మానవుడిగా పుట్టి... మహనీయుడై

11 Aug, 2019 13:09 IST|Sakshi

పురానీతి

రాముడు పట్టాభిషిక్తుడై, లక్ష్మణ భరత శత్రుఘ్నుల అండదండలతో రాజ్యాన్ని చక్కదిద్ది, ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేస్తూండగా, ప్రజలు అన్నివిధాలా ఆనందిస్తున్నారు. ఒకరోజున విశ్వామిత్రుడు రాముడి కొలువుకు వచ్చాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక శకుంతుడు అనే రాజు తనను అవమానించాడనీ, కనుక అతనిని తక్షణం వధించవలసిందిగా ఆజ్ఞాపించాడు.
అప్పటికప్పుడే రాముడు గురువు ఆనతిని తలదాల్చి శకుంతుణ్ణి వధించడానికి బయలు దేరాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి శకుంతుడికి శరణు ఇచ్చింది. హనుమంతుడు తల్లి మాట నిలపడానికి, రామబాణానికి ఎదురొడ్డి రామనామం జపిస్తూ కన్నులు మూసి నిలబడ్డాడు. రాముడు విడిచిన బాణం హనుమంతుడి హృదయంలో లీనమైంది.
ఇది చూసిన విశ్వామిత్రుడు దురాగ్రహం విడిచి శకుంతుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళాడు.

అలా చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, అత్యవసరంగా ఒక దేవరహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కావలి ఉంచమనీ, ఎవరినైనా రానిస్తే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో ఆయన అవతరించిన పని తీరిందనీ, ఇక వైకుంఠానికి  చేరవలసిందనీ చెప్పాడు.
అదే సమయంలో దుర్వాసుడు వచ్చి తక్షణం రాముడిని చూడటానికి వెళ్ళనివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోనికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపోయాడు.

రాముడు లవకుశులను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. 
అది శ్రావణమాసం. సరయూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తూన్నది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణ పర్వదినం. మంగళ తూర్యనాదాలు మోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటిపెట్టుకొని నడుస్తూండగా, రాముడు సరయూనదికి బయలుదేరాడు. అశేష ప్రజానీకం అనుసరించారు.

రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. వీణాధ్వనులు, దేవదుందుభులతో దిక్కులు మారుమోగుతున్నాయి. 

అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తున్నది, సరయూనది ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా సాగుతోంది. అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురు చూస్తున్నారు. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలు కాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మి పాదాలొత్తుతుండగా శేషతల్పాన్ని అలంకరించాడు.
లోకకల్యాణం కోసం మానవుడిగా పుట్టి పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడై వానరులను కూడగట్టుకొని సముద్రానికి వారధిని కట్టి, లంకను చేరి అజేయుడనని విరవ్రీగిన రావణుడి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రామావతార పరిసమాప్తి అలా జరిగింది.  
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా