ఆపరేషన్‌ కాదంబిని

7 Apr, 2019 11:15 IST|Sakshi

‘భారత జాతీయ కాంగ్రెస్‌ సభా వేదిక మీద కనిపించిన తొలి భారతీయ మహిళ శ్రీమతి కాదంబిని గంగూలీ. తుది పలుకులు చెప్పవలసిందని కోరగానే ఆమె వేదిక ఎక్కి ప్రసంగించారు. స్వేచ్ఛాభారతం మహిళకు చేయూతనిస్తుందని చెప్పడానికి ఇదొక సంకేతం.’ అనిబీసెంట్‌  ‘హౌ ఇండియా రాట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌’ అన్న పుస్తకంలో రాసిన మాటలు ఇవి. కాదంబిని గంగూలీ జీవితంలో ఇలాంటి  ‘తొలి’ఘనతలు చాలా ఉన్నాయి. ఆమె భారతదేశ చరిత్రలో కనిపించే ఒక అద్భుత మహిళ. ఆమె సేవలను బట్టి ఫ్లారెన్స్‌ నైటింగేల్, అనిబీసెంట్‌లతో సమంగా కీర్తి పొందవలసిన విదుషీమణి వెంటనే అర్థమవుతుంది. కానీ భారతీయ చరిత్రకు ఏదో శాపం ఉంది. ఇలాంటి వారిని నిర్దాక్షణ్యంగా పట్టించుకోకుండా సాగింది.

కాదంబిని వైద్యురాలిగా అవతరించిన కాలాన్ని చూస్తే తప్ప ఆమె విజయం ఎంత చరిత్రాత్మకమో అర్థం కాదు. ఆమె పుట్టిన సంవత్సరం 1861. ఆ సంవత్సరమే భారతదేశంలో సతీ దురాచారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తూ విక్టోరియా రాణి ప్రకటన జారీ చేశారు. ఇంకాస్త వెనక్కి వెళితే దారుణమైన దృశ్యం కనిపిస్తుంది. 1803లో కలకత్తాలోనే కేవలం 30 మైళ్ల పరిధిలో 438 సతీసహగమనాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న నేల మీద పుట్టిన కాందబిని ఒక గైనకాలజిస్ట్‌గా అవతరించారు. బ్రహ్మ సమాజీకుల కుటుంబంలో పుట్టారామె. కానీ సనాతన హిందువులు సరే, మహిళను ఉద్ధరించడమే ఉద్యమ ధ్యేయమని చెప్పుకున్న  బ్రహ్మ సమాజీకులు కూడా ఆమె వైద్య విద్యను అభ్యసించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

ఇక్కడ పేర్కొంటున్న ఈ ఉదాహరణకి మనుషులను తప్పు పట్టాలో, కాలాన్ని తప్పు పట్టాలో ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే సంస్కరణోద్యమాలకీ, రాజకీయోద్యమాలకీ, సాంస్కృతికపునరుజ్జీవనోద్యమాలకి ఆటపట్టయిన వంగదేశంలో ఇది జరిగింది. పురిటి నెప్పులు పడుతున్న బాలికను పరీక్షించేందుకు కలకత్తాలోనే ఒకసారి ఒక ధనిక కుటుంబం కాదంబినిని ఇంటికి పిలిచింది. పురుడొచ్చింది. తల్లీ, శిశువు  క్షేమంగా బయటపడ్డారు. తరువాత కాదంబినికీ, ఆమె సహాయకురాలికీ భోజనం పెట్టిందా కుటుంబం– బయట వరండాలో. అంతేకాదు, ఎంగిలి విస్తళ్లు తీసి, అక్కడ శుభ్రం చేయమన్నారు కూడా. ఆ రోజుల్లో వైద్య విద్య చదివిన మహిళా డాక్టరు అన్నా మంత్రసాని కంటే ఎక్కువ విలువ ఇచ్చేది కాదు సమాజం.

కాదంబిని గంగూలీ (జూలై 18, 1861–అక్టోబర్‌ 3, 1923) అసలు పేరు కాదంబిని బసు. భారతదేశం నుంచి పట్టభద్రులైన తొలి ఇద్దరు మహిళల్లో ఒకరు. ఆ రెండో మహిళ డెహ్రాడూన్‌కు చెందిన చంద్రముఖి బసు.  నిజానికి మొత్తం బ్రిటిష్‌ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలు వారు. దేశంలో వైద్యవృత్తి చేసిన తొలితరం స్త్రీలలో కాదంబిని ఒకరు.  అయితే కాదంబిని పాశ్చాత్య వైద్యం చేయడానికి సర్టిఫికెట్‌ పొందిన మహిళగా ఖ్యాతి గాంచారు. ఆమె వైద్యురాలిగా ఎంతో ప్రతిభను కనపరచడమే కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలో, మహిళల హక్కుల సాధన ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు.

కాదంబిని బిహార్‌లోని భాగల్పూరులో పుట్టారు. ఆమె కుటుంబం బ్రహ్మ సమాజ దీక్షను స్వీకరించింది. నిజానికి వీరి అసలు ఊరు వంగదేశంలోని బారిసాల్‌ జిల్లాలోని చాండ్సి.   ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది. ఆమె తండ్రి బ్రజ్‌ కిశోర్‌ బసు. ఆయన స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. బ్రహ్మ సమాజ సభ్యుడు కాబట్టి సంఘ సంస్కరణోద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించేవారు. స్త్రీ విముక్తి కోసం బ్రహ్మ సమాజం పాటు పడేది.

కాదంబిని బ్రాహ్మో ఈడెన్‌ ఫిమేల్‌ స్కూల్‌లో ఆంగ్ల విద్యను అభ్యసించింది. ఇది ఢాకాలో ఉంది. తరువాత కలకత్తాలోనే బాల్యాగంజ్‌లో హిందూ మహిళా విద్యాలయంలో (1876) చదువుకున్నారు. తరువాత దీనిని బెతూన్‌ స్కూల్‌లో విలీనం చేశారు. ఇందులో చేరడమూ ఆమెకు గగనమైపోయింది. దీనికి కలకత్తా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష నిర్వహించేది. కానీ మహిళలకు ప్రవేశం ఉండేది కాదు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న  మోడ్రన్‌ దురాచారమే అనుకోనక్కరలేదు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌ల సంప్రదాయాన్ని అనుసరించే కలకత్తా విశ్వవిద్యాలయం కూడా మహిళలకు ప్రవేశం కల్పించేది కాదు. ఆమెతో పాటే డెహ్రాడూన్‌కి చెందిన చంద్రముఖి బసు కూడా దరఖాస్తు చేశారు.

ప్రవేశ పరీక్ష కోసం పెద్ద పోరాటమే చేసిన వ్యక్తి ద్వారకానాథ్‌ గంగూలీ. ఆయన అదే స్కూల్‌లో ఉపాధ్యాయుడు. మొత్తానికి ఆ ఇద్దరు బాలికలు ప్రవేశ పరీక్ష 1877లో రాశారు. మరుసటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి. ఒక్క మార్కు తక్కువగా కాదంబిని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. చంద్రముఖి కొంచెం తక్కువ మార్కులతో ఉత్తీర్ణురాలయ్యారు. కాదంబినికి బెతూన్‌లో కళాశాల స్థాయిలో ప్రవేశం దక్కింది.

చంద్రముఖి ఫ్రీ చర్చ్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ కళాశాలలో ప్రవేశించారు. 1880లో ఇద్దరూ ఫస్ట్‌ ఆర్ట్స్‌ (ఎఫ్‌ఏ) పట్టా తీసుకున్నారు. తరువాత కాదంబిని కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని ఆశించారు.  కానీ మహిళలకు ప్రవేశం లేదు. దీనితో కాదంబిని, చంద్రముఖి ఇద్దరూ బెతూన్‌ కళాశాలలోనే డిగ్రీలో చేరారు. 1883లో ఉత్తీర్ణులయ్యారు. ఆ విధంగా బ్రిటిష్‌ సామ్రాజ్యంలోనే పట్టభద్రులైన తొలి మహిళలుగా పేరు సంపాదించారు. 

 తరువాత కలకత్తా వైద్య కళాశాలలో చేరాలని కాదంబిని కోరుకున్నారు. ఇందుకూ మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ 1875 నాటికే మహిళలను చేర్చుకోవడానికి సిద్ధపడింది. కానీ 1882 నాటికి కూడా కలకత్తా వైద్య కళాశాల మాత్రం అందుకు సిద్ధపడలేదు. మళ్లీ ద్వారకానాథ్‌ రంగంలోకి దిగి పోరాడారు. 1884లో ఆ వైద్య కళాశాలలో చేరిన తొలి మహిళ కాదంబిని. వైద్య విద్య చదవడానికి ఆమెకు ప్రభుత్వం నెలకు 20 రూపాయలు విద్యార్థి వేతనం మంజూరు చేసింది.

కానీ ఈ విజయం కోసం ఆమె ఎన్నో అవరోధాలను అధిగమించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వైద్య కళాశాలలో మహిళల ప్రవేశం నిర్వాహకులకు రుచించేది కాదు.  ఒక బెంగాలీ ఆచార్యుడు కూడా ఆమె వ్యతిరేకులలో ఉన్నారు. ఆయనే మెటీరియా మెడికా, కంపేరిటివ్‌ అనాటమీ పరీక్షలో మార్కులు తగ్గించాడు. దీనితో ఆమె ఎంబి (బేచిలర్‌ ఆఫ్‌ మెడిసిన్‌) పట్టాను కోల్పోయింది. గ్రాడ్యుయేట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ బెంగాల్‌ (డిప్లొమా) పట్టా మాత్రమే దక్కింది. ఇన్ని ఆటంకాల నడుమ 1886లో ఆమె ఆ స్థాయికి చేరడం మహోన్నత చరిత్రాత్మక విజయమే.

ఆ డిప్లొమాతో కాదంబిని లేడీ డఫ్రిన్‌ ఉమెన్స్‌ హాస్పిటల్‌లో చేరారు. జీతం రెండువందల రూపాయలు. అక్కడ కొద్దికాలమే ఉన్నారు. కారణం– వివక్ష. ఆమెతో పాటు పనిచేసే పాశ్చాత్య మహిళా వైద్యులు ఆమెను చులకనగా చూసేవారు. కారణం ఆమెకు ఎంబి పట్టాలేదు. మూడేళ్లు గడిచినా ఆమెకు ఆ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. దీనితో కొద్దికాలంలోనే ఆమె అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రైవేటు ప్రాక్టీసు ఆరంభించారు. కానీ పెద్దగా విజయవంతం కాలేదు. అప్పుడే ఆమె లండన్‌లో పాశ్చాత్య వైద్య విద్య చదివి మరో శిఖరం అధిరోహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

1892లో అనుకున్న విధంగానే కాదంబిని లండన్‌ వెళ్లారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఆర్‌సిపి పట్టా, డబ్లిన్‌ విశ్వవిద్యాలయం నుంచి సీఎఫ్‌పిసి పట్టా, గ్లాస్గో విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఆర్‌సీఎస్‌ పట్టా తీసుకుని ఇండియా వచ్చారు. విదేశాలలో వైద్య పట్టాపుచ్చుకుని వచ్చి ఆ వృత్తిని నిర్వహించిన తొలి ఆసియా మహిళగా కాదంబిని చరిత్ర ప్రసిద్ధురాలయ్యారు. ఆమె మళ్లీ సగౌరవంగా డఫ్రిన్‌ ఆస్పత్రిలో చేరారు. కొద్దికాలమే పనిచేసి ప్రైవేట్‌ ప్రాక్టీసు పెట్టారు. నేపాల్‌ రాజమాతను దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యను పరిష్కరించడంతో ఉన్నత వర్గాలలో ఆమె పేరు మారుమోగిపోయింది. ఇక ఆమె వెనుతిరిగి చూడలేదు.

కాదంబిని ద్వారకానాథ్‌ గంగూలీని వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్రహ్మ సమాజీకుడే. అప్పటికి ఆయన భార్య  పోయింది. ముగ్గురు పిల్లలు. బెతూన్‌లో ఉపాధ్యాయుడైన ద్వారకానాథ్‌ కాదంబినికి అన్ని విధాలా సహకరించారు. అన్నట్టు ఇద్దరూ బ్రహ్మ సమాజీకులే అయినా ఈ వివాహాన్ని బ్రహ సమాజంలో కొందరు అంగీకరించలేదు.

ఆయన ప్రోత్సాహంతోనే కాదంబిని విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేశారు. 1891లో మరొక దారుణ సంఘటన జరిగింది. ఆనాడు ‘బంగా బసి’ పేరుతో ఒక ప్రముఖ పత్రికకు నడిచేది. దానికి  మహేశ్‌చంద్ర పాల్‌ సంపాదకుడు. కాదంబినిని చూస్తే బ్రహ్మ సమాజ స్త్రీలోకం తల దించుకుంటోందని విమర్శిస్తూ, ఆమెను పరోక్షంగా ‘వేశ్య’ అని రాసింది. దీనితో ద్వారకానాథ్, డాక్టర్‌ నీల్‌రతన్‌ సర్కార్, శివనాథశాస్త్రి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆ పత్రికకు వంద రూపాయల జరిమానా, సంపాదకుడికి  ఆరుమాసాలు జైలు శిక్ష విధించింది.

కాదంబిని గొప్ప వైద్యురాలు. గొప్ప సామాజిక కార్యకర్త. మేధావి. వీటితో పాటు గొప్ప తల్లి. ఆమె తన భర్త ముందు భార్యకు జన్మించిన ముగ్గురు పిల్లలతో పాటు, తామిద్దరికీ జన్మించిన మరో ఐదుగురు పిల్లలను కూడా పెంచారు. భర్తకు, ఆమెకు పదిహేడు సంవత్సరాల తేడా ఉంది.ఆమె పలు సామాజిక ఉద్యమాలతో పాటు కాంగ్రెస్‌ జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు.  దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీజీ స్థాపించిన  ట్రాన్స్‌వాల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1923లో మరణించే వరకు ఆమె వైద్య వృత్తిని వీడలేదు. 

విదేశాలలో వైద్య విద్య చదివి వచ్చి దేశంలో సేవలు అందించిన వారిలో కాదంబిని తొలి మహిళ కాదన్న వాదన ఒకటి ఉంది. అందులో నిజం లేకపోలేదు. కానీ ఇదొక వ్యర్థ వాదన. ఆనందీబాయి జోషి పాశ్చాత్య దేశాలలో వైద్యవిద్యను అభ్యసించి వచ్చిన తొలి భారతీయ వనిత. మహారాష్ట్రకు చెందినవారు. ఆమె 1885లోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో వైద్య విద్యను పూర్తి చేశారు. 1886లో భారత్‌ వచ్చారు. ఆ తరువాత సంవత్సరమే ఆమె కన్నుమూశారు. ఆమె వైద్య సేవలు అందుకునే అవకాశం నాటి భారతీయ మహిళకు దక్కలేదు.

కాదంబిని 1886లో కలకత్తాలోని బెంగాల్‌ మెడికల్‌ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు. 1892లో ఇంగ్లండ్‌లో వైద్య విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ప్రసూతి వైద్యురాలిగా ఆమె సేవలు చిరకాలం భారతీయ మహిళలు అందుకున్నారు. ఆనందీబాయి, కాదంబిని ఎవరు ముందు అంటూ ఆ మధ్య అమెరికా నుంచి వెలువడే వైద్య విశేషాల పత్రిక ‘యూరాలజీ’ ఒక ప్రశ్న వేసింది. ఆనందీ తొలి మహిళ కావచ్చు. కానీ భారతీయ సమాజానికి సేవలు అందించిన మహిళగా కాదంబిని కూడా గుర్తుంటారు.  ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. 1886–1887లో మద్రాస్‌ వైద్య కళాశాల నుంచి అనీ జగన్నాథన్‌ అనే మహిళ వైద్య విద్యలో డిప్లొమా తీసుకున్నారు. అయినా తొలితరం కాబట్టి ఎవరి విలువ వారిదే. చరిత్ర వీరిని సమంగా గౌరవించవలసిందే.
·
కాంగ్రెస్‌ సభలలో వేదిక మీద కనిపించిన తొలి మహిళ కూడా కాదంబిని. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో కూడా పాల్గొన్నారు. 1908లో కలకత్తాలోనే మహిళా సమావేశం నిర్వహించారు. తూర్పు భారతంలో గనులలో పనిచేసే మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం