లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు

18 Sep, 2016 00:10 IST|Sakshi
లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు

హెల్త్ ల్యాబ్
లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు గోడమీద ఎర్రగా ఫోకస్‌లా పడుతుండే ‘లేజర్ పాయింటర్’తో పిల్లలు ఆడుకుంటూ ఉండటం తరచూ చూస్తుంటాం. సాధారణంగా మీటింగ్స్‌లో ఏదైనా విషయాన్ని వివరించేందుకు దీన్ని ఒక ‘పాయింటర్’ను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఇది అంత కీడు చేయదని అందరిలోనూ ఒక భావన. అయితే ఈ ‘లేజర్ పాయింటర్’ పిల్లల చూపును దెబ్బతీయవచ్చని ఇటీవల కొన్ని కేసుల అధ్యయనం తర్వాత తెలిసింది. ఈ పాయింటర్ నుంచి వచ్చే కాంతి రెటీనాను దెబ్బతీస్తుందని అమెరికాలోని మిన్నెయాపోలిస్‌కు చెందిన కంటివైద్య నిపుణుడు డాక్టర్ డేవిడ్ అల్మెడియా పేర్కొన్నారు.

గతంలో పదిలక్షల మందిలో ఒకరిలో మాత్రమే లేజర్ పాయింటర్ వల్ల కలిగే దుష్ర్పభావాలు కనిపిస్తాయని అనుకునేవారు. అయితే ఇటీవల ఒక అధ్యయనంలో వీరి సంఖ్య చాలా ఎక్కువని తేలింది. గతంలో లేజర్ పాయింటర్ నుంచి వచ్చే కాంతి 1 నుంచి 5 మిల్లీవాట్లు మాత్రమే ఉంటున్నందున ఇది కంటికి అంతగా ప్రమాదం చేయదని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ కాంతి వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఇటీవలి అధ్యయనాలలో తేలింది.

‘‘ఇటీవల ఇలాంటి పాయింటర్‌లను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో అవి తేలిగ్గా లభ్యమవుతున్నాయి. వాటిపై అదుపు కూడా ఏమీ లేదు. దాంతో ఇలా రెటీనాపై దుష్ర్పభావం పడ్డ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అంటున్నారు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్‌కు చెందిన బ్లాంటన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్తాల్మాలజీ విభాగం డిప్యూటీ చైర్‌పర్సన్ డాక్టర్ చార్మెస్ వైకాఫ్.

మరిన్ని వార్తలు