గుడ్డి గుర్రం

15 Mar, 2020 13:22 IST|Sakshi

సింహపురి రాజ్యాన్ని రుషికేశవ మహారాజు పరిపాలిస్తున్నాడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నాడంటే ఎవరూ ఎదురు చెప్పకూడదు, ’ఔను’ అనాలి. చాలా మొండిఘటం. అయినా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. 
తనకు ఒక గుర్రం వుంది. చాలా ఏళ్ల తరబడి దానిపైనే ప్రయాణం సాగిస్తున్నాడు. గుర్రానికి వయసు పైబడింది. సేనాధిపతి కేశవుడికి గుర్రం మార్చమని చాలా సార్లు చెప్పాడు రాజు. ‘‘సేనాధిపతి... నేను స్వారీ చేస్తున్న గుర్రానికి వయసు ముదిరినది.. పైగా చీకటి పడే సమయానికి కళ్లు కనిపించవు.. గుడ్డిదైపోయింది. జోరు తగ్గిపోయింది. ఈ గుర్రాన్ని పాకలోనే కట్టేసి వేరే గుర్రాన్ని తెప్పించండి’’ అని  చాలా సార్లు సేనాధిపతికి చెప్పి చూశాడు రాజు.  ‘‘మహారాజా.. నీకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి ఈ గుర్రం నిన్ను మోస్తూనే వుంది, ఇప్పుడు వయసు అయిపోయిందని వద్దనుకోవడం రాజధర్మం కాదు, వయసు మీద పడిందని మన బరువు బాధ్యతలు మోసిన తల్లిదండ్రులను వద్దనుకుంటామా, ఇది అంతే మహారాజా’’ అంటూ సేనాధిపతి గుర్రాన్ని మార్చడానికి ఒప్పుకోలేదు.  ‘‘సేనాధిపతి.. పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. గుర్రానికి వయసు మాత్రమే పైబడి వుంటే ఇలా ఆలోచించేవాణ్ణి కాదు.

గుడ్డిది అయింది, పైగా సమరానికైనా సంబరానికైనా పనికి రాకుండా పోయింది, తల్లిదండ్రులతో పోలిక ఏమిటి?’’ రాజుగారి కంఠంలో కాస్త కటువుదనం కనిపించింది, ‘‘వయసు మీద పడినప్పుడే మహారాజా.. చూపు కూడా మందగిస్తుంది. కన్నవారు మన బాధ్యతను మోస్తున్నట్టే గుర్రం కూడా మీ బరువును మోస్తూ మీరు అనుకున్న గమ్యానికి చేరుస్తోంది. ఇందులో తారతమ్యం ఏమున్నది మహారాజా..’’ తమాయించుకుంటూ అన్నాడు సేనాధిపతి. ‘‘మీరు ఎన్నైనా చెప్పండి ఈ గుడ్డి గుర్రంపై నేను స్వారీ చేయలేను. వెంటనే గుర్రం మార్చండి’’ ఈసారి హెచ్చరిక జారీ చేసినట్టుగా అన్నాడు మహారాజు. ‘‘చిత్తం ప్రభు.. కాకపోతే చిన్న మనవి’’ అన్నాడు సేనాధిపతి. ‘‘చెప్పండి’’ అన్నాడు మహారాజు. ‘‘ఇప్పుడు మనం వెళుతున్న వేటకు ప్రస్తుతం ఈ గుర్రాన్నే ఉపయోగించండి. తరువాత వెళ్ళే వేటకు మరో గుర్రం సిద్ధం చేస్తాను’’ అన్నాడు సేనాధిపతి. ‘‘అటులనే కానివ్వండి’’ అంటూ మందిరంలోకి వెళ్ళాడు రుషికేశవ మహారాజు. రాజుకు వేటాడడం అంటే చాలా ఇష్టం, వేటకు వెళ్లిన ప్రతిసారి ఇలా వెనుకబడిపోవటం తనకు నచ్చలేదు, పరివారం చక్కగా వేటాడి విజయం సాధిస్తున్నారు, ఆ ఆనందం తనకు దక్కక పోవడానికి కారణం గుడ్డి గుర్రం. సేనాధిపతి మాత్రం గుర్రం విషయంలో వాయిదాలు వేస్తూ వెళుతున్నాడు. రాజు గుడ్డి గుర్రాన్నే స్వారీ చేయాలనే సేనాధిపతి యొక్క కోరిక వెనుక ఆంతర్యం ఏమిటో రాజుకు అర్థం కాలేదు. తన మాట ప్రకారమే ముందుకు వెళుతున్నాడు. పైగా రాజుకు వేట అంటే చాలా ఇష్టం ఒక మాసంలోనే రెండు సార్లు వేటకు వెళ్ళాల్సిందే.. 

ఒక రోజు తన పరివారంతో అడవికి వేట కోసం వెళ్ళాడు రాజు, పరివారమంతా ముందు వెళుతుంటే రాజు గుర్రం బాగా వెనుకబడింది, ముందుగా వెళ్లిన సేనాధిపతి రాజు రాకకోసం చెట్టు కింద కూర్చుని వున్నాడు. కాసేపటి తరువాత రాజు రానే వచ్చాడు. సత్తువ లేని గుర్రం కాబట్టే బాగా వెనుక పడ్డాడని తనపై కోపంగా వున్న రాజును గమనించాడు సేనాధిపతి, ‘‘సేనాధిపతి.. నీ గుర్రాన్ని నాకు ఇవ్వు. నువ్వు ఎలాగూ స్వారీలో నేర్పరివికాబట్టి ఈ గుడ్డి గుర్రాన్ని దారికి తెచ్చుకోగలవు’’ అంటూ అడిగాడు రాజు. సేనాధిపతి గట్టిగా నవ్వి ‘‘మహారాజా.. ఈరోజు చీకటి పడేవరకు దీనిపైనే పయనించండి. మీకు నచ్చకపోతే నా గుర్రం మీకిచ్చి మీ గుడ్డి గుర్రాన్ని నేనే తీసుకుంటాను’’ అన్నాడు సేనాధిపతి, 
వేట మొదలు పెట్టారు.. పరివారం మొత్తం అరణ్యాన్ని చుట్టు్టముట్టారు. పగలంతా తలా ఓ దిక్కు వెళ్లి వేటాడుతున్నారు, మధ్యాహ్నం దాటిపోయింది, రాజుగారి దగ్గర ఒక్క మనిషి కూడా లేడు. చీకటి పడుతోంది పరివారమంతా సేనాధిపతి మాట ప్రకారం రాజ్యానికి చేరుకున్నారు. రాజు మాత్రం అడవిలోనే నిలిచిపోయాడు. 

అది దట్టమైన అడవి కావడంతో వచ్చిన దారి మరచిపోయాడు. పైగా గుర్రం గుడ్డిది. ఎంతటి రాజైనా ఈ పరిస్థితుల్లో భయపడక తప్పదు. చాలా దూరం వచ్చేసినట్టు వున్నాడు. తను వచ్చింది తూరుపు ముఖం నుంచి కానీ అక్కడకు వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది. తన పరివారం కనిపిస్తారేమో అని దిక్కులు చూస్తున్నాడు రాజు. వాళ్ళ అలికిడి ఎక్కడా వినపడలేదు. గుర్రాన్ని దారి మళ్ళిస్తున్నాడు. అది మాట వినలేదు. వేరే మార్గం వైపు లాగుతోంది. కాలి గిట్టలు పదే పదే నేలకేసి కొడుతోంది. గుర్రాన్ని ఎంత అదిలిస్తున్నా అది దక్షిణం వైపు దారికే అడుగులు కదుపుతున్నది.

ఆకాశంలో క్రమేపి చీకటి అలముకుంది, ఇక ప్రయోజనం లేదని గుర్రం లాగుతున్న వైపే పయనం సాగించాడు. అది మెల్లగా అడుగులు వేస్తూనే ఎట్టకేలకు రాజుని రాజ్యానికి చేర్చింది. ఆశ్చర్యబోయాడు రాజు. ‘‘మహారాజా.. గుర్రం మార్చుకుందామా’’ అడిగాడు రాజుకు ఎదురేగిన సేనాధిపతి. ‘‘అవసరం లేదు సేనాధిపతి.. నా గుర్రం గుడ్డిదైనా దానికి వున్న ఆత్మవిశ్వాసం గుడ్డిది కాదు. మనిషి ఆత్మవిశ్వాసంతో బాటు ఏకాగ్రత కోల్పోతాడు కాబట్టే దారి మరచిపోతాడు. ఏ జంతువుకైనా ఏకాగ్రత వుంది కాబట్టే వచ్చిన దారి మరచిపోదు, దీన్ని బట్టి మనిషి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంపై నమ్మకం పెంచుకోవాలి, నువ్వు గుర్రం గుడ్డిదైనా ఎందుకు మార్చలేదో అర్థమైంది’’ అంటూ రాజు సేనాధిపతిని మెచ్చుకున్నాడు.
∙ 

మరిన్ని వార్తలు