మహాత్ముడికే స్ఫూర్తి

6 Mar, 2016 00:16 IST|Sakshi
మహాత్ముడికే స్ఫూర్తి

కస్తూరిబా వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె ఆలోచనలు ఎంతో దృఢమైనవి. ఆ దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది.
 - కస్తూరిబా గురించి గాంధీ
 
 ‘నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలి కలుగుతూ వుంటుంది’ అని తన ఆత్మకథలో రాసుకున్నారు మహాత్మాగాంధీ. పదమూడేళ్ల వయసుకే పెళ్లయిన తన చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అలా రాసుకున్నారు. అయితే... తన సంసారం గురించి, కుస్తూరిబా గురించి గాంధీజీ చెబుతున్నప్పుడల్లా...‘కస్తూరి బా సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నామీద నాకే గర్వం కలుగుతుంది’ అంటూ ఆయన మనసులోని మార్మిక మాటను అందరికీ వినిపిస్తూనే ఉన్నారు.
 
 ఒక బాల్యస్నేహితురాలిగా తన జీవితంలోకి వచ్చిన కస్తూరిబా గురించి గొప్ప కలలు కన్నారు గాంధీజీ. ఆయన ఇలా అనుకున్నారు...‘నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని, నేను నేర్చుకున్నదాన్ని ఆమె నేర్చుకోవాలని, నేను చదివినదాన్ని ఆమె చదవాలని, ఇద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన లేదు’. గాంధీజీ కన్న ఈ కల వృథా పోలేదు. నూటికి నూరుపాళ్లు నిజం అయ్యింది.
 
 సంసార విజయానికి పట్టు విడుపులు ఉండాలి. ఒక అభిప్రాయాన్ని తన కోణం నుంచి మాత్రమే చూడడం కాకుండా అవతలి వ్యక్తి కోణం నుంచి కూడా చూసే సహనశీలత, ఉదార లక్షణం ఉండాలి. మొదట్లో గాంధీజీ అభిప్రాయం, నిర్ణయాల పట్ల అసహనం, కోపం ప్రదర్శించినా... ఆ తరువాత మాత్రం వాస్తవంలోకి వచ్చారు కస్తూరిబా. భర్త నిర్ణయాలలోని మంచిని గ్రహించారు. దాన్ని అక్షరాలా ఆచరించారు. దీనికొక ఉదాహరణ...
 
 కస్తూరిబా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  ఉప్పు, పప్పు మానేయమని సలహా ఇచ్చారు గాంధీజీ. ‘‘ఉప్పు పప్పు మానేయమని మీకు ఎవరైనా చెబితే మీరు మానేస్తారా?’’ అని అడిగారు కస్తూరిబా. వెంటనే గాంధీజీ... ‘‘ఈ క్షణం నుండి ఒక సంవత్సర కాలం ఉప్పు పప్పు వదిలేస్తున్నాను’’ అన్నారు. ‘‘క్షమించండి. మీ మాట ప్రకారం ఉప్పు, పప్పు మానేస్తాను. మీరు మాత్రం మానకండి.
 
 నాకు శిక్ష పడుతుంది’’ తల్లడిల్లిపోతూ సమాధానం ఇచ్చారు కస్తూరిబా.కస్తూరిబా దృఢచిత్తం గురించి గాంధీజీ ఎన్నోసార్లు చెప్పారు. తన ఆత్మకథలో  ‘నా భార్య యొక్క దృఢచిత్తత’ అని  రాసిన ఒక అధ్యాయంలో ఇలా రాశారు- ‘కస్తూరిబా శరీరం బాగా క్షీణించింది. మత్తు మందు ఇవ్వకుండానే డాక్టర్ ఆపరేషన్ చేశాడు. కత్తులు పని చేస్తున్నప్పుడు అపరిమితంగా బాధ కలిగింది. కానీ ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది చూసి నేను నివ్వెర పోయాను. భయంకరమైన స్థితిలో ఉన్న భార్యకు ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు కలగలేదు. ‘ఏం ఫరవాలేదు. భయపడకండి’ అని ఆమే నాకు ధైర్యం చెప్పింది.’’

 కస్తూరిబా ధైర్యం గురించి ప్రశంసించడమే  కాదు...‘ఆమె దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది’ అని చెప్పారు గాంధీజీ.గాంధీజీ డర్బన్‌లో వకీలుగా పని చేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే గుమస్తాలు ఆయనతో పాటే ఉండేవారు. ఆ గుమస్తాలకు కేటాయించిన గదులలో ప్రతి గదిలో మూత్ర విసర్జనకు ప్రత్యేక పాత్రలు ఉండేవి. కొత్తగా చేరిన ఒక గుమాస్తా తన గదిలో ఉన్న పాత్రను తెలిసో తెలియకో శుభ్రపరిచేవాడు కాదు. దీంతో శుభ్రపరిచే పని కస్తూరిబా తీసుకునేవారు. ఈ విషయం ఆవిడకు తలనొప్పిగా మారింది. ఇది భార్యాభర్తల మధ్య తగాదాకు కూడా కారణమైంది.
 
  దీని గురించి గాంధీజీ ఇలా చెప్పారు...

 ‘‘ఆమె కోపంతో మూత్ర పాత్రను తీసుకువెళ్లడానికి నేను ఇష్టపడలేదు. నవ్వుతూ తీసుకువెళ్లాలి అని చెప్పాను. కంఠం పెద్దది చేసి ‘ఈ కలహం నా ఇంట్లో నడవదు’ అని అరిచాను. ‘అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లిపోతున్నాను’ అన్నది. అప్పుడు దయ అనేది నా హృదయంలో కొంచెం కూడా మిగలలేదు. నిస్సహాయురాలైన ఆ అబలను ద్వారం దాక లాక్కెళ్లాను.  ‘నేను ఎక్కడికి వెళ్లను? ఇక్కడ మా అమ్మానాన్నలు లేరు. ఆడదాన్ని... అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు’ అని కళ్ల నిండా కన్నీళ్లతో అంది కస్తూరిబా.
 
 పైకి ధుమధుమలాడుతూ ఉన్నాను. కానీ లోలోన సిగ్గుపడిపోయాను. భార్య నన్ను వదలలేనప్పుడు  నేను ఆమెను వదిలి ఎక్కడికి వెళ్లగలను? అలా తను అద్భుత సహనశక్తితో విజయం సాధించిందన్నమాట’’ మహాత్ముని జీవితాన్ని తరచిచూసినప్పుడు... గుణాత్మకంగా తనను తాను సవరించుకోవడానికి ఒక అద్దంలా, అధైర్యం నుంచి ధైర్యమనే శక్తిని ఆవాహన చేసుకునే శక్తిస్వరూపిణిగా, ఉద్యమ ప్రస్థానానికి చోదకశక్తిగా కస్తూరిబా మహాత్ముడి జీవితంలో భాగమైపోయారు. భౌతిక ఆడంబరాల నుంచి వచ్చే ఆనందం ఆనందం కాదని మానసిక తృప్తి నుంచి వచ్చే ఆనందమే అసలు సిసలు ఆనందమని అక్షరాలా నమ్మారు.
 - యాకూబ్ పాషా

మరిన్ని వార్తలు