చీకటి

4 Mar, 2018 08:30 IST|Sakshi

చుట్టుపక్కల చీకట్లకి అంటకుండా వెళ్తోంది బస్సు. మేఘాలు పొగరుగా కురుస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఉరిమిన చప్పుడు, డ్రైవర్‌ గుండెలో బెదురులా ప్రతిధ్వనించింది. అద్దంపైన నీటిబొట్లు తోకచుక్కల్లా రాలుతున్నాయి. బస్సు వేగాన్ని, చినుకుల్ని తుడిచెయ్యటానికి వైపర్లకి ఒక్క క్షణం పట్టలేదు. ముందున్న వెలుగు.. త్రోవ చూపడం మానేసి, హెచ్చరించడం మొదలుపెట్టింది.ధైర్యం చెమటలాగా తప్పించుకుంటోంది. లేని దర్జాతో మొండిగా కదులుతోంది బస్సు. డ్రైవర్‌కి ఏమీ పాలుపోక, పక్కన గేర్‌ బాక్స్‌తో ఆడుకుంటున్న పిల్లాడిని గట్టిగా ఒక బూతుకేక వేశాడు. ఏదో లోకాల్లో ఉన్న జనం, ఒక్కసారిగా కళ్ళు, నోళ్ళు ముందుకి తిప్పారు. కిటికీ బయటున్న చిక్కటి అంధకారం మనసుల్లోకి పాకింది. పెద్ద గుంటలో పడబోయిన టైరుని రక్షిద్దామని, డ్రైవర్‌ ఒక్కసారిగా పక్కకి తిప్పాడు. లోయలో లీనమైపోతోంది బస్సు. నా చెవుల్లో న్యూటన్స్‌ క్రేడిల్‌ శబ్దం మొదలైంది.

క్లిక్‌.. క్లిక్‌.. క్లిక్‌..
చచ్చిపోయే ముందు జీవితం అంతా ఒక్కసారి కళ్ళముందు కనపడుతుందంటారు. నాకు కనపడింది మాత్రం ఒక కవి జీవితం. ఎందుకు పుట్టాడో? ఎందుకు రాశాడో తెలియని,  తెలుసుకోవాలని కూడా లేని ఒక కవి జీవితం. బాధల ఎడారుల్లో దూరంగా కనపడే ఆనందపు ఎండమావులవైపుకు, తడి ఇసుక తిన్నెలమీద పడిన అడుగులు క్షణమైనా లేవనే దుఃఖం వైపుకు, మెడకి బిగుసుకుంటున్న వ్యసనాల గొలుసుల తాళంచెవుల నిధి వైపుకు, ఒక కటిక చేదుని తీపని అని బ్రహ్మపడే జనాల వెర్రితనానికి అవతల వైపుకు, నడిచిన, పరిగెత్తిన, రొప్పుతూ కుంగిపోయిన ఒక కవి జీవితం.    

క్లిక్‌.
‘‘ఇప్పటికి నాలుగు పుస్తకాలలో పిచ్చి గీతలు గీసేశావ్, ఇంక నేను కొనను’’ నాకు పెన్సిల్‌ పట్టుకోవడం వచ్చాక వినపడిన మొదటి మాటలు. తెల్లకాయితాల మీద ద్వేషం నాకు. మాట్లాడవని. ఎవరికీ అవసరంలేని తెలుపు ఎందుకు? కొద్ది రోజులకి ఆ తెల్లమేఘాల మధ్య నల్ల ఇంద్రధనుస్సులు విరిశాయి. అక్షరాలు. చదవటం వచ్చింది. ఆ నలుపులోని ఒక్కో రంగుని విభజించడానికి ఇంకొన్ని నెలలు పట్టింది. సృష్టించడానికి, సంవత్సరాలు పట్టింది. ‘‘చెట్లు పచ్చగా ఉండును, ఆకాశం నీలంగా ఉండును.’’ వంటి అబద్ధాలు వింటూ, పదే పదే, మోసపోయాను.  చెట్లు ఒక్కో ఋతువులో ఒక్కోలా ఉంటాయి. ఆకాశం ఈ క్షణం ఉన్నట్టు మరు క్షణం ఉండదు.

క్లిక్‌.
రేయ్‌! ఆడుకుందాం రారా! అక్కడేం చేస్తున్నావ్‌!’’ మావిడితోపులో నా స్నేహితులు ఆడుకుంటుంటే, మొదటిసారి నేను చూసిన చిత్రం ఇప్పటికీ నాలోపల చెరిగిపోలేదు. పల్చటి మామిడి ఆకుల మధ్యనుంచి ప్రకాశించిన సూర్యకాంతి ఆకుపచ్చగా మారింది. ఆ క్షణం ఆ ఆకుని అయిపోవాలనిపించింది. ఆ సూర్యకాంతిని తాకుతున్న ఆకుల నుంచి మనిషిని చూడాలనిపించేంత. ప్రకృతిలో ఎప్పుడూ రెండు శక్తులు. ఒకటి అన్నింటినీ ఏకం చేసే శక్తయితే, అన్నింటిని విడిగా ఉంచే శక్తి ఇంకొకటి. ఏ అనర్థాలైనా జరిగేవి, వీటి మధ్య ఉన్న విరోధం వల్లనే. యుగాలు మారే కొద్దీ, ఆ విరోధం బలమై, అనర్థాలు పెరుగుతుంటాయి.

క్లిక్‌.
చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా సున్నితం. ముద్దుచేయకపోతే చిన్నబుచ్చుకుని ఎటో వెళ్లిపోతాయి. రెండో తరగతి సైన్స్‌ పీరియడ్‌. డబల్‌ రూల్‌ పుస్తకంలో, నేను రాసిన మొదటి కవిత. అది చూసిన మా సైన్స్‌ టీచర్‌ ఏమి చెయ్యాలో అర్థంకాక నన్ను కొట్టి క్లాస్‌ బయటికి పంపించింది. ఆవిడ కళ్ళలోని భయం, కంగారు ఇంకా గుర్తున్నాయి. భయం ఎందుకు? క్లాస్‌ విననందుకు కోపం కదా రావాలి? వ్యత్యాసాన్ని తట్టుకునే శక్తీ ఉండదు కొంతమందికి. ఏడేళ్ల  పిల్లాడు రాసే కవితమీద జెలసి. దాన్ని వెంటనే హాస్యం చేసెయ్యాలి. నలుపుకి తెలుపుకి మధ్య ఉన్నది కాదు వ్యత్యాసమంటే. ఆ నలుపులలోని నలుపుల మధ్య తేడా. ఇది కొంతమంది ఎన్ని జన్మలు ఎత్తినా గమనించలేరు, అధిగమించలేరు.  

క్లిక్‌.  
పదవ తరగతి పరీక్షలు. ఆ పరీక్షల విలువ ఎంతనీ! అవి తప్పితే జీవితం వ్యర్థం కదూ!
వ్యర్థమైన జీవితాన్ని ముందుకు తోసేకన్నా, ఏ కొండమీదనుంచో నన్నే తోసేసుకుంటే? ఆ అవసరం రాలేదు, సెకండ్‌ క్లాస్‌ వచ్చింది. తప్పితే బావుణ్ణు అనిపించేలా సెలవలన్నీ, పీడ కలల్లా వెళ్లిపోయాయి. మావాళ్లు నాపైనున్న అపారమైన నమ్మకంతో, ముందు ఇంటర్లో చదవాల్సిన పాఠాలనే ఆ  సెలవల్లోనే నాపైన వేశారు. రోజుకు నాలుగు గంటలు చదవాలి. రెండేళ్లలో మెడికల్‌ కాలేజీలో చేరాలి. ఆరేళ్లలో డాక్టర్‌ అవ్వాలి. ఎనిమిదేళ్లలో.. ఇది నా ముందున్న కార్యక్రమాల పట్టిక. వీటన్నిటికీ నాతో సంబంధం లేదు. నా కవిత్వం అక్కర్లేదు. దీనిని తప్పించుకోవడానికి నేను చేసిన మొదటి పని, ఇంట్లో ఇది నావల్ల కాదని చెప్పడం.

ఎందుకు కాదు, తలచుకుంటే ఏదైనా చెయ్యచ్చు.ఆ మాటలు విన్నప్పుడు నిజమనిపించేంత బావుంటాయి, స్నేహంగా భుజం మీద చెయ్యి వేసి నడుస్తాయి. కానీ పక్కకి తీసుకెళ్లి ‘‘నువ్వు ఏమీ చెయ్యలేవురా’’ అని మొహాన ఉమ్మేస్తాయి. నేను వీటితో ఇంకో రెండు సంవత్సరాలు బతకాలి. ఈ మలినం నా కవిత్వానికి అంటకూడదు. కవిత్వం రాయడం, చదవడం మానెయ్యాలి. దానికి నాకు దొరికిన లంచం, ఒక కంప్యూటర్‌. అందరి జీవితాలు తొంగి చూడగలిగే, ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలిగే ఒక చిక్కనైన అల్లిక అంతర్జాలం.

క్లిక్‌.
మొదటిసారి భయం వేసింది, నాలాంటి మనుషులు ఇంకొంతమంది అక్కడ పరిచయం అయ్యాక, మొదటిసారి జాలి కలిగింది. ఏది వారి తీరం! ఏది వారి దారి! వారి గుహల్లో ఎప్పటినుంచో మధ్య నివసిస్తున్న వారి చేత దీపమేది? ఎందుకు వారికా ఆనందం? ఎందుకు అంత శోకం? ఏది వారు రాసేమాటలకి ఆధారం! కవిత్వమంటే ఒక ప్రయాణం. రోజూ కనపడేవాటి వెనక నక్కి ఉన్న ఇంకొక పొరలోకి. కవిత్వమంటే ఒక అన్వేషణ. కచ్చితంగా ఉందని తెలిసినా, మాయమైన దాని ఉనికి కోసం. కవిత్వమంటే ఒక ధైర్యం. ఎవ్వరు లేకపోయినా, అన్నీ దూరమైనా, వెచ్చగా హత్తుకునే గుండెలా. అక్కడ నా అడుగులు చాలవు. నా వయస్సు చాలదు. ఏదోటి రాసెయ్యాలి. నేనేంటో చూపించాలి అనే తృష్ణతో ఒక కవిత రాసి ఫేస్బుక్‌లో పెట్టా.

నీ నవ్వుతో అమావాస్యనాడు వెన్నెల కాచేనా!
నీ మౌనంతో ఎడారి కడలై పొంగేనా!
నీ శోకానికి ఆనకట్ట నా నవ్వా?
ఎంత కాలం?
ఇక నవ్వి విసిగిపోయాను, ఏడుపు మరచిపోయాను,
ఇంకేమి చూపగలను
శూన్యం తప్ప!
ఎవ్వరూ చదవలేదు, పట్టించుకోలేదు.

క్లిక్‌.
కొన్నాళ్లు ఆ కాలేజీలో ఉండేసరికి, వాళ్ళ నిర్ణయం మేరకు – అవసరం మేరకు, ఉపయోగపడాలని – నా కళ్ళని  సున్నితంగా పొడిచేశారు. దృష్టి క్షీణించింది. లక్షల రంగులు చూసిన నాకు ఇప్పుడు కనపడే రంగులు రెండు. వెలుతురూ, చీకటి. కలిగే భావాలూ రెండు. మెలుకువ, నిద్ర. తెలిసిన ప్రదేశాలు రెండు. ఇల్లు, కాలేజీ. నెమ్మదిగా ఈ రెండూ ఒకటికి కుంచించుకుపోయాయి. చీకటి, మెలకువ, కాలేజీ. తెలియకుండానే బాధని మోశాను, కవిత్వం వదిలేసాను. ఎంట్రన్స్‌ రాసిన మరుసటి రోజు మళ్ళీ కంప్యూటర్‌ ముట్టుకున్నా. నా కవిత్వానికి నాలుగైదు లైకులు. కామెంట్స్‌ ఏంలేవు. ఇన్‌బాక్స్‌లో ఇరవై మెసేజెస్‌. కవిత పెట్టిన రోజునుండి, 6 నెలలక్రితం వరకు. అన్నీ ఒక్కరినుంచే. ఒకే ఒక్క మనిషి నన్ను బయటపడేద్దాం అనుకున్నాడు. ఆఖరి మెసేజ్‌లో అయన చిరునామా, ఫోన్‌నెంబర్‌ పంపించి ఆపేశాడు.

క్లిక్‌.
ఆ మెసేజ్‌లకి అప్పుడు బదులు ఇవ్వబుద్ధి కాలేదు. సుడిగుండంలో బలవంతంగా ఎదురీదుతూ అలిసిపోయాను. అందరూ ఊహించినట్టుగానే, జీవితంలో ఘోరమైన పాపం చేసేశాను. ఎంట్రన్స్‌ తప్పాను. ఆ బాధ మింగుడుపడలేదు. కొంతమంది ఓదార్చారు. ఇంకొంతమంది గేలిచేశారు. మా ఇంట్లో భయపడ్డారు, ఏమవుతానోనని, ఎక్కడ తేలతానోనని. బలవంతంగా ముంచాక, తేలేందుకు చోటేక్కడిది!

క్లిక్‌.
బి ఫార్మసీలో చేరాను. ఇంత అక్రమంలో కూడా నాకు ఒక క్రమం కనపడుతోంది. మారే కాలం కవికి కాక ఇంకెవరికి స్పష్టంగా తెలిసేది! ఒక పియానో సొనాటాలోని ఆఖరి స్వరం. మెరిసే మెరుపులోని మొదటి తళుకు. తీరాన్ని ముద్దాడే సముద్రపు ఆఖరి బొట్టు. ఇవి కవి కోసం కాక మరెవ్వరికీ! మరి ఆ గొంతుకి చుట్టుకుంటున్న వేళ్ళు? వాటి సందులనుంచి నేను అరిస్తే? ఎవరికి వినపడేది! ఆ పైన మూడేళ్లు నన్ను బయటికి లాగాలని ప్రయత్నించిన వాళ్ళకి నా మీద ఇష్టం కన్నా, వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ.అవును నాకు పొగరు. పెద్ద విషాదం అనుభవించిన వాళ్లందరికీ ఉంటుంది పొగరు.‘ఇది నాకు జరిగింది, నాకే ప్రత్యేకంగా జరిగింద’నే ఒక గర్వం.అలాంటివాళ్ళని లాగి ఒడ్డున పడేయాలంటే, త్రాణ కావాలి. అది సంపాదించే బదులు జాలి పడినట్టు నటిస్తే పోలేదూ! నిజమే. అలాగే నటించారుకూడా. తెల్లవారుతుందనే ఆశలు రేపి, అవసరం లేనంత ప్రాణవాయువుని అరువిచ్చి, మత్తుగా తూలుతుండగా, ఏనుగంబారీలతో తొక్కితే?

క్లిక్‌.
ఎలాగోలా బయటికి రావాలనిపిస్తోంది. ఇంకెంత కాలం ఈ రొచ్చులో ఉండాలనిపిస్తోంది. నా బాధ మీద నాకే అసహ్యం వేసింది. ఎక్కడికి లాక్కెళ్తుందిది? నా ఊపిరిని కొల్లగొట్టడానికి దానికేంటి హక్కు? పాము చుట్టుకుంటుంటే పోరాడాలి. అయ్యేది అవుతుందిలే అని కూర్చోడానికి అసలు పుట్టడం ఎందుకు? పోరాటం, యుద్ధం మానవులకున్న వరం. నా దృష్టి నాకు మళ్ళీ రావాలంటే, నా బాధని కాల్చాలి. నా లోపలున్న కవిత్వాన్ని నాశనం చేసుకున్నది నేనే. ముందు నాతో నేను గెలవాలి. శత్రువుల మీద తరువాత దండెత్తచ్చు, నేను సుఖపడినప్పుడు. ఎవ్వరి మాటలు నాకు అంటేది! ఎవ్వరి కళ్ళు నన్ను తాకేది! నేను మారాలి, ఆ తరువాతే, అంతా.ఆ మెసేజ్‌లని మళ్ళీ ఒకసారి చదివా. అప్పటి నన్ను మళ్ళీ ఒకసారి చూశా. పక్కనే ఉండి చాలామంది ఇవ్వని ఆసరా, ఆ మెసేజ్‌ల ద్వారా ఆయన ఎప్పుడో ఇవ్వాలని చూసాడు.  తీసుకుంటే?    

మొదట్లో చాలా కష్టమైంది. బయటికి రావాలనిపించలేదు. బయట అనేది ఒకటి ఉందని ఒప్పుకోవడానికి కొన్ని వందల యుద్ధాలు గెలవాల్సొచ్చింది. ఆ నెర్రెల నుండి చిమ్మే వెలుగుల వైపుకి నెమ్మదిగా పాకుతుంటే, కాలి మడమలు ఒకటిగా కట్టేసిన సంకెళ్ళు ముందుకు పడేసేవి. విడుదలకి నాకొక్కటే ఊతం, ఆ మెసేజ్‌లు. చదివాను. ఇంకిపోయే వరకు. నా బానిసత్వం చచ్చేవరకు. చీకట్లు పగిలే వరకు. వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి, నా జీవితంలో ఇన్నేళ్లు వృథా చేసినందుకు, క్షమించమని అడగాలి. అడిగితే?ఆ చివరి మెసేజ్‌లో ఉన్న చిరునామాకి ప్రయాణం తలపెట్టా.

క్లిక్‌.
బస్సు లోయలో పడే ముందు, నా బల్లమీద అలారం మోగింది. నాకు మెలకువ వచ్చింది. ఇంకా ఇంట్లోనే ఉన్నా అని అర్థమైంది. ఒక ఆరు గంటలలో నా జీవితం మొత్తాన్ని మళ్ళీ చూశాను. నాకిదొక పాఠం. ఒక్కొక్క రోజు ఎంత అద్భుతమో. నాకల. మన మధ్య  ఊబిలో కూరుకుపోతున్న కొంతమంది కవుల నిజం. అంకెల నుంచి అంతరిక్షం వరకు అన్నీ సృష్టించబడింది మనిషిని స్పందింపచేయటానికే. ఆ స్పందనని వెతకాలి. వెలివెయ్యకూడదు. బయల్దేరాలి. ఎలాగోలా బయటికి రావాలనిపిస్తోంది. ఇంకెంత కాలం ఈ రొచ్చులో ఉండాలనిపిస్తోంది. నా బాధ మీద నాకే అసహ్యం వేసింది. ఎక్కడికి లాక్కెళ్తుందిది? నా ఊపిరిని కొల్లగొట్టడానికి దానికేంటి హక్కు? పాము చుట్టుకుంటుంటే పోరాడాలి. అయ్యేది అవుతుందిలే అని కూర్చోడానికి అసలు పుట్టడం ఎందుకు?

మరిన్ని వార్తలు