ఖలేజా ఆపరేషన్

18 Jan, 2015 01:10 IST|Sakshi
ఖలేజా ఆపరేషన్

శస్త్రచికిత్స జరిగిన నాలుగు వారాల తర్వాత లక్ష్మయ్యతో గ్లోబల్ హాస్పిటల్ కాలేయ శస్త్రచికిత్స విభాగపు అధిపతి, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ టామ్ చెరియన్
కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది.

 
మెడికల్ వండర్
ఒక రోజు లక్ష్మయ్య హాస్పిటల్‌కు వెళ్లాడు. వయసు 60 ఏళ్లు. మహబూబ్‌నగర్ జిల్లా. ఆయన కళ్లు పచ్చగా ఉన్నాయి. జ్వరం ఉంది. రెండు నెలలలో నాలుగైదు కిలోల బరువు తగ్గాడు. అంతకుమించి వేరే లక్షణాలేమీ లేవు. ఆయన పొగతాగడు. మద్యం అలవాటు లేదు. పొట్ట పలుచగా ఉంది. పై నుంచి చూస్తే అంతా మామూలే.

కానీ, సీటీ స్కాన్ తీస్తే... ఆశ్చర్యం... ఆయన ‘హైలార్ కొలాంజియో కార్సినోమా’ లేదా ‘బైల్ డక్ట్ మ్యాలిగ్నెన్సీ’ వ్యాధితో బాధపడుతున్నాడు. అది తీవ్రమైనదిగా పరిగణించే క్యాన్సర్లలో ఒకటి!
 కాలేయానికి రెండు తమ్మెలుంటాయి. ఎడమ వైపు తమ్మె నుంచి రక్తం తీసుకుపోవడానికి ‘లెఫ్ట్ పోర్టల్ వీన్’ రక్తనాళం ఉంటుంది. కుడి తమ్మెకు రక్తం అందించేందుకు ‘రైట్ హెపాటిక్ ఆర్టరీ’ రక్తనాళం ఉంటుంది.

కాలేయం చూడటానికి ఎర్రగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా? అది శరీరంలోని అతి పెద్ద గ్రంథి.  కీలకమైన కార్యాలు నెరవేరుస్తుంటుంది. అత్యంత ప్రాధాన్యంతో దానికి ఎక్కువమొత్తంలో రక్తసరఫరా అవుతుంటుంది. అందువల్లే ఎర్రగా కనిపిస్తుంది. అది కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ... కొన ఊపిరి దొరికే వరకూ లక్షణాలను కనిపించనివ్వదు. అందుకే తీవ్రమైన క్యాన్సర్‌కు గురైనా లక్ష్మయ్యలో లక్షణాలేవీ బయటపడలేదు.

కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. కొంతమేర తొలగించే అవకాశం ఇక్కడ లేదు. కానీ కాలేయం లేదంటే ప్రాణమే లేదని అర్థం. మరి పూర్తిగా తొలగించాలంటే కాలేయాన్ని ఇచ్చే దాత ఉండాలి. దాత దొరకడం, ఆయన ఇచ్చిన కాలేయం సరిపోలడం, దీనికి పెద్దమొత్తంలో అయ్యే ఖర్చు... అన్నీ సవాళ్లే!
 
ఏం చేద్దామిప్పుడు?
డాక్టర్ల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ టామ్ చెరియన్ ఒక ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, ఎడమవైపు రోగగ్రస్థమైన కాలేయపు తమ్మెను తొలగించాలి. అయితే, కుడిైవైపున రోగగ్రస్థం కాని తమ్మెను అలాగే ఉంచాలి. కానీ పాడైన రక్తనాళాలను మాత్రం తొలగించాలి. మరి ఆ భాగానికి రక్తసరఫరా కావాలి కదా! అందుకోసం ఇతర ప్రాంతాలనుంచి ఆరోగ్యకరమైన రక్తనాళాలను తెచ్చి, తొలగించినవాటి స్థానంలో అమర్చాలి. మరి రక్తనాళాలు దొరకవు కదా! అంటే, కుడివైపు తమ్మెకు పాత రక్తనాళాలతోనే మంచి రక్తం అందాలి.
 
సంక్లిష్ట ఆపరేషన్
అనుకున్నంత సులభం కాదు. అయినా సాధ్యంచేశారు. ఎడమవైపున ఎనిమిది సెంటీమీటర్ల కాలేయపు తమ్మెను తొలగించారు. ఇటు రోగగ్రస్థమైన రక్తనాళాలనూ తొలగించారు. అటు వైపున ఆరోగ్యకరమైన రక్తనాళాలున్నాయి కదా! వాటిని తొలగించకుండా ఉంచిన ‘ఆరోగ్యకరమైన కాలేయపు తమ్మె’కు రక్తం అందేలా అనుసంధానించారు. ఇంతటి సంక్లిష్టమైన ఆపరేషన్‌కు తొమ్మిది గంటలు పట్టింది. రోగిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. తొలిదశలో కొద్దిరోజులు రక్తసరఫరాను యంత్రాల సహాయంతో చేశారు.

ఆ తర్వాత అతడికి అమర్చిన వైద్య పరికరాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వచ్చారు. ఎట్టకేలకు కాలేయం ఇచ్చే దాత లేకుండానే, కొత్త కాలేయం అమర్చకుండానే, కొత్తదాన్ని అమర్చినంత పనిచేశారు. ఇక్కడ ఒక అంశం స్పష్టం చేయాలి. వైద్యుల నైపుణ్యం, సృజనతో కాలేయ మార్పిడి చేయకుండానే, చేసినప్పటి సాఫల్యాన్ని సాధించారన్నమాట! మనం భిన్న అర్థంలో వాడే ఖలేజా అనే మాటకు కాలేయం అని కూడా అర్థం. అలా ఇది ఖలేజా ఉన్న వైద్యుల వాస్తవగాథ!
- యాసీన్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు