నిశ్చింతయానం

6 Apr, 2014 01:35 IST|Sakshi
నిశ్చింతయానం

వివరం: మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎం.హెచ్ 370 అదృశ్యమై పోయాక విమానయానం ఎంతవరకు సురక్షితమైనది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే అన్ని ప్రయాణ సాధనాలకన్నా విమానమే అత్యంత భద్రమైనదని గతంలో జరిగిన భూ, జల, వాయు వాహనాల ప్రమాద కారణాలు, గణాంకాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలో... విమాన యానం గాలిలో దీపం కాదనీ, విమాన ప్రమాదాలన్నీ విమానం వల్ల జరిగే ప్రమాదాలు కావని చెప్పడమే ఈవారం ‘వివరం’.    
 
 మీరో బిజినెస్ మేగ్నెట్. లేదా సెలబ్రిటీ. లేదా క్షణం తీరికలేకుండా గ్లోబు చుట్టూ తిరుగుతుండే పెద్దమనిషి. విమానం ఎక్కందే మీకు పొద్దు గడవదు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగి, అక్కడ ఎక్కి మరెక్కడో దిగి ఆ రోజు చేయవలసిన పనులన్నిటికీ మీ దగ్గర పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. అందులో మునిగిపోయి ఉంటారు. పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఎక్కడా మీకు మీరు ప్రయాణిస్తున్న లేదా ప్రయాణించబోతున్న విమానం గురించి చెడు ఆలోచన కలగనే కలగదు. ‘ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే?’ అనే అనుమానమే మీలో తలెత్తదు. ఎందుకు? ఎందుకంటే  విమానయానం మిగతా అన్ని ప్రయాణాల కంటే నూటికి నూరుపాళ్లు సురక్షితం కనుక. అలాగా! అయితే అడపాదడపా జరుగుతున్న విమాన ప్రమాదాల మాటేమిటి? అవా? అలాంటివి ప్రమాదాలే కానీ, విమాన ప్రమాదాలు కాదు! అంటే?! విమానాలు తయారయ్యేటప్పుడే అత్యంత ప్రమాదరహితంగా తయారవుతాయని! మానవ తప్పిదం వల్లనే కానీ, విమాన లోపం వల్ల ప్రమాదం జరగడం అన్నది దాదాపు అసాధ్యం అని!!
 
 తరచు ప్రయాణాలు చేసేవారు ఒక విషయం గమనించి ఉంటారు. విమానం లాండ్ అయ్యేముందు పెలైట్ గొంతు సవరించుకుని, ‘ద సేఫెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రిప్ ఈజ్ నౌ ఓవర్’ అని చెప్తాడు. ‘మీ ప్రయాణంలో అత్యంత సురక్షితమైన భాగం ఇప్పుడు పూర్తయింది’ అని చెప్పడం అన్నమాట. ఆ మాట నిజమే. విమానం దిగగానే మీరు మీ గమ్యం చేరుకోడానికి టాక్సీ ఎక్కారనుకుందాం. అది ఎంత సురక్షితమో మీరు చెప్పలేరు. డ్రైవర్ చేతుల్లో ఉన్నది స్టీరింగ్ ఒక్కటే కాదు, మీ ప్రాణాలు కూడా. అతడు ఎలా డ్రైవ్ చేస్తాడో మీకు తెలీదు. టాక్సీ కండిషన్ ఏమిటో మీకు తెలీదు. విండో లోంచి బయటికి చూడండి.

అక్కడ సిగ్నల్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలీదు. మీరు ప్రయాణిస్తున్న రోడ్డు మీద ఎక్కడ ఏ గతుకు ఉందో తెలీదు. మీ టాక్సీకి ఎదురొచ్చే వాహనాలు సక్రమంగా వస్తాయో లేదో తెలీదు. వాటిని నడుపుతున్నవారు కంటి నిండా నిద్రపోయినారో లేదో తెలీదు. మద్యం సేవించకుండా నడుపుతున్నవారో లేదో తెలీదు. ఏ దశలోనైనా సురక్షితం అనేది ప్రమాదంగా మారిపోవచ్చు. అలాంటిది భూమికి ఆరు మైళ్ల ఎత్తులో, గంటకు 500 మైళ్ల వేగంతో వెళ్లే విమానంలో మన ప్రాణాలు విమానంలో కాదు, అరచేతిలో ఉన్నట్లు. అయినా సురక్షితంగా ఎక్కుతున్నాం, దిగుతున్నాం, మళ్లీ మళ్లీ ప్రయాణిస్తున్నాం అంటే విమానం ఎన్ని ముందు జాగ్రత్తలతో, ఎంత సురక్షితంగా తయారవుతోందో చూడండి.
 
 ఏరోప్లేన్ డిజైన్
విమానం ఎక్కి, దిగితే మన ప్రయాణం పూర్తవుతుంది. కానీ ఎయిర్‌లైన్స్ సంస్థల ఇంజినీర్ల పని ఆ తర్వాతే మొదలవుతుంది. పూర్తయిన ప్రయాణకాలంలో ఆ విమానంలోని యంత్రపరికరాలు ఏయే పరిమితులకు లోబడి పనిచేశాయన్న వివరాలను, ఇతర అవసరమైన సమాచారాన్ని వారు జాగ్రత్తగా నమోదు చేసుకుంటారు. ఇలా ఇప్పటి వరకు గత యాభై ఏళ్లలోనూ జరిగిన ప్రయాణాలకు సంబంధించిన కోట్ల గంటల డేటా ఆయా సంస్థల దగ్గర ఉంది! ఆ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల డిజైనింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంటారు కనుక ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు శూన్యం. ప్రమాదం జరిగితే అనూహ్యమైన బయటి అవాంతరాల వల్ల జరగాల్సిందే కానీ లోపలి యంత్రాల వల్ల జరిగే అవకాశమే ఉండదు.
 
 కాక్‌పిట్ టెక్నాలజీ
కాక్‌పిట్‌లో సంప్రదాయ యంత్ర (మెకానికల్)  నియంత్రణ పద్ధతులు పోయి, వాటిస్థానంలో విద్యుత్కణ (ఎలక్ట్రానిక్) నియంత్రణ  విధానాలు వచ్చాక ప్రమాదాలు అరుదులో అరుదు అయిపోయాయి. జెట్ లైనర్స్  చాలావరకు ఇలా ఆధునికీకరణ చెందినవే. 777, 787 బోయింగులు, అలాగే ఎ330, ఎ340, ఎ380 అన్నీ ఇప్పుడు ‘ఫ్లయ్ బై వైర్’తో (కంప్యూటర్ పరిజ్ఞానంతో) నడుస్తున్నవే కాబట్టి ప్రమాదాలను ఊహించడం, వాటి నుంచి విమానాలను తప్పించడం తేలికయింది. సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమన్వయం చేసుకోగలిగితే చాలు పెలైట్ సక్సెస్ అయినట్లే.
 
 శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్, అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే, టెలీకమ్యూనికేషన్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాలు వచ్చాక విమానం కదలికల్లో కచ్చితత్వాన్ని పసిగట్టడడం పూర్వపు రోజులకన్న సులభం అయింది. 1950, 1960లలో 2లక్షల ప్రయాణాలకొకసారి ఘోర ప్రమాదం నమోదయ్యేది. ప్రపంచ వైమానిక రంగంలో సురక్షిత ప్రమాణాలు నాటితో పోలిస్తే నేడు 10 రెట్లు మెరుగవడంతో 20 లక్షల ప్రయాణాలకొక వైఫల్యం లేదా అంతకంటే తక్కువగా మాత్రమే దుర్ఘటనలు జరగడం కనిపిస్తోంది. ఈ గొప్పతనం అంతా కాక్‌పిట్ (పెలైట్ ఉండే చోటు)టెక్నాలజీదే.  
 
 పైలట్ చేతుల్లో పిట్ట ప్రాణం
 ఎంత తిరుగులేని టెక్నాలజీ అయినా పైలట్ అనుభవం, నైపుణ్యం, నిర్ణయ శక్తి అనే అంశాలపైనే సురక్షిత ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుందని చెస్లీ సలెన్‌బర్గర్ అంటారు. ఫస్ట్ ఆఫీసర్ జెఫ్ స్కిల్స్‌తో కలిసి అత్యంతాధునిక ఆటోమేటెడ్ ఎయిర్‌బస్ ఎ 320ను (యు.ఎస్. ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం.1549)ను న్యూయార్క్‌లోని హడ్సర్ నదిపై లోతు తక్కువ ప్రదేశంలో అత్యవసరంగా దింపి అందులోని 155 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ అతను. 2009లో జరిగిన ఈ ఘటనను విమాన ప్రయాణ చరిత్రలోనే ఒక మిరకిల్ అని, దాన్ని జాగ్రత్తగా నడిపి, కిందికి దించిన చెస్లీ సలెన్‌బర్గర్ గ్రేట్ పైలట్ అనీ ప్రపంచమంతా ప్రశంసించింది.
 
 విమానాన్ని నడుపుతున్నప్పుడు అన్ని వైపులనుండి వ చ్చిపడుతుండే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ప్రయాణ మార్గాలను అనుసరించడం, సంబంధిత వ్యక్తులతో అనుసంధానమై ఉండడం వంటివాటిలో పైలట్‌లకు శిక్షణ ఉంటుంది. వీటన్నిటితో పాటు, పైలట్ వ్యక్తిత్వాన్ని కూడా నియామక సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. వారిలోనూ వ్యక్తిగత సమస్యలకు ప్రభావితంకాని మనస్తత్వం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.  
 
 కాక్‌పిట్ సైజు
 సురక్షితమైన విమాన ప్రయాణానికి నిపుణుడైన పైలట్ తో పాటు విశాలమైన కాక్‌పిట్ కూడా అవసరం. ఈ అంశాన్ని జెట్‌లైనర్లు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాయి. విమాన నియంత్రణకు సంబంధించిన ప్రతి పరికరం, ప్రతి పరిజ్ఞానం పైలట్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న మార్పు సైతం పైలట్ కళ్లు గప్పి తప్పించుకోలేదు. ‘‘కాక్‌పిట్ విస్తృతి, ఆకారం, ఉపస్థితి (అప్పియరెన్స్), కాక్‌పిట్‌లోని ప్రతి స్విచ్, ప్రతి లైటు పైలట్ కనుసన్నలలో ఉంటాయి కనుక కాక్‌పిట్ లోపాల కారణంగా ప్రమాదం జరిగే అవకాశమే ఉండదు’’ అని జూలియన్  ఫాక్స్ కమింగ్ అంటారు. ఆయనకు బోయింగ్ 787లో కాక్‌పిట్ ఇంజినీరుగా పనిచేసిన అనుభవం ఉంది.
 
 ప్యాసింజర్ క్యాబిన్

 కాక్‌పిట్ సరే, ప్రయాణీకులు కూర్చునే ఏరోప్లేన్ బాడీ మాటేమిటి? అది కూడా కాక్‌పిట్ అంత పకడ్బందీగానే ఉంటుంది. కిక్కిరిసినట్లుండే ఎకానమీ సీట్లుగానీ, విశాలంగా ఉండే ఎగ్జిక్యూటివ్ సీట్లు గానీ ఎలాంటి తారతమ్యమూ లేకుండా విమానంలోని సీట్లన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతోనే ఉంటాయి. ఎక్కువ డబ్బుకు ఎక్కువ భద్రత, తక్కువ డబ్బుకు తక్కువ భద్రత ఉండదు. ఒక్కో సీటు పదహారింతల గురుత్వాకర్షణ శక్తిని తట్టుకునేలా తయారై ఉంటుంది. దీనివల్ల విమానం లేచేటప్పుడు,  అకస్మాత్తుగా ఆగినప్పుడు కుదుపులకు లోనైనా ఆ ఒత్తిడి కూర్చున్న వారిపై ఏమాత్రం ప్రభావం చూపదని విస్కాన్సిన్‌లోని ఎం.జి.ఎ. ఇంజినీరింగ్ విభాగం టెస్ట్ ఇంజినీరు డేవిడ్ ఎస్సే అంటారు.
 
  సీట్ల నిర్మాణంపై ఇంజినీర్లు తీసుకునే శ్రద్ధ ఇంతటితో అయిపోలేదు. సీట్లకు వాడే వస్త్రం, లోపలి కుషన్... మంటల్ని విస్తరించనివ్వని స్వభావాన్ని కలిగివుంటాయి. అంతేకాదు మంటల్ని ఆర్పే గుణం కూడా వాటికి ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు కొద్దిస్థాయిలో మాత్రమే అవి పొగను విడుదల చేస్తాయి. ఆ పొగలో కూడా హానికరమైన రసాయనాలు ఉండవు. సీటు వెనుక భాగం (వీపును ఆన్చే భాగం) సున్నితంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరానికి నొక్కుకుపోని విధంగా ఉంటుంది. ప్రయాణికుల క్యాబిన్ గోడలు అగ్నిమాపక కవచాల్లా ఉంటాయి. ఏ కారణం చేతనైనా మంటలు రేగి, పొగ ఆవరించినప్పుడు బయటికి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపించేలా లైట్స్ వాటంతట అవే వెలుగుతాయి. ఇంత సురక్షితమైన ఏర్పాట్లు ఉన్న కారణంగానే గత పదేళ్లలో 301 విమాన ప్రమాదాలు సంభవించినా వాటిల్లో ప్రాణాంతకమైనవి పావు వంతు కూడా లేవు.
 
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
 భూమి మీద ట్రాఫిక్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తూ, ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్లు కళ్లముందు చక్కగా సూచనలు ఇస్తూ ఉన్నప్పటికీ రోజూ వందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయే, మరి పైన ఆకాశంలో ఏమీ లేని చోట పైలట్ తన ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడం ఎలా సాధ్యమౌతోంది?
 
 ఇందులో పైలట్ ప్రావీణ్యం ఎంత ఉందో అంతకు రెండింతలుగా జి.పి.ఎస్. కేంద్రం పనితీరు కూడా ఉంటుంది. జి.పి.ఎస్.అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విమాన గమనాలను గమనిస్తూ, అవి దారి తప్పకుండా సూచనలు ఇస్తూ, ఎప్పటికప్పుడు పైలట్‌ను అప్రమత్తం చేస్తూ ఉంటుంది జి.పి.ఎస్. పూర్వం ఈ విధానం అందుబాటులో లేనప్పుడు మ్యాపులను దగ్గరపెట్టుకుని, బ్లాక్‌బోర్డ్ మీద చాక్‌పీస్‌తో లేదంటే పేపర్ మీద పెన్సిల్‌తో అంచనాలు వేసుకుంటూ పైన పైలట్‌కు కిందినుంచి సూచనలు ఇస్తుండేవారు. అప్పటికీ ఇప్పటికీ ప్రయాణికులు పెరిగారు, విమానాల సంఖ్య పెరిగింది. గగన వీధుల్లో ట్రాఫిక్ కూడా పెరిగింది. గత ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా నింగి నుంచి నేలకు 2 కోట్ల 80 లక్షల విమానాలు దిగాయి. ఇవన్నీ కూడా నింగిలోకి సురక్షితంగా టేకాఫ్ అయి, ప్రయాణాన్ని పూర్తిచేసినవే. పైన కాక్‌పిట్‌కీ, కింద కంట్రోల్ స్టేషన్‌కీ మధ్య కచ్చితమైన అనుసంధానం ఉండడం వల్ల విమానాలు ఒకదానిని ఒకటి  ఢీకొనడం అనేది దాదాపు అసాధ్యం.  
 
 పోటీ, ఆదాయం
 ఆదాయం కోసం పోటీ పడుతుండే విమానయాన సంస్థలు, తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భద్రత కోసం కేటాయించడంలో కూడా పోటీపడుతున్నాయి. కనుక ఈసారి మీరు విమానం ఎక్కినప్పుడు, కెప్టెన్ ఆహ్వానం పలకగానే నిశ్చింతగా వెళ్లి కూర్చోండి. హాయిగా వెనక్కి వాలి, మీరు అత్యంత సురక్షితమైన వాహనంలో ఉన్నారన్న ధీమాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి.
 
 అణువణువున భద్రత..  A380 - కొన్ని విశేషాలు
 ఏ దేశపు ఎయిర్‌లైన్స్‌కైనా ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యం. విమానం సామర్థ్యానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదాహరణకు A380 ఎయిర్‌బస్. దీని తయారీలో అణువణువు ప్రయాణికులకు సదుపాయంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అలాగే బోయింగ్ విమానాల్లోనూ సురక్షితమైన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి.  
 
-     ప్రపంచంలో కె ల్ల అతి పెద్ద విమానం అ380 ఎయిర్ బస్. 2007లో సేవలను ప్రారంభించిన ఈ ఎయిర్‌బస్ ప్రయాణికుల క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది.
-     A380 ఎత్తు 24.1 మీటర్లు. వెడల్పు 80 మీటర్లు. పొడవు 72.7 మీటర్లు. అంటే రెండు నీలి తిమింగలాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవుంటాయో అంత పొడవు.
-     ఈ ఎయిర్ బస్ (అ380) రెక్కలు... బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కల కన్నా 54 శాతం పెద్దవిగా ఉంటాయి.
-     ఇందులో ఒకేసారి కనీసం 525 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. 3000 సూట్‌కేసులు పెట్టుకోవచ్చు.
-     A380 ఎయిర్ బస్ రెక్కలు ఇంగ్లండ్‌లో తయారవుతాయి. తోక, విమాన ప్రధాన భాగం స్పెయిన్ , జర్మనీలలో తయారవుతాయి. ఈ భాగాలన్నీ పెద్ద పెద్ద ఓడలలో బిగింపుల (అసెంబ్లింగ్) కోసం ఫ్రాన్సుకు చేరుకుంటాయి.
-     ఎయిర్ బస్ ఇంధన సామర్థ్యం 81900 గ్యాలన్లు. బరువు 560 టన్నులు. సాధారణ పెద్ద విమానాలు వినియోగించుకునే ఇంధనంలో 17 శాతం తక్కువగా ఎయిస్ బస్ వినియోగించుకుంటుంది. ఒక్కో ప్రయాణికునికి వంద కి.మీ.లకు 4 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది.
-     ఈ భారీ విమానం 43,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
-     ఎయిర్ బస్‌లోని మూడు ప్రధాన భాగాలను 8000 బోల్టులు గట్టిగా కలిపి ఉంచుతాయి. మొత్తం మీద ఈ విమానంలో 40 లక్షల విడి భాగాలు ఉంటాయి. వీటిని 30 దేశాలలోని 1500 కంపెనీలు సరఫరా చేస్తాయి.
-     ఎయిర్‌బస్‌లోని పరికరాలన్నీ తేలికైనవీ, తక్కువ శబ్దం చేసేవీ, పర్యావరణహితమైనవీ. ఎయిర్ బస్ నుంచి వెలువడే కాలుష్యాలు, ధ్వని తరంగాలు, పొగలు కూడా మిగతా విమానాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ.
-     ఒక్కో ఎయిర్‌బస్ ప్రయాణ సామర్థ్యం 1,40,000 గంటలు.  
 
ఎయిర్‌పోర్ట్ కంట్రోల్
 విమానాశ్రయంలో ఉండే భద్రతా ఏర్పాట్లూ తక్కువేం కాదు. ముఖ్యంగా రన్‌వే మీదకు విమానం దిగుతున్నప్పుడు ‘మూవ్‌మెంట్ డిటెక్షన్ మానిటర్లు’ ప్రతి ఒక్క వాహనాన్ని, అంటే... రన్‌వేలు, ట్యాకీ వేలు, టెర్మినల్ గేట్‌ల దగ్గర ఉన్న వాహనాలను గమనించి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంటాయి. విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనూ మానిటర్లు మిగతా వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తుంటాయి. దీని వల్ల రన్‌వేపై ప్రమాదాలు జరిగే మాటే ఉండదు.

మరిన్ని వార్తలు