంఘటన జరిగి ఉంటుందని, ప్రశ్నించి వదిలేస్తారని భావించాడు. అయితే, రెండు రోజులు పోలీస్ స్టేషన్‌లోనే గడిచిపోయాయి. తర్వాత అక్కడి నుంచి అతడిని పోక్ కౌంటీ జైలుకు తరలించారు.

జైలుకు వెళ్లాక గానీ జేమ్స్‌కు అసలు సంగతి అర్థం కాలేదు. బార్టో పట్టణంలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడిపై అత్యాచారం జరిగింది. నల్లజాతి యువకుడు కావడంతో పోలీసులు అలవాటుగా జేమ్స్ బెయిన్‌ను ఆ కేసులో ఇరికించారు. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడి పేరు ‘జేమ్స్’ అని చెప్పాడు ఆ పిల్లాడు. అతడు నల్లగా ఉంటాడని, చెంపలకు దట్టంగా జుట్టు ఉంటుందని.. ఇలాంటివే కొన్ని పోలికలు చెప్పాడు. అతడికి ఎర్ర మోటారు సైకిలు ఉందని కూడా చెప్పాడు. కర్మకాలి జేమ్స్ బెయిన్ మోటార్ సైకిలు ఎర్ర రంగుదే కావడంతో పాటు ఆ పిల్లాడు చెప్పిన పోలికలు దాదాపు సరిపోయాయి.

ఇంకేం.. పోలీసులు జేమ్స్‌ను లోపలేసేశారు. తానేపాపం ఎరుగనంటూ అతడు ఎంతగా మొత్తుకున్నా, వారు వినిపించుకోలేదు. పకడ్బందీగా కేసు బిగించారు. ఆరుగురు అనుమానితులను వరుసగా నిలబెట్టి ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు. వాళ్లలో జేమ్స్‌తో పాటు మరొకరికే చెంపలపై దట్టంగా జుట్టు ఉంది. దురదృష్టవశాత్తూ బాధిత బాలుడు జేమ్స్ వైపు వేలు చూపించాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను ఫ్లోరిడా కోర్టు పూర్తిగా విశ్వసించింది. జేమ్స్ వాదనను ఏమాత్రం పట్టించుకోకుండా, అతడికి యావజ్జీవ శిక్ష విధించింది. అతడు దాఖలు చేసుకున్న అప్పీళ్లన్నీ బుట్టదాఖలయ్యాయి. తన బతుకు ఇక జైలుగోడల మధ్యే తెల్లారిపోతుందనే పరిస్థితికి చేరుకున్నాడు.
 
డీఎన్‌ఏ పరీక్షలతో మలుపు...
జేమ్స్‌పై కేసు నమోదైన కాలంలో డీఎన్‌ఏ పరీక్షలు అందుబాటులో లేవు. అప్పట్లో ఇతర వైద్య పరీక్షల ఆధారంగా అత్యాచారాల వంటి నేరాలను నిర్ధారించేవారు. అయితే, జేమ్స్ విషయంలో అలాంటి పరీక్షలనూ నిర్వహించలేదు. డీఎన్‌ఏ పరీక్షలు అందుబాటులోకి వచ్చాక, అన్యాయంగా జైళ్లలో మగ్గిపోతున్న నిరపరాధులకు న్యాయం చేయడానికి ‘ఇన్నోసెంట్ ప్రాజెక్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ‘ఇన్నోసెంట్ ప్రాజెక్ట్’ చొరవ ఫలితంగా పాత కేసుల్లో సైతం డీఎన్‌ఏ పరీక్షలను తాజాగా నిర్వహించేందుకు అమెరికన్ కోర్టుల నుంచి అనుమతి లభించింది.

ఆ క్రమంలోనే జేమ్స్ దాఖలు చేసుకున్న అప్పీలును 2006లో ఫ్లోరిడా కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, పునర్విచారణకు కావలసిన పాత రికార్డులేవీ లేకపోవడంతో జేమ్స్ వాటి కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసుకున్నాడు. కానీ అవన్నీ కోర్టులోనే గల్లంతైనట్లు తేలింది. ఎట్టకేలకు 2009లో కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు అనుమతించింది. నేరానికి పాల్పడింది జేమ్స్ కాదని ఆ పరీక్షల్లో తేలింది. ఫలితంగా 2009, డిసెంబర్ 17న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలులో గడిపిన ప్రతి సంవత్సరానికీ 50 వేల డాలర్ల చొప్పున కోర్టు అతడికి 17 లక్షల డాలర్లకు పైగా పరిహారాన్ని ప్రకటించింది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు