జస్ట్ 107...అంతే!

12 Nov, 2016 22:55 IST|Sakshi
జస్ట్ 107...అంతే!

విడ్డూరం

కొందరు పుట్టుకతోనే వృద్ధులు. కొందరు మాత్రం ఎప్పుడూ నిత్య యవ్వనులు. రెండో కోవకు చెందిన వ్యక్తి  మారియానో రోటెల్లి. ఇటీవలే ఈ అమెరికన్ యంగ్‌మెన్  తన 107 బర్త్ డేను కొవెట సిటీలో ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు.

‘‘ఆయన ఎప్పుడూ దిగాలుగా, ఆందోళనగా కనిపించరు’’ అని తండ్రి గురించి కూతురు నాన్సీ చెబుతుంది. ‘‘వంద సంవత్సరాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన ఎప్పుడో చనిపోయారు. నేను మాత్రం బతికే ఉన్నాను’’ అని చెబుతారు రోటెల్లి. ‘‘తన గురించి మాత్రమే కాదు... పరులకు మేలు చేయాలనే తపన తన చేత ఎన్నో మంచి పనులు చేయించింది. దాని తాలూకు తృప్తి కూడా ఆయన ఆరోగ్యానికి కారణమేమో’’ అంటుంది నాన్సి. ఒత్తిడి లేకుండా, ప్రతి రోజును ఒక పండగ రోజులా గడపడమే రోటెల్లి ఆరోగ్య రహస్యం కావచ్చు అని కొందరు అంటారు. అయితే చాలా మంది మాత్రం...

‘‘రోటెల్లి ఆరోగ్య రహస్యం విస్కీ’’ అంటారు.
ఆయన  ఆరోగ్యానికి, విస్కీకి ఏమి సంబంధం అంటారా! ఉదయం పూట రోజూ తాను కొద్దిగా విస్కీ సేవిస్తానని చెప్పారు రోటెల్లి. ఈ అలవాటు... ఏకంగా వంద సంవత్సరాల నుంచి కొనసాగుతుందట! ఎక్కువ కాలం బతికిన వాళ్లకు వారి కంటూ కొన్ని ప్రత్యేక అభిరుచులు ఉంటాయి. ‘వరల్డ్స్ ఓల్డెస్ట్ పర్సన్’గా గుర్తింపు పొందిన ఇటలీకి చెందిన ఎమ్మా మోరనోకు... రోజుకు రెండు ‘రా ఎగ్స్’ తీసుకోవడం అలవాటు. ‘రా ఎగ్స్’ తీసుకోవడమే ఆమె ఆరోగ్య రహస్యం అనేవారు కొందరు. ఎక్కువ కాలం జీవించిన మహిళ ఒకరు... ‘‘ఎవరి ఆధిపత్యాన్ని ఆమోదించకపోవడం, భర్త నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా జీవించడం నా ఆరోగ్య రహస్యం’’ అని చెప్పుకునేవారు. ఫలానా అలవాటు వల్లే... ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందా? అనేది వేరే విషయంగానీ... ఎక్కువ కాలం జీవించడం వల్ల...వారి అలవాట్లు  ఫేమస్  అవుతాయి. ఒక నిర్ధారణకు కూడా రావడానికి కారణమవుతాయి! మరి రోటెల్లి ఆరోగ్య రహస్యం ఏమిటంటారు? ‘విస్కీ’ అంటారా? ఏమో... ఎవరు చెప్పొచ్చారు!!

మరిన్ని వార్తలు