ఇచ్చిన మాట

13 Feb, 2016 22:40 IST|Sakshi
ఇచ్చిన మాట

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  33
తన భార్య బార్బరాకి కేన్సర్ అని తెలిసాక కూడా నెల్సన్ లియాన్‌తో అక్రమ సంబంధం కొనసాగించాడు. బార్బరా ఓ రోజు కోరింది.
 ‘‘నేను ఇంక జీవించేది మూడు నాలుగు నెలలే. దయచేసి రాత్రిళ్లు లేట్‌గా రాకండి.’’
 ‘‘కానీ ఆఫీస్‌లో ఓ గంట ఎక్కువ పనిచేస్తే కాని ప్రమోషన్ రాదు. ఆఫీస్ నించి ప్రతీరోజు లేట్‌గా బయటికి వచ్చేది నేనే’’ చెప్పాడు.
 బార్బరాకి తన వివాహేతర సంబంధం గురించి ఎలాంటి అనుమానం కలిగేలా తను ప్రవర్తించడం లేదని నెల్సన్ విశ్వసించాడు.

బార్బరా సంగతి అతనికి బాగా తెలుసు. పగ. పట్టుదల కల మనిషి. నిజం తెలిస్తే నానా యాగీ చేస్తుంది.
 అతనికి ఆమెతో ఆమె జీవితంలోని ఆఖరి వారాలు గడపాలనే ఉంది. కానీ లియాన్ మీద కలిగిన వ్యామోహం అతన్ని ఆమెకి దూరంగా ఉంచలేక పోతోంది. పైగా బార్బరా జుట్టు పూర్తిగా రాలిపోయి, మొహం, కళ్లు లోతుకి పోయి అందవికారంగా తయారైంది.
 ఐతే లియాన్‌కి మాత్రం తన భార్య కేన్సర్ గురించి చెప్పలేదు. చెప్తే ఆమె పోయేదాకా తన దగ్గరికి రానివ్వదనే భయం అతనిలో ఉంది.
   
‘‘ఈ శని ఆదివారాలు నేను ఆఫీస్ పనిమీద బయటికి వెళ్తున్నాను’’ నెల్సన్ శుక్రవారం ఆఫీస్ నించి ఫోన్ చేసి తన భార్యకి చెప్పాడు.
 ‘‘అదేమిటి? శనాదివారాలు ఆఫీస్ పనా?’’ బార్బరా ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
 ‘‘అవును. శని ఆదివారాలు సాధారణంగా ఆడిటర్స్ రారు కాబట్టి రీజెన్సీ హోటల్ మేనేజర్ కేష్‌ని స్వల్పకాల అప్పుకి తిప్పుతున్నాడని మా ఆడిట్ ఫర్మ్‌కి సమాచారం అందింది. న్యూయార్క్‌లోని ఆ హోటల్, ఇతర అలాంటి సంస్థలకి మా టీం తనిఖీకి వెళ్తోంది.’’

 ‘‘ఇది శని ఆదివారాలే చేయాల్సిన పనన్నమాట.’’
 ‘‘అవును. మొత్తం ముగ్గురం వెళ్తున్నాం.’’
 ‘‘మిగిలిన వారి భార్యల సంగతి నాకు తెలియదు కానీ, నేను వెళ్లిపోయే లోగా మీరు నాతో గడిపే రోజులు లెక్కపెడుతున్నాను’’ బార్బరా బాధగా చెప్పింది.
 క్షణకాలం తర్వాత ఆడిట్ రద్దయిందని చెప్దామా అనిపించింది. కానీ కాలం గడిచి ‘ఆ తర్వాత’ వచ్చాక చెప్పబుద్ధి కాలేదు. లియాన్ ఈ వీకెండ్ గురించి అనేక కలలు కంటోంది. ఆమెని నిరాశపరచడం అతనికి ఇష్టం లేకపోయింది.

 ఆ శని ఆదివారాలు బఫెలో లోని ఓ మోటెల్‌లో వారిద్దరూ బస చేసారు. నేచర్ పార్క్‌లో లంచ్ చేసారు. నయాగరా జలపాతం మీద హాట్ ఎయిర్ బెలూన్‌లో, ఆ తర్వాత హెలికాఫ్టర్‌లో ఎగిరారు. రాత్రి ఓ ఖరీదైన రెస్ట్‌రెంట్‌లో వైన్ తాగి భోజనం చేసారు. హనీమూన్‌కి వచ్చిన దంపతులు ఎలా గడుపుతారో ఆ రెండు రోజులూ అలా గడిపారు. బార్బరా మరణిస్తే తనకి ఇన్సూరెన్స్ కంపెనీ నించి ఐదు లక్షల డాలర్లు వస్తాయనే ధీమాతో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.

 తిరిగి వచ్చాక బార్బరా ఇంట్లో లేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆమె ఇంకాస్త నీరసంగా కనిపించింది.
 ‘‘ఇంకొక వారం మించకపోవచ్చు. ఇక్కడ ఉంచుతారా లేక ఇంటికి తీసుకువెళ్తారా అన్నది మీ ఇష్టం. ఇక్కడ ఉంటే, బాధ తెలియకుండా సమయానికి మందులు ఇవ్వగలం. ఇంటికి తీసుకెళ్తే బాధ భరించాల్సి ఉంటుంది’’ డాక్టర్ సూచించాడు.
 ఆ వారం రోజులు పాతిక వేల డాలర్ల పైనే ఖర్చు చేయడానికి అతని దగ్గర డబ్బు లేదు. లియాన్ మోజులో పడి అంతకి రెట్టింపు ఖర్చు చేసేసాడు.
 అప్పు కోసం ప్రయత్నించకుండా భార్యని ఇంటికి తీసుకెళ్లాడు.
   
మరణానికి ముందు రోజు రాత్రి బార్బరా తన భర్తతో చెప్పింది.
 ‘‘నాదో కోరిక.’’
 ‘‘ఏమిటది?’’
 ‘‘మాట తప్పనని ప్రామిస్ చేస్తే చెప్తాను.’’
 అతను ఒట్టు పెట్టాక చెప్పింది.
 ‘‘దయచేసి ఎన్నటికీ మన బేంక్‌లోని సేఫ్ డిపాజిట్ బాక్స్ తెరవకండి. ఎన్నటికీ. ఎందుకని కూడా అడక్కండి. ఇదే నేను కోరేది.’’
 అతను మాట ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుఝామున అతని చేతికి చల్లటి భార్య శరీరం తగలడంతో మెలకువ వచ్చింది.
   
తెరవాలి. తెరవకూడదు. తను ఆ బాక్స్‌ని తెరవాలి. వద్దు. ఎట్టి పరిస్థితిలో తెరవద్దని బార్బరా ఆఖరి కోరిక కాబట్టి తెరవకపోతే బేంక్ వాళ్లు టైం దాటాక పగలకొట్టి అందులోవి వేలం వేస్తారు.
 కానీ అంతకుముందుగా ఓసారి తెరిచి చూస్తే? కానీ అది మాట తప్పినట్లుగా అవుతుంది.

 బార్బరాకి ఇచ్చిన ఆఖరి వాగ్దానాన్ని మన్నించాలని ఉంది. అతనికి దాన్ని తెరిచి చూడాలనే ఆసక్తీ ఉంది. అందులోని నల్ల పెట్టెలో ఏముందో తెలుసుకుంటే? ఆమె భూమికి ఆరడుగుల లోతున ఉంది. తను చూడకూడని సమాచారం బార్బరాకి ఏముంది? చివరికి దాన్ని తెరవాలనే నిశ్చయించుకున్నాడు.
 బేంక్‌కి తాళం చెవితో వెళ్లి సేఫ్ డిపాజిట్ బాక్స్‌ని తెరిచాడు. తన భార్య చేతి రాతలో ఓ కాగితం కనిపించింది.
 ‘‘మీరు మోసం చేస్తున్నారు. ఇందులోని నల్ల పెట్టెని మాత్రం తెరవకండి.’

 స్మశానంలోంచి తన భార్య తనని సాధిస్తోందని అతనికి అనిపించింది. పెట్టె తెరిస్తే అందులోనిది విలువైనదయితే తను అమ్మచ్చేమో! కానీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము తనకి చాలదా? డబ్బు కోసం కాదు. వద్దన్న పని చేయాలని కూడా కాదు. ఆసక్తి. దాన్ని చంపుకోలేక ఆ నల్ల పెట్టెని అందుకుని తెరిచాడు. మూత గట్టిగా ఉండడంతో బలంగా తెరవాల్సి వచ్చింది. వెంటనే లోపల్నించి తెల్లటి పొడి అతని ఒంటి మీద పడింది. ఆశ్చర్చపోయాడు. బార్బరాకి డ్రగ్స్ అలవాటా? కొద్దిగా తీసుకుని వాసన చూసాడు.

 బార్బరా చేతి రాతతో ఆ పెట్టెలో మరో కాగితం కనిపించింది.
 డియరెస్ట్ డియరెస్ట్ నెల్సన్,
 లియాన్‌తో తిరిగి నువ్వు నా గుండెని బద్దలు కొట్టావు. ఇప్పుడు నా నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు. ఇక నువ్వు జీవించవు.’
 కాదు. ఇది కొకైన్ కాదు. బార్బరా తనని ఇంత పట్టుదలగా, ఇంత పగగా చంప... చంపగలుగు...
 (తారా అన్‌టైడ్ కథకి స్వేచ్ఛావాదం)

మరిన్ని వార్తలు