ఆశీర్వచన బలం

12 Aug, 2018 00:21 IST|Sakshi

పురానీతి

పూర్వం మృకండుడు, మరుద్వతి అనే ముని దంపతులుండేవారు. వారికి సంతానం లేకపోవడంతో మృకండుడు శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘‘నీకు పదహారేళ్ళ వయసు వరకు జీవించే కుమారుడు జన్మిస్తాడు’’ అని వరమిచ్చాడు. ఆ కుమారుడికి మార్కండేయుడని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు ఆ దంపతులు. ఆ దంపతులు తమ కుమారునికి బాల్యం నుంచి పెద్దలందరికీ పాదనమస్కారాలు చేయడం అలవాటు చేశారు. మార్కండేయుడు అలా నమస్కరించిన ప్రతిసారీ, అతన్ని ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ అని దీవించేవారు. చూస్తుండగానే మార్కండేయునికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. మరికొది ్దరోజులలో తమ కుమారుడి ఆయుర్దాయం తీరిపోతోందని తెలిసి మృకండ దంపతులు తమలో తామే కుమిలిపోసాగారు. తల్లిదండ్రుల వద్ద విషయం తెలుసుకున్న మార్కండేయుడు ‘‘నన్ను ఆశీర్వదించండి. శివుని గూర్చి తపస్సు చేస్తాను. ఆ బోళాశంకరుడు నన్ను కరుణించబోడు. మీరు బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి హిమాలయాలకు వెళ్లి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి చిన్న దేవాలయం నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.

ఆ బాలుడి ఆయువు తీరే సమయం అసన్నం కావడంతో యమదూతలు వెళ్లారు. అయితే, మార్కండేయుని మెడలో పాశం వెయ్యడానికి భయం వేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు. అపుడు యముడు తానే స్వయంగా వెళ్లి, ‘ఓ బాలకా! బయటకు రా! నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను’ అన్నాడు. మార్కండేయుడు భయంతో శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. యముడు పాశాన్ని మార్కండేయుడి మెడలోకి విసిరి బలంగా లాగాడు. పాశం శివలింగానికి తగిలింది. అంతే! శివలింగం ఫెటిల్లున పేలిపోయి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమ కాలితో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికి యముడు విరుచుకు పడిపోయాడు. శివుడు మార్కండేయునితో ‘‘నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో’’ అన్నాడు.

మార్కండేయుడు ‘‘స్వామీ! పాపం! యముడు భయకంపితుడై ఉన్నాడు. ఆయనను కరుణించండి’’ అన్నాడు. శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు లేచి నమస్కరించి ‘‘స్వామీ, నువ్వు ఈ బాలుడికి పదహారు సంవత్సరాలు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి ‘‘ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అని అర్థం చేసుకోవడమే నీ దోషం. అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు. వెళ్ళు’’ అన్నాడు.‘‘నాయనా! మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను. చిరంజీవివై ఉండు’’ అని ఆశీర్వదించాడు.పెద్దల ఆశీర్వచనం, భగవంతునిపట్ల నిర్మల భక్తి ఎప్పటికీ వృథాపోవన్నది ఇక్కడ తెలుసుకోవలసిన నీతి. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు