ముచ్చటగా మూడు స్నాక్స్‌ మీకోసం..

9 Feb, 2020 11:40 IST|Sakshi

స్నాక్‌ సెంటర్‌

బనానా–వాల్‌నట్‌ మఫిన్స్‌
కావలసినవి: అరటిపండ్లు – 8, ఖర్జూరం పేస్ట్‌ – 1 కప్పు, వాల్‌నట్‌ పేస్ట్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ – అర కప్పు, మైదాపిండి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, బేకింగ్‌ పౌడర్‌ – 2 టీ స్పూన్లు, బేకింగ్‌ సోడా – అర టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 4, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 2 టీ స్పూన్లు
తయారీ: ముందుగా బటర్‌ కరింగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు అరటిపండ్లను అడ్డంగా అంగుళం పొడవులో కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ తీసుకుని, మిగిలి ఉన్న 6 అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, ఖర్జూరం పేస్ట్, గుడ్లు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చల్లారిన బటర్‌ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండి, మొక్కజొన్న పిండి, పంచదార పొడి, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా, వాల్‌నట్స్‌ పేస్ట్‌ వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మఫిన్స్‌ బౌల్స్‌లో కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని వాటిపైన అరటిపండు ముక్కలు చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని, 20 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకోవాలి.

పీనట్‌ పాన్‌కేక్‌

కావలసినవి: వేరుశనగలు – ఒకటిన్నర కప్పులు(దోరగా వేయించినవి), పంచదార – 2 కప్పులు, మైదాపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – ముప్పావు కప్పు, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, బేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్, బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత, నెయ్యి – అర టేబుల్‌ స్పూన్‌
తయారీ: ముందు ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, బేకింగ్‌ సోడా వేసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, కొబ్బరిపాలు, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఏడెనిమిది గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పాన్‌ కేక్స్‌ సిద్ధం చేసుకునే ముందు పల్లీలు, ఒక కప్పు పంచదార మిక్సీ బౌల్‌లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో కొబ్బరి తురుమును బాగా వేయించి అందులో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండి మిశ్రమంతో మందంగా దోసెల్లా వేసుకుని, దానిపైన కొద్దిగా పల్లీ–కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్‌ చేసుకోవాలి. వీటిని బెల్లం పాకంలో వేసిన ఆపిల్‌ ముక్కలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

పనీర్‌ హల్వా

కావలసినవి: పనీర్‌ తురుము – 1 కప్పు, పాలు – 2 కప్పులు (కాచి చల్లార్చినవి), పంచదార – అర కప్పు, సొరకాయ ముక్కలు – 2 కప్పులు (పైతొక్క తొలగించి), బ్రెడ్‌ పౌడర్‌ – 1 కప్పు, నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు, కిస్మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు – 10 లేదా 15, వేరుశనగలు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్‌
తయారీ: ముందు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక బౌల్‌ పెట్టుకుని.. అందులో  3 టేబుల్‌ స్పూన్ల నెయ్యిలో  వేరుశనగలు, జీడిపప్పు, కిస్మిస్‌ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని.. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసుకుని, అందులో సొరకాయ తురుము వేసుకుని మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పాలు వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పనీర్‌ తురుము, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం మొత్తం పొడిపొడిలాడుతున్నట్లుగా మారిన సమయంలో.. చివరిగా అభిరుచిని బట్టి  ఏలకుల పొడి కూడా వేసుకుని గరిటెతో బాగా కలిపి స్టవ్‌ మీద నుంచి ఆ పాన్‌ను దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, వేరుశనగలు వేసుకుని, ఒకసారి అటూ ఇటూ కలిపి.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది.

మరిన్ని వార్తలు