అన్వేషణం: బొలీవియాలో బోలెడంత ఉప్పు!

17 Nov, 2013 03:27 IST|Sakshi
అన్వేషణం: బొలీవియాలో బోలెడంత ఉప్పు!

 సముద్రం ఉన్న ప్రతిచోటా ఒప్పు మడులు ఉండటం సహజం. కానీ బొలీవియాలో ఉన్న ఉప్పుమడి అన్నిటిలాంటిదీ కాదు. దాన్ని చూస్తే ఉప్పు మడిని చూసినట్టు ఉండదు. అసలు అక్కడి నేలే ఆ రంగులో ఉందేమో అన్నట్టుగా ఉంటుంది.
 
 బొలివియాలోని పొటోసీ రీజియన్‌లో ఉంటుంది సలార్ డి ఉయునీ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పుమడి. 10,582 చదరపు కిలోమీటర్ల మేర ఉండే ఈ మడిలో పది మీటర్ల మందాన ఉప్పు మేట వేసి ఉంటుంది. అందుకే దీని మీద భారీ వాహనాలను అతి వేగంగా నడిపినా ఏమీ కాదు. ఒకప్పుడు ఇక్క చాలా ఉప్పునీటి సరస్సులు ఉండేవట. వాతావరణంలో వచ్చిన పలు భారీ మార్పుల కారణంగా ఇవన్నీ ఉప్పుమేటలుగా మారిపోయాయి. తద్వారా ఇంత పెద్ద విస్తీర్ణం గల ఉప్పుమడి ప్రత్యక్షమయ్యింది. ఇదంతా నలభై రెండేళ్ల క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది.
 
 ఈ ఉప్పుమడిలో సోడియం, పొటాషియం, లిథియం, మెగ్నీషియం పాళ్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లిథియం. ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం చాలా కీలకం. ప్రపంచంలో వాడే మొత్తం లిథియంలో నలభై మూడు శాతం బొలీవియా నుండే వెళుతోంది. ఇందులో అధిక భాగం సలార్ డి ఉయునీ నుంచే లభిస్తోంది.
 
 అది మాత్రమే కాక టూరిజం ద్వారా బోలెడంత ఆదాయం సమకూరుతోంది. ఉప్పుమేటనేం చూస్తాం అనుకోవడానికి లేదు. కొన్ని కిలోమీటర్ల మేర, ఎక్కడా మట్టి అన్నదే కనిపించకుండా, నేలమీద తెల్ల పెయింటు ఒలకబోసినట్టుగా, స్వచ్ఛంగా ఉండే ఆ మేటలు చూడటానికి బోలెడంతమంది సందర్శకులు వస్తుంటారు. సూర్యుని కిరణాలు పడి ఉప్పుమేట రకరకాల రంగుల్లో మెరుస్తూ ఉంటే, చూసి ఎంజాయ్ చేస్తారు. వాహనాల్లో మడి అంతా తిరుగుతూ సంబరపడతారు. అందుకే... అవడానికి ఉప్పుమడే అయినా, సలార్ డి ఉయునీ ఓ ప్రముఖ సందర్శనీయ స్థలమైంది!
 
 ఆ రెస్టారెంటుకెళ్తే పేషెంటవ్వాల్సిందే!
 లాత్వియాలో హాస్పిటాలిస్ అనే రెస్టారెంటు ఉంది. పేరుకే ఇది రెస్టారెంట్. లోపల హాస్పిటల్. టేబుళ్లకు బదులు స్ట్రెచర్లు ఉంటాయి. కుర్చీల స్థానంలో ఆసుపత్రుల్లో వాడే స్టూళ్లు ఉంటాయి. చివరకు లైట్లు కూడా ఆపరేషన్ థియేటర్లో ఉండేలాంటివే. అసలు రెస్టారెంటుకు వచ్చామా, ఆసుపత్రికి వచ్చామా అని కన్‌ఫ్యూజవడం ఖాయం.
 
 ఇక స్టాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేనేజర్, క్యాషియర్ లాంటి వాళ్లంతా డాక్టర్ డ్రెస్సుల్లో ఉంటారు. సర్వ్ చేసేవాళ్లంతా నర్సుల మాదిరిగా తయారవుతారు. మెడలో స్టెతస్కోపులు, చేతులకు గ్లవుజులు వేసుకుని చకచకా అన్నీ చక్కబెట్టేస్తుంటారు. మనంతట మనం తినడానికి ఉండదు. వెళ్లగానే మనకు పేషెంట్ల దుస్తులు తొడిగి, ఓ చోట కూర్చోబెట్టేస్తారు. నర్సు దుస్తుల్లో ఉన్న వెయిట్రస్‌లు చక్కగా తినిపించేస్తారు.
 
 వామ్మో... ఇదేం రెస్టారెంట్ అనిపిస్తోంది కదూ! కానీ లాత్వియా వాళ్లు అలా అనడం లేదు. రెస్టారెంటు ముందు క్యూ కడుతున్నారు. అక్కడ భోంచేయడానికి పోటీపడుతున్నారు. కొత్తొక వింత కదా! అందుకే ఆ హోటల్ కిటకిటలాడుతోంది మరి!

మరిన్ని వార్తలు