పూర్తిగా తగ్గాక కూడా... పక్షవాతాన్ని తెచ్చే జికా!

24 Sep, 2016 22:40 IST|Sakshi
పూర్తిగా తగ్గాక కూడా... పక్షవాతాన్ని తెచ్చే జికా!

జికా వ్యాధి సోకిన వారిలో కొందరికి తాత్కాలికంగా అవయవాలు చచ్చుబడిపోతాయా అన్న ప్రశ్నకు అవును అనే సమాధానమే వస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న పరిశోధనలు ఈ అంశాన్ని గట్టిగా చెబుతున్నాయి. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్ సోకి నయమైన వారిలో కనిపిస్తుంటుంది. దీని వల్ల శరీరంలో కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా ఒళ్లంతా చచ్చుబడిపోతుంది. నిజానికి ఒంటి కండరాలు చచ్చుబడేలా చేసే గులియన్ బ్యారీ సిండ్రోమ్‌ను క్రమంగా తట్టుకుని నిలిస్తే కొన్ని నెలల వ్యవధి తర్వాత పరిస్థితి మామూలుగా కావచ్చు. కండరాలు మళ్లీ మెదడు అదుపులోకి రావచ్చు. కానీ ఒక్కోసారి గులియన్ బ్యారీ సిండ్రోమ్ రోగి శ్వాసవ్యవస్థను ప్రభావితం చేస్తే ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవచ్చు.

దాంతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి, రోగిని ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చాల్సిన అవసరం రావచ్చు. జికా వచ్చిపోయాక గులియన్ బ్యారీ సిండ్రోమ్ రావచ్చని, దాని వల్ల ఒళ్లు చచ్చుబడిపోవడం, క్రమంగా పక్షవాతం లక్షణాలు కనిపించడం జరుగుతుందంటున్నారు పరిశోధకులు. ఈ కొత్త సంగతులన్నీ ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
 
ప్రస్తుతం గులియన్ బ్యారీ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో లోతైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో జికా వైరస్ ఉన్నట్లు తేటతెల్లమైంది. ‘‘అవును... జికా తర్వాత గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చేందుకు అవకాశమున్నట్లు తేలింది. ఆ రెండు వ్యాధుల మధ్య ఉన్న సంబంధం స్పష్టమైంది’’ అంటారు ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్‌లోని కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగం డెరైక్టర్ డాక్టర్ మార్కోస్ ఎస్పినాల్.

బ్రెజిల్, కొలంబియా, ద డొమెనిక్ రిపబ్లిక్, ఎల్ సాల్వెడార్, హోండురాస్, సురినామ్, వెనిజులా వంటి పలు చోట్ల గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన అనేక మంది రోగులకు నిర్వహించిన వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఇది తెలిసింది.  అంటే మనకు నేరుగా కనిపించే ముప్పే గాక... కనిపించని ముప్పు మరింతగా ఉందని స్పష్టమవుతోంది. అయితే గుడ్డిలో మెల్లలా అనిపించే విషయం ఏమిటంటే... డెంగ్యూకూ, గులియన్ బ్యారీ సిండ్రోమ్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనాల్లో నిరూపితం కాలేదు.

మరిన్ని వార్తలు