అమ్మ చూస్తోంది

4 Mar, 2018 08:11 IST|Sakshi

ప్రాతఃకాలపు వేళ నగర శివార్లలో నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక యువతి తన నాలుగేళ్ల కొడుకును వెంటబెట్టుకుని నడుస్తోంది. పసివాడు గులాబీ రంగులో చలాకీగా ఉన్నాడు. యువతి చక్కగా అలంకరించుకుని అందంగా ఉంది. కొడుకుని చూసుకుని మురిసిపోతూ ఉంది. కుర్రవాడు పసుపు రంగులో ఉన్న ఒక కొత్త చక్రాన్ని కర్రతో కొడుతూ దాని వెనకే పరుగెడుతున్నాడు. తల్లి వైపు వెనక్కి చూసి నవ్వుతున్నాడు. ఆమె తన దగ్గరికి వచ్చే దాకా ఆగుతూ, మళ్లీ చక్రాన్ని పరిగెత్తిస్తున్నాడు. చక్రాన్ని కర్రముక్కతో బాదడానికి చెయ్యి అంత పైకి లేపనక్కరలేదు. కాని వాడిలోని పట్టరాని సంతోషం అలా చేయిస్తోంది.

కొద్దిసేపటి క్రితం వాడి దగ్గర ఆ చక్రం లేదు. అప్పుడప్పుడే అది వాడి సొంతమైంది. అందుకే ఆ సంతోషం! పట్టరాని ఆనందం!!ఒక మురికి బట్టల ముసలివాడు వారి దారిలో నిలబడ్డాడు. ఇరుకుదారిలో అడ్డంగా నిలబడ్డాడేమో, పక్కకు వొరిగి ఆ తల్లీ కొడుకులకు దారి విడిచాడు. ముసలాడి దృష్టి బాలుడి మీద పడింది. వాడి ఆట, ఆనందం చూసి ముచ్చటపడ్డాడు. ముసిముసిగా నవ్వుకున్నాడు.‘కుర్రాడు బుద్ధిమంతుడిలాగున్నాడు. చక్రం నడపడంలో ఎంత ఆనంద పొందుతున్నాడో..? పసితనంలో ఆ ఆనందమే వేరు’ అని అనుకున్నాడు.కాని, ఆ ఆనందమేమిటో ఆ వృద్ధుడికి తెలియదు. అతడు ఎన్నడూ అలాంటి ఆనందం అనుభవించి ఎరగడు. జుట్టు పట్టుకుని లాగుతూ, శిక్షిస్తే పిల్లలు తప్పకుండా చెడిపోతారు. వారివారి ఇష్టాయిష్టాలు తెలుసుకుని, వారికి తగినంత స్వేచ్ఛనిచ్చి, ప్రేమ ఆప్యాయతలతో పెంచినపుడు మాత్రమే పిల్లలు సత్ప్రవర్తన గల నాగరికులవుతారు.

ఆ తల్లిని చూస్తే ఆ పిల్లవాడి గూర్చి ఏ మాత్రం ఆందోళన పడుతున్నట్టుగా లేదు. చక్కగా అలంకరించుకుని, హాయిగా నడిచిరావటం చూస్తుంటే.. ఆమె ఆ అబ్బాయిని క్రమశిక్షణతో పెంచుతూ, సుఖశాంతులతో జీవిస్తోందని అర్థమవుతూ ఉంది. వృద్ధుడు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అతని బాల్యాన్ని ఒకే ఒక మాటలో చెప్పుకోవచ్చు. అదొక నరకం! ఆకలి, తిట్లు, దెబ్బలు!! అంతే. తిప్పుకునే చక్రాల్లేవు. ఆడుకునే బొమ్మల్లేవు. ఆదరణ లేదు. ఆప్యాయత లేదు. అప్పటికి ఇప్పటికీ కూడా అతని జీవితంలో పెద్ద మార్పేమీ లేదు. ‘జీవితమంతా పేదరికంలో, ఒంటరితనంతో నిస్వార్థంగా గడిచిపోయింది. ఒక చిన్న సరదా లేదు. ఒక సంతోషమూ లేదు’ అనే ఆలోచనే వృద్ధుణ్ని కృంగదీసింది. అలా ఆలోచిస్తూనే ఆ రోజు పనిలోకి వెళ్లిపోయాడు. ఎప్పుడో బాల్యంలో ఒక కర్మాగారంలో పనికి కుదురుకున్నాడు. జీవితం అంతా అందులోనే గడిపాడు. ఇప్పటికీ అందులోనే పనిచేస్తున్నాడు. కర్మాగారం – పని – నాలుగు కూలి రాళ్లు – ఆకలి – తిండి – నిద్ర. అంతకు మించి ఆ వృద్ధుడికి మరో ప్రపంచం లేదు. మరో ధ్యాస లేదు.

దినమంతా కర్మాగారపు యంత్రాల మధ్య పని చేసినా ఆ వృద్ధుడి కళ్లలో ఆ రోజు ఉదయం చక్రం తిప్పుకుంటూ వెళ్లిన ఆ పసిబాలుడే కనిపించసాగాడు. వాడి నవ్వు కేరింతలు, మరువలేకుండా ఉన్నాడు. రాత్రి కలలో కూడా అతడికి ఆ సంఘటనే కనిపించింది. వీధిలో చక్రం తిప్పుకుంటూ వెళ్లడం ఏమైనా గొప్ప విషయమా? కాకపోవచ్చు. కానీ దానివల్ల ఆ పసివాడు పొందిన ఆనందం మాత్రం ఏ కొలమానాలకూ అందనిది. కూలి పని చేసుకునే ఈ వృద్ధుడికి కూడా ఆ విషయం అవగతమైంది. ఇప్పుడు అదే ఒక సమస్య అయ్యింది.ఆ మరునాడు కూడా వృద్ధుడికి కలొచ్చింది. ఫ్యాక్టరీ చక్రాలు తిరుగుతూనే ఉన్నాయి. చక్రాల మధ్య బెల్టు పట్టా రయ్‌ మని పరిగెడుతూనే ఉంది. చేతులకు అలవాటైన పని వృద్ధుడు యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నాడు. మనుషులు దయ్యాల్లా కదులుతున్నారు. గాలి మసకమసకగా మబ్బుల మాదిరిగా మారింది.

ముఖాలు కనిపించి కనిపించకుండా ఉన్నాయి. మానవ స్వరాలు యంత్రాలు రణగొణ ధ్వని కింద పడి నుగ్గునుగ్గయ్యాయి. అలాంటి వాతావరణంలో వృద్ధుడు పసిబాలుడిగా మారిపోయాడు. పక్కనే వాళ్లమ్మ నడుస్తోంది. తన ఆనందాన్ని వాళ్లమ్మ చూడగలుగుతోంది. అతడి చేతిలో కొత్తది ఇనుప చక్రం ఉంది. దాన్ని అతను కేరింతలు కొడుతూ పరిగెత్తిస్తున్నాడు. తెల్లటి డ్రెస్‌లో అతను ఆరోగ్యంగా ఉన్నాడు. కొడుతూ పరుగెత్తిస్తున్నాడు. తెల్లటి డ్రెస్‌లో అతను ఆరోగ్యంగా ఉన్నాడు.     రోజులు గడుస్తున్న కొద్దీ వృద్ధుడి పనిలో మార్పురాలేదు. చిత్రమేమంటే అతడి కలలో కూడా మార్పురాలేదు.ఓ రోజు సాయంత్రం ఫ్యాక్టరీలో పని ముగించుకుని, వృద్ధుడు ఇంటికి తిరిగివస్తున్నాడు. ఓ చోట చిలుము పట్టిన బ్యారెల్‌ కనిపించింది. దాని అంచు ఊడిపోయి సరిగ్గా చక్రం మాదిరిగానే ఉంది. వృద్ధుడి దృష్టి ఆ చక్రం మీద పడింది. అతని మనసు ఎగిరి గంతేసింది.

బోసినోటితో కాసేపు నవ్వుకున్నాడు. చిలుము పట్టిన ఆ చక్రం ఎంతో అందంగా కూడా కనిపించింది. తెలియకుండానే ఒక కోర్కె అతని మనసులో ప్రేవేశించింది. వృద్ధుడు అటూ ఇటూ చూశాడు. ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్నాడు.బ్యారెల్‌ నుంచి చక్రాన్ని వేరు చేసి, సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వయసులో తనకు ఆ చక్రంతో పనేమిటని సిగ్గుపడ్డాడు కూడా! కానీ సుషుప్తావస్థలో ఉన్న అతనిలోని బాల్యం ఆ సమయంలో అతనితో ఆ పని చేయించింది.ఎవరూ అతణ్ని గమనించలేదు. గమనించినా ప్రశ్నలతో వేధించలేదు. ఎవరికీ, ఎందుకూ పనికిరాని చక్రం లాంటి తుప్పు పట్టిన డ్రమ్ము అంచు ఎవరికి కావాలనీ? అందుకే ఎవరూ అతణ్ని పట్టించుకోలేదు.వృద్ధుడు మాత్రం నవ్వుతూ, సిగ్గుపడుతూ, అదేదో అపురూపమైన ఆటవస్తువులాగా – చక్రాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకువెళుతున్నాడో ఆ నిమిషానికి అతనికి తెలియదు. కానీ తీసుకెళ్లడంలో ఆనందాన్ని పొందాడు. ఆ ఆనందం పసిబాలుడు చక్రం పరిగెత్తించినప్పటి ఆనందం లాంటిదే!

చాలా రోజులు ఆ ఇనుప చక్రం వృద్ధుడి రేకుల గదిలో అతడి పడక పక్కనే ఉంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా దాన్ని బయటికి తీసి, శ్రద్ధగా చూసుకుని ఆనందిస్తూ ఉండేవాడు. కల నిజమైందని సంతృప్తి చెందుతుండేవాడు.ఓ రోజు వృద్ధుడు చీకటితోనే లేచాడు. పక్షులు అప్పుడప్పుడే తమ గూళ్ల నుంచి బయటపడుతున్నాయి. ఇనుప చక్రాన్ని బయటికి తీసి, ఊరి బయటికి పట్టుకెళ్లాడు. కుంటుతూ, మెంటుతూ, దగ్గుతూ వెళ్లాడు. దారిలో చిత్ర విచిత్రమైన కీటకాలు కనిపించాయి. నిశ్శబ్దంగా నిలుచున్న మహా వృక్షాలు మౌనంగా మాట్లాడాయి. పిల్లల కథల్లో లాగా మంచు మెత్తగా లేదు. అదొక చిత్రమైన పరిస్థితి. వృద్ధుడి బాల మనసులాగా –అనుభవాన్ని మింగిన అమాయకత్వం లాగా – వృద్ధుడు ఒక ఎండుకొమ్మని విరిచి, కర్ర తయారు చేసుకున్నాడు. దాన్ని చక్రానికి ఆనించి ఒకసారి పైకి చూశాడు.

ఎదురుగా విశాలమైన మైదానాలు, పచ్చని పొలాలు, చెట్లు, చేమలు.. చల్లని గాలి! ప్రకృతి వృద్ధుణ్ని తన ఒడిలోకి తీసుకున్నట్లయ్యింది. అమ్మ ఒడిలో గారాలు పోయినట్లు వృద్ధుడు చక్రాన్ని కర్రతో మెల్లగా కదిలించాడు. అది గిరగిరా తిరుగుతూ ముందుకు కదిలింది. వృద్ధుడు బాలుడైపోయాడు. వార్థక్యపు బాధలన్నీ మరచిపోయాడు. చక్రం వెనక పరుగుదీశాడు. బాల్యం తిరిగి వచ్చినట్లయ్యింది.వృద్ధుడు పసిబాలుడిలా పకపకా నవ్వాడు. కేరింతలు కొట్టాడు. కర్రముక్క అడ్డం పెట్టి పరిగెత్తే చక్రాన్ని ఆపాడు. మనసారా నవ్వుకుని, దాన్ని మళ్లీ పరిగెత్తించాడు. పిల్లల్లాగే చెయ్యి బాగా పైకెత్తి చక్రాన్ని కొట్టాడు. పిల్లల్లాగే ఎగురుతూ ఎగురుతూ పరిగెత్తాడు. పిల్లల్లాగే బోసినోటితో నవ్వాడు.

తను ఒక పసిబాలుడైపోయినట్లు అనుభూతి చెందాడు. తన తల్లి తన వెంటే ఉందని ఊహించుకున్నాడు. తన సంతోషాన్ని ఆమె ఎక్కడో ఉండి ఆనందిస్తున్నట్లు భావించుకున్నాడు.నవ్వులతో, దగ్గుతెరలతో, బోసినోరు వంకర్లు తిరిగిపోతుంటే ముడతలు పడ్డ ముఖం మీద పెరిగిన తెల్ల గడ్డం అటూఇటూ కదిలింది. ప్రతి రోజు తెల్లవారు జామునే లేచి, చక్రం వెంట ప్రకృతి ఒడిలోకి పరుగెత్తడం ఎంతో ఇష్టమైన కార్యక్రమం అయ్యింది. ఒక్కోసారి – తను చక్రంతో ఆడుకుంటున్న విషయం ఎవరైనా గమనిస్తున్నారేమోనని.. సిగ్గుతో, భయంతో చుట్టూ పరికిస్తూ ఉండేవాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక హాయిగా చిన్న పిల్లాడిలా ఆడుకునేవాడు. అతణ్ని ఎవరూ గమనించేవారుకాదు. ఎవరూ ప్రశ్నించేవారు కాదు.

 ఇష్టం వచ్చినంత సేపు ఆడుకుని, ఊళ్లోకి తిరిగి వచ్చేవాడు. తిరిగి వచ్చేప్పుడు అతని ముఖం మీద ఎప్పుడూ ఓ చిరునవ్వు చిందులేస్తూ ఉండేది. అతణ్ని అతని ఆటను ఎవరూ గమనించలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ప్రశాంతంగా అతను అలా చాలా రోజులు ఆడుకున్నాడు. కాని ఒక రోజు చలిలో తిరిగినందువల్ల కాబోలు, బాగా జలుబు చేసి జ్వరంతో మంచాన పడ్డాడు. చివరికి తోటి కూలీల సహాయంతో ఫ్యాక్టరీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యం నడుస్తూ ఉండగానే ఓ రోజు కన్నుమూశాడు. అయితే అతని ముఖం మీద చిరునవ్వు చెరగలేదు. చుట్టూ ఉన్న పరిచయస్థులకు, అపరిచితులకు ఆ నవ్వు రహస్యమేమిటో అర్థంకాలేదు.తనకు ఒకప్పుడు బాల్యం ఉండేదన్న ఆలోచన, బాల్యంలోని అనుభూతిని తనివి తీరా అనుభవించానన్న సంతృప్తి – అతనిలో ఉంది. అందుకే మరణశయ్యపై చిరునవ్వు చిందించగలిగాడు.‘తను ఆడుకుంటున్నప్పుడు తన తల్లి ఎక్కడో ఉండి గమనిస్తూనే ఉంది’ అనే భావన అతనికి కొండంత సంతోషాన్నీ, సంతృప్తినీ ఇచ్చింది.

టెటర్నికోవ్‌ – ‘ఫియోడోర్‌ సోలగోబ్‌’ అనే కలం పేరుతో రచనలు చేశారు. 1863లో సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌లో పుట్టారు. రష్యన్‌ సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన ఈయన తొలుత కథలు, కవితలు విరివిగా రాశారు. వాటికి మంచి ఆదరణ లభించడంతో దస్తోవిస్కీ శైలిలో సుదీర్ఘమైన నవలలు రాశారు. 1927లో తన అరవై నాలుగవ యేట కన్నుమూశారు. ఈయన తండ్రి దర్జీగా పనిచేసేవారు. నాటి సెంట్‌పీటర్స్‌ బర్గ్‌ ఇప్పుడు లెనిన్‌గ్రాడ్‌గా పిలవబడుతోంది. మానవ ప్రవృత్తి ఆధారంగా బాల్యంలోని చిరు కోర్కెకు సాహిత్య రూపమిచ్చి, అద్భుతమైన కథ మనకందించారు ఫియోడోర్‌ సోలగోబ్‌.

రష్యన్‌ రచయిత ఫియోడోర్‌ కుజ్‌మిచ్‌

మరిన్ని వార్తలు