జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...

11 Jan, 2015 01:08 IST|Sakshi
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ పెట్టాలంటే...

మీరే పారిశ్రామికవేత్త!
‘ఇంట్లో అందరూ సంపాదన పరులే. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి’ అనుకుంటున్నారా?
‘ప్రతి ఒక్కరిలో ఏదో ఓ నైపుణ్యం ఉంటుంది. నాలో నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి’ అనుకుంటున్నారా?
ఇవేవీ కాదు, ‘డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే మార్గం కాదు. ఉద్యోగాలిచ్చే పరిశ్రమను స్థాపించడం గొప్ప ఆలోచన’ అనుకుంటున్నారా?
ఇందులో మీరు ఎలా ఆలోచించినా, మీలో ఏదో చేయాలనే తపన ఉన్నట్టే! మీ ఆలోచనలకు వాస్తవ రూపమివ్వడానికే ఈ ప్రయత్నం. ఈ వారం జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.

 
ఏమేం కావాలి? ఎంత ఖర్చవుతుంది?
(ధరలు రూపాయల్లో)
1 జ్యూట్ సూయింగ్ మెషీన్ - 12,000 నుంచి 20,000. ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇండస్ట్రియల్ మెషీన్ తీసుకోవాలి. అది 20,000 ఉంటుంది.
1 కటింగ్ మెషీన్ - 9,000. చేత్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో కావాలంటే మెషీన్ ఉంటే పని సులువవుతుంది. ఒక మెషీన్‌కు ఒక మనిషి చేత్తో కట్ చేసి అందించగలరు.
1 కటింగ్ టేబుల్ - 12,000. మీది చిన్న గది అయితే టేబుల్ వేయడం కుదరదు. నేల మీద పరచి కత్తిరించుకోవాలి.
 మరింత ఆకర్షణీయంగా తయారుచేయాలంటే ఎంబ్రాయిడరీ మెషీన్ కూడా తీసుకోవచ్చు. దీని ధర 28,000.
2 ర్యాకులు- ఒక్కొక్కటి 2,500
1 అల్మెరా - 6,000 నుంచి 7,000
 
ఇతరాలు:
1 కత్తెర - 200
1 పెద్ద స్కేలు - 20
1 టేపు - 5
10 బాబిన్‌లు, బాబిన్ కేస్‌లు - 350
మెషీన్ రిపేర్ కోసం స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ సెట్ - 100
2 ఐలెట్ పంచెస్ (రంధ్రాలు చేయడానికి) - ఒక్కోటి వంద.
(‘ఎలీప్’ ఇచ్చిన వివరాలతో...)
 
మ్యాన్‌పవర్: ఇద్దరు కావాలి
స్థలం ఎంతుండాలి? ఒక మెషీన్‌తో యూనిట్ పెట్టడానికి కనీసంగా కావల్సిన స్థలం: 12 బై 12 అడుగుల గది. టేబుల్ కూడా అమర్చుకోవాలంటే మరికొంత పెద్దగా ఉండాలి.  యాభై వేల రూపాయలు మీ చేతిలో ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకు రుణాల సహకారంతో పది లక్షల రూపాయల యూనిట్ పెట్టుకోవచ్చు.
 
శిక్షణ ఎలా? భారత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ‘వందేమాతరం’ పేరుతో కేంద్ర పరిశ్రమల శాఖ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘ఎలీప్’ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 18-45 ఏళ్ల మధ్య వయసు మహిళలు (కనీస విద్యార్హత 5వ తరగతి) శిక్షణ పొందవచ్చు.
 
ఎలాంటివి ఉత్పత్తి చేయొచ్చు? కుషన్ కవర్లు, కర్టెన్లు, సెల్‌ఫోన్ కవర్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, లంచ్ బాక్సుల ఆకారాలను బట్టి వాటిని ఇమిడ్చే బ్యాగులను తయారుచేయవచ్చు. సర్టిఫికెట్ల ఫోల్డర్లు, కూరగాయల సంచుల నుంచి పిక్నిక్‌కు పనికొచ్చే వెరైటీలు, ఇలా దైనందిన జీవనాన్ని గమనిస్తే ఎన్నో ఆలోచనలొస్తాయి.
 
మార్కెట్ ఎలా? జిల్లా, మండల కేంద్రాలలోని డ్వాక్రా బజార్లలో స్టాల్ అద్దెకు తీసుకుని స్వయంగా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన మార్కెట్ ఏజెన్సీలతో అంగీకారం కుదుర్చుకోవచ్చు. గుళ్ల దగ్గర, కాలనీలోని దుకాణదారులకు ప్రయోగాత్మకంగా కొన్ని పీసులను ప్రదర్శించమని అడగవచ్చు. ఇంకా, ఎలీప్ ‘విపణి’  కార్యక్రమం ద్వారా అమ్మకందార్లను, కొనుగోలుదార్లను అనుసంధానిస్తోంది.

శిక్షణ ఎక్కడ? రిజిస్ట్రేషన్ ఏలా?
1800 123 2388 టోల్ ఫ్రీ నంబరులో  సంప్రదించవచ్చు.
 
యాభై వేల రూపాయలు చేతిలో ఉంటే పదిలక్షల యూనిట్ ప్రారంభించే అవకాశాలు నేడు మహిళలకు అందుబాటులో ఉన్నాయి. ఎలీప్ ద్వారా శిక్షణ, పరిశ్రమ పెట్టడానికి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహాలు  అందిస్తున్నాం. ఆన్‌లైన్ మార్కెట్‌కు కూడా తెర తీశాం. జ్యూట్ (జనపనార) పర్యావరణ హితమైనది. దాని  వాడకం పెరిగితే పరోక్షంగా రైతులకు ఉపాధి పెరుగుతుంది.
 
 - రమాదేవి
ఎలీప్(అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) అధ్యక్షురాలు


రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు