యాప్స్‌....యాప్సోయ్‌!

10 Feb, 2019 00:24 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

మీరు యాప్స్‌ ప్రియులా? అయితే ఇది చదవాల్సిందే!కాలంతో పాటు సరికొత్త యాప్స్‌ ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకుందామా మరి...మ్యాడ్‌ మూడ్‌:అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు సుబ్బారావు. మామూలుగానైతే  వాళ్లావిడ ద్వారం దగ్గర నిల్చొని చిరునవ్వుతో స్వాగతం పలుకుతుంది.ఈరోజు మాత్రం అలాంటి సీన్‌ కనిపించలేదు.‘‘శైలూ...’’ అని ఇంట్లోకి వస్తూ ప్రేమపూర్వకంగా అరిచాడు సుబ్బారావు.‘‘ఎందుకలా చెవి కోసిన మేకలా అరుస్తావు. ఏమైంది?’’ అని గద్దించింది శ్రీమతి శైలజ.గతుక్కుమన్నాడు సుబ్బారావు. అయినా ఆ గతుక్కును బయటపడనివ్వకుండా కూల్‌గా...
‘‘ఏం లేదు శైలూ... బయట వాతావరణం కూల్‌గా ఉంది. సన్నగా వర్షం. రొమాంటిక్‌గా ఉంది. ఇప్పుడు నువ్వు పకోడీ చేసి పెడితే తినాలని ఉంది డియర్‌. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు తింటే...నా సామిరంగా...’’ అని లొట్టలు వేశాడు సుబ్బారావు.‘‘ఎప్పుడూ తిండి గోలే. ఏం మనిషో ఏందో’’ గట్టిగా విసుక్కుంది శ్రీమతి శైలజ.మళ్లీ గతుక్కుమన్నాడు సుబ్బారావు. అప్పుడు అతనికి వారం క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

సేమ్‌ టు సేమ్‌. ఈరోజులాగే ఉంది వాతావరణం. సుబ్బారావు ఇంటికి రాగానే...‘‘యావండీ....బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వేడి వేడి పకోడీలు చేసి పెడతాను తింటారా?’’ అని గోముగా అడిగింది. ‘‘అంతకంటే భాగ్యం ఏముంది డియర్‌. పూర్వజన్మ సుకృతం ఉంటేగాని నీలాంటి భార్య దొరకదు’’ అంటూ మేఘాల్లో తేలిపోయాడు సుబ్బారావు.మరి అలాంటి శైలూకు ఈరోజు ఏం అయింది?ఎందుకిలా బిహేవ్‌ చేసింది?వాళ్ల అమ్మ ఏమైనా నూరిపోస్తో్తందా? వాళ్ల అక్క ఏమైనా తప్పుదోవ పట్టిస్తోందా... ఇలా పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు సుబ్బారావు.నిజానికి అతడి అనుమానాల్లో ఏ ఒక్కటీ నిజం కాదు.ఆమె మూడ్‌ బాగోలేదు...అన్నది మాత్రమే నిజం.ఆమె మూడ్‌ బాగోలేకపోవడానికి....తలనొప్పి మాత్రమే కారణమన్నది నిజం!భార్య మాత్రమే కాదు భర్త కూడా అప్పుడప్పుడూ అదుపు తప్పిన లారీలా ప్రవర్తించవచ్చు. అకారణంగా అరవవచ్చు. అంతమాత్రాన....అతడికి భార్య మీద ప్రేమ లేదని కాదు....మూడ్‌ బాగోలేదని!భార్యాభర్తల మధ్య లేనిపోని తగాదాలు రావడానికి సైద్ధాంతిక కారణాలు, వ్యూహాత్మక కారణాలు ఏవీ ఉండవని ‘లకోట బకోట’ స్టడీ సర్కిల్‌ సర్వే క్లియర్‌గా చెప్పింది.‘ఇప్పుడు నా భార్య మూడ్‌ ఎలా ఉంది?’ అని భర్త–‘ఇప్పుడు నా భర్త మూడ్‌ ఎలా ఉంది?’ అని భార్య....సమయానుకూలంగా వ్యవహరిస్తే దంపతుల మధ్య అసలు సమస్యలే ఉండవు అంటుంది ‘లోకోట బకోట’ స్టడీ.‘‘చాల్లేవయ్యా చెప్పొచ్చావు! వాళ్ల మూడ్‌ ఎలా ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది?’’ అని మీకు డౌటు రావచ్చు!...ఇలాంటి సమయంలోనే మీకు కావాలి సరికొత్త యాప్‌: మ్యాడ్‌ మూడ్‌ ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మన పార్ట్‌నర్‌ మూడ్‌ ఎలా ఉందనేది  మూడు గంటల ముందే తెలుస్తుంది.ఉదా: మీ ఆవిడకు తలనొప్పిగా ఉంది...బీ కేర్‌ ఫుల్‌! మీ ఆయన ఆఫీసులో గొడవ పడి ఇంటికి వస్తున్నాడు...బీ కేర్‌ ఫుల్‌!డౌన్‌లోడ్‌ లింక్‌: https//mad-mood.app//జంప్‌ జిలానీ:అప్పు చేయని వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారో చెప్పండి! అప్పు చేయడం తప్పు కాదు. అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోలేకపోవడమే అసలు తప్పు. అదేంటోగానీ ఊళ్లో ఎటు వెళ్లినా అకారణంగా అప్పు ఇచ్చిన వాడే ఎదురుపడుతుంటాడు. దీంతో ఇల్లు దాటి బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. అలాగని అస్తమానం ఇంట్లో కూర్చోలేం కదా. ఇలాంటి కష్టాలు తీర్చడానికి వచ్చిన సరికొత్త యాప్‌ ‘జంప్‌ జిలానీ’ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ఊళ్లోనే ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? మనకు ఎంత దూరంలో ఉన్నాడు....మొదలైన వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.డౌన్‌లోడ్‌ లింక్‌:htgt//pdm.app.kd/పెదవి దాటని మాటొకటుందీ:కొందరు ఉంటారు. మాటలొకటి చెబుతాయి. కళ్లు ఒకటి చెబుతాయి.ఉదా:‘‘ ప్రపంచంలో నిన్ను తప్ప ఎవరినీ నమ్మను’’ అంటాడు ఒకడు.కళ్లు మాత్రం...‘‘నిన్ను తప్ప అందరినీ నమ్ముతాను’’ అంటాయి.‘‘చక్కనయ్య చిక్కినా అందమే...మీరు బరువు తగ్గి స్లిమ్‌ కావడం బాగుంది’’ అంటాడు ఇంకొకడు.

కళ్లు మాత్రం...‘‘అస్థిపంజరానికి సూటూ బూటూ వేసినట్లున్నావ్‌. ఏడ్చినట్లున్నావ్‌’’ అంటాయి. ఎదుటి వ్యక్తి మనసులో మాటను కనిపెట్టడానికి మనమేమీ దేవుళ్లం కాదు కదా! అలా అని మీరేమీ దేవుళ్లు కానక్కర్లేదు...‘పెదవి దాటని మాటొకటుందీ’ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు... ఎదుటి వ్యక్తి నిజం మాట్లాడుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా? అసలు అతడి మనసులో మాటఏమిటి....మొదలైనవిషయాలు క్షణాల్లో తెలిసిపోతాయి.డౌన్‌లోడ్‌ లింక్‌: htkts//jump gilani.app//సహజంగానే మనం భోజన ప్రియులం. మంచి ఫుడ్‌ దొరికితే లా....గిం...చేస్తూనే ఉంటాం. మన మీద ప్రేమ వల్లో, మొహమాటం వల్లో ‘తిన్నది చాలు. ఇక ఆపండి’ అని ఎవరు చెప్తారు. ఇలాంటి సమయంలోనే మీకు కావాలి ‘ఛస్తావురోయ్‌’ యాప్‌. ఇది  ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎంత తినాలో  కాదు...ఎంత తినకూడదో  తెలిసిపోతుంది.
– యాకుబ్‌ పాషా 

మరిన్ని వార్తలు