సరస్వతీ నమ(నీ)స్తుభ్యం...

17 Dec, 2016 23:39 IST|Sakshi
సరస్వతీ నమ(నీ)స్తుభ్యం...

ఉజ్జయిని నగర శివారునున్న శ్మశానం భయంకరంగా ఉంది. చితులు చిటపటలాడుతున్నాయి. వర్తమానం తరం విద్యార్థి జ్ఞానంలా చితిమంటలు... ఆగి ఆగి మండుతున్నాయి. ఆ సమయంలో ఉజ్జయిని రాజ్య చక్రవర్తి కాళీ వరప్రసాదుడైన విక్రమార్కుడు భేతాళుని వశపర్చుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తూ... అతను చెప్పే తెలుగు సీరియల్‌ వంటి లాంగ్‌ ఎపిసోడ్స్‌ కథలకు సమాధానాలు చెబుతూనే ఉన్నాడు. విక్రమార్కునికి మౌనభంగం కావటంతో భేతాళుడు తిరిగి మహామర్రి వృక్షాన్ని చేరుకుంటున్నాడు.ఈ రోజు రాత్రి కూడా విక్రమార్కుడు శ్మశానాన్ని చేరుకున్నాడు. అతని రాకకోసం ఎదురుచూస్తున్న భేతాళుడు రయ్‌మని వచ్చి విక్రమార్కుని భుజంపైన కూర్చున్నాడు. నిశిరాత్రిలో వారి ప్రయాణం ఉజ్జయిని వైపుగా సాగుతున్నది.‘‘ఊ... ప్రారంభించు నీ కథ’’.. అధికార దర్పంతో అడిగిన విక్రమార్కుణ్ని ఒక్కసారిగా సంతోషంగా చూసి... ‘‘రాజా నీ సాహసం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. అన్యాయాలను సహిస్తూనే ఆకలి దప్పులను మరచి, నిరంతర త్యాగాలకు అలవాటైన సామాన్య జనంలా నీ సహనం భలేగుంది రాజా. అందుకే ఐ లైక్‌ యు రాజా’’ అన్నాడు.
‘సోది ఆపి స్టోరీ చెప్పు’’ అన్నాడు విక్రమార్కుడు సీరియల్స్‌ మధ్య వచ్చే సారీ ప్రకటనల మధ్య వచ్చే సీరియల్‌ను చూస్తున్న సగటు ప్రేక్షకునిలా మొహం పెట్టి.‘‘ఉజ్జయిని నగరానికి కొన్ని వేల క్రోసుల దూరంలోని రాజ్యం కోశాంబి. దానిని కుతూహలుడు అనే నీ సామంతు పరిపాలిస్తున్నాడు. అతనికి ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు చేయాలనే కుతూహలం కలిగింది. అదియును కాక... అతని రాజ్యం ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయి ఉంది. దీనికి కారణం... కృత్రిమ కరువుకాటకాలు.’’

‘‘కృత్రిమ కరువు కాటకాలా? ఆ మాట నేనెక్కడా వినలేదే’’ భేతాళునికి అడ్డువచ్చి విక్రమార్కుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు.‘‘రాజ్యం సుసంపన్నంగానే ఉంది రాజా. కాకపోతే రాజు, రాజ పరివారం సుసంపన్నం కావాలి కదా. ఎవరికి దక్కినది వారు బొక్కేస్తున్నారు. ప్రజలను త్యాగాలు చేయమంటున్నారు. ఇందుకోసం కళాజాతర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ఖర్చుపెడుతున్నారు. అనగా బంగారు కోశాంబి నిర్మాణం కోసం పన్నులూడగొట్టి మరీ పన్నులేస్తున్నారు. పనులు లేని ప్రజలు పన్నులెలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. క్రమంగా ఉద్యమం దిశగా ప్రశ్నలు సాగటం వేగుల ద్వారా తెలుసుకొన్న కుతూహలుడు తన మంత్రిని పిలిచి ఆయనను ‘మామూలు’గానే సలహా అడిగాడు.మంత్రి కొద్దిక్షణాలు ఆలోచించి, తనకొచ్చిన ఆలోచనలను రాజుకు చెప్పాడు. రాజు మంత్రిని మామూలుగానే అభినందించాడు. వారి యంత్రాంగం ఫలించింది. ఎవరిపైనా పన్నులు వేయకుండానే ధనాగారానికి ధనం ధారాళంగా రాసాగింది.

రాజు, రాజపరివారం సుభిక్షంగా ఉన్నారు.
ప్రజలు దుర్భిక్షంగా ఉన్నారు. అయినా వారంతా తమ బంగారు భవిష్యత్‌ను తమ బిడ్డల రూపంలో చూసుకుని మురిసిపోయారు.కోశాంబికి ఉత్తరాన కొన్ని వేల యోజనాల దూరంలో విశ్రాంతి అనే గురుకులాన్ని రాజుగారి సహాయ సహకారాలతో కొన్ని వందల ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా విష్ణుశర్మ (ప్రస్తుత గురువు) వంశీకులు నడుపుతున్నారు. అది వర్తమాన కాలం నాటి గురుకులం కాదు. క్రమశిక్షణ, చక్కని పాండిత్యం, సమస్యా పరిష్కారం, వ్యక్తిత్వ వికాసం, రాజనీతి, నీతిసూత్రాలు, క్రీడలు, యుద్ధ విద్యలు... వంటి వాటిని మేళవించి చక్కని విద్యను బోధిస్తూ తన దగ్గరున్న విద్యార్థులను తీర్చిదిద్దే పాఠ్యాంశాల ప్రణాళికలో... దాని అమలుకు కావలసిన కార్యాచరణ ప్రణాళికతో అవిశ్రాంతంగా వెలుగుతున్నది విశ్రాంతి గురుకులం. ఇందులో ప్రవేశం పొందాలంటే ఎన్నెన్నో పరీక్షలు, వడపోతలు విద్యార్థుల, తల్లిదండ్రులకు తప్పవు. అయినా సరే... వారు తమ పిల్లలు అక్కడే చదువుకోవాలని ఆశించేవారు.ఓ రోజు ఆశ్రమం గుమ్మంలో కొంతమంది రాజభటులు వచ్చి నిలుచున్నారు. గురువుగారు బయటకు వచ్చారు. భటుల రాకను గమనించి... ‘‘ఏం కావాలి నాయనా?’’ ప్రేమగా అడిగారు.

‘‘ప్రభువులవారు... మిమ్మల్ని తీసుకురమన్నారు’’ అన్నారు.
‘‘మీరు వెళ్లండి. నేను వస్తాను’’ అన్నారు విష్ణుశర్మ.
‘‘త్వరగా రావాలి. ఏదో రాచకార్యం మీతో ముచ్చటించాలన్నారు. మంత్రిగారితో కలసి...’’ అని గుర్రాలనెక్కి వెళ్లిపోయారు.
దీర్ఘంగా ఆలోచించిన విష్ణుశర్మ లోనికి నడిచి, విద్యార్థులకు వారం రోజులు సెలవు ప్రకటించి, భార్యకు చెప్పి రాచనగరుకు బయలుదేరాడు.

ఆ రాత్రి రాజుగారి ఏకాంత మందిరంలో ఏ కాంతలను రానీయకుండా మంత్రి, విష్ణుశర్మలతో సమావేశం జరిపాడు. ‘‘గురువుగారు... ఈ మధ్యకాలంలో గురుకుల విద్యాభ్యాసంలో ఉపాధి మార్గాలు కరువవుతున్నాయని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. కారణం...’’ రాజు కుతూహలుడు గంభీరంగా అడిగాడు. మంత్రి గుంభనంగానే కళ్లతో ఇదే ప్రశ్నను విష్ణుశర్మకు వేశాడు.నైతిక విలువలతో కూడిన విద్య వలన విషయ పరిజ్ఞానం పెరిగి, దీని వలన వ్యక్తిత్వ వికాసం జరిగి వ్యక్తిగత వృద్ధి జరుగుతుంది. తద్వారా విద్యార్ధి చదువు ఉద్యోగం కోసం అని భావించక, తన కాళ్లమీద తానే నిలబడగలుగుతాడు. విశాలమైన ఆలోచనా దృక్పథం అతడిని ఉన్నత పౌరునిగా తీర్చిదిద్దుతుంది. ఇతరులను చేయి చాచడు. వ్యక్తిత్వాన్ని అమ్ముకోని వ్యక్తిగా స్వతంత్రంగా ఎదుగుతాడు. ఇటువంటి విద్యనే కొన్ని తరాలుగా మేం బోధిస్తున్నాము. ఇది తప్పా. ఇది ప్రశ్నించదగినదా రాజా’’ సూటిగా స్పష్టంగానే అడిగాడు విష్ణుశర్మ.

‘‘శర్మగారు... మీ మాటల లోతు మాకు తెలుసు. మీ మేథస్సు మాకు తెలుసు. కాని కాసులు రాల్చని విద్య ఎందుకు కాల్చుకు తింటామా చెప్పండి. వేదాలు వల్లెవేయటం, అడవికి పంపి పుల్లలు ఏరుకు రమ్మనటం, మీరు పెట్టిన గడ్డి తినటం, బయట గడ్డి తినటం నేర్పలేకపోవటం, వైద్యులు, భవన నిర్మాణానికి కావలసిన నమూనాలను వినూత్నంగా ఆలోచించలేనివారు లేకపోవటం... ఇవా నేటి విద్యార్థులకు నేర్పవలసినవి. చెప్పండి.’’‘‘రాజా! మీ ఆంతర్యం, అంతరార్థం అవగతమౌతున్నది. విద్యలో వినూత్నమైన మార్పులు చేయాలనే కుతూహలంలో మీరున్నారు. కాని, మనం ప్రజల మద్దతు కూడా తీసుకోవటం మంచిదనుకుంటాను’’ అన్న విష్ణువర్మ సూచనను రాజు, మంత్రి ఇరువురూ చప్పట్లుకొట్టి మరీ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.‘‘అందుకే మన పూర్వులన్నారు... విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే అని చక్కని సూచన. ఎల్లుండి ప్రజా దర్బారు ఏర్పాటు చేద్దాం. రేపు రాజ్యమంతటా దండోరా వేయిద్దాం. సరేనా. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి’’ విష్ణుశర్మ వెళ్లిన తరువాత, రాజు మంత్రి మంత్రాంగం చేశారు.

రెండు రోజులు అనంతరం...
ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. రాజుగారు సభలోకి రాగానే అంతటా నిశ్శబ్దం. గంభీరంగా రాజు... ‘‘ప్రజలారా! మనదేశంలో విద్యారంగాన పెను మార్పులు చేద్దామనుకుంటున్నాము. మీకు నచ్చిన సలహాలు, సూచనలు మాకు కావాలి. నిర్భయంగా చెప్పండి. మీకేం భయం లేదు. ముందుగా గురువులు విష్ణుశర్మ కొన్ని మాటలు చెప్పాలని తాపత్రయపడుతున్నారు’’ అని ‘‘చెప్పండి గురువర్యా! మీ అభిప్రాయం’’ అన్నాడు నవ్వుతూ. విష్ణుశర్మకు మంత్రి, రాజుల అంతరాత్మ అర్థమైంది. తనను, తన గురుకుల విద్యను సమర్ధించుకోవటం కన్నా, సార్వజనీనమైన సత్యవంతమైన విద్యను గురించే చెప్పాలని భావించి...‘‘ప్రజలారా! సంప్రదాయం, చారిత్రక నేపథ్యం, సంస్కృతి వారసత్వం, స్వేచ్ఛాయుత ఆలోచనా విధానాలతో కూడిన విద్యలో వ్యక్తిగత అభివృద్ధి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలుంటాయి. ఆలోచనలు విశ్వవిహంగ వీక్షణం చేస్తాయి. విశ్వమానవ సౌభాతృత్వాలను కోరుకుంటాయి. సంప్రదాయ విద్యంటే వల్లె వేయటం కాదు. సమగ్రమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా, వ్యక్తి శక్తిగా ఎదగటం, శక్తిమంతమైన సమాజ నిర్మాణం చేయటం... ఈ సత్యాలను దూరం చేసే విద్య మనిషిని మూఢుణ్ని చేస్తుంది. స్వార్థపరుణ్ని చేస్తుంది. రాచపుండు మాదిరిగా శరీరంలోని భాగాలను క్రమంగా నాశనం చేస్తూ చివరకు మృత్యువుకు ఎరవేస్తుంది. ఇది రాజ్యానికైనా, వ్యక్తికైనా ప్రమాదమే. నమస్సులు. లోకా సమస్తా సుఖినోభవంతు’’ అని కూర్చున్నారు.

‘‘ప్రజలారా చెప్పండి మీ అభిప్రాయాలను. ఒక్కమాట. కాలం మారుతున్నది. మనం కూడా మారాలి. విద్య వలన విత్తం సమకూరాలి. అనగా డబ్బు సంపాదించాలి. సంప్రదాయమైన విద్యతో ఏవేవో వస్తాయని చెప్పారు కాని... డబ్బు వస్తుందని చెప్పలేదు గురువులు. ప్రస్తుతం... మీరంతా కష్టపడుతున్నదానికి సరిపడా సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పండటం లేదు. భూములు క్రమంగా జనావాసాలుగా మారతాయి. భవిష్యత్‌లో భూములుండవు. అన్ని అందమైన భవంతులే. మీకు రోగాలు వచ్చినా ధన్వంతర్ల కోసం వేల, వందల క్రోసుల పరుగులు తీయనవసరం లేదు. ఇంటికో వైద్యుణ్ణి, భవన నిర్మాణాలకు గొప్ప గొప్ప నమూనాలు తయారుచేసే పనివారిని మనమే తయారుచేసుకుందాం. అటువంటి సంస్థలను ఏర్పాటు చేద్దాం. ముందు తనకోసం ఆలోచించేవారిగా మన పిల్లలను తయారుచేద్దాం. ఆ తరువాత తనవారి కోసం ఆలోచిద్దాం. ఏమంటారు’’ అన్నాడు మంత్రి.

‘ఆహా... విషాన్ని, విష విత్తులను ఎంత చక్కగా ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తున్నాడు మంత్రి’ అని గురువుగారు మనసులో అనుకున్నారు. ప్రజలంతా... ‘మీరేమి చేస్తే అదే చేస్తాం. మాకు కావలసింది మా బిడ్డల భవిష్యత్‌. వారికి మంచి భవిష్యత్‌ కావాలి. అదేదో మీరే చేయాలి.’’ ‘‘చేస్తాం. కాని దానికి ప్రతి ఒక్కరూ కొన్ని వందల బంగారు నాణేలు ఇవ్వాలి. పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం, బంగారు రాజ్యం కోసం మనమంతా త్యాగాలు చేయాలి. సరేనా.’’ అందరూ ‘సరే’ అన్నారు.

విష్ణుశర్మ మౌనంగా నిష్క్రమించారు. అతనికి భవిష్యత్‌ చిత్రపటం గోచరమైంది. ఆ రాత్రి అతను తన పల్లె దిశగా ప్రయాణమైనాడు. కొద్దికాలం తరువాత... అతను, అతని కుటుంబం ఎవరికీ కనిపించలేదు? ‘విశ్రాంతి’ గురుకులం శిథిలావస్థకు చేరింది.కొద్దిరోజుల తరువాత...రాజ్యమంతటా కొన్ని కొత్త విద్యాసంస్థలు నెలకొల్పారు. విపరీతమైన ప్రచారం చేయించారు. ఏ నోట విన్నా, ఏ పాటైనా ఈ కొత్త విద్యాసంస్థల గురించే.
తల్లిదండ్రులు తమ బిడ్డలు పుట్టి పుట్టగానే ఆ సంస్థల్లో ప్రవేశం కోసం క్యూలు కడుతున్నారు. డ్రమ్ములతో వారు కట్టిన డబ్బులు, ఎవరి వాటాలు వారు తీసుకొని, మిగిలినది రాజుగారి కోశాగారానికి చేరుస్తున్నారు. కోట్ల కొద్దీ బంగారు నాణేలు చేరుతున్నాయి.

అక్కడేం చెబుతున్నారు...
వైద్య, నిర్మాణ నమూనాలు తయారుచేసి, విద్యను బోధిస్తున్నారు. రాత్రి పది వరకు విద్యాబోధనే. జైలు గదులు వంటి సరిౖయెన వెలుగు కూడా ప్రసరించని ఇరుకు గదులు. తెల్లవారకముందే విద్యార్థులకు పాఠాలు చెబుతారు. రాత్రి పన్నెండు వరకూ చదివిస్తారు. సెలవులు లేవు. తల్లిదండ్రులను కలవనివ్వరు, తల్లిదండ్రులు మాసాంతమున ఒక్కసారే రావాలి. కొన్ని గంటలు మాత్రమే ఉండాలి. సౌకర్యాలు ఉండవు. గాలి వెలుతురు రాదు. నగరానికి దూరంగా నిర్మాణాలు. అనారోగ్యం వస్తే చూసే నాథుడు ఉండడు. ప్రేమగా పలకరింపులుండవు. వీటి వలన క్రమంగా విద్యార్థులు అంతర్లీనంగా ఉన్మాదులుగా తయారవుతున్నారు. గ్రంథాల్లో చదివింది తాటాకులపైన కక్కుతారు. చదువు... చదువు... చదువు. క్రీడలు, వినోదాలు లేవు. వాటి వలన కాలహరణ తప్ప మరే ప్రయోజనం లేదని మేథావుల చేత చెప్పిస్తారు. తరచుగా విద్యార్థులు మరణిస్తే, అంతా నిశ్శబ్దమే. తల్లిదండ్రుల మూగ వేదనే.

క్రమంగా చక్కని క్రమశిక్షణతో మేధావులను తయారుచేయసాగింది. మేథావులు క్రమంగా ఉన్మాదులుగా మారి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం రాదు, కూలి పనులకు శరీరం సహకరించదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు. ఆరు సంవత్సరాలు గడిచాయి. నిరుద్యోగం పెరిగింది. వైద్యులు నేర్చుకొన్నది... వారి అనారోగ్యాన్నే తగ్గించుకోలేనిదిగా తయారైంది. భవన నిర్మాణ నమూనాలను తయారుచేయటంలో దిట్టలుగా పేరొందిన విద్యార్థులు నిర్మించిన భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. కన్నవారి కలలు గాలిమేడలయ్యాయి. వారు నిరుపేదలుగా మిగిలిపోయారు.ఒకనాడు...
రాజ్యంలో ఒక వార్త ప్రజలను కుదిపేసింది. మనసుల్లో ఆనందించారు. బయటకు ఆవేదనను ప్రకటించారు. ఇంటి తలుపులు వేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.

ఆ వార్త  సారాంశం ఏమిటంటే...
‘‘ఓ అర్ధరాత్రి వేళ... అంతఃపురంలోనే రాజు, మంత్రులను ఎవరో చంపేశారు దారుణంగా’’ కథను ముగించాడు భేతాళుడు.
‘‘రాజా విక్రమార్క. ఇప్పుడు చెప్పు. వారిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ప్రజలెందుకు పండగ చేసుకొన్నారు? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి వ్రక్కలవుతుంది’’ అన్నాడు భేతాళుడు.
‘‘భేతాళా! మన జాతికి కొన్ని సాంస్కృతిక మూలాలున్నాయి. ముఖ్యంగా విద్యను గురించి మనవారిలో వ్యాపారాత్మక భావనలు తక్కువ. ఈ రంగంలో తమదైన సామ్రాజ్యవాద పూరిత ఆలోచనలు, భూస్వామ్యయుత మార్పుల అమలు ప్రజలను ఎక్కువ కాలం నిద్ర పుచ్చలేవు. సాంస్కృతిక మూలాలను ఈ తరహా నియంతృత్వ భావజాలం నాశనం చేయటం ప్రజలను మభ్యపరచటమే అవుతుంది. ఆధ్యాత్మికత, రంగురంగుల కలలు వారిని కొంతవరకే జోకొడతాయి. కాని అవి తమ బిడ్డల భవిష్యత్‌ నాశనం చేస్తాయనుకొనే రోజున ఏ చట్టం... వారిని ఆపలేదు. రాజులు, నియంతలు తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకోలేదా? రాజు, వర్తమాన భవిష్యత్‌లకు పునాది కావాలి. కాని ఆరచేతిలో స్వర్గం చూపకూడదు. ప్రజలు మూర్ఖులు కారు. మహా తెలివైనవారు. ఎవరి మీద ఎప్పుడు నిశ్శబ్దంగా దెబ్బవేయాలో బాగా తెలుసు సుమా.
రాజు, మంత్రులను ఎవరు చంపారో నేనూహించగలను. కాని, ఎవరికి వారుగా తమ తమ ఊహలకు పదును పెట్టుకోవాలని వారిని తెలివైనవారిగానే చూడాలని చక్రవర్తిగా నా ఆశ. జాగ్రత్తగా గమనిస్తే, రహస్యం పెద్దదేమీ కాదు. రాజు అంతఃపురంలో... ఆయన ఆలోచనలు దేశ వినాశనానికి దారితీస్తున్నాయని చంపేసింది ఎవరో... తెలుసుకోని! ‘‘పిల్లలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎదగాలి. వారి మేథస్సు అపారమైనది. కుటుంబం, తమవారు... వారి మేలు, మంచి, చెడు వారికి తెలుసు’’ అన్నాడు విక్రమార్కుడు.

కొంతసేపు మౌనం.
‘‘రాజా! నీ మాటలలోని తర్కం నాకు నచ్చింది. నీ సహనం కూడా నాకు నచ్చింది. ఈనాటి నుంచి నేను నీ బానిసను. చెప్పు ఏం చేయమంటావు’’ భేతాళుడి సమాధానం.
‘‘వద్దు. నీవంటి వారి శక్తి దేశ ప్రయోజనాలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి. నాకు బానిసగా వద్దు. స్వేచ్ఛగా విహరించు. నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న విద్యాసంస్థలకు చెల్లుచీటీ రాయి. విద్య యొక్క మూలాలు, ప్రయోజనాలను ప్రజలకు చెప్పు. విష్ణుశర్మ లాంటి గురువులను వెతికి పట్టుకో’’ అని నర్మగర్భంగా నవ్వాడు విక్రమార్కుడు.
అతని నవ్వులోని భావార్థం భేతాళునికి అర్థమైంది.
తూర్పున వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
చిత్రంగా... వారిద్దరూ ఒకే దిశగా ప్రయాణం సాగించారు.
వారి వెనుక రహస్యంగా... ఒక వర్గం వారిని అనుసరిస్తున్నదన్న విషయం వారికి తెలియదు.

మరిన్ని వార్తలు