అన్నార్తులకు ప్రేమతో...

12 Jun, 2016 00:14 IST|Sakshi
అన్నార్తులకు ప్రేమతో...

ఆదర్శం
విషాదానికి విషాదం మాత్రమే పరిష్కారం కాదు. ఏ కొద్ది కార్యాచరణ అయినా ఆ విషాదాన్ని తగ్గిస్తుంది. మనసుకు ఊరట ఇస్తుంది. మన దేశంలో ఆకాశాన్ని అంటే మేడలు ఉంటాయి. చిన్నగాలికి కూడా నేల మీద నిలవలేని పూరిగుడిసెలు కూడా ఉంటాయి. పంచభక్ష్య పరమాన్నాలు తినడానికి ఐదు నక్షత్రాల హోటళ్లు ఉంటాయి. ఆకలి కేకలతో అలమటించేవారికి అన్నం మెతుకులు కూడా దొరకవు.
 
టీ షాప్‌ల దగ్గర, హోటళ్ల దగ్గర... ఇక్కడా అక్కడా అని కాదు... ప్రతి చోటా కడుపు చేత పట్టుకున్న దీనులు రోజూ కనిపిస్తారు. వారి దైన్యం కొందరిని కదిలించకపోవచ్చు. ఇంకొందరిని కదిలించినా... ఆ కదలిక బాధ పడడం వరకు మాత్రమే పరిమితమైపోవచ్చు.
 
కొందరు మాత్రం కేవలం బాధపడటంతోనే ఊరుకోరు. ‘ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా’ అనే వాక్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు. అన్నార్తుల కన్నీళ్లు తుడవడానికి కార్యాచరణలోకి దిగుతారు. బెంగళూరుకు చెందిన హర్షిల్ మిట్టల్ ఈ కోవకు చెందిన వ్యక్తే. ఆకలితో అల్లాడే వారి బాధలను దగ్గరి నుంచి చూసిన ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్ తన మిత్రులతో కలిసి ‘లెట్స్ ఫీడ్ బెంగళూరు’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.
 
‘మీ కుటుంబంలో మరో వ్యక్తి ఉన్నాడు అనుకొని వంట చేయండి’ అని ఇరుగు పొరుగు వారికి చెబుతూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు  హర్షిల్. ఇలా తయారైన భోజనం ఎందరి కడుపులో నింపుతోంది. తన ఆలోచనను  ఇతరులకు చెప్పినప్పుడు ఎలా స్వీకరిస్తారో అనే సంశయం హర్షిల్ మనసులో ఏ మూలో ఉండేది. అయితే అందరూ తన సలహాను సంతోషంగా స్వీకరించడం హర్షిల్‌కు ధైర్యాన్ని ఇచ్చింది. తాను చేస్తున్న పనిపట్ల మరింత ఉత్సాహం వచ్చింది.
 
దాతల సంఖ్య పెరుగుతూ పోయింది.
 దాతల నుంచి సేకరించిన భోజనాన్ని కంటెయినర్‌లో పెట్టుకొని వీధి వీధీ తిరుగుతూ ఆకలితో బాధ పడుతున్న వారికి ఆ భోజనాన్ని వేడివేడిగా అందిస్తున్నారు.
 మొదట్లో తన స్నేహితులు రిషిమ్, సెలినా, అశుతోష్‌లతో కలిసి తమ హౌసింగ్ సొసైటీలోని ప్రతి ఇంటికీ వెళ్లి భోజన సేకరణ చేసేవారు.
 ఆరు నెలల కాలంలోనే హర్షిల్ ఆలోచనకు పాపులారిటీ వచ్చింది.
 
హర్షిల్ ఆలోచన  ‘లెట్స్ ఫీడ్ బెంగళూరు’ (ఎల్‌ఎఫ్‌బీ)గా రూపుదిద్దుకుంది.
 సేవాపరిధి మరింతగా పెరిగింది.
 ఇప్పుడు ఎల్‌ఎఫ్‌బీలో రిజిస్టర్ అయిన వాలంటీర్ల సంఖ్య 750కి చేరుకుంది!
  నిరాశ్రయులు, వికలాంగులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్లు, అనాథలు, వృద్ధులు... ఇలా రకరకాల వ్యక్తులకు ‘ఎల్‌ఎఫ్‌బీ’ అన్నదానం చేస్తుంది.
 
‘‘వారికి భోజనం మాత్రమే కాదు, ప్రేమ కూడా కావాలి’’ అంటాడు హర్షిల్. ఆకలితో ఉన్నవారికి భోజనం సమకూర్చడం మాత్రమే కాదు వారితో ఆప్యాయంగా మాట్లాడతారు ఎల్‌ఎఫ్‌బీ స్వచ్ఛందసేవకులు.
 సామాజిక మాధ్యమాలు ఎల్‌ఎఫ్‌బీ సేవాపరిధిని మరింత విస్తరించేలా చేశాయి.
  ‘‘ఫేస్‌బుక్‌లో ఎల్‌ఎఫ్‌బీ కార్యక్రమాలను చూసిన స్వచ్ఛందసేవకులు, దాతలు మాతో టచ్‌లోకి వస్తున్నారు’’ అంటున్నాడు హర్షిల్.
 బెంగళూరు సిటీలోని ప్రతి ప్రాంతం నుంచి ఆహారసేకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎల్‌ఎఫ్‌బీ.
 
‘‘ఆకలితో ఉన్నవాళ్లకు భోజనం అందించడం మాత్రమే మా బాధ్యత అనుకోవడం లేదు... వారికి ప్రేమ, సంతోషాన్ని పంచడం కూడా మా బాధ్యత అనుకుంటున్నాం’’ అంటున్నాడు హర్షిల్.
 స్వచ్ఛందసేవకులు తమ పూర్తి సమయాన్ని ఎల్‌ఎఫ్‌బీకి కేటాయిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇది నిజం కాదు. ప్రతి సేవకుడు నెలలో ఎంతో కొంత సమయం వెచ్చిస్తే సరిపోతుంది.
 తాము మాత్రమే కాదు... ప్రతి ఇంటి నుంచి ఒక స్వచ్ఛందసేవకుడు, సేవకురాలు తయారు కావాలనేది హర్షిల్ కోరిక.
 మంచి పనిచేయడానికి ‘మనీ’తో పని లేదు... మంచి మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నాడు హర్షిల్ మిట్టల్.

>
మరిన్ని వార్తలు