జ్ఞాన సమాధులు!

24 Jan, 2016 02:00 IST|Sakshi
జ్ఞాన సమాధులు!

 విహంగం
 పుట్టుకలాగే చావు కూడా పండగే అనేది తత్వం అయితే, ఆ తత్వానికి అందమైన నిర్మాణ రూపం టర్కీలోని రాక్-కట్ టూంబ్స్. ప్రపంచ పర్యాటకులను కనువిందు చేసే అందాలకు టర్కీలో కొదవలేదు. అయితే పర్యాటక ఆసక్తికి ‘అందం’ మాత్రమే ఎప్పుడూ ప్రామాణికమైపోదు. శిథిల చరిత్ర నుంచి కూడా అందమైన ఆకర్షణ పుట్టవచ్చు. అది అందం, ఆకర్షణలకు మాత్రమే పరిమితం కాకుండా... సరికొత్త మానసిక ప్రపంచం లోకి మనల్ని తీసుకువెళుతుంది. ఆ ప్రపంచంలో... ఉన్నట్టుండి మనం శతాబ్దాల వెనక్కి వెళ్లిపోతాం. చరిత్రతో వినోదప్రధాన సంభాషణ కాకుండా విజ్ఞానదాయక సంభాషణ చేస్తాం. టర్కీలోని దక్షిణ కోస్తాలో ఉన్న లైసియలో ఉన్న రాక్-కట్ టూంబ్స్ అందుకు నిలువెత్తు ఉదాహరణ.
 
 లైసియాను ఒక ప్రాంతం అనడం కంటే సుసంపన్నమైన చరిత్ర అనడం సబబుగా ఉంటుదేమో! శ్వేతవర్ణ కొండల అందాల నుంచి శిలలపై చెక్క బడిన  ఇండో-యూరోపియన్ ఫ్యామిలి ప్రాచీన భాషల వరకు... లైసినయ్ యూనియన్‌లోని ప్రతిదీ ఆకర్షణీయమే! అందుకేనేమో... ‘‘లైసియాలోని కట్టడాల కంటే వాటి వెనుక ఉన్న చరిత్రే గొప్పది’’ అంటుంటారు ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారంతా!
 
 లైసియన్ నాగరితకను గురించి ఈజిప్ట్ ప్రాచీన చరిత్రలో గొప్పగా ప్రస్తావించారు. కట్టడాలు, వాటి చారిత్రక ఘనత అనేవి ఎలా ఉన్నప్పటికీ... లైసియన్ సంస్కృతిలో విశేషంగా చెప్పుకోవాల్సింది... అంతిమ సంస్కారాలకు  సంబంధించిన ప్రత్యేకత గురించి. వీరు మృతదేహాలను నేలలో పాతి పెట్టరు. లైసియన్‌లోని మైరా రాతి  కొండపై చెక్కిన సమాధుల్లో పెట్టేవాళ్లు. ఇవి 5వ శతాబ్దనికి చెందినవని అంచనా!
     
 శవాలను కొండపై చెక్కిన సమాధుల్లో ఉంచడం వల్ల వాళ్లంతా స్వర్గానికి వెళ్తారు అన్నది ఈ సంప్రదాయం వెనుక ఉన్న నమ్మకం. పెద్ద రెక్కలు ఉన్న ఒక పక్షి వచ్చి, సమాధుల్లోని వారిని స్వర్గానికి తీసుకు వెళుతుందని ఆనాటి ప్రజలు నమ్మేవాళ్లు.అయితే రాతిలో సమాధులు చెక్కడమంటే ఏదో చెక్కాం అని కాకుండా వీటిని  ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు కళాత్మకంగా తీర్చిదిద్దేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇవి లైసియన్ ప్రాంతంలోని ఇండ్లను గుర్తుకు తెస్తాయి అంటే ఒక ఇంటికి ఎలాగైతే ద్వారం, కిటికీలు, గదులు ఉంటాయో... ఈ సమాధులకు కూడా అలాగే ఉంటాయి! ఒకే సమాధిలో రెండు నుంచి మూడు గదుల వరకు కనిపిస్తాయి.
 
 ఈ గదుల్లో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దుస్తులు, ఇష్టమైన వస్తువులను పెట్టేవాళ్లు. ఇన్ని విశేషాలు ఉండబట్టే ఈ సమాధుల్ని చూడటానికి సందర్శకులు బారులు తీరుతున్నారు. ‘‘రాక్-కట్ టూంబ్స్‌ని తొలిసారి చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యానందాలకు గురయ్యాను. కొండ మీద సమాధులు చెక్కడమనేది వినూత్నమైన ఆలోచన. ఒక్కో సమాధినీ చూస్తుంటే... సజీవంగా ఉన్న వ్యక్తితో సంభాషణ జరిపినట్లుగా ఉంటుంది’’ అంటాడు బ్రిటన్‌కు చెందిన మైఖేల్ గోల్ అనే  పర్యాటకుడు.
 
 కొండపై చెక్కిన సమాధులతో పాటు స్థూపాకార సమాధులకు కూడా ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇవి కొండపై చెక్కిన సమాధుల కంటే పురాతనమైవి. ‘‘ప్రతి కట్టడం మౌనంగానే ఎన్నో విషయాలు చెబుతుంది అనడానికి  ఈ కొండ, స్థూపాకార సమాధులే నిదర్శనం. ఆనాటి ప్రజలు చావును ఏ కోణంలో చూశారు?  ఎలా జీవించారు? అని చెప్పడానికి ఇవి నిర్మాణాత్మకమైన ఉదాహరణలు’’ అంటాడు జపాన్ పర్యాటకుడు, ఇంజినీర్ అయిన జెన్ నకటోని.
 
 ఈ రాతి సమాధులు కేవలం శవాలను భద్రపరిచే ప్రదేశాలుగా మాత్రమే అనిపించవు. చాలా సమా ధులపై చెక్కిన పౌరాణిక చిత్రాలు నాటి ప్రజల నమ్మక అపనమ్మకాలను, సంస్కృతిని  తెలియజేస్తున్నట్లుగా ఉంటాయి. ‘భవిష్యత్‌ని నిర్వచించాలనుకుంటే, చరిత్రను అధ్యయనం చేయడం అవసరం’ అనే మాట తెలిసిందే. రాక్-కట్ టూంబ్స్‌ను చూసినప్పుడు... పర్యాటక ఉత్సాహమే కాదు, అధ్యయన ఆసక్తీ కలుగుతుంది. చరిత్ర జ్ఞానం చేరువవుతుంది.                                        

>
మరిన్ని వార్తలు