ఇదే మా ఇంటికి అటక

15 Dec, 2019 09:04 IST|Sakshi

కథా ప్రపంచం

నలభైయో నంబరు జాతీయ రహదారి నుండి పదికిలోమీటర్లు కుడివైపు వెళ్ళినట్లయితే బ్రహ్మపూర్‌ కనబడుతుంది. ఆ మలుపు తిరగటానికి కొద్ది నిమిషాల ముందర నేను ఆదిత్యను అడిగాను–
 ‘‘మిత్రమా! నువ్వు నీ పుట్టిన వూరునీ స్థలాన్ని చూస్తావా? ఆ వూరు వదిలి వచ్చిన తరువాత మళ్ళీ వెళ్ళలేదనుకుంటాను’’
‘‘ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం వూరు విడిచి వచ్చేశాను. ఈసరికి మా ఇల్లు శిథిలమైపోయి వుంటుంది. ఆ మాట కొస్తే నేను చదివిన బడి ఏమై వుంటుందో? అంచేత చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలని భావించి అక్కడికి వెళ్లినా నాకు నిరుత్సాహమే ఎదురు కావచ్చు. కాబట్టి నాగేన్‌బాబు గారి టీ దుకాణం వద్ద ఆగి ఒక కప్పు టీ తాగుదాం, అది కూడా ఇంకా అక్కడ వుంటే...’’

ఆదిత్య పూర్వీకులు అక్కడి స్థానిక జమీందార్లు. స్వతంత్రం వచ్చిన మరుసటి సంవత్సరం ఆదిత్య తండ్రి ఆ వూరిని శాశ్వతంగా వదలి కలకత్తా చేరి వ్యాపారంలో స్థిరపడ్డారు. బడి చదువు పూర్తయిన వరకు ఆదిత్య బ్రహ్మపూర్‌లోనే వున్నాడు. కలకత్తా యూనివర్శిటీలో నేను అతడి సహాధ్యాయిని. తండ్రి హఠాత్తుగా చనిపోయిన తరువాత వ్యాపార పగ్గాల్ని ఆదిత్య తీసుకున్నాడు. ఇప్పుడు నేను అతడి మిత్రుడ్నీ, భాగస్వామిని కూడా.
మేము ప్రస్తుతం దేవ్‌దార్‌గంజ్‌లో కొత్త పరిశ్రమ స్థాపిస్తున్నాం. అక్కడి నుండే తిరిగి వస్తున్నాం. కొద్ది నిమిషాల్లో బ్రహ్మపూర్‌కు చేరుకుంటామనగా ఆదిత్య ‘ఆగు’ అన్నాడు.  అక్కడ ఉన్న పాఠశాల భవనం ముఖద్వారం ఇనుపఫ్రేమ్‌ మీద ‘విక్టోరియా ఉన్నత పాఠశాల. స్థాపితం 1892’ అని చెక్కి వున్నది.
‘‘చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయా?’’ ఆదిత్యని అడిగాను.
‘‘ఏమీ రావడం లేదు. అప్పుడు ఇంత భవనం వుండేది కాదు. కుడివైపున ఇప్పుడు ఉన్న భవనం స్థానంలో విశాలమైన ఖాళీస్థలం ఉండేది. అందులో మేం కబడ్డీ ఆడేవాళ్ళం’’

మేము అక్కడ నిల్చుని ఒక నిమిషం పాటు బడినీ ఆ పరిసరాల్నీ పరికించాం. ఆ తరువాత కారుని చేరుకున్నాం.
‘‘నువ్వన్న టీ దుకాణం ఎక్కడుంది?’’ అని అడిగాను.
 ‘‘ఇక్కడి నుండి సుమారు మూడు ఫర్లాంగులు వెళ్ళాలి’’ అన్నాడు.
‘‘మీ ఇల్లు ఎక్కడుంది?’’
‘‘ఈ పట్నానికి ఒక చివరన వుంటుంది. దాన్ని చూడాలని నాకు కోరిక ఏమీ లేదు. చూసినా ఒక విధమైన నైరాశ్యం ఆవహిస్తుంది’’ అన్నాడు ఆదిత్య.
మేము తొందరగానే కూడలిని చేరుకున్నాం. ముందు టెర్రాకోట దేవాలయం కనబడింది. మేము అటు వెళ్తూ వుండగానే హఠాత్తుగా ఆదిత్య ఆశ్చర్యంగా చూశాడు. ‘నాగేన్స్‌ టీ కేబిన్‌’. అక్కడ కిరాణాదుకాణం కూడా వున్నది. ఆనాటి యజమాని కూడా సజీవంగానే ఉన్నాడు. ఇప్పుడతనికి అరవై ఏళ్ళు దాటి వుంటాయి. అతని ముఖంలో వార్థక్యపు లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

‘‘బాబూ! మీరు ఎక్కడ నుండి వస్తున్నారు?’’ మమ్మల్ని అడిగాడు. సహజంగానే అతడు ఆదిత్యను గుర్తించే ప్రశ్నే లేదు.
‘‘దేవ్‌దార్‌గంజ్‌ నుండి’’ అన్నాడు ఆదిత్య. 
‘‘అలాగా...మరి ఇక్కడకు...’’ అన్నాడు షాపు యజామాని.
‘‘మీ దుకాణంలో ఒక కప్పు టీ తాగాలని ఆగాం’’
‘‘చాలా సంతోషం. రండి. కూర్చోండి. మీకు మంచి బిస్కెట్లు కూడా ఇస్తాను’’
 ఆ దుకాణంలో మాతో పాటు మరో వినియోగదారుడు మాత్రమే వున్నాడు. ఒక మూలగా వున్న టేబుల్‌ దగ్గర కూర్చున్నాడు. అతడు నిద్రపోతున్న భంగిమలో వున్నాడు.
‘‘ఓయ్‌ సన్యాల్‌! నాగేన్‌ అతడ్ని బిగ్గరగా పిలిచాడు.

‘‘ఇప్పుడు నాలుగ్గంటలు కావస్తున్నది. నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన టైమయింది. ఇంకా కస్టమర్లు ఎక్కువ మందే వస్తారు’’ అంటూ మా వైపు తిరిగి కన్ను మెదిలించి ఇలా అన్నాడు: ‘‘అతడొక చెవిటి మాలోకం. కళ్ళూ సరిగ్గా కనపడవు. కాని కళ్ళద్దాలు చెయ్యించుకునే స్థోమత కూడా లేదు’’
నాగేన్‌బాబు మాటలకు సన్యాల్‌ ప్రతిస్పందిచిన విధానం కూడా అతని మనస్థితి పట్ల సందేహాల్ని రేపింది. అతడు కొన్ని క్షణాల పాటు మా వైపు చూసి, ఒక్కసారిగా చలించి ఏదో పాట పాడ్డం మొదలుపెట్టాడు.
‘దోచుకునే వాళ్ళొచ్చారు మరాఠా నుండి...
యుద్ధానికి సిద్ధం కండి...
అజ్మీరు రాజుని పిలవండి...’

బిగ్గరగా ఆ గీతాన్ని పాడుకుంటూ నమస్కారం చేసే భంగిమలో చేతులు జోడించి  ఎవరివైపు చూడకుండానే షాపు బయటికి నడిచాడు. అదే రోడ్డు నుండి ముందుకెళ్ళి కూడలిని చేరుకున్నాడు. అక్కడ చాలామంది జనం వున్నారు. కానీ ఒక్కరు కూడా సన్యాల్‌ని పట్టించుకోవడం లేదు. కారణం ఊహాతీతమేమి కాదు. పిచ్చివాని ప్రేలాపననీ, ప్రవర్తననీ ఎవరూ పరిగణించరు. కాని ఆదిత్య ముఖంలోకి చూసి నేను నివ్వెరపోయాను. నాగేన్‌బాబు వైపు తిరిగి–
‘‘అతడెవరు? ఏం చేస్తుంటాడు’’ అని అడిగాడు.
‘‘అతడి పేరు శశాంక సన్యాల్‌. అతడొక శాపగ్రస్తుడు. గతంలో జరిగిన వాట్ని ఏవీ మరిచిపోడు. వాళ్ల నాన్న ఒక స్కూల్‌ టీచర్‌. ఆయనెప్పుడో చనిపోయాడు. కొద్దిపాటి పంటభూమి వుండేది. సన్యాల్‌ తన కుమార్తె పెళ్ళి కోసం  ఆ భూమిలో ఎక్కువ భాగాన్ని అమ్మివేశాడు. అయిదేళ్ళ క్రితం అతని భార్య చనిపోయింది. ఉన్న ఒక్క కుమారుడు కలకత్తాలో పనిచేసుకుంటూ వుండేవాడు. గత సంవత్సరమే అతడొక బస్సు కింద పడి మరణించాడు. ఆ తరువాతే సన్యాల్‌ ఇలా తయారయ్యాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు’’

‘‘అతడిప్పుడు ఎక్కడుంటాడు?’’ ఆదిత్య అడిగాడు.
‘‘జోగేష్‌ కవిరాజ్‌ సన్యాల్‌ తండ్రికి మిత్రులు. వారి ఇంట్లోనే సన్యాల్‌ ఒక చిన్నగదిలో వుంటున్నాడు. వాళ్ళే అతనికి తిండికూడా పెడుతున్నారు. కేవలం టీ బిస్కట్ల కోసమే నా షాపుకొస్తాడు. తిన్నదానికీ, తీసుకున్నదానికీ బిల్లు చెల్లించడం ఎప్పుడూ మరిచిపోడు. ఇప్పటికీ ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాడు. ఇంకెంతకాలం బతగ్గలడో ఆ భగవంతుడికే తెలియాలి’’
‘‘జోగేష్‌ కవిరాజ్‌ గారంటే...ప్రతి సంవత్సరం ఒక పెద్ద యాత్ర జరిగే విశాలమైన మైదానముంది కదా! దానికి పశ్చిమంగా వున్న ఇల్లేనా?’’ ఆదిత్య అడిగాడు.
‘‘అవును...మీకు తెలుసా? మరి మీరు?’’
‘‘ఒకానొకప్పుడు నాకు ఈవూరితో బాగా పరిచయముండేది’’

ఈలోగా టీషాపులో రద్దీ పెరిగింది. నాగేన్‌బాబు మాకు దూరంగా వెళ్ళాడు. మేము బిల్లు చెల్లించి బయటకు వచ్చాం.
ఈసారి డ్రైవింగ్‌ సీట్లో ఆదిత్య కూర్చున్నాడు. 
‘‘మా ఇంటికి వెళ్లే రోడ్డు కొంచెం క్లిష్టంగా వుంటుంది. నేను డ్రైవ్‌ చేస్తేనే సులభం’’ అన్నాడు.
‘‘ఇప్పుడు తప్పనిసరైంది’’ అన్నాడు ఆదిత్య. అతడి వైఖరిని చూస్తే ‘ఎందుకు? ఏమైంది?’ అని నేనిప్పుడు ఆసక్తి కొద్దీ అడిగినా ఆదిత్య మాట్లాడే స్థితిలో లేడని అర్థమవుతుంది. ఆదిత్య ముఖకవళికల్లో ఒక గంభీరత, ఉద్విగ్నత నెలకొన్నాయి.

కూడలి నుండి కొన్ని ములుపులు ఎడమ కూ,  కొన్ని కుడికీ తిరిగి ముందుకు వెళ్ళిన తరువాత మేము ఒక ఇంటిని  కనుగొన్నాం. దాని ప్రహారీగోడ చాలా ఎత్తుగానూ పెద్దదిగానూ వున్నది. మరోమలుపు తిరిగి పాతబడి పెచ్చులు ఊడిపోతున్న గోడ గల గేటుని చేరుకున్నాం.
ఆ మూడంతస్తుల భవనం ఒకనాడు దేదీప్యమానంగా వుండేదని చూడగానే తెలుస్తుంది. అక్కడొక విరిగిన సైన్‌బోర్డున్నది. దాన్నిబట్టి ఆ ఇల్లు పట్టణాభివృద్ధి సంస్థకు కేంద్ర కార్యాలయంగా వుండేదని అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా వున్నది. ఆదిత్య కారుని నేరుగా గేటు లోపలికి పోనిచ్చాడు. లోనికి దారి తీసే మార్గం పిచ్చి మొక్కలతో నిండి వున్నది. కారుని ముందరి ద్వారం వరకూ తీసుకెళ్ళి ఆపాడు. అక్కడ మరో మానవ ప్రాణి సంచారమే లేదు. గత దశాబ్ద కాలంలో ఆ ఇంటిలో ఎవరూ ప్రవేశించిన దాఖలాలు లేవు. ఇంటి ముందర ఒక విశాలమైన పూలతోట వుండేదని తెలుస్తున్నది. అదిప్పుడు అరణ్య సదృశంగా వున్నది.
‘‘లోనికి వెళ్లాలనుకొంటున్నావా?’’ అని అడిగాను. కారు దిగి ఆదిత్య సింహద్వారం వైపు నడుస్తున్నాడు.
‘‘అవును. లోనికి వెళ్లకుండా ఇంటి పై భాగాన్ని చేరడం సాధ్యం కాదు’’
‘‘అంటే, ఇంటి పై కప్పా?’’

‘‘అదే అటక’’ అన్నాడు ఆదిత్య. ఆ మాటలో ఏదో నిగూఢమైన ధ్వని నాకు వినబడింది. మరి నేనేమీ ప్రశ్నించలేదు. నేను కూడా అతడ్ని అనుసరించి నడిచాను.
ఇంటి లోపలి భాగం ఇంకా ఘోరంగా వున్నది. పై కప్పుగా వున్న దూలాలు పడిపోవడానికి సిద్ధంగా వున్నాయి. ముందరి గది ఒకనాడు కేవలం సందర్శకుల కోసమే కచేరీ చావడిగా వినియోగపడినట్టున్నది. విరిగిన కుర్చీలూ బల్లలూ గదిలో ఒక మూలన పోగుపడి వున్నాయి. నేల మీద కొన్ని అంగుళాల మేర ధూళి పేరుకొని వున్నది. 
ఆ గది తరువాత ఒక వరండా వున్నది. దాని తరువాత సువిశాలమైన హాలు అవశేషాలున్నాయి. ఆ హాలు లోనే పూజలు, జాతరలూ, సంబరాలు, సంగీత కచేరీలూ...ఇతర వేడుకల్ని జరిపే వారని ఆదిత్య చెప్పాడు. ప్రస్తుతం ఆ హాలు గబ్బిలాలు, ఎలుకలూ, పావురాలు , బొద్దింకలూ... మొదలైన ప్రాణులకు ఆవాసంగా వున్నది.
హాలుని దాటి మేము కుడివైపు వెళ్ళాం. కొద్ది అడుగుల దూరంలోనే అక్కడొక మెట్ల మార్గం పైకి దారి తీస్తున్నది. ఆదిత్య సాలెగూళ్ళను తొలగించుకొంటూ ఆ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అతడి వెనకే నేనూ నడిచాను. నేరుగా పై కప్పు వరకూ చేరుకున్నాం.

‘‘ఇదే మా ఇంటికి అటక’’ అన్నాడు ఆదిత్య.
‘‘ఇదే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. నా బాల్యం, విద్యాభ్యాసాలలో ఎక్కువ భాగం ఇక్కడే గడిచింది. నా తోటిపిల్లలు చాలా మంది ఇక్కడికే వచ్చి పోతూవుండేవారు. మొత్తం ఈ లంకంత కొంపలో పూర్తి స్వేచ్ఛని అనుభవించే ప్రత్యేకమైన ప్రదేశం ఇదొక్కటే.
ఈ అటక గోడలో కొంతభాగం కూలి ఒక రంధ్రం ఏర్పడింది. దాంట్లోంచి నేను పైన  ఆకాశమూ క్రింద ఆకుపచ్చని పొలాలూ, రైస్‌మిల్లులో కొంతభాగమూ, పద్దెనిమిదో శతాబ్ధపు టెర్రాకోట దేవాలయ శిఖరం చూడగలిగాను.

క్రింది గదుల కంటే ఈ అటకగది చాలా దెబ్బల్ని ఎదుర్కొన్నట్టున్నది. బాగా ఛిద్రమైపోయి వున్నది. నేల మీద పక్షుల రెట్టలూ, గడ్డిపోచలు ఇతర చెత్తా పోగుపడి వున్నాయి. ఒక మూలన విరిగిన ఈజీ ఛైరున్నది. విరిగిన క్రికెట్‌ బ్యాట్‌ కూడా వున్నది. వంకర్లు పోయిన పేము చెత్తబుట్టా, మరో కర్రపేకేజీ పెట్టే వున్నాయి.
ఆదిత్య ఆ పేకేజీ పెట్టెని ముందుకు తీసాడు. ఇలా అన్నాడు:
‘‘దీని మీద నేనిప్పుడు నిల్చోబోతున్నాను. ఇదిగాని విరిగిపోతే పడిపోకుండా నువ్వే పట్టుకోవాలి’’
సరిగ్గా గోడ పై భాగంలో ఒక గూడు వున్నది. ఆదిత్య ఆ పెట్టె పైన నిల్చుని గూడు పైకి చెయ్యి చాచాడు. దాన్లో చెయ్యి చొప్పించి కదిలించబోయాడు. కట్టుకున్న గూడు పాడై క్రింద పడగా రెండు పిచ్చుకలు ఎగిరి బయటికి వచ్చాయి. నేల మీద మరింత చెత్త పోగయింది. గూడు లోపల తడిమి చూసి ‘‘హమ్మయ్య’’ అన్నాడు ఆదిత్య. అంటే అతడు వెతుకుతున్నదేదో దొరికిందని నాకు స్ఫురించింది. అతడి చేతి వైపు చూశాను. ఒక కారమ్‌ స్ట్రయికర్‌లాంటి వస్తువు కనబడింది.
అదెందుకు అక్కడున్నదో దాన్ని సుమారు మూడు దశాబ్దాల తరువాత ఎందుకు వెతికి వెలికి తియ్యవలసి వచ్చిందో నాకు అర్థం కాలేదు. దాన్ని చేత్తో పామి శుభ్రం చేశాడు. చేతి రుమాలుతో కూడా తుడిచి జేబులో పెట్టుకున్నాడు.

ఆ వస్తువేమిటని నేను అడిగాను.
‘‘త్వరలోనే తెలుసుకుంటావు’’ అని మాత్రం జవాబిచ్చాడు.
మేం మెట్లు దిగి క్రిందకు చేరుకున్నాం. మళ్ళీ కారెక్కి వచ్చిన దార్నే తిరిగి ప్రయాణించాం. ఒక దుకాణం ముందర ఆదిత్య కారుని ఆపాడు. ఒక గేటులోనికి ప్రవేశించాం. దానిపైన ‘క్రౌన్‌ జ్యూయెలర్స్‌’ అని రాసి వుంది.
మేము షాపులోపలికి వెళ్ళి నగల వ్యాపారిని కలిసాం. ఆదిత్య అతని చేతికి ఇందాకటి వస్తువుని ఇచ్చాడు.
‘‘దీన్నొకసారి చూస్తారా?’’

షాపాయన బాగా పెద్దవాడు. మందమైన కళ్ళద్దాలతో వున్నాడు. ఆదిత్య  ఇచ్చిన వస్తువుని క్రిందా మీదా వేసి చూశాడు. నాకూ అప్పుడది స్పష్టంగా కనబడింది.
‘‘ఇది చాలా పాతదిలా వుంది’’ అన్నాడతను.
‘‘అవును పాతదే!’’ అన్నాడు ఆదిత్య.
‘‘ ఇలాంటివి ఈరోజుల్లో సాధారణంగా వుండటం లేదు’’
‘‘లేదు. దయచేసి దీన్ని మీరు తూచి ఎంత వెల చేస్తుందో చెప్పగలరా?’’ అడిగాడు ఆదిత్య.
పెద్దాయన తన త్రాసుని ముందుకులాగి ఆ గు్రండని వస్తువుని దానిపైన వుంచాడు. ఏదో చెప్పాడు.
అంతే!

మేము అక్కడి నించి బయల్దేరి జోగేష్‌ కవిరాజ్‌ ఇంటి వద్ద ఆగాం. నాలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కాని ఆదిత్య ముఖం చూసి ఒక్క ప్రశ్న కూడా ఆడగలేకపోయాను.
సుమారు పది సంవత్సరాల వయసు గల ఇద్దరు కుర్రాళ్ళు ఇంటి ముందర గోళీ కాయలు ఆడుకొంటున్నారు. కారుని చూడగానే ఒక్క గంతు వేసి ఆట ఆపి మా వైపు వచ్చారు.

సన్యాల్‌ ఎక్కడుంటాడని ఆదిత్య వాళ్ళని అడిగాడు.
‘‘సన్యాల్‌ కావాలా? ఆ ముందరి ద్వారం గుండా వెళ్తే ఎడమ చేతి వైపున మొదటి గదిలో వుంటాడు.
తలుపు తెరిచే వుంది. మా ఎడమ చేతి వైపు గదిలో ఎవరో మాట్లాడుతున్న ధ్వని వినబడింది. మేము దగ్గరకు వెళ్ళేసరికి సన్యాల్‌ ఇంకా తనలో తనే పాడుకొంటున్నాడని స్పష్టమైంది. అదికూడా టాగోర్‌ రాసిన ఒక పెద్ద పాట.
మేము ద్వారం దగ్గరకు వెళ్ళినప్పటికీ అతడు పాటని ఆపలేదు. మమ్మల్ని గమనించినట్లుగానే తన పాటని చివరి చరణం వరకూ పాడాడు.
‘‘మేము లోపలికి రావచ్చా!’’ ఆదిత్య అడిగాడు.
అప్పుడు సన్యాల్‌ నేరుగా మా వైపు చూశాడు.
‘‘ఇక్కడికి ఎవరూ రారు’’ బొంగురు గొంతుతో అన్నాడు.
‘‘మేము లోపలికి వస్తే మీకేమైనా అభ్యంతరమా?’’
‘‘లేదు. రండి’’

మేము గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయాం. అక్కడ ఒక పరుపు  తప్ప ఇంకేమి లేవు. సన్యాల్‌ ఆ పరుపు మీదనే కూర్చొని వున్నాడు. మేము అలాగే నిల్చున్నాం. సన్యాల్‌ మా వైపు చూస్తూనే వున్నాడు.
ఆదిత్య అడిగాడు: ‘‘ఆదిత్య నారాయణ చౌధురీ నీకు గుర్తున్నాడా?’’
‘‘వున్నాడు’’ సన్యాల్‌ జవాబిచ్చాడు.
‘‘ఒక సంపన్న కుటుంబంలో పుట్టి చెడిపోయిన కుర్రాడు. మంచి విద్యార్థే కాని ఎప్పుడూ నన్ను మించ లేకపోయేవాడు. నేనంటే అసూయ...చచ్చినంత అసూయ పడేవాడు. అంచేత అబద్ధాలు చెప్పేవాడు’’
‘‘నాకు తెలుసు’’ ఆదిత్య అన్నాడు. తన జేబులోంచి చిన్న పాకెట్‌ వంటిది తీసి సన్యాల్‌కు అందచేస్తూ–  ‘‘ఆదిత్య మీకిమ్మని పంపాడు’’
‘‘అదేమిటి?’’
‘‘డబ్బు’’
‘‘డబ్బా! ఎంత?’’

‘‘నూట యాభై రూపాయలు. వీట్ని మీరు తీసుకుంటే తను చాలా సంతోషిస్తానని చెప్పాడు’’
‘‘నిజంగానా? నాకు నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు. ఆదిత్య నాకు డబ్బు పంపాడా? ఎందుకు పంపాడు?’’
‘‘మనుషులు కాలంతో పాటు మారుతూ వుంటారు. బహుశా మీకు తెలిసిన ఆదిత్య ఇంక వుండి వుండక పోవచ్చు’’
‘‘అసంభవం. మాయమాటలు చెప్పొద్దు. ఆదిత్య ఎప్పటికీ మారడు. నాకు తెలుసు. ఒకరోజు నాకొక బహుమతి వచ్చింది. అది వెండిపతకం. దాన్ని లాయర్‌ రామతరణ్‌ బెనర్జీ  ఇచ్చారు. ఆకాశమంత పొంగిపోయాను. అపురూపంగా దాచుకున్నాను. ఆనాటి గుర్తింపునీ సన్మానాన్నీ ఆదిత్య భరించలేపోయాడు. పతకాన్ని నా నుండి తీసుకొని తన తండ్రిగారికి చూపించి తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. తీసుకెళ్ళాడు. అంతే, ఆ తరువాత ఆ పతకం మాయమైంది. తన జేబుకు ఒక రంధ్రం వున్నదనీ, అందులోంచి ఆ పతకం ఎక్కడో జారిపోయి వుండొచ్చనీ చెప్పాడు. ఏదైతేనేం ఆ మెడల్‌ శాశ్వతంగా నన్ను తిరిగి చేరలేదు’’
‘‘ఆ పతకానికి ఖరీదే ఇది. దీన్ని తీసుకునే అర్హత నీకే వుంది’’

సన్యాల్‌ మావైపు ఆశ్చర్యకరంగా చూశాడు.
‘‘ఆ పతకమా? అది కేవలం వెండిది. దాని ఖరీదు మహా వుంటే అయిదు రూపాయలుండొచ్చు’’
‘‘అవును. కాని వెండిధర బాగా పెరిగింది. ఆ మెడల్‌ నీకు వచ్చినప్పటి కంటే ఇప్పుడు దాని వెల ముఫ్ఫైరెట్లు అధికంగా వుంటుంది’’
‘‘నిజంగానా? ఆ సంగతి నాకు తెలీదు...కానీ...’’ సన్యాల్‌ తన చేతిలో వున్న పదిహేను పదిరూపాయల నోట్ల వంకా చూశాడు. తల పైకెత్తి ఆదిత్య వైపు చూశాడు. ఇప్పుడతని ముఖకవళికలు మారిపోయాయి.
‘‘ఇది చాలా ఔదార్యమైన అంశం కదా! ఆదిత్యా!’’ అన్నాడు.
మేము మౌనం వహించాం. సన్యాల్‌ ఆదిత్య వైపు అదేపనిగా చూశాడు. తల  ఊపి చిరునవ్వు నవ్వాడు.

‘‘టీ షాపు వద్ద నిన్ను చూసిప్పుడే నీ చెక్కిలి మీద పుట్టుమచ్చతో వెంటనే గుర్తు పట్టాను. నువ్వు నన్ను పోల్చుకోలేక పోయావని భావించాను. కాబట్టి ఆ మెడల్‌ సంపాదించి పెట్టిన పాటనే మళ్లీ  పాడాను. అది గతంలో నువ్వు చేసిన పనిని నీకు గుర్తు చేస్తుందని తలచాను. మీరు ఇక్కడికి వచ్చిన తరువాత ఆ మాటలు అనకుండా వుండలేకపోయాను. చాలా సంవత్సరాలు గడిచాయి. నువ్వు నాకు చేసిన దాన్ని నేను మరిచిపోలేదు’’
‘‘నీకు నా పట్ల కలిగిన అభిప్రాయాలు పూర్తిగా  న్యాయమైంది. నువ్వు నా కోసం అన్న ప్రతీ మాటా సరైనదే. అయినా ఇప్పుడు నువ్వు ఆ మొత్తాన్ని స్వీకరిస్తే నాకు చాలా సంతోషం’’

‘‘వద్దు ఆదిత్యా!’’ సన్యాల్‌ తల అడ్డంగా తిప్పాడు.
‘‘ఈ డబ్బు శాశ్వతం కాదు. దాన్ని నేను ఏదో విధంగా ఖర్చు చేసేస్తాను. నాకు నీ డబ్బు అవసరం లేదు. నాకు కావలసింది ఆ మెడల్‌ మాత్రమే. దాని ఖరీదు కానే కాదు. ఆ పతకం దొరికితే అదే కావాలి. ఇప్పుడు కూడా దాన్ని ఎవరైనా తెచ్చి నాకిస్తే నా బాల్యాన్ని బాధ పెట్టిన ఆ ప్రియమైన సన్నివేశాన్ని మరిచిపోగలను. ఆ పతకాన్ని నా కొన ఊపిరి వరకూ పదిలపరుచుకుంటాను. అది నా ఉజ్వలమైన విద్యార్థి దశని గుర్తు చేస్తూ వుంటుంది. తరువాత నేను పశ్చాత్తాప పడవలసిన అవసరం అసలే వుండదు’’
ఒక అటక పైన ఒక గూటిలో సుమారు మూడు దశాబ్దాల క్రితం దాచిన మెడల్‌ చిట్ట చివరికి తన నిజమైన యజమాని దగ్గరకు చేరింది. తను న్యాయంగా శాశ్వతంగా వుండవలసిన చోటికే చేరింది.
దాని పైన చెక్కి వున్న అక్షరాలు నాకు స్పష్టంగా కనబడుతున్నాయి.
‘చిరంజీవి శశాంక సన్యాల్, పద్య పఠనంలో ప్రత్యేక బహుమతి 1949’
మూలం : సత్యజిత్‌ రే
అనువాదం: టి.షణ్ముఖరావు 

బెంగాలీ కథ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా