ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం

12 Dec, 2016 14:26 IST|Sakshi
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం

 ప్రణామం ప్రణామం ప్రణామం         ప్రభాత సూర్యుడికి ప్రణామం
 ప్రణామం ప్రణామం ప్రణామం        సమస్త ప్రకృతికి ప్రణామం
 ప్రమోదం ప్రమోదం ప్రమోదం        ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
 ప్రయాణం ప్రయాణం ప్రయాణం        విశ్వంతో మమేకం ప్రయాణం


 చరణం:1
 మన చిరునవ్వులె పూలు/నిట్టూర్పులె తడి మేఘాలు/ హృదయమె గగనం రుధిరమె సంద్రం/ఆశే పచ్చదనం/ మారే ఋతువుల వర్ణం/మన మనసున భావోద్వేగం / సరిగా చూస్తే ప్రకృతి మొత్తం /    మనలో ప్రతిబింబం
 నువ్వెంత నేనెంత రవ్వంత/ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత/అనుభవమే దాచింది కొండంత/        తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
 
 చరణం:2
 ఎవడికి సొంతమిదంతా/ఇది ఎవ్వడు నాటిన పంట/ఎవడికి వాడు నాదే హక్కని    చెయ్యేస్తే ఎట్టా/ తరములనాటి కథంతా /మన తదుపరి మిగలాలంట/క దపక చెదపక పదికాలాలిది     కాపాడాలంట/ ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం    ఇష్టంగా గుండెకు హత్తుకుందాం/కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం/తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం/ప్రణామం ప్రణామం ప్రణామం/    {పభాతసూర్యుడికి ప్రణామం
   
 ఈ పాటలో నాకు తోచినవి చెప్పడానికి ప్రయత్నించాను. మనిషిని ప్రకృతి వైపు నడపడం ఈ పాటలో ఉన్న ప్రధాన అంశం. ప్రకృతిని పూజించాలి. ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని తృణీకరించకూడదు. ప్రకృతి, మనిషి విభిన్నం కాదు. ప్రకృతిలో ఉన్నవన్నీ మనలో ఉన్నాయి. ఈ విషయాన్ని సినిమాలో సందర్భానికి తగ్గట్టు రాశాను. నాకు ఇష్టమైన విషయం కావడంతో, మంచి అవకాశం వచ్చిందనిపించి, కొంచెం విజృంభించి రాశాను. నా మనసు పొరలలో నుంచి వచ్చింది ఈ పాట. నాలుగు నెలల క్రితం పెద్ద గాలి వచ్చినప్పుడు మా ఇంటి తలుపులు ఊగిపోయాయి. ఎంతటి వాళ్లమైనా ప్రకృతి చేతిలో బందీలమే. పంచభూతాలకు కోపం రానంతవరకు అందరం క్షేమంగా ఉంటాం. అప్పుడు మళ్లీ అనుకున్నాను, ప్రకృతి కన్నెర్ర చేస్తే ఒక్కరం కూడా మిగలమని.
 
 ఆదిమానవుల నాటి నుంచి యావత్ప్రపంచం సూర్యుడిని భగవంతుడిగా ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. మాన వ సృష్టి జరిగిన నాటి నుంచి సూర్యుడే భగవంతుడు. అందుకే ముందుగా... సూర్యనమస్కారం చేసి ఆ తరవాతే మిగతా కార్యక్రమాలు ప్రారంభించడం అనాదిగా వస్తోంది. ఈ పాటలో మొదటగా ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం’ అంటూ సూర్యుడికి ప్రధమ స్థానం ఇవ్వడానికి కారణం ఇదే. ఒక్క సూర్యుడికే కాదు సమస్త ప్రకృతికే ప్రణామం. ప్రకృతి లేనిదే మనం లేము. ఇటీవల వ చ్చిన గాలికి నాలుగో అంతస్తులో ఉన్న మా ఇల్లు ఒక్కసారి నన్ను భయపెట్టింది. ప్రకృతి ఏ మాత్రం కన్నెర్ర చేసినా తట్టుకునే శక్తి ఏ ప్రాణికీ లేదని మరోమారు అర్థం చేసుకున్నాను. ఈ పాట మొత్తం ప్రకృతిని ప్రేమించమని చెబుతుంది. పూలల్లాంటి చిరునవ్వులు, తడి మేఘాల్లాంటి  నిట్టూర్పులు, ఆకాశమంత హృదయం, సముద్రంలాంటి రక్తం, పచ్చని ఆశ... వీటన్నిటికీ ఒక్కసారి పరిశీలిస్తే మనమంతా ప్రకృతికి ప్రతిబింబంగా కనిపిస్తాం. ఋతువులలాగ భావోద్వేగాలు మారుతుంటాయని, ప్రకృతి దాచిన కొండంత అనుభవాలలో అడుగులు వేస్తూ నడుద్దామని చెప్పాను ఈ చరణంలో.
 
 రెండవ చరణంలో...
 ప్రకృతి ఎవరి సొంతమూ కాదని, ఇది నాది అనే హక్కు ఎవరికీ లేదని చెప్పాను. ప్రకృతి భగవంతుడి సృష్టి. ప్రకృతిని ఎవరికి వారు చేతుల్లోకి తీసుకుంటే చివరికి మిగిలేది ప్రళయమే. ప్రేమించే పెద్దమ్మ లాంటి ఈ ప్రపంచాన్ని గుండెలకు హత్తుకోవాలే కాని, చులకనగా చూడకూడదని వివరించాను. మనం చేసే తప్పులను ఇక భరించలేక ప్రకృతి మాత ఒక్కసారి కన్నెర్ర చేసిందంటే, ఒక్కరు కూడా మిగలరు, శూన్యమే మిగులుతుందని ప్రకృతి ప్రాధాన్యతను వివరించాను. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నారు చాలామంది. వీటి వల్ల జల కాలుష్యం, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం కలుగుతున్నాయి. ఎన్నో చోట్ల ఈ కవర్ల వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పొరపాటున ఈ కవర్లను తినేస్తున్న పశుపక్ష్యాదులు మరణిస్తున్నాయి. అలాగే చాలామంది చెట్లను నరికేస్తున్నారు. దాంతో సూర్యతాపం పెరుగుతోంది, భూమి వేడెక్కుతోంది, ప్రాణికోటి అల్లాడిపోతోంది. కేవలం మానవ తప్పిదాల వల్లే ఇటువంటివి సంభవిస్తున్నాయి. అందుకే ఈ పాటలో ప్రకృతిని ప్రేమించమని, ప్రకృతిని ఆరాధించమని చెబుతూ, ప్రకృతి మీద ఏ ఒక్కరికీ హక్కు లేదనీ, విశ్వంతో ప్రయాణించాలనీ వివరించాను. నాకు బాగా నచ్చిన పాట ఇది. నాకే కాదు ప్రకృతి ప్రేమికులందరికీ నచ్చుతుంది ఈ పాట.
 - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి
 

మరిన్ని వార్తలు