లగే రహో గాంధీగిరీ!

1 Nov, 2015 01:33 IST|Sakshi
లగే రహో గాంధీగిరీ!

* ఈ చిత్రం... మంచిని, మానవత్వాన్ని చాటింది.  
* మనిషి ఎలా బతకాలో  నేర్పింది.
* మనిషికి మహాత్ముడయ్యే మార్గాన్ని చూపింది.
ఎప్పుడైనా రాజ్‌కుమార్ హిరానీ కనిపిస్తే... నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. అవే ఇవి...
 రాజ్ హిరానీ గారూ... మీరు మాత్రమే జీవితాన్ని ఇంత అందంగా, ఇంత మంచిగా, ఇంత ఆర్ద్రతతో, ఇంత ఆహ్లాదంగా, ఇంత పాజిటివ్‌గా ఎలా చూస్తారండీ?

ప్రతి దర్శకుడూ కష్టపడి తను బాగా తీసిన ఒక్కో సినిమాని కళామతల్లి పాదాల వద్ద ఒక పువ్వుగా పేర్చుతుంటే... మీరు మాత్రమే సినిమాలో ఉన్న డెబ్భై సీన్లనీ డెబ్భై పువ్వులు చేసి, మీదైన స్క్రీన్‌ప్లేలో వాటికి దండ కూర్చి, కళామతల్లి కంఠంలో మీ ఒక్కో సినిమాని ఒక్కో పూవుల దండగా ఎలా వేస్తారండీ? మీ పూలని దండగా కూర్చే మీ దారం పేరేంటండీ? మీ మనసు ఫెవికాలా? మీ మెదడు సెలోఫెన్ టేపా? మానవత అనే దృష్టి మీకు మాత్రమే ఎలా వచ్చిందండీ? సమాజంలో ప్రతి మధ్య తరగతి వాడి  మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు మీకు మాత్రమే ఎలా తెలుసండీ? మీకు పరకాయ ప్రవేశం తెలుసా?
 
200 కోట్లు చేరకుండానే చాలామంది దర్శకులు అగ్ర దర్శకులమని ఢంకా బజాయించి పబ్లిసిటీలు చేసుకుంటున్న ఈ రోజుల్లో... మూడొందల కోట్లు, నాలు గొందల కోట్లు అవలీలగా దాటించేసినా, ఎక్కడా పర్సనల్ పబ్లిసిటీ చేసుకోకుండా అగ్ర దర్శకుడిననే అహంకారం సామాజిక అనుసంధాన వేదికల్లో కనిపించనీకుండా ఎలా ఉంటున్నారండీ?
 
మీ సినిమాలు మాత్రమే కంటి నుండి కాకుండా మనసు నుండి నీరు కార్పిస్తా యెందుకండీ? మీ సినిమా విడుదలైతే, ప్రేక్షకుడిగా అత్యంత ఆనందం, దర్శకుడిగా అతి సిగ్గు నాకెందుకు కలగాలండీ? ఏంటండీ ఈ టార్చరు? సమాజానికి మీరు సినిమా దర్శకుడా? మార్గ దర్శకుడా? ఎందుకండీ ఇంత మంచి సినిమా తీస్తారు అని నేనడగను. ఎలా అండీ ఇంత గొప్ప సినిమాలు అంత అలవోకగా తీస్తున్నారు అని నేనడుగుతున్నాను. ఈ మిలీనియమ్ సినిమాల్లో రాజ్‌కుమార్ హిరానీ సినిమాలు మాత్రమే రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే... అవే వస్తే, మిగిలిన సినిమాలన్నీ బలాదూరే కాబట్టి. వాటి గురించి రాయబుద్ధి కాదు కాబట్టి.
 
‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్.’ జనామోదం పొందిన తర్వాత మళ్లీ కొంతకాలానికి అదే దర్శక నిర్మాతలు మున్నాభాయ్, సర్క్యూట్, మామూ పాత్రల్ని యథాతథంగా తీసుకుని, అదే ఆర్టిస్టులని ఉంచి (సంజయ్‌దత్, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ), విద్యాబాలన్‌ని  హీరోయిన్‌గా పెట్టి తీసిన సినిమా ‘లగేరహో మున్నాభాయ్’. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 149వ చిత్రంగా ఈ చిత్రాన్ని ‘శంకర్‌దాదా జిందాబాద్’ పేరుతో అనువదించారు, నిర్మాత జెమిని కిరణ్. ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
 
సర్క్యూట్ (అర్షద్) ఒక మున్సిపల్ ఆఫీసర్‌ని కిడ్నాప్ చేసి లక్కీసింగ్ ఆఫీసుకి తీసుకెళ్తాడు. లక్కీసింగ్ (బోమన్) ఆ ఆఫీసర్‌ని బెదిరించి ఒక బిల్డింగ్ కబ్జా చేయడానికి పేపర్స్ సృష్టించుకుంటాడు. మున్నాభాయ్‌కి థ్యాంక్స్ చెప్పి స్వీట్లు ఇవ్వమంటాడు. మున్నాభాయ్ హాయిగా ఎఫ్.ఎం. రేడియోలో గుడ్ మా...ర్నిం...గ్... ముం... బై... అని సాగదీసి కార్యక్రమం మొదలుపెట్టే జాహ్నవిని ప్రేమిస్తూ ఆమె గొంతు కోసం ఆ రేడియో కార్యక్రమం మిస్సవ్వకుండా వింటూ ఉంటాడు.
 
ముంబైలో ఉదయాన్నే జీతాల కోసం ఆఫీసులకి పరుగులు పెట్టే ఒత్తిడిలో బతకడాన్నే జీవించడం అంటే, మరి మరణించడాన్ని ఏమంటారు? అని అడుగుతుంది రేడియోలో జాహ్నవి. మున్నాభాయ్ లాంటి ప్రేక్షకుడు కూడా ఆ మాట అడిగిన జాహ్నవి పాత్రతో ప్రేమలో పడిపోతాడు వాడికీ మనసుంటే. అక్టోబర్ 2న బాపు గురించి కొన్ని ప్రశ్నలడుగుతాను, ఆ క్విజ్‌లో గెలిచిన వాళ్లు తర్వాత రోజు స్టూడియోలో నాతో షోలో పాల్గొనవచ్చు అంటుంది జాహ్నవి. మున్నాభాయ్ ఒక రౌడీ కాబట్టి బాపు అక్టోబర్ 2 మందు దొరకని ‘డ్రై’డే అని తప్ప, ఆ రోజుకి, ఆ రోజు పుట్టిన  జాతి పితకి ఉన్న విలువేమిటో తెలియదు. అందుకే ముగ్గురు ప్రొఫెసర్లని కిడ్నాప్ చేసి, వాళ్ల సాయంతో షోలో సమాధానాలన్నీ కరెక్ట్‌గా చెప్పి జాహ్నవిని రేడియో స్టేషన్‌లో నేరుగా కలిసే అవకాశం పొందుతాడు.
 
అయినా మున్నాభాయ్ ఎంత మంచివాడంటే, ఈ కిడ్నాప్ చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకీ సరైన సమాధానం చెప్పినప్పుడల్లా ఒక గ్రైండరో, ఫ్యానో, ఇస్త్రీ పెట్టో గిఫ్ట్‌గా ఇచ్చి పంపుతాడు. జాహ్నవికి తనని తాను మురళీ ప్రసాద్‌శర్మగా, ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకుంటాడు మున్నా. జాహ్నవి సెకెండ్ ఇన్నింగ్స్ అనే వృద్ధాశ్రమం నడుపు తుంటుంది. ఆ ఆశ్రమం ఉన్న బిల్డింగ్‌ని తన కూతురికి (దియామీర్జా) పెళ్లి సంబంధం కుదర్చడానికి కట్నంగా ఇవ్వాల్సి వస్తుంది లక్కీసింగ్‌కి. దాంతో మున్నాభాయ్‌ని, జాహ్నవిని, ముసలి వాళ్లని హాలిడేకి పంపించి, సర్క్యూట్ అండ్ గ్యాంగ్‌తో కలిసి కబ్జా చేస్తాడు. అప్పటికే జాహ్నవి కోసం బాపు గురించి చదవడం మొదలుపెట్టిన మున్నాభాయ్‌కి బాపు స్వయంగా ప్రత్యక్షమై సత్యం వైపు, అహింస వైపు మార్గ దర్శనం చేస్తూ మున్నాభాయ్‌తో దాదాగిరి మానిపించి, దాని స్థానంలో గాంధీగిరి అనే కొత్త మార్గాన్ని పాటింపజేస్తుంటాడు.

ఈ బాపు ప్రభావం వల్ల, సలహాల వల్ల లక్కీసింగ్‌లో పరివర్తన కలిగే వరకూ మున్నాభాయ్ ఆ బిల్డింగ్ కోసం అహింసతో నిరసన చేపడ తాడు. కానీ, అబద్ధం చెప్పి ప్రేమలో దింపిన సంగతి జాహ్నవితో చెప్పేస్తానని లక్కీసింగ్ బెదిరిస్తాడు. దాంతో తనే జాహ్నవికి నిజం చెప్పేస్తాడు మున్నా. ఆమె దూరమైపోయినా సత్యం, అహింసల కోసం నిలబడతాడు. చివరికి లక్కీలో మార్పును తీసుకురావడం, ఇల్లు ఇవ్వా ల్సిన అవసరం లేకుండా లక్కీ కూతురి పెళ్లి జరిపించడం, ఆ ఇంటిని మళ్లీ జాహ్నవికి అప్పగించడం జరుగుతుంది.
 
చెప్పుకోడానికి ఇది కథ. కానీ ఇందులో ఉన్న డెప్త్ రాస్తే కాదు, చూస్తే తెలుస్తుంది. పుస్తకాలు చదివినంత మాత్రాన గాంధీ ప్రత్యక్షమైపోతాడా అనుకోవచ్చు. కానీ దానికీ ఓ చక్కని లాజికల్ ఆన్సర్ ఇచ్చారు హిరానీ. మున్నాభాయ్‌కి గాంధీజీ ప్రత్యక్షమవడం అనేది అతని హాలూసినేషన్. మతి భ్రమణం వల్ల అతనలా గాంధీజీతో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ఆ విషయం మనకే కాదు, హీరో మున్నాభాయ్‌కీ అర్థమయ్యేలా చేసేందుకు మీడియా సమక్షంలో డాక్టర్లతో నిరూపణ అయ్యేలా చేశారు ఓ సన్నివేశంలో.
 
ఇదే హెల్యూసినేషన్‌ని చివర్లో కామెడీ కోసం వాడుకున్నారాయన. లక్కీసింగ్ పరివర్తన చెందాక గాంధీజీని చూడాలన్న ఆశతో అదే లైబ్రరీకి వెళ్లి గాంధీజీ గురించి చదువుతాడు. ఆయన ప్రత్యక్షం అవ్వగానే ఫొటో దిగాలని ట్రై చేస్తాడు. ఆ తర్వాత, అంటే చిత్రం ఆఖరులో గాంధీ ఇచ్చే సందేశం ఎంతో విలువైనది. ‘‘నాకు గౌరవం ఇవ్వడం అంటే, నా విగ్రహాలు పెట్టి, నోట్ల మీద నా ముద్ర వేయించి, రోడ్లకి, కాలనీలకి నా పేర్లు పెట్టడం కాదు. నన్ను మనసులో నింపుకోవడం, నేను పాటించిన మార్గాన్ని కష్టమైన సహనంతో అవలంబించడం, నేను కలలుగన్న భారతావనిని తీర్చిదిద్దడంలో ప్రతి భారతీయుడూ నిర్మాణాత్మకంగా నడుం బిగించడం’’ అన్న ఆ మాటలు అందరూ మనసుల్లో నిలుపుకోవాల్సిన ఆణిముత్యాలు.
 
పాఠాల్లో చదువుకుని, పరీక్షలు రాస్తేనే గాంధీజీ గురించి మనకి తెలిసినట్టు కాదు. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని చెప్పేందుకు హిరానీ చేసిన ఓ అద్భుతమైన ప్రయత్నమే... ‘లగేరహో మున్నాభాయ్’. ఈ సినిమా చూస్తే నిజంగా గాంధీజీ సిద్ధాంతం ఏంటో, దాన్ని ఇవాళ్టి దైనందిన జీవితంలో ఎంత అందంగా పాటించవచ్చో తెలుస్తుంది. స్మరించుకోవడానికి గాంధీజీ దేవుడు కాదు. మనిషి మహాత్ముడు కావొచ్చు అనడానికి నిరూపణగా, నిర్వచనంగా నిలిచిన మనిషి.
 
కాబట్టి గాంధీజీ చదువుకునే చరిత్ర కాదు, ఆచరించే పాత్ర. అనుసరించాల్సి మార్గం. ఇది మనకి తెలియజెప్పిన రాజ్‌కుమార్ హిరానీ కూడా దర్శకుల్లో మహాత్ముడు. మంచితనం, మంచి మార్గం మాత్రమే సినిమాల్లో ప్రతిబింబించే గొప్ప సంస్కారమున్న దర్శకుడు, రచయిత. నవ సమాజ సంస్కృతీ వికాస నిర్దేశకుడు, మార్గదర్శకుడు. సామాజిక  కథాంశాలతో, మానవత, ఆర్ద్రత కలగలిపి... సెట్లు, గ్రాఫిక్కులు, భారీ తారాగణం, అంచనాలు పెంచే పబ్లిసిటీలు లేకుండానే వంద కోట్లు, రెండొందల కోట్లు, మూడొందల కోట్ల వసూళ్లు సునాయాసంగా చేసే కమర్షియల్ చిత్రాలను నిర్మాతలకి అందించిన మేటి దర్శకుడు.
 
కళ్లు, చెవుల నుంచి పెద్ద మెదడుకి, అక్కణ్నుంచి గుండెకి ఒక ప్రయాణం చేసి... గుండెని తాకగానే అప్రయత్నంగా కళ్లల్లో నీరు ఉబికి వచ్చి చెంపని తడమడం ఎలా ఉంటుందో అనుభవించాలనుకుంటే ‘లగేరహో మున్నాభాయ్’ చూడండి. ఇది నిజం. గాంధీయిజమ్ అంత నిజం.ఇది అద్భుత జీవన సౌందర్యానికి రహదారి... ఇదే గాంధీగిరి!                           
- వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

మరిన్ని వార్తలు