యుగయుగాల కృష్ణమ్మకు వందనం...

7 Aug, 2016 09:18 IST|Sakshi
యుగయుగాల కృష్ణమ్మకు వందనం...

స్మరణాత్ సర్వదోషఘ్నీం, దర్శనాత్ స్వర్గదాయినీం
స్నానేన ముక్తిదాం పుణ్యాం కృష్ణవేణీం నమామ్యహమ్
కృష్ణానదిని తలుచుకుంటే చాలు దోషాలన్నీ పోతాయి. చూస్తే చాలు స్వర్గం లభిస్తుంది. స్నానం చేస్తే ముక్తి చేకూరుతుంది.

 
విష్ణుస్వరూపంగా కృష్ణ, శివస్వరూపంగా వేణి సహ్య పర్వతంపై అశ్వత్థ (రావి), అమలక (ఉసిరి) చెట్ల మొదటి నుంచి ప్రవహిస్తూ కలిసిపోయి కృష్ణవేణిగా ఒక్కటైనారు. హంసలదీవి సాగర సంగమం వరకు ఎన్నో తీర్థాలుగా, క్షేత్రాలుగా యుగయుగాలుగా ప్రవహిస్తున్న నదులరాణి కృష్ణవేణి. ఏ నదులూ కృష్ణమ్మకు సాటి రావు. మిగిలిన నదులన్నీ బ్రహ్మ సృష్టి. శ్రీమన్నారాయణుడు లోకరక్షణ కోసం తన జలావతారంగా కృష్ణానదిని సృష్టించాడు. ఆయనకు తోడుగా పరమేశ్వరుడు తన జలరూపాన్ని వేణీనదిగా చేశాడు. శివకేశ వ సృష్టి కృష్ణవేణి.
అల గంగమ్మకు లేదు గౌతమికి లేదీ యోగ మా విష్ణువే
వెలసెన్ నీవుగ కృష్ణవేణి! కలిలో వెంటాడు పాపమ్ములన్
తొలగం ద్రోయగ మోక్షమీయగ కళాదుర్గమ్మైవై జ్ఞానదో

హలవై కూర్తువు భుక్తి ముక్తులను సస్యశ్యామలానందినీ! అని కవులు కృష్ణవేణీ వైభవాన్ని ఎన్నో విధాలుగా కీర్తించారు. స్కాందపురాణం, పద్మపురాణాలలో రామాయణ భారత భాగవతాలలో కృష్ణానదీ ప్రస్తావన ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు కృష్ణవేణిని భక్తి ప్రపత్తులతో స్తుతించారు. వారి వాక్కులో మహిమ, మంత్రబలం వల్ల ఆ స్తోత్రాలు చదివినవారికి ఎన్నో లాభాలు ఉంటాయి.


 కలియుగంలో మానవులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి గంగ, యమున, నర్మద, గోదావరి వంటి నదుల్లో మునుగుతారు. వారందరి పాపాలతో ఈ నదులు కలుషితం అవుతాయి. వాటి కాలుష్యం పోవటానికి, మళ్లీ పవిత్రం కావటానికి శ్రీమహావిష్ణువు తన అంశతో కృష్ణానదిని సృష్టించాడు. నదులన్నీ వచ్చి కృష్ణలో మునగాలి. అప్పుడు అవి స్వచ్ఛం అవుతాయి. గంగానది కాకి రూపంలో వచ్చి కృష్ణా సాగరసంగమంలో మునిగి హంసగా మారింది. అక్కడ హంసలదీవి ఏర్పడింది. కృష్ణ హంసతీర్థం అయ్యింది.


 ‘కృష్ణా కృష్ణాంగ సంభూతా ప్రాణినాం పాపహారిణీ
 స్వర్గదా మోక్షదా నౄణాం భవబంధముక్తిదా’
 అంటూ సూతమహర్షి కీర్తించాడు.
 ‘కార్యద్వయం సముద్దిశ్య కృష్ణవేణీ భవామ్యహం
 జగతా రక్షణార్థాయ మద్భక్తానాం చ ముక్తయే’

రెండు పనుల కోసం నేను కృష్ణవేణిగా అవతరించాను. ఒకటి లోకాలను పాపాల నుంచి రక్షించడం, రెండు నా భక్తులకు ముక్తినివ్వడం కోసం అని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కృష్ణవేణి ఘనతను చెప్పాడు. నేనే కృష్ణవేణిని కనుక కృష్ణనీళ్లు త్రాగినవారి హృదయంలోకి నేను ప్రవేశిస్తాను. వారి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తాను. అందరూ కృష్ణ నీరు త్రాగండి అని శ్రీమహావిష్ణువు చెప్పాడు.

‘కృష్ణాం ససర్జ సంపన్నో దివ్యమూర్తిం సులోచనాం
 శ్యామలాం విష్ణుచిహ్నాంకాం చతుర్భుజాం శుభప్రదామ్’ అని నారద మహర్షి కృష్ణవేణీ రూపాన్ని వర్ణించాడు.
 కల్పాద్యస్య కృతస్యాదా వియం దేవీ వసత్పురా
 వైష్ణవీ బ్రహ్మణః పుత్రీ పూజ్యమానా సురర్షిభిః
 తథా పుణ్యమయీ కృష్ణా సర్వత్ర సుధియో జనః

 విష్ణు స్వరూపిణి, బ్రహ్మ దత్తపుత్రిక, దేవతలు, ఋషులు పూజించే కృష్ణానది సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఆమె పుణ్యప్రదాయిని.. అని సాక్షాత్తు పరమేశ్వరుడు కృష్ణ ఎంత ప్రాచీనమైనదో చెప్పాడు.
 పేరు ఎలా వచ్చింది...
 కృష్ణానదికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా పరమేశ్వరుడు ప్రకటించాడు.
 నదీనమగ్రజననాత్ మాహాత్మ్యాత్‌చ మహత్వతః
 సర్వం కర్షతి చాఘౌఘం తేన కృష్ణా ప్రకీర్తితా

 అన్ని నదుల కంటే ముందు పుట్టి తన మహిమతో అందరి పాపాలను తనలోకి ఆకర్షించుకొనే శక్తి కలిగి ఉండడం వల్ల ఈ నదికి కృష్ణా అనే పేరు వచ్చిందని కుమారస్వామికి శివుడు వివరించాడు. తన రూపమైన వే ణీ నది కలవటం వల్ల కృష్ణవేణి అయిందని కూడా చెప్పాడు. కృస్ణానదికి సహ్యజ అనే పేరు కూడా ఉంది. దానికి కారణం భూలోకంలో కృష్ణ సహ్యగిరి ప్రార్థనకు అంగీకరించి సహ్యపర్వతంపై నుంచి ప్రవహించింది. అప్పుడు కృష్ణ సహ్యాద్రికి ఈ వరం ఇచ్చింది.


 ఏవమస్తు గిరిశ్రేష్ఠత్వత్తస్సంప్రభవామ్యహమ్
 సుతా తవ భవిష్యామి సహ్యజేత్సపి విశ్రుతా
 సహ్యపర్వతరాజా!

నేను నీ నుండి ప్రవహించి నీ కుమార్తెను అవుతాను. ఇక నుంచి నన్ను సహ్యజ అనే పేరుతో పిలుస్తారు. నీ పేరు శాశ్వతం అవుతుంది అన్నది. నారదమహర్షి మరొక దేవ రహస్యాన్ని కృష్ణానది గురించి ఇలా చెప్పాడు...
 సురభిర్దివిలోక విశ్రుతా భువి కృష్ణేవరప్రపూరణే
 సురభేరియమేవ బాధికా స్వజనేభ్యోఖిలమోక్షదా

దేవలోకంలో కామధేనువు ఉంది. అడిగినవన్నీ ఇస్తుంది. మానవుల కోసం భూలోకంలో కోరికలు తీర్చే కృష్ణానది ఏర్పడింది. కామధేనువు కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కృష్ణ అంతకంటే ఎంతో గొప్పది. తన భక్తుల కోరికలు తీర్చటమే కాక మోక్షాన్ని కూడా ఇస్తుంది.
వరద కృష్ణమ్మ అంత పరవళ్లు ఎందుకు తొక్కుతుందో మార్కండేయ మహర్షి వర్ణించాడు. కృష్ణానది అలలు స్వర్గానికి మెట్లులాగా ఉంటాయన్నాడు.
 యాభాతి వితతా భూమౌ నృణాముత్తరాయవై
 నృణాంరోషేణ పాపాని భాతి హంకుర్వతవయా

 వరదలు వచ్చినప్పుడు కృష్ణవేణి నరుల పాపాలను చూసి హుంకరిస్తున్నట్టు, బుస కొడుతున్నట్లు ఉంటుంది. కృష్ణవేణి ముగ్గురమ్మల రూపం.
 ‘ఆవర్తనాభిః పద్మాక్షీ శుభ్రాంగీ ఫేనహారిణీ’ స్వచ్ఛమైన నీటిలో, తెల్లని నురుగు హారాలతో కృష్ణ సరస్వతిలా ఉంటుంది.
 ‘చకాస్తియా స్వయం లక్ష్మీః జగద్దుర్గతి నాశినీ’ పద్మహస్త అయిన లక్ష్మిలా ఉంటుంది.
 ‘సౌభాగ్యదాయినీ గౌరీ యా భాతి జగదంబికా’ సౌభాగ్యాన్ని ఇచ్చే జగదాంబ గౌరిలా ఉంటుంది కృష్ణ.
 పురాణాల్లో ఇన్ని విధాలుగా వర్ణింపబడిన యుగయుగాల కృష్ణమ్మకు కోటి దండాలు.
 పుణ్యదాయినికి పుష్కర ప్రణామాలు.
 - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

 
మహాబలేశ్వర్‌కు దిగువన ఉన్న పట్టణం ‘వాయి’లో ఏడు కృష్ణా ఘాట్లు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో డ్యోలా గణపతి ఆలయం ఉంది. కృష్ణానదికి వరద వస్తే ... ఆ నీరు ఆలయాన్ని తాకకుండా ఉండడానికి డ్యోలా గణపతి ఆలయ వెనుక భాగాన్ని చేప ఆకారంలో నిర్మించారు.

>
మరిన్ని వార్తలు