దోచేవారెవరురా..!

7 Jul, 2019 08:20 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

తొలిసారిగా దేశంలోని దొంగలందరూ సమావేశమయ్యారు.
చారల టీషర్ట్‌ వేసుకున్న సీనియర్‌ దొంగ చోరకుమార్‌ మైక్‌ అందుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు...
‘‘దొంగమిత్రులందరికీ  దొంగాభివందనములు. దేశ నలుమూలల నుంచి వచ్చిన దొంగమిత్రులారా!... ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో తెలియజేయడానికి ముందు... తెలుగు సినీ పరిశ్రమకు మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం..’’
‘‘వాళ్లకు మన మీద ప్రేమ ఎందుకుంటుందండీ బాబూ... నారు పోశారా?  నీరు పోశారా?  బీరు పోశారా... కనీసం కల్లు అయినా పోశారా?’’ పాయింట్‌ లేవనెత్తాడు వర్ధమాన దొంగ రాకెట్‌కుమార్‌.
‘‘ప్రేమ లేదని ఎందుకనుకోవాలి. ఎన్నో సినిమాలకు మన పేర్లు పెట్టుకున్నారు.  మచ్చుకు కొన్ని...’’ అంటూ ఇలా లిస్ట్‌ చదివాడు చోరకుమార్‌.
దొంగ
దొంగలకు దొంగ
దొంగ మొగుడు
దొంగల దోపిడి
దొంగ రాముడు
దొంగపెళ్లి
దొంగలు బాబోయ్‌ దొంగలు
దొంగోడొచ్చాడు
దొంగగారు స్వాగతం
యమదొంగ
అమ్మదొంగా
మంచిదొంగ
జేబు దొంగ
అడవి దొంగ
కొండవీటి దొంగ
టక్కరి దొంగ
ఘరానా దొంగ
భలే దొంగ
ఇద్దరు దొంగలు
తోడు దొంగలు...’’
‘‘సరే...ఈ పేర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే... ఇన్నాళ్లుగా మనం అసంఘటిత రంగంలో ఉన్నాం. ఇప్పుడిక సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. మన హక్కుల్ని సాధించుకోవాలి... అవి సాధించుకోవాలంటే మనకంటూ ఒక జాతీయసంఘం ఉండాలి. మన తొలి జాతీయ మహాసభ వచ్చేవారం బిహార్‌లోని చోర్‌గంజ్‌లో జరుపుకోబోతున్నాం. ఆ సభలలో కొన్ని తీర్మానాలు చేయడం, ప్రతిభావంతులైన దొంగలకు సన్మానం చేయడం, ప్రతిభా పురస్కాలరాలను ఇవ్వడం, లేటెస్ట్‌ దొంగ గాడ్జెట్స్‌ను పరిచయం చేయడం జరుగుతుంది’’ అని ప్రకటించాడు చోరకుమార్‌.

బిహార్‌లోని చోర్‌గంజ్‌.
దేశం నలుమూలల నుంచి దొంగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకుడు డొనాల్డ్‌ థీఫ్‌ మైక్‌ అందుకున్నాడు...
‘‘మిత్రులారా... అనివార్యకారణాల వల్ల విజయ్‌మాల్యా, నీరవ్‌ మోడీలు ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. సభ జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు. వారు స్వదేశానికి రాగానే మన సంఘంలో గౌరవ పదవులు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు మన సభ తరపున కొన్ని తీర్మానాలు చదువుతాను...
► స్కూళ్లలో దొంగతనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
► సాటి విద్యార్థుల పెన్నులు, బుక్స్, బ్యాగ్‌లు కొట్టేసే చిన్నారి దొంగలకు ఉపకార వేతనాలు ఇవ్వాలి.
► అత్యుత్తమ దొంగలకు ప్రతి యేడు ‘దొంగశ్రీ’ అవార్డ్‌లు ప్రకటించాలి.
► వయసు మీద పడిన దొంగలకు ఫించన్‌లు ఇవ్వాలి.
ఒకటా రెండా... ఇలా ఎన్నో తీర్మానాలను ఆమోదించారు.
తరువాత ‘అత్యుత్తమ దొంగ’ అనే కార్యక్రమం మొదలైంది... దొంగల్లోని అరుదైన ప్రతిభావిశేషాలను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
‘‘ఈయన పేరు ఏబీసీడీ. స్క్రిన్‌ నేమ్‌ లాగా ఇది ఈయన చోర్‌ నేమ్‌. 24 గంటల్లో 84 చోరీలు చేసి దొంగీస్‌ రికార్డ్‌ల్లోకి ఎక్కాడు’’
‘‘ఈయన పేరు ఘోటక బ్రహ్మచారి. పేరు చూసి మోసపోవద్దు. ఇప్పటి వరకు పదికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. మామూలుగానైతే పెళ్లిళ్లలోకి బయటివారు దూరి  దొంగతనం చేస్తారు. కాని ఈ బ్రహ్మచారి మాత్రం... తన పెళ్లికి వచ్చిన అతిథులను నిలువుదోపిడీ చేస్తాడు. ఎంత కొమ్ములు తిరిగిన డిటెక్టివ్‌ అయినా...పెళ్లికుమారుడిని పొరపాటున కూడా అనుమానించడనేది ఇతని సిద్ధాంతం. ఈ థియరీకీ కళ్యాణం కట్‌ కట్‌... అనే పేరు కూడా పెట్టాడు.’’

ఇలా కొన్ని పరిచయాలైన తరువాత...
‘‘మన దొంగల్లో సైంటిస్ట్‌లు ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన పేరు టెక్‌ శ్రీను. మన దొంగజాతి కోసం ఎన్నో ఉపకరణాలు తయారుచేశాడు. ప్రసుత్తం సంచలనాత్మకమైన, చరిత్రను తిరగరాసే మెషిన్‌ను తయారు చేశాడు.
ఇదిగో... ఫ్రిజ్‌లా కనిపిస్తున్న దీని పేరు ‘జాం ఝటక్‌ హాం ఫటక్‌’.
 ఈ మెషిన్‌తో ఇంట్లో కూర్చొనే, కడుపులో చల్ల కదలకుండా ఎంచక్కా దొంగతనాలు చేసుకోవచ్చు.
చిన్న దొంగతనాలైతే... గంటకు అయిదు,
ఒక మాదిరి దొంగతనాలైతే... గంటకు రెండు.
పెద్ద దొంగతనాలైతే... రోజుకు రెండు చొప్పున చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ మెషిన్‌ను వేలం వేస్తున్నాం. అయితే ఎంత ఎమౌంట్‌ అయితే పాడుతారో ఆ మొత్తాన్ని ఒక కవర్‌లో వేసి, తమ పేరు రాసి అప్పటికప్పుడు ఈ మెషిన్‌ మీద పెట్టాలి’’ అని పాట మొదలుపెట్టాడు పరిచయకర్త.
‘నా పాట కోటి నలభై అయిదు లక్షలు’ అని పాడి ఆ మొత్తాన్ని పెద్దసంచిలో వేసి ‘జాం ఝటక్‌.. హాంఫటక్‌’ మెషిన్‌ మీద పెట్టాడు బెంగాల్‌ నుంచి వచ్చిన డొంగర్‌ బెనర్జీ.
‘నా పాట రెండు కోట్ల నలభై లక్షలు’ అని పాడి అట్టి మొత్తాన్ని గోనెసంచిలో వేసి మెషిన్‌ మీద పెట్టాడు రాజస్థాన్‌ నుంచి వచ్చి చోర్‌లాలాచౌహాన్‌.
పాట పదికోట్లు దాటి ఆగిపోయింది.
ఈలోపు కరెంట్‌ పోయింది.
కొద్దిసేపట్లోనే పోయిన కరెంట్‌ వచ్చింది.
కానీ ‘జాం ఝటక్‌’ మెషిన్‌ను కనిపెట్టిన టెక్‌ శ్రీను మాయమయ్యాడు.
ఆయన కనిపెట్టిన మెషిన్‌ మాయమైంది. ఆ మెషిన్‌పై ఉన్న డబ్బు మాయమైంది.
సభ గందరగోళమైంది!
– యాకుబ్‌ పాషా

మరిన్ని వార్తలు