ఎంచుకున్న సంకెళ్లు

2 Aug, 2015 04:44 IST|Sakshi
ఎంచుకున్న సంకెళ్లు

‘‘ఊరి నుంచి చంద్రం వచ్చి వెళ్లాడు’’ రామం ఇంట్లోకి అడుగుపెడుతూనే చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ చెప్పింది లక్ష్మి.‘‘అమ్మకెలా ఉందట?’’ సోఫాలో కూలబడుతూ అడిగాడు రామం. మనం జీవితంలో వేసే ప్రశ్నలలో చాలా వాటికి సమాధానం తెలిసే వేస్తాం. మన యాంత్రికమైన సంభాషణలకి అవి ఒక ఊతం మాత్రమే.‘‘ఎలా ఉంటుంది! ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోమంటే మన మాట వింటారా, ఆ ఆర్.ఎం.పి. డాక్టరు ఇచ్చే అరకొర మందులకి ఆవిడ ఉబ్బసం ఏం తగ్గుతుందీ! అలాగే ఉన్నారంట.’’రామానికి తెలుసు - ఆవిడ అలాగే ఉంటుంది, ఆ ఊళ్లోనే ఉంటుంది. జబ్బు తగ్గుతుందని తెలిసినా తమ దగ్గరికి మటుకు రాదు. కొడుకు బడ్జెట్‌కి మరింత భారం కాకూడదనో, కోడలితో వైరం ఎందుకనో, ఉన్న ఇంటిని వదులుకో లేకనో ఆవిడ గడప దాటదు. తనే వెళ్లి ఆవిడని కొన్నాళ్లు చూసుకునే తీరికా స్వతంత్రమూ రామానికి లేవు.
 
ఊరి నుంచి అందిన కబురుతో తల్లి అనారోగ్యం మళ్లీ వాస్తవికతలోకి రావడంతో రామం నిస్తేజంగా మారి పోయాడు. మళ్లీ అవే యాంత్రికమైన సంభాషణలూ, విశ్లేషణలూ, ఆలోచనలూ. మధ్యమధ్యలో అకస్మాత్తుగా ఏదో ఉపాయం స్ఫురణకు వస్తుంది. అంతలోనే అది ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదని తేలిపోవడంతో ఆ క్షణికోద్రేకం సడలిపోతుంది.
 ఆ రాత్రి భోజనాలు ముగిసి నిద్రకు సిద్ధమవుతుండగా, ‘‘లక్ష్మీ’’ అంటూ పిలిచాడు రామం. ఆ స్వరంలోని మార్దవాన్ని గ్రహించిన వెంటనే అర్థమైపోయింది లక్ష్మికి, అతనేదో నిర్ణయానికి వచ్చాడనీ, ఆ నిర్ణయంపై తన సమర్థనని కోరుకుంటున్నాడనీ!‘‘మరేం లేదు’’ తటపటాయిస్తూ మొదలుపెట్టాడు రామం- ‘‘అమ్మని ఎంతగా బతిమాలినా ఇక్కడికి రాదు. అక్కడ ఉంటే తన ఆరోగ్యం సవ్యంగా ఉండటం లేదు. అందుకని నెలనెలా ఓ రెండు వేలు తనకి పంపితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తనకొచ్చే బొటాబొటీ పింఛను ఏ మూలకీ సరిపోతున్నట్లు లేదు. ఏమంటావూ?’’ ఎటో చూస్తూ అడిగాడు రామం.
 
లక్ష్మికి తెలుసు, ఇటువంటిదేదో రామం నోటి వెంట వస్తుందని. ఎందుకంటే తమ జీవితాలలో చాలా సమస్యలకి పరిష్కారం డబ్బుతోనే ముడిపడి ఉంది. ఆప్యాయతలూ, అనుబంధాలూ, సంతుష్టి అని ఎన్ని కబుర్లు చెప్పినా అవన్నీ పూట గడిచిన తర్వాతే కదా! కానీ నెలనెలా రెండు వేలంటే ఎక్కడి నుంచి తెచ్చేది, ఇప్పటికే నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకు భవిత కోసం ఎన్నో వదులు కోవలసి వస్తోంది. అన్నీ మానుకుని జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా ఓ పేరాసెట మాల్‌తో సరిపెట్టుకుంటే గానీ నెలాఖరుకి ఓ రెండువేలు మిగలట్లేదు. అలాంటిది ఇంకో రెండువేలంటే ఎక్కడి నుంచి వస్తాయి! అందునా వయసు మీదపడిన ఆయన తల్లికోసం, ఎన్నటికీ వీడని ఆవిడ అనారోగ్యం కోసం, అవే రెండు వేలు తమ కొడుకు పేరున వేస్తే మరింత సద్విని యోగం అవుతాయి కదా! అరనిమిషం లోనే లక్ష్మి ఇదంతా ఆలోచించేసింది. కానీ దేన్నీ బయటకి అనలేదు. కొన్ని భావాలని ఉన్నవి ఉన్నట్లుగా వ్యక్తీకరించడానికి సంస్కారం అడ్డు వస్తుంది. అందుకనే లక్ష్మి, రామాన్ని మరోవిధంగా నిలువ రించడానికి ప్రయత్నించింది.
 
‘‘ఇప్పుడున్న పరిస్థితులలో నెలనెలా రెండువేలంటే ఎక్కడి నుంచి తేగలం!’’
‘‘కష్టమేననుకో’’ నిట్టూరుస్తూ బదులిచ్చాడు రామం. ‘‘కానీ ఒక్కో పద్దులోనూ కాస్త కాస్త పొదుపు చేస్తే సాధ్యమేననిపిస్తోంది.’’
 
ఏమీ మాట్లాడలేదు లక్ష్మి. దాంతో రామమే మళ్లీ అందుకున్నాడు.
‘‘పాలప్యాకెట్లూ, బియ్యం, కూరలు కాస్త చవక రకానివి తెచ్చుకుంటే నెలకి ఎంతలేదన్నా ఓ ఎనిమిదొందలు మిగులుతాయి. ఎలాగూ చలికాలం కాబట్టి ఫ్రిజ్ ఆఫ్ చేసి పారేస్తే ఓ రెండు వందలు కరెంటు ఆదా అవుతుంది, సెల్‌ఫోన్ కూడా అత్యవసరానికి తప్ప వాడ కుండా ఉంటే మూడు వందలు మిగుల్తాయి’’ ఆశువుగా చెప్పుకుపోతున్నాడు రామం, మధ్యలో ఆపేస్తే ఆ నిశ్శబ్దాన్ని భరించడం కష్టం. అసంతృప్తితో కూడిన ఆ నిశ్శబ్దాన్నీ ఆపై పెగిలే పొడిపొడి మాటలనీ చివరికెలాగూ భరించక తప్పదు.
 
‘‘నా బండి పక్కన పడేసి రోజూ బస్సులో ఆఫీసుకి వెళ్తే, నెలకో ఎనిమిది వందలన్నా ఆదా అవుతాయి, ఇహపోతే...’’ తటపటాయిస్తూ చివరి అంకానికి చేరుకున్నాడు రామం. ‘‘నీకా ఎలాగూ సీరియల్స్ చూసే అలవాటు లేదు, నాకేమో ఆదివారాలు తప్ప టీవీ చూసే తీరికుం డదు. అందుకని కేబుల్ కనెక్షన్ తీయించేస్తే రెండు వందలు మిగుల్తాయి. అంతగా బాబి గాడు మారాం చేస్తే ఓ కార్టూన్ సీడీ కొనిపెడితే సరిపోతుంది’’ అంటూ ముగించాడు.లక్ష్మి ఉలకలేదు, పలకలేదు. రామం చెప్పిన లెక్కల్ని మనసులో బేరీజు వేస్తూ కూడుకుంది - మొత్తం 2,300 రూ॥ఆ మిగతా మూడు వందలూ తనని ఊరించడానికే నని తెలుసు లక్ష్మికి. తనిప్పుడు అనాల్సిన మాటలేమిటో కూడా తెలుసు. ‘‘సరే మీ ఇష్టం!’’ అంటూ నిర్లిప్తంగా అటు తిరిగి పడుకుంది, ఆమె తన మనసులోని అసంతృప్తిని వెల్లడించకపోయినా ఈపాటికి తన కళ్లు చెమ్మగిల్లే ఉంటాయని రామానికి తెలుసు.
    
మర్నాడు ఉదయం బాబిగాడు పాలు తాగనని మారాం చేశాడు. కానీ పాలు పల్చబడ్డాయని మటుకు తెలుసుకోలేక పోయాడు. రామానికి కూడా టీ సయించలేదు గానీ ‘అదే అలవాటైపోతుందిలే’ అనుకుంటూ ఒక్క గుక్కలో తాగేసి నడుచుకుంటూ తన ఇంటికి దగ్గరలో ఉన్న బస్టాప్‌కి బయల్దేరాడు.వచ్చే బస్సూ, పోయే బస్సూ - అన్నీ కిటకిటలాడేవే! ఎప్పుడో ఓసారి తన బండికి రిపేరైతేనే, బస్సెక్కడానికి నామోషీ పడే రామానికి, ఇకపై రోజూ ఆ రద్దీలోనే ఇరుక్కుని ఆఫీసుకి వెళ్లాలన్న ఆలోచన ఇబ్బందికరంగా తోచింది. ఆ బస్సులో అందరూ తనబోటి మనుషులే - కానీ ఎందుకనో ఈవేళ తానొక మెట్టు దిగజారానన్న భావన, తను చేస్తున్న త్యాగం కంటే పడుతున్న ఇబ్బందే ఎక్కువేమోనన్న దుగ్ధ. ‘ అలవాటైపో తుందిలే’ అనుకుంటూ కళ్లు మూసుకుని బస్సు రాడ్డుకి వేలాడసాగాడు.
 
ఆ సాయంత్రం రైతుబజారు దగ్గర ఆగి ఏయే కూరలు చవగ్గా ఉన్నాయో వాకబు చేసి మరీ కొనుక్కుని ఇంటికి బయల్దేరాడు. ఈ లెక్కన తనకిష్టమైన బీన్స్ కానీ బాబిగాడికి ఇష్టమైన క్యారెట్లు కానీ ఇకపై కొనలేకపోవచ్చు. రామం ఇల్లు చేరుకునేసరికి ఇల్లంతా నిస్తేజంగా తోచింది. టీవీ శబ్దంతో ప్రతిధ్వనించే హాలు గోడలన్నీ మూగబోయి ఉన్నాయి. కందిరీగలా ఝంకారం చేసే ఫ్రిజ్ నిశ్చలంగా ఉంది - ఒక్క రోజులోనే ఎంతటి మార్పు. ఈ మార్పుని తాను నెలల తరబడి భరించగలడా! కష్టమే...
 
ఎందుకంటే కొద్దిరోజుల్లోనే అతని నూతన కార్యాచరణకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.
ఆ శనివారం సాయంత్రం రామం ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి దిగాలుగా కూర్చునుంది, ‘‘ఏమైంది?’’ ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ భయం భయంగా అడిగాడు రామం. ‘‘ఇంకా ఏం కావాలి, మీ పొదుపు మా ప్రాణాల మీదకి తెచ్చేట్లుంది’’ విసురుగా జవాబిచ్చింది లక్ష్మి. ఉపోద్ఘాతం లేకుండా పురాణం ప్రారంభమవదు కదా!‘‘బాబిగాడు మూడురోజుల నుంచీ సరిగా తిండి తినడం లేదు. ఆ ముతక బియ్యం వాడికి సయించట్లేదు. పైగా బడి నుంచి రాగానే ఫ్రిజ్‌లో నీళ్లు ఉండట్లేదని రోజూ అలుగుతున్నాడు. పనిమనిషి కూడా మీ టీవీ పనిచేయట్లేదేంటని రోజూ అడుగుతోంది’’ - అదీ అసలు సంగతి!
 
‘‘టీవీ పాడైపోయిందని చెప్పక పోయావా?’’ అనునయించాడు రామం.
‘‘అదీ అయ్యింది. దానికది ఏమందో తెలుసా! ‘‘మీకు కొత్త టీవీ కొనుక్కోవడం అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి. చెన్నైలో మా తమ్ముడు వాళ్లింట్లో పాత టీవీ ఒకటుంది. ఓ వేయి రూపాయలిస్తే దాన్ని తెప్పించి పెడతానంది.’’ఆ మాటలు విన్న రామానికి కూడా లక్ష్మి మనసులోని మంట తగులుకుంది. అసలే అటు ఆఫీసులో రామం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ప్రతి ఒక్కరూ ఎందుకని బండి వేసుకురావటం లేదని అడిగేవారే. బండి రిపేరులో ఉందని చెప్పగానే తమకి తోచిన సలహాలని ఇచ్చేవారే. ఇక వారం నుంచీ ఎవరికీ తనంతట తానుగా ఫోను చేయక పోవడంతో ‘ఇన్‌కమింగ్ రామం’ అంటూ ఓ మారుపేరు కూడా పెట్టేశారు.
 
‘‘ఈ ఒక్క నెలా ఓపిక పట్టు లక్ష్మీ! అంతగా అయితే వచ్చే నెల నుంచీ వేయి రూపాయలే పంపుదాంలే!’’ అంటూ ఆమె పక్క కూలబడ్డాడు. అలవాటు తప్పిన బస్సు ప్రయాణాలకి ఇంట్లో చికాకులు కూడా తోడవడంతో మోకాళ్లపై తల వాల్చుకుని నిస్సత్తువగా కూలబడి పోయాడు రామం. ఆలోచనాపరుల కోసం ఓ థింకర్ విగ్రహాన్ని రూపొందించినట్లే, మధ్య తరగతి మనుషుల కోసం ఓ విగ్రహాన్ని చెక్కాలనుకుంటే, దానికి సరిగ్గా సరి పోతుంది, రామం ప్రస్తుత భంగిమ.
 
ఇన్ని సర్దుబాట్లు చేసి నెలాఖరుకి ఎంతో కొంత కూడబెట్టినా, అనుకోని ఖర్చులు రానే వచ్చాయి. లక్ష్మి వాళ్ల అక్క, బావ రాకరాక సిటీకి రావడంతో, వాళ్లకి సిటీలోని పర్యాటక ప్రదేశాలన్నీ చూపించి ఓ పన్నెండు వందల రూపాయలతో వాళ్లిద్దరికీ బట్టలు పెట్టి పంపాడు రామం. అంత చేసినా తాము పెట్టిన బట్టలకి వాళ్ల మొహాలలో వెలుగే కనిపించకపోవడంతో ఉసూరుమనిపించింది.
    
‘‘మీ అమ్మగారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది’’  రామం ఇంటికి రాగానే అతని చేతిలోని కేరియర్‌ని అందుకుంటూ ఓ ఉత్తరాన్ని అతని చేతిలో పెట్టింది లక్ష్మి.తల్లి ప్రస్తావనతో రామం మనసు చివుక్కుమంది. ఈ నెల పంపుదామను కున్న డబ్బు ఇంకా పంపనే లేదు, వచ్చే నెలకి గానీ ఎంతో కొంత పంపే సావకాశం చిక్కేట్లు లేదు. తాను డబ్బు పంపుతానని అమ్మతో ఏమీ చెప్పలేదే! మరెందుకు రాసిందో ఉత్తరం అనుకుంటూ తెరిచి చదవసాగాడు. ‘‘రామానికి, మీ అమ్మ ఆశీర్వదించి రాయునది. చలికాలం దాటిపోవడంతో నా ఆరోగ్యం కాస్త కుదుటపడినట్లుగానే తోస్తోంది. అక్కడ నువ్వు, లక్ష్మీ, పిల్లవాడూ క్షేమంగానే ఉన్నారని తలుస్తాను. బాబిగాడి పుట్టిన రోజు కోసమని వాడికిష్టమైన సున్నుండలూ, జంతికలూ చేసి ఉంచాను. వాటిని చంద్రానికిచ్చి పట్నానికి పంపు తున్నాను. అదే చేత్తో ఓ ఐదు వందలు కూడా పంపుతున్నాను. వాటితో పిల్లవాడికి మంచి బట్టలు కొనగలవు. వీలు చూసుకుని మీరందరూ ఓసారి మనింటికి రండి. మీ ఆరోగ్యాలు జా...’’
 
చివరికి వచ్చేసరికి అక్షరాలు అలికి నట్లుగా అయిపోయాయి. తల్లి దయకి కళ్ల వెంబడి నీరు ధార కడుతుండగా సోఫాలో వాలిపోయాడు రామం. రామంలో ఊహించని ఈ బేలతనానికి బిత్తరపోయి అతని చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని చదువుతున్న లక్ష్మి వంక చూస్తూ గద్గద స్వరంతో అన్నాడు రామం- ‘‘ప్రపంచీకరణ వలన మన మధ్యతరగతి ప్రజలంతా తెగ సుఖపడిపోతున్నారని, నాయకులూ, మేధావులూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు గానీ, నిజంగా మనమేం బావుకుంటున్నాం చెప్పు! ప్రతి వ్యక్తీ తన జీతానికి అనువైన చట్రంలో బిగుసుకుని పోతున్నాడు. అవసరానికీ, విలాసాలకీ మధ్యనున్న సరిహద్దులు అతి సులువుగా చెరిగిపోతున్నాయి.
 
ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో, లేక తనే ఆ విలాసాలకి అలవాటుపడో ఉన్న స్థాయి నుంచి ఒక్క మెట్టు కూడా కిందకి దిగలేని నిస్సహాయతలో ఉన్నాం. కార్పొరేట్ చదువులూ, ఏసీలు, కార్లూ, హోటల్ తిళ్లూ, ఎల్‌ఈడీలూ, ఇంటి లోన్లూ... అంటూ ఎవరి రాబడికి తగ్గట్టు వాళ్లు ఖర్చుపెట్టక తప్పట్లేదు.’’లక్ష్మికి అతడిని ఎలా సముదాయిం చాలో తోచలేదు. తనలోని బాధే వేరొక రిలో వ్యక్తమవుతున్నప్పుడు ఎలా సముదా యించగలదు? కానీ అతనికి సాంత్వన కలిగేట్లు ఒక్కమాట మటుకు అనగలిగింది - ‘‘వచ్చేవారం వెళ్లి ఆవిడతో ఓ రెండు రోజులు గడుపుదాం. ఇక్కడికి వచ్చి ఉంటారేమో మరోసారి అడిగి చూద్దాం!’’
కానీ ఆ పైవారం ఆడిట్ పని మొదలవ్వడంతో ఆ ఊసే మర్చిపోయారంతా!
కె.ఎల్.సూర్య

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు