లాలీ! ఓ లాలీ!!

7 Jun, 2015 17:29 IST|Sakshi
లాలీ! ఓ లాలీ!!

పాట నాతో మాట్లాడుతుంది
మోహన్‌బాబుగారి ఆఫీస్ నుండి ఫోన్ - ‘‘ఏయ్ సుద్దాలా! ఫ్రీ యేనా?’’
‘ఇపుడా - రేపు ఎల్లుండి గురించా’ మనసులో, ‘‘చెప్పండి సర్’’ అన్నాను.
‘‘ఎల్లుండి నుండి వారం రోజులు తిరుమలపై సినిమా పాటల సిట్టింగ్... నీకోకే... కదా’’
‘‘ఓకే సర్’’ - ఫోన్ కట్...
చిత్రం ఝుమ్మంది నాదం.

కీరవాణి - రాఘవేంద్రరావుల ‘రసమ్మేళనం’ తిరుమలపై సందర్భం చెప్పారు రాఘవేంద్రులు. ‘విదేశాల నుండి వచ్చిన కథానాయిక జోలపాటలపై రీసెర్చ్ చేస్తూంది. గైడ్ హీరో మనోజ్. ‘జోలపాట’ కావాలి. పసిబిడ్డల నిదురపుచ్చుతూ - పడుచు హృదయాలను నిద్రలేపేదిగా ‘పిల్ల తెమ్మెరలా - పిండివెన్నెలలా సుకుమార సుందరంగా ఉండాలి. మధ్యలో తెలంగాణ - సాగరతీర గ్రామాల జానపద మిళితంగా ఉండాలన్నారు. దర్శకేంద్ర పసిబాలుడు - రసహేలుడు - సినీరస విశ్వవిద్యాలయ చాన్స్‌లర్.
 
స్థలం తిరుమల కొండ - మనసు మా అమ్మ పాడిన జోలపాటల జ్ఞాపకాలకు వెళ్లింది. ‘‘పడుచు హృదయాలను రస హృదయాలను నిద్రలేపేలా’’ దర్శకుని మాట... పల్లవిలా గుర్తుకొస్తుంది.
 తెల్లకాగితంపై పెన్ను సిద్ధంగా ఉంది. నేను అనే నా కవితాత్మ మనోజ్ కళ్లతో తాప్సిని చూస్తోంది. నా పాట... నాతో... ‘ఊయల - గాలి... పూలతూగుటూయల - పూల గాలుల కోయిల’ - ఇలా వెళ్లు తండ్రీ! అంది. నాలోని కవి పెదవుల కొసలపై ఆత్మవిశ్వాసపు చిరునవ్వుతో కాగితంపై పల్లవిని ఇలా అలంకరించాడు.
 
‘‘లాలి పాడుతున్నది ఈ గాలి - ఈ గాలి రాగాలలో నువ్వూయల ఊగాలి’’... ఇంతే రాసి దర్శకునికిచ్చా. ఆయన పెదవులపై వెలసిన వెన్నెల కన్నులలో వెలుగై తళుక్కుమంది.  ఆ కాగితం మోహన్‌బాబుకందించారు. రసికతా కవితా భోజరాజులా ‘శెభాష్’ అన్నారు. కాగితం కీరవాణి ఆర్మోణియం పైకి వెళ్లింది. ‘చాలా బాగుంది అశోక్ తేజగారూ’ అని కాగితాన్ని చూస్తూ వేళ్లతో సంగీత మంత్ర నగరి తలుపులు తెరిచారు ఆర్మోణియంపై.
 
మొదటి స్పర్శతోనే - పల్లవికి బాణీ... వచ్చేసింది.
అక్కడున్న అందరి కరతాళ ధ్వనులే తాళాలుగా, లయ తప్పిన హృదయాలే లయలుగా పల్లవి పూర్తయింది. వెంటనే ఒక జానపద గుబాళింపు ఇవ్వాలి అనకాపల్లిలో నా మిత్రుడు సీతారాముడు ఎప్పుడో చెప్పిన జాలరీ గుండెల జాజిమల్లెల జానపద రాగాల మాల నా మేధస్సుకు ప్రాంప్టింగ్ ఇచ్చింది. కాగితంపై రాసిచ్చాను.
 
‘ఏలో యాల... ఏలో యాల హైలెస్సో
 ఐలపట్టి హైలెస్సా... బల్లా కట్టు హైలెస్సా
 అద్దిర బాబు హైలెస్సా... అక్కడ పట్టు హైలెస్సా
 సన్నజాజి హైలెస్సా... చీరాకట్టి హైలెస్సా
 సిన్నాదొచ్చి హైలెస్సా... కన్నుకొట్టె హైలెస్సా... జాలరీ జానపదుల బాణీ నేను, కీరవాణి పాడుకుంటూ ‘అలాగే దించాం’. ఆ రాత్రి ‘పసిపాపల ఎదుగుదల’ను అందంగా అందించమంటూ గాలి - పూల తీవ - వేళ్లు - బోసినవ్వు అంటూ నిద్రరాని నా కనురెప్పలపై ఊది చెప్పింది.
 
గాలి కొసల లాలి - ఆ పూల తీవెకు
వేలి కొసల లాలి - ఈ బోసి నవ్వుకు
బుడిబుడి నడకలకు - భూమాత లాలి
ముద్దు ముద్దు పలుకులకు - చిలకమ్మ లాలి
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి
ఇంతవరకు రాసి, పిల్లల గంతులను చాలా అందంగా చందమామ చందంగా చెప్పాలని నా పాట నన్ను ఊరించింది.

‘చెంగు చెంగు గంతులకు చందమామలో దాగివున్న కుందేలమ్మ లాలి’ అని రాశా. ఇంక చరణంలో కీరవాణి - దర్శకుడు - మోహన్‌బాబుల హృదయాలను ముద్దుపెట్టేంత అందంగా చెప్పాలనే తపనలో ఉండగా, ‘ఈ లాలి’ ఎలాంటిదో చెప్పు అంది నా పాట నాతో.
 ‘నా లాలి నీకు పూలపల్లకీ... అలసిన కళ్లకి...సొలసిన కాళ్లకి’
 అని రాశాక, ‘శెభాష్ తేజా’ అంది. ఆపైన తెలంగాణ జానపదం మా అమ్మ పాడే ‘ఒక పూలగుళుచ్ఛం’ లాంటి పద సంపెంగ గుత్తి గుర్తుకువచ్చింది.
 ‘‘ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ...
 ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’’... ఇది కూడా తెలంగాణ జానపదులు ఎలా పాడతారో అలాగే పెట్టాం.
 
ఇక రెండో చరణం...
 వెన్నముద్ద లాలి - చిన్నారి మేనికి
 గోరుముద్ద లాలి - బంగారు బొమ్మకి
 ఓనమాలు పలికితే - పలకమ్మ లాలి అని రాయగానే, ‘శెభాష్ తండ్రీ! పలకమ్మ లాలి బాగుంది. ‘పలుకులమ్మ లాలి’ పెట్టవా అంది. నా పాట బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి - దినదినము ఎదుగుతుంటే - దినకరుని లాలి... అనగానే మోహన్‌బాబు ‘సూపర్’ అన్నారు. ‘పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికడుపు తీపి లాలి’ అని రాశాను.
 ‘పుత్రోత్సాహంబు’ అన్న సుమతి పద్యం గుర్తుంచుకుని - పాట పూర్తయింది. ‘పడుకో తేజా’ అంటూ లాలి పాడి వెళ్లిపోయింది నా లాలిపాట.                
- డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

మరిన్ని వార్తలు