కుంతీదేవి ధర్మ నిరతి

4 Aug, 2019 10:25 IST|Sakshi

పురానీతి

అజ్ఞాతవాసం నిమిత్తం పాండవులు జింక చర్మాలు, నార చీరలు ధరించి బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం అనే అగ్రహారం చేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం ఏర్పరచుకుని, రోజూ భిక్ష స్వీకరించి తల్లికి తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు. మిగిలిన వారు భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీదేవి భీమునితో ‘భీమసేనా! ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది. నేను వారికి ఏమి కష్టం వచ్చిందో తెలుసుకుని వచ్చి నీకు చెబుతాను. వారికి చేయగలిగిన సాయం చేయడం పుణ్యప్రదం’ అంది. అందుకు భీముడు ‘అమ్మా! నీవు తెలుసుకుని నాకు చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను’ అన్నాడు.
ఎందుకని విలపిస్తున్నారని అడిగిన కుంతీదేవితో ఆ ఇంటి యజమాని ‘అమ్మా జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేకున్న భార్యను కాని, కన్యాదానం చేసి అత్త వారింటికి పంపవలసిన కూతురుని కాని, నాకూ నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కానీ రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు’ అన్నాడు.

‘రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి?’ ఆశ్చర్యంతో అడిగింది కుంతి. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు ‘అమ్మా! ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో   రోజూ ఒక బండి ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆతడికి ఆహారంగా పంపేలా ఒప్పందం కుదుర్చుకున్నాము. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాల్సిన వంతు వచ్చింది’. అన్నాడు. అందుకు కుంతీదేవి ‘అయ్యా! చింతించవద్దు. మీకు ఒక్కడే కుమారుడు. నాకు ఐదుగురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను’ అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో ‘అమ్మా! అతిథిని పంప తగదు. అందునా బ్రాహ్మణ హత్య మహాపాపం’ అన్నాడు. కుంతీదేవి ‘అయ్యా! ఆలోచించవద్దు. నా కుమారుడు మహా బలవంతుడు. తప్పక బకుని చంపి వస్తాడు’ అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పిం ది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు.

అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది ‘అమ్మా! పరాయి వారికోసం నీ కన్నకొడుకును బలి ఇస్తావా?’ అన్నాడు. కుంతీదేవి ‘నాయనా ధర్మరాజా! కలత చెంద వలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన పదవరోజునే ఒక బండ రాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ ఆగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మనధర్మం’ అని చెప్పింది.

తల్లి చెప్పిన మాటలకు సమాధాన పడ్డ ధర్మరాజాదులు అందుకు సమ్మతించారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, తమకు ఆశ్రయం ఇచ్చిన వారు రోదిస్తుంటే కుంతీదేవి చూస్తూ ఊరుకోలేదు. కారణం తెలుసుకుంది. బ్రాహ్మణునికి మారుగా తన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా పంపేందుకు సిద్ధపడింది. అడ్డుపడబోయిన ధర్మరాజుకు కూడా ధర్మసూక్ష్మాలు చెప్పింది. అన్నింటినీ మించి తన కుమారుని బలం, శక్తి సామర్థ్యాల మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకుంది ఆ తల్లి. పక్కవాడు ఏమైపోతున్నా పట్టించుకోని నేటి రోజులలో తమకు ఆశ్రయం ఇచ్చిన వారికోసం తన కొడుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టింది ఆ తల్లి. అమ్మ మాటను ఆ కొడుకు కూడా జవదాటలేదు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు