కాపీ హాసన్!

19 Jul, 2015 00:18 IST|Sakshi
కాపీ హాసన్!

ఆ సీన్ - ఈ సీన్
‘పంచతంత్రం’... రిటన్ బై కమల్ హాసన్. ‘పోతురాజు’... డెరెక్టైడ్ బై కమల్ హాసన్. విశ్వనాయకుడు ముఖ్యపాత్రల్లో నటించి రూపొందించిన సినిమాలు ఇవి. మొదటిది 2002లో వచ్చింది. మరోటి 2004లో వచ్చింది. ఇవి సూపర్‌హిట్ సినిమాలు. ఇంకో పోలిక ఏమిటంటే..  రెండు సినిమాల్లోనూ విదేశీ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. కమల్ విదేశీ సినిమాల స్ఫూర్తితో సినిమాలు రూపొందిస్తాడనే వాదనకు బలాన్ని ఇస్తాయివి.

అయితే కమల్ ఎలాంటి కథనైనా లోకలైజ్ చేయగలడు.. మూలాల ప్రభావం లేకుండా తన సృజనాత్మకతను చాటగలడు అనే మాటకు కూడా రుజువులు ఈ సినిమాలు.
 తమిళనాడు గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కట్టిన సినిమా ‘పోతురాజు’. తమిళంలో ‘వీరుమాండి’ పేరుతో రూపొందిన ఈ సినిమా అంతర్లీనంగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఉరిశిక్షపై గొప్ప చర్చలా సాగుతుంది. అత్యంత వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఉరి రద్దు డిమాండ్‌ను వినిపించే కమల్ దర్శకత్వ ప్రతిభకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే.

ఈ అద్భుత సినిమా కథ, కథనాల క్రెడిట్ పూర్తిగా కమల్‌కే దక్కుతాయి. అయితే ఈ కథా కథనాలను వినిపించే విధానంలోనే కమల్‌పై ‘రషోమన్ ఎఫెక్ట్’ కనిపిస్తుంది. జపాన్ దర్శకుడు అకిరా కురసోవా ‘రషోమన్’ సినిమా కథను చెప్పిన పద్ధతిలోనే కమల్ ‘పోతురాజు’ కథను వివరించాడు.
 
‘నీకు తెలిసింది ఒకటి.. నాకు తెలిసింది మరోటి.. అసలు నిజం ఇంకోటి’ అనే తాత్వికతను తెరపై ఆవిష్కరించేదే ‘రషోమన్ ఎఫెక్ట్’. అకిరా కురసోవా తన ‘రషోమన్’ స్క్రిప్ట్ విషయంలో తొలిసారి ఈ ప్రక్రియను అనుసరించాడు. దీంతో దీనికి రషోమన్ ఎఫెక్ట్‌గా పేరు. ఇదెలా ఉంటుందంటే పోతురాజు సినిమాలో చూపినట్టుగా... మొదట కథ అంతా విలన్ పశుపతి పాత్ర ద్వారా చెప్పిస్తారు. ఆ తర్వాత అవే సంఘటనల గురించి కమల్ చేసిన పోతురాజు పాత్ర చేత చెప్పిస్తారు.

పరస్పర విరుద్ధమైన తీరున కథను వివరిస్తాయి ఆ పాత్రలు. 1950లో వచ్చిన రషోమన్ సినిమాతో ఇలా కథను వివరించాడు అకిరా. తర్వాత ఆ పద్ధతిని అనుకరిస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి వాటిలో ‘పోతురాజు’ కూడా ఒకటి. ఇక్కడ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే.. కథ చెప్పే విధానంలో కమల్ అకిరాను ఫాలో అయ్యాడేమో కానీ, అసలు కథ, కథనాల విషయంలో మాత్రం అణువణువునా కమల్ శ్రమ కనిపిస్తుంది. అది పోతురాజు వెనుక ఉన్న కథ.
 
ఇక ‘పంచతంత్రం’ సంగతి. ఐదుగురు స్నేహితులు. ఉల్లాసంగా గడపడానికి బయలుదేరతారు. బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఒక కాల్‌గాళ్‌తో ఆనందించాలనేది వారి ప్రణాళిక. ఈ ప్రయత్నంలో వారు అనుకోని చిక్కుల్లో పడతారు. ఈ చిన్న పాయింట్‌ను మాత్రమే అమెరికన్ సినిమా ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ నుంచి తెచ్చుకొన్నారు కమల్. దాన్ని గొప్ప కామెడీ ఎంటర్ టైనర్‌గా మార్చి లోకలైజ్ చేస్తూ ‘పంచ తంత్రం’ కథను తీర్చిదిద్దాడు. ఎలాంటి బ్యాడ్ మూడ్‌నైనా మార్చేసి మనసును తేలిక పరిచే సినిమా ‘పంచతంత్రం’.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కమల్‌తో సహా నలుగురు దక్షిణాది నటులు ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ఇది. ఆద్యంతం నవ్వులు పండించే ఈ సినిమాకు కమల్, క్రేజీ మోహన్‌లు రచ నా బాధ్యతలు తీసుకున్నారు. ‘వెరీ బ్యాడ్ థింగ్స్’ అనేది ఒక ట్రాజెడీ మూవీ. అయితే పంచతంత్రం మాత్రం ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ట్రీట్‌మెంట్ విషయంలో రెండు సినిమాలకూ ఎక్కడా పోలిక ఉండదు. అయితే మూల కథ కాపీ అనే ముద్ర మాత్రం మిగిలిపోయింది.
 - బి.జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు