ఇస్మార్ట్‌ బఫెట్‌

8 Mar, 2020 10:56 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

వారెన్‌ బఫెట్‌ ఎవరు? అపర సంపన్నుడు. స్టాక్‌ ఎక్సేంజి శ్వాసను ఈజీగా పసిగట్టి విజయపథంలో దూసుకుపోతున్న అపరకుబేరుడు. అప్పు చేసైనా సరే, పప్పు కొనకుండా ‘స్మార్ట్‌ఫోన్‌’ కొనే జమానా ఇది.
స్మార్ట్‌ఫోన్‌ కొనడానికి బఫెట్‌ అప్పు చేయాల్సిన అవసరం లేదు... స్మార్ట్‌ఫోనేం ఖర్మ  ఏకంగా ‘సార్ట్‌ఫోన్‌ కంపెనీ’నే కొనగల సంపన్నుడు ఎన్నో సంవత్సరాల నుంచి సాదాసీదా ఫోన్‌నే వాడుతున్నాడు.
తన సింపుల్‌ ఫోన్, పరమ పాత ఫోన్‌ ప్రస్తావన వచ్చినప్పుడు– ‘‘అలెగ్జండర్‌ గ్రహంబెల్‌  దీన్ని కానుకగా ఇచ్చాడు’’ అని చమత్కరిస్తుంటాడు.

మరి అలాంటి స్మార్మ్‌ఫోన్‌ వ్యతిరేకి ఉన్నట్టుండి నెట్‌వర్క్‌ ఫిరాయించి, పాత సింపుల్‌ ఫోన్‌ను పక్కన పెట్టేసి ‘స్మార్ట్‌ఫోన్‌’ కొనేశాడు. వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచాడు.
‘వారెన్‌ బఫెట్‌కు ఉన్నట్టుండి స్మార్ట్‌ఫోన్‌ మీద ఎందుకు మనసు మళ్లింది?’
ఇదే విషయాన్ని భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు.
అప్పుడు విక్రమార్కుడు ఈవిధంబుగా ఆన్సర్‌ చెప్పాడు...
∙∙ 
స్వర్గంలో ‘అరు’ అనే అప్సరస ఉండేది.
ఆమెకు ఒకరోజు స్వర్గం మీద బోర్‌ కొట్టింది. గాలిలో మార్పు కోసం అలా భూలోకం వెళ్లాలనిపించింది.
‘జై భూలోక’ అని అరిచింది.
అంతే...ధగధగ మెరుస్తూ పుష్పకవిమానం ప్రత్యక్షమైంది.
‘‘అమ్మా  ఆర్డర్‌ ఇవ్వండి... ఏడు లోకాల్లో ఏలోకం వెళదాం’’ అని వినయంగా అడిగాడు డ్రైవరుడు.
‘‘భూలోకం తీసుకెళ్లు డ్రైవరా...’’ అని ఆజ్ఞాపించింది అరు.
‘‘అట్టాగే నమ్మా’’ అంటూ ఇంజన్‌ స్టార్ట్‌ చేశాడు డ్రైవరుడు.
 పట్టుమని పదినిమిషాలు కాకుండానే పుష్పక విమానం భూలోకం చేరింది.
∙∙ 
‘‘డ్రైవరోత్తమా... ఇది ఏ ప్రాంతం?’’ అని అడిగింది  అరు.
‘‘దీనిని యు.ఎస్‌ దేశం అందురు తల్లీ... యు.ఎస్‌లో ఇది ఒమాహ అను సిటీలోని వోల్డ్‌ మార్కెట్‌ ఏరియా’’ అని చెప్పాడు డ్రైవరుడు.
ఆ వోల్డ్‌ మార్కెట్‌ ఏరియాలో ఒక వ్యక్తి సమాజసేవ చేస్తూ కనిపించాడు.
‘‘డ్రైవరోత్తమా ఎవరా వ్యక్తి?’’ అని అడిగింది అరు.
‘‘అతని పేరు వారెన్‌ బఫెట్‌. మహా సంపన్నుడు. బిజినెస్‌మెన్, ఇన్వెస్టర్, దానాలు బాగా చేస్తుంటాడు. మన కుబేరుల వారి దగ్గర కంటే ఈతని దగ్గరే ఎక్కువగా ధనం ఉందట. అప్పుడప్పుడూ ఇలా సమాజసేవ చేస్తుంటాడు’’
బఫెట్‌ను చూడగానే ‘అరు’ లవ్‌లో పడిపోయింది.
∙∙ 
స్వర్గలోకానికి తిరిగివచ్చిన తరువాత ‘నువ్వేం మాయచేశావోగానీ...’ పాట ఆమెకు పదేపదే గుర్తుకువస్తోంది. ఎలాగైనా సరే బఫెట్‌ను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంది. డైరెక్ట్‌గా బఫెట్‌ దగ్గరకు వెళ్లి  ‘‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అంటే అతడికి కోపం రావచ్చు....‘‘ఈ వయసులో నాకు పెళ్లి ఏమిటి!’’ అని తిట్టవచ్చు.
అందుకని–
దేవుడి కోసం తపస్సు చేసింది.
రెండు రోజుల తరువాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఏమి కావాలో కోరుకో’’ అని అడిగాడు దేవుడు. అప్పుడు...
‘‘వారు...అనగా వారెన్‌ బఫెట్‌ నన్ను తదేకంగా చూస్తూ ఉండాలి’’
ఓకే!
‘‘నా కళ్లలో కళ్లు పెట్టి చూస్తుండాలి’’
ఓకే!
‘‘నేను తప్ప  ఆయనకు మరో లోకం ఉండకూడదు’’
‘‘ఓకే’’
‘‘ఆయన నిద్ర నించి లేవగానే నా ముఖమే చూడాలి’’
‘‘ఓకే’’
‘‘నా గొంతు వినబడగానే ఎలర్ట్‌ కావాలి’’
‘‘ఓకే’’
‘‘నేను పిలవకపోయినా పిలిచినట్లుగా భ్రమించాలి’’
‘‘ఓకే’’
‘‘నేను లేకుండా పక్క దేశానికి కాదు కదా....పక్కింటికి కూడా వెళ్లకూడదు’’
‘‘ నువ్వు కోరినవన్నీ ఫలిస్తాయి తల్లీ’’ అని మాయమయ్యాడు దేవుడు.
వెంటనే అప్సరస అరు ‘స్మార్ట్‌ఫోన్‌’గా మారింది. వారెన్‌ బఫెట్‌ దగ్గరికి చేరింది.
శుభం
– యాకుబ్‌ పాషా 

మరిన్ని వార్తలు