వేట మొదలైంది..

18 Aug, 2019 10:27 IST|Sakshi

ఈవారం కథ

చీకటి.
కాటుకలాంటి చీకటి.
పిరికివాడి భయంలా చిక్కగా ఉండి. అడవిలో నిశ్శబ్దం చూసుకొని మరింత నల్లగా నవ్వుతోంది. ప్రమాద పరిస్థితిలో పసివాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి.
మొహం చెల్లక, కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడా మిణుగురులతో ఇకిలిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనబడి మాయమవుతున్నాయి.
మంచు కురుస్తోంది.
చలి కరుస్తోంది.
గాలి సన్నగా, వాడిగా రంపపు కోతలా ఒరుసుకుపోతోంది. చెవుల మీద నుంచి చోటు దొరికిన చోటాల్లా గాఢంగా గుచ్చుకుంటోంది. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయి...భయం...భయంగా....
ఇలకోడి ఎగురుతాళంలో కూస్తోంది.
భయసందేహాల వల్ల లయ లేకుండా పడుతున్న మా అడుగుల సవ్వడిని కాబోలు ఆగి ఆగి అలకిస్తోంది.
మెయిన్‌రోడ్డు మీద నడిచిన అలవాటు వల్ల కాబోలు దారి నిండా ఇన్ని గతుకులేమిటని విసుక్కుంటున్నాయి పాదాలు.
వెనక మేమున్నామన్న ధీమాతో బ్యాటరీలైటు కాంతికిరణం ఒకటి మా ముందు చెంగు చెంగున ఎగురుతూ పోతోంది. సాక్షాత్తు మృత్యువులాంటి పెద్దపులులు పచ్చటి ఎర్రటి కనుపాపలు పెద్దవి చేసుకొని  ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదలలోకి కూడా తొంగి చూసి వస్తోంది ఆ కిరణం.
ఒక్క క్షణం ఆగాను. ఇంత చలిలోనూ కూడా చిరుచెమట పోసింది నొసట...అలసట చేత...భయం చేత కూడాను. రుమాలుతో మొహం తుడుచుకొని డబుల్‌ బారెల్‌ గన్‌ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను. ఆటవిక నిశ్శబ్దం నన్ను చెవిటివాణ్ణి చేసింది.
నా వెనక వస్తున్న నా మిత్రుడు పొడిదగ్గాడు.
ఉలిక్కిపడ్డాను.

‘ఊ?’’ అన్నాను వెనక్కితిరక్కుండానే.
‘అబ్బే’ అన్నాడు అతడు.
‘చలా?’
‘ఉహు’
‘‘భయమెందుకోయ్‌’’ అన్నాను భయం అణుచుకుంటూ.
అతను నవ్వాడు–ధైర్యం తెచ్చుకొంటూ (అతనికిదే తొలిసారి)
నాది భయమా?
భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి?
ధైర్యముంటే అతనెందుకు భయపడాలి?
మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి?
అడవిలో పులులు ఎందుకు ముందుకురావు?
చీకటి నిశ్శబ్దంలో, నిశ్శబ్దం చీకట్లో ఎందుకు దాక్కున్నాయి? కుట్ర చేస్తున్నట్లుగా ఎందుకు నిశ్శబ్దం? పొంచి ఉన్న ఈ ‘ప్రమాదాల’ మధ్య, మృత్యుపరికరాల మధ్య, అణగి ఉన్న ఈ ప్రకృతిశక్తి చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత?
అణువంత.
కాని అణువులోని శక్తి ఎంత?
ఆ సంగతి తెలిసే ధైర్యముగా అడవిలోకి ఆరుమైళ్ళ దూరం వచ్చానా?
ఏ ధైర్యం నన్ను ముందుకు నడిపించింది? స్వతహాగా పిరికివాణ్ని గదా...చేతిలో తుపాకి ఉన్నదన్న ధైర్యంతో కాబోలు. కాని ‘మృత్యువు’ గాండ్రుమని గర్జించి మీదికి లంఘించినప్పుడు ఎదిరించి కాల్చే సాహసమెంత?
ఈ రంగారావులో భయమూ వుంది. సాహసం ఉంది. భయం కోరి తెచ్చుకున్నది. సాహసం ఆవహింపజేసుకున్నది.
శత్రువు(?)ని కొట్టేవరకూ ‘ప్రమాదం’ ఎక్కడ పొంచి  ఎట్నించి మీద పడుతుందోనని భయం. ఆ భయం–అప్పటి ఉత్కంఠ ఒక అద్భుతమైన అనుభూతి. అనిర్వచనీయమైన సుఖం. అదే వేటగాడి కష్టానికి తెగింపుకూ ప్రతిఫలం. ప్రాణం పణంగా ఒడ్డి గెల్చుకున్న మధురఫలం. 
అందుకోసమే, ఆ భయం కోసమే, సుఖం కోసమే షికారీ వేటకెళ్తాడేమో.

‘‘ప్రమాదం తన పచ్చటి ఎర్రటి  కళ్ళతో అమేయమైన శక్తితో తన వేపు గురి చూసి ఉన్న తుపాకీకేసీ, ఆ వెనుక ఉన్న మనకేసి చూసి–గాండ్రుమంటూ అడవి జడుసుకేలా అరచి దూకినప్పుడు–
తుపాకి ట్రిగ్గర్‌ నొక్కి, అందులో నుంచి గుండు బయల్దేరి ముందుకు వెళ్తున్నప్పుడు–
పులిపంజా, తెరచిన నోరు, తొమ్మిది అడుగుల భారీ శరీరం, చిన్న తుపాకి గుండుకు ఎదురుగా వస్తున్నప్పుడు–
ఆ పులికీ, ఈ బుల్లెట్‌కీ భేటి కుదరకపోతే? ఆ అరక్షణం తరువాత ఏమి జరుగుతుందీ అని అర క్షణంసేపు షికారీ నరాలను మెలిపెట్టి దహించివేసే  విద్యుదాఘతంలాంటి ఆలోచన–
అదే భయం– ఆదే సుఖం– ఆ క్షణమే స్వర్గం– ఆ క్షణమే  భరింపరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూచిన ముహుర్తం.

సాధారణంగా వేటకు వెళ్తే మనం ఎక్కడో భద్రంగా కూర్చుని, పులి వచ్చే వరకూ కాసుకుని కొట్టేస్తాం. అది చూచినా దానికి అందని పద్దతిలో ఉంటాం. విశాఖజిల్లా మన్యపా్రంతాలలో అడ్డతీగెల, ఎర్రకుండి, మర్రిపాకల అడవులలోనే, తూర్పుగోదావరిలో జిడ్డంగి, కాకరపాడు దగ్గర మంప వగైరా ప్రాంతాలలోనూ నేను నా మిత్రులు అప్పుడప్పుడు వేటకు వెళ్తునే ఉంటాం.
ఒకసారి అడ్డతీగలలో–పెద్ద వేటగాళ్లుతో పోల్చుకుంటే ఏమి అనుభవం లేని నాకు, అప్పటికి అనుభవం అనదగ్గ సంఘటన ఒకటి జరిగింది. భోజనాలు చేసి, జెర్కిన్‌లు బిగించి, స్వెట్టర్లు తొడిగి, మఫ్లరీలు చుట్టి ఒక జీపులో బయల్దేరాం నలుగురం.
రాత్రి పదకొండున్నర అయింది.
నేను ముందు సీట్లో కూర్చున్నాను తుపాకి దట్టించి.
గతుకుల్లో జీప్‌ నెమ్మదిగా వెళ్తోంది.

ఎదుట చీకటి. కాటికలాంటి చీకటి. అంతటా నిశ్శబ్దం. మధ్య మధ్య అపశ్రుతిగా ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి. ఇలకోడి ఎదురు తాళంలో కూస్తోంది. జీపు కారు శబ్దాన్నీ ఇవీ మిగతా నిశ్శబ్దమూ కలిసి మింగేశాయి కాబోలు, వినబడటమే లేదు.
అంతలో నా మిత్రుడు జీపుకు బ్రేక్‌ వేశాడు.
‘ష్‌’ అన్నాడు నిష్కారణంగా.
ఎదర 15 గజాల దూరాన చోటు తెరిపిగా ఉంది. జీపు హెడ్‌లైట్‌ల కిరణాలు నీరసించి మసకమారిపోతున్న చోట లీలగా జంతువు కదలిక కనిపించింది.
నేను ఆలోచించే స్థితిలో లేను. కొత్త ఉత్సాహం.
గబుక్కున తుపాకి గురి చేసి ట్రిగ్గర్‌ నొక్కాను.
అడవీ, నిశ్శబ్దమూ, నా గుండే, పొదల్లో కుందేళ్ళూ, చెట్ల మీద పక్షులు దడదడలాడిపోయాయి తుపాకి మోతకి.
ఒక్క క్షణం నిశ్శబ్దం.
అంతలో గర్జనలతో అరణ్యం మళ్ళీ మారుమోగింది.
నేను గబుక్కున జీపులోంచి కిందకు దూకాను. క్లియరింగ్‌ వేపు బయల్దేరాను.
నా మిత్రులు గట్టిగా వారించారు. వెనుక్కులాగారు, విదిలించుకుపోయాను. నిజానికి అది చాలా మూర్ఖమైన పని...అని ఇప్పుడు తెలుసు. ఆచూకీ తెలియకుండా పొంచి ఉన్నప్పుడు అలా దిగిఅటు వేపు పోకూడదు.

నేను మొండిధైర్యంతో–బహుశా అది అజ్ఞానం వల్ల నిలబడ్డ ధైర్యంతో అనుకొంటాను–అలా ముందుకు పోతున్నాను.
వెనకాల జీపు వస్తోంది నెమ్మదిగా పది అడుగుల తరువాత ఆగిపోయినట్టుంది. నేను వెనక్కి చూడలేదు.
తుపాకిని పొజిషన్‌లో పట్టుకొని  దాని మీద క్లాంప్‌ వేసిన లైట్‌ను వెలిగించి సర్వేంద్రియాలకూ హెచ్చరిక చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకా ముందు వెళ్లాను.
నేల మీద ఒకచోట నల్లటి డాగు కనబడింది. పెద్ద డాగు. ఆగి పరీక్షగా చూశాను. రక్తం.
అంత భయంలోనూ గర్వం. గురి తప్పక కొట్టగలిగానని. ఆనందంతో గర్వంతో వెనక్కు చూశాను. అంతలోనే నేను ఉన్న స్థితి గుర్తుకు వచ్చింది.
చిరుతపులి నాకు కుడివైపు నుండి ఎడమవైపుకు పోతూ ఉండగా కొట్టాను. బహుశా దెబ్బతిని ఎదర ఉన్న పొదలలోకి దూకి ఉంటుంది.
ఎక్కడా అలికిడి లేదు.
ఆయాసంగా ఊపిరి తీస్తున్న సవ్వడి కూడా లేదు–నాది తప్పు. క్లాంప్‌లాంప్‌ను పొదల మీదకు ప్రసరించి నెమ్మదిగా జరుపుతూ పరిశీలిస్తున్నాను.
అంతలో హఠాత్తుగా నా కుడి వైపు దగ్గరగా బాటరీలైటు కిరణం పడింది.

పరాకుగా ఉన్న వాడి పక్కన బాంబు పేలినట్లయింది. చిక్కటి చీకటిలో ఆ వెలుగు కిరణం అలా పగలడంతో గుండె ఝల్లుమంది. కదలకుండానే ఎటూ తిరక్కుండానే పక్కకు వాల్చి ఆ కిరణం కేసి చూశాను. అది నా పాదాల దగ్గర నుండి కుడివేపుకు వెళ్ళి మళ్లీ వెనక్కువచ్చి మళ్ళీ కుడివైపుకు వెళ్తోంది.
నాకేదో చెప్పాలని నానా హైరానా పడుతూ–నా వెనక జీపులోంచి నా మిత్రుడు వేస్తున్న లైటు అని తెలుసు. గట్టిగా అరవవచ్చుననీ తెలుసు. అరవడానికి కంఠం పెగల్లేదు.
ఒకడు అలా గాయపడ్డ జంతువును వెదుకుతూ ఉండగా వెనకనించి మరొకడు అలా లైటు వెయ్యకూడదు. అలా చేస్తే పొంచి ఉన్న జంతువుకు ఇతను స్పష్టంగా కనబడి పోతాడు.
అది ప్రమాదమని నా మిత్రులకు నా కన్న బాగా తెలుసు. గత్యంతరం లేకనే ఈ పని చేస్తూ ఉండి ఉండాలి.
నేను నిలబడ్డ చోటు వైశాల్యం పది చదరపు గజాల లోపు.
శాంతి కిరణాన్ని అనుసరిద్దామని ఆ వెంటే వెనక్కి తిరిగి, నా తుపాకీ మీద బాటరీ లైటు పొదలవైపు వేసి చూశాను. అంతే, ఇప్పుడంతా అర్థమైంది.
ఆలోపలే గుండె ఝల్లుమంది. క్షణంలో ఒళ్ళు కొయ్యబారి పోయింది. ఒక్కసారిగా నిడివడింది. అంత చలిలోనూ ముచ్చెమటలు పోసేశాయి. నా ఎదురుగుండా 20 అడుగుల దూరంలో పొద పక్కన కూర్చుని ఉంది–దెబ్బ తిన్న చిరుపుతి. దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది.
నాకేమీ తోచలేదు. ఆలోచనకు అవకాశమే లేదు.
నన్నెవరూ ఆ క్షణంలో ఆదుకోలేరు. కాపాడలేరు.

ఆ క్షణంలోనే ఒళ్లు తెలియకుండా ఆలోచన లేకుండా బాటరీ దాని మొహం మీద వేశాను. ఆ కాంతికి చిరుతపులి ఒక్క మాటు కళ్లు ముడుచుకున్నది. కళ్లు చీకట్లు కమ్మి ఉండాలి. అది కళ్ళు తెరిచి తమాయించుకుంటే తరువాత ఆ దెబ్బతిన్న పులిని అడ్డేవాడుండడు.
నా దగ్గర తుపాకిలో ఇంక ఒక్కటే గుండు ఉన్నదన్న ఊహ కూడా స్ఫురించింది. అయితే ఒకటే ధైర్యం. గుండు గురి తప్పి, అది మీదకు ఉరికినా ఒక్క  ఆశ ఉంది. అంది పెద్దపులి కాదు. చిరుతపులి కాబట్టి కలియబడవచ్చు.
అప్పుడు జయపజయాలు–ఏమో.
ఒక పక్క చెమటలు పోస్తున్నాయి.
మరోపక్క ఒళ్ళు గజగజ వణికిపోతుంది.
తెగించి, గురి పెట్టి కాల్చారు.
తుపాకి శబ్దానికి అడవి మారుమోగింది...కాని దానికి ప్రతిధ్వనిగా గర్జన రాలేదు. మూలుగులాటిది వినబడింది. పులి నా మీద కురక లేదు. పొద అదిరిపోలేదు. ఇక ఫరవాలేదు అది దెబ్బతింది అనుకున్నాను.
గబగబ పెద్దపెద్ద అంగలు వేస్తూ జీపు వేపు నడిచిపోయాను.
నా మిత్రులు ముగ్గురూ ఆమాంతం ఎదురువచ్చి కౌగిలించుకున్నారు. కారులో కూర్చోబెట్టి మొహం తుడిచారు. కాంగ్రాచ్యులేషన్స్‌ కురిపించారు. ఫ్లాస్కులోంచి వెచ్చటి టీ తీసి ఇచ్చారు. అది తాగి సిగరెట్‌ ముట్టించాను. కసితీరా రెండు పీల్పులు పీల్చాక ప్రాణం కుదుటపడింది. ఎవరితోను మాట్లాడ బుద్ధి కావటం లేదు. చెప్పరానంత ఆనందగా గర్వంగా హాయిగా వుంది, కన్నులరమూసి కూర్చున్నాను.
పావుగంట తరువాత, వాళ్ళతో వెళ్లి నేను చంపిన చిరుతపులిని సాయం పట్టి జీపు బాలెట్‌ పడేశాను.
తృప్తిగా కూర్చున్నాను.

జీపు అడ్డతీగెల గ్రామం వేపు సాగిపోతుంది నెమ్మదిగా,
మిత్రులు, నేనెంత మూర్ఖపుపని చేయబోయానో, ఎంతటి గండం తప్పిందో చెబుతున్నారు. క్రమంగా అవన్నీ వినబడడం మానేశాయి. వాళ్ళ సంతోషం పంచుకోలేకపోతున్నాను. నేను సాధించిన విజయం ఏమిటి?
పగ సాధించానన్న ఈ తృప్తి ఎందుకు కలగాలి?
పగ ఎందుకు వచ్చింది?
పులికి నా మీద కోపం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదు.
నాకు దాంతో పరిచయం లేదు. పనిమల్లె నేను ఇక్కడికి దాని రాజ్యంలోకి ప్రవేశించాను. నేనే శత్రువుని. దాని దారిన అది పోతూ ఉంటే, హెచ్చరించకుండా దెబ్బ కొట్టాను.
నాకన్న అది బలమైనదని తెలుసు. ధైర్యం ఎక్కువని తెలుసు. నాకు అదంటే భయమని తెలుసు.
మరొక్కటి తెలుసు. అది జంతువని దానికి బుద్దిబలం లేదనీ, వంచనా శిల్పం బాగా తెలీదనీ, నేను నాగరిక మానవుడిననీ, దానికి లేని బుద్ధిబలం నాకు ఉండదనీ పైగా వంచనా శిల్పం, ఆయుధసంపద నా అధీనంలో ఉన్నాయనీను. అదే, పంజా ఎత్తిన పులికాక. తుపాకి పట్టిన మరో మనిషి లాగే ఆ పొదలో నిలిచి ఉంటే? నేనూ అతడూ సమానస్థాయిలో ఉందుము. అపుడు ఎవరేమయ్యేవారో!
నేను నిరాయుధుడనై వెళ్తే పులి నన్ను బలి చేస్తుందని ఊహించి. నాకన్న అది బలశాలి అని గుర్తించి, దానికి తెలీకుండా, అది నాతో సవాలు చేసినట్టు అనుకుని, ప్రతీకారం కోసం అయినట్టు పనిమల్లె వెళ్ళి చంపాను. కాని ఇది ప్రతీకారమా, నాలో అహంకారానికి ఉపశమనమా?
ఏమో. తెలీదు...తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అది తెలుసుకుంటే, నేను చాలా ధైర్యశాలిని అని వెన్ను చరుచుకోవడానికి అవకాశం ఉండదనా? ఏమో...
‘‘వాట్‌ రంగారావ్‌...ఏమిటలా ఉన్నావు?’’ అంటున్నారెవరో.
‘‘కొత్తగదయ్యా...పోను పోను అతనే సర్దుకుంటాడు’’ అంటున్నారింకెవరో.
జీపు ఊరివేపు, నాగరికత వేపు, సంస్కారం వేపు ముందుకు సాగిపోతుంది.
- ఎస్వీ రంగారావు

మరిన్ని వార్తలు