దురాశ తగదు

14 Jan, 2018 01:29 IST|Sakshi

హేలాపురి అడవి దగ్గర్లో రామయ్య, సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఓ గుడిసెలో కాపురం ఉంటున్నారు. కడుపేదలైన ఆ దంపతులకు పిల్లలు లేరు. రామయ్య అడవిలో కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బులు తీసుకువచ్చేవాడు. ఆ కొద్ది డబ్బుతోనే వారి ఆహారం, మిగిలిన అవసరాలు తీర్చుకునేవారు.

ఒకనాడు వర్షంపడుతూ ఉండటంతో రామయ్య అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లలేకపోయాడు. సీతమ్మ కుండలో చెయ్యి పెడితే, ఆమె చేతికి రెండు గుప్పెళ్ల బియ్యం దొరికాయి. ఆ బియ్యాన్నే ఆమె దంచి పిండి చేసి ఒకే ఒక్క రొట్టె చేసింది.

పళ్లెం ముందుపెట్టుకొని ఆ దంపతులిద్దరూ రొట్టెని పంచుకుని తిందామనుకునేంతలో గుడిసె తలుపు చప్పుడైంది. తలుపు తెరిచి చూస్తే గుమ్మంలో వర్షానికి తడిసిన ఓ సాధువు కనిపించాడు. ఆ దంపతులు సాధువును లోపలికి ఆహ్వానించి పొడి బట్టలిచ్చారు. సాధువు ఆకలి మీద ఉండటం గమనించిన రామయ్య.. ఆయన ముందు రొట్టె ఉన్న పళ్లాన్ని ఉంచాడు.

‘‘మీరిద్దరూ తిన్నారా నాయనా?’’ అని సాధువు అడిగితే, ‘‘తమరు తినండి స్వామీ.. మేము తర్వాత తింటాం’’ అన్నారా దంపతులు.

వారివద్ద తినడానికి మరో రొట్టె లేదని గ్రహించిన సాధువు... ‘‘మీరు కూడా రండి. ఈ రొట్టెనే తలాకొంచెం పంచుకుని తిందాం. కొయ్యడానికి చాకు పట్టుకురా!’’ అన్నాడు. రామయ్య చాకు తీసుకురాగానే రొట్టెను చాకుతో ముక్కలుగా కోశాడు. విచిత్రంగా ముక్కలు  కోసినా కూడా రొట్టె మళ్లీ పూర్తి రొట్టెగా మారిపోయింది. మళ్లీ ఆ రొట్టెను ఎన్ని ముక్కలుగా కోసినా అది మొత్తం పూర్తి రొట్టెగానే ఉండిపోసాగింది. ముగ్గురూ సంతృప్తిగా రొట్టె ముక్కలు తిన్న తర్వాత కూడా అది పూర్తి రొట్టెగానే ఉండిపోయింది.

‘‘నాయనా! మీ కోసం చేసుకున్న రొట్టెను నాకు పెట్టి, మీరు పస్తులుందామనుకున్నారు కదూ! ఇకపై మీరేనాడూ పస్తులుండవలసిన అవసరం లేదు. ఈ రొట్టెను ఎంతకాలం, ఎంతమంది తిన్నా ఇది అందరికీ సరిపోతుంది. ఈ రొట్టెను పరోపకారానికి మాత్రమే వాడాలి. మీ స్వార్థానికి కాదు సుమా అని చెప్పి ఆ సాధువు ఆ దంపతులను ఆశీర్వదించి వాన తగ్గడంతో అడవిలోకి వెళ్లిపోయాడు.’’
ఆరోజు నుంచి రామయ్య, సీతమ్మ దంపతులు ఆ రొట్టెను ముక్కలుగా చేసి తమ ఆకలిని తీర్చుకోవడమే కాకుండా... గంపెడు ముక్కలు చేసి అడవిలో ఆకలిగొన్న వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు, బాటసారులకు పంచసాగారు. ఎంతమందికి ఎంతకాలం పంచినా ఆ రొట్టె మాత్రం తరిగిపోవడం లేదు.

ఇలా కొంతకాలం గడిచింది. 
ఒకనాడు సీతమ్మ..‘‘ ఏమయ్యా! ఎంతకాలం ఈ రొట్టె ముక్కలను ఎంతమందికని ఉచితంగా పంచుతాం! ఇకపై రొట్టె ముక్కలిచ్చిన వాళ్ల దగ్గర నుంచి తృణమో, పణమో పుచ్చుకుందాం. ఏమంటావు!’’ అన్నది.

రామయ్య కాదని చెప్పలేకపోయాడు. ఆరోజు రొట్టె ముక్కలను గంప నిండా పెట్టుకొని అడవిలోని యాత్రికులకు, వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు ఇచ్చి.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నది సీతమ్మ.

గంప నిండా తీసుకొచ్చిన రొట్టె ముక్కలు అయిపోయాయి. ఇంటికి వెళ్లిన తర్వాత సంచి తెరిచి చూసుకుంటే రొట్టె ముక్కలు తిన్నవాళ్లు ఇచ్చిన డబ్బులు మాయమైపోయాయి. సాధువు మంత్రించి ఇచ్చిన రొట్టె కూడా మాయమైపోయింది. 

ఆ రొట్టెను పరోపకారానికి తప్ప తమ స్వార్థానికి ఉపయోగించవద్దని సాధువు చెప్పిన మాటను పాటించనందుకు తమకు తగిన శాస్తే జరిగిందని గ్రహించి విచారపడ్డారు ఆ దంపతులు.

తిరిగి ఆనాటి నుంచి రామయ్య కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి, సంతలో అమ్మి డబ్బులు తీసుకువస్తేనే వాళ్లు ఇంత తిండి తినగలుగుతున్నారు. దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేటు కదా!

మరిన్ని వార్తలు