ఆపరేషన్ తర్వాత... మర్చిపోతున్నాను...

14 Aug, 2016 00:01 IST|Sakshi
ఆపరేషన్ తర్వాత... మర్చిపోతున్నాను...

సందేహం
 
నా వయసు 22. నాకు నాలుగు నెలల బాబు ఉన్నాడు (ఆపరేషన్ అయింది). బ్యాంకు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. కానీ ఆపరేషన్ తర్వాత ప్రతి చిన్న విషయం మరిచిపోతున్నాను. ఇలాంటి సమయంలో నేను ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వచ్చా. దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే... నాకు, మావారికి సరైన సెక్యూర్డ్ జాబ్ లేదు. అందుకే నా ఈ మతిమరుపు తగ్గడానికి పరిష్కారం చెప్పండి ప్లీజ్.   - లక్ష్మీకాంతం, ఊరు పేరు రాయలేదు  
కాన్పు తర్వాత బాబు పనులు, ఇంటి పనులలో బిజీగా ఉండటం వల్ల ఏకాగ్రత సరిగా లేకపోవడంతో కొన్నిసార్లు జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. బాబుకు పాలు ఇవ్వడం, మిగతా పనుల వల్ల నీరసించడం, బలం లేకపోవడం, విటమిన్స్ లోపం వల్ల కూడా కొద్దిగా తాత్కాలికంగా మతిమరుపు ఏర్పడవచ్చు. ఇద్దరికీ మంచి జాబ్ లేదనే అభద్రతా భావం వల్ల కూడా అన్నీ మరిచిపోయినట్లు అనిపించొచ్చు. అందుకే కంగారు పడకుండా... మొదట సరైన పౌష్టికాహారం, అవసరమైన విశ్రాంతి తీసుకుంటూ దృఢ నిశ్చయంతో మెల్లిగా పరీక్షకు ప్రిపేర్ అవ్వడం ప్రారంభించండి. అప్పుడు తప్పకుండా పరీక్షల్లో సఫలీకృతులవుతారు. బాబును చూసుకోవడంలో మీ వారిని కూడా సహాయం చేయమని చెప్పండి. దానివల్ల మీకు కొద్దిగా స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి పూర్తిగా చదువుకోవడంపై దృష్టి పెట్టవచ్చు.
 
 నా వయసు 36. ఒక బాబు ఉన్నాడు. వాడి వయసు పదకొండేళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. కానీ మొదటి నుంచి రెండు మూడు రోజులకు మించి బ్లీడింగ్ అవ్వదు. బాబు పుట్టడానికి కూడా అది సమస్య కాలేదు. పీరియడ్స్ సమయంలో నాకెప్పుడూ నొప్పి కూడా ఉండేది కాదు. అయితే రెండు నెలల నుంచి పొత్తి కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదిస్తే స్కానింగ్ చేశారు. రిపోర్ట్‌లో  నా గర్భాశయంలో 2 సె.మీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఆ రిపోర్ట్ చూశాక... మళ్లీ డాక్టర్‌ను కలవలేదు. ఎక్కడ ఆపరేషన్ చేయాలంటారేమోనని భయంగా ఉంది. దయచేసి పరిష్కారం చెప్పండి.     - జయ, తెనాలి
రెండు నెలల నుంచి పొత్తి కడుపులో నొప్పి రోజూ ఉంటుందా లేక పీరియడ్స్ సమయం లోనే ఉంటుందా అనే విషయాన్ని మీరు సరిగా రాయలేదు. 2 సె.మీ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్‌కి ఆపరేషన్ అవసరం లేదు. మీ కడుపులో నొప్పి తప్పనిసరిగా ఫైబ్రాయిడ్ వల్లే అవ్వాలని ఏమీ లేదు. మీకు పొత్తి కడుపులో నొప్పి కేవలం పీరియడ్స్ సమయంలోనే ఉంటే.. ఆ రెండు మూడు రోజులు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. మిగతా రోజులు కూడా నొప్పి ఉంటే, మూత్రంలో ఇన్‌ఫెక్షన్, గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరీక్షల ద్వారా తెలుసుకొని, తగిన చికిత్స తీసుకోండి. 6 నెలలకు ఒకసారి స్కానింగ్ చేయించుకొని ఫైబ్రాయిడ్ పరిమాణం ఇంకా పెరుగుతుందా లేదా అనేది తెలుసుకోవడం మంచిది. పరిమాణం బాగా ఎక్కువగా పెరుగుతూ, పీరియడ్స్ సమయంలో నొప్పి పెరుగుతూ, బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటేనే ఆపరేషన్ గురించి ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా విడుదలైన మందుల ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గే అవకాశం ఉంది.
 
 
బాబుకు పాలు ఇవ్వడం, మిగతా పనుల వల్ల నీరసించడం, బలం లేకపోవడం, విటమిన్స్ లోపం వల్ల కూడా కొద్దిగా తాత్కాలికంగా మతిమరుపు ఏర్పడవచ్చు.
 
డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు