మొత్తం హాలీవుడ్ చలవే!

10 Oct, 2015 23:07 IST|Sakshi
మొత్తం హాలీవుడ్ చలవే!

ఆ సీన్ - ఈ సీన్
‘మల్లీశ్వరి’... దగ్గుబాటి వెంకటేశ్, కత్రినా కైఫ్‌లు హీరో హీరోయిన్లుగా, విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన త్రివిక్రమ్ విరచిత  హిట్ సినిమా. ఈ సినిమా టైటిల్‌ను అలనాటి ‘మల్లీశ్వరి’ సినిమా స్ఫూర్తితో పెట్టుకున్నారనేది సుస్పష్టమైన అంశం. 1951లో ఎన్టీఆర్, భానుమతీ రామకృష్ణలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రరాజం ‘మల్లీశ్వరి’. మళ్లీ అదే పేరుతో, 2004లో విడుదలయిన చిత్రమిది. అయితే టైటిల్‌ను పాత తెలుగు సినిమా నుంచి తీసుకున్నారు కానీ... కథ, కథనాలను మాత్రం హాలీవుడ్ నుంచే ఎత్తుకొచ్చారు. మన నయా ‘మల్లీశ్వరి’కి మార్గం చూసిన ఆ ఆంగ్ల చిత్రం గురించి తెలుసుకోవాలంటే యాభై ఏళ్లు వెనక్కి వెళ్లాలి.
 
సాధారణంగా... కాపీ కొట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఒక్కసారి ఆ ధైర్యం వచ్చిందంటే... ఆపై చాలా వరకూ వ్యక్తిగత సృజన చచ్చిపోతుంది. ఆలోచనల్లో పదునూ తగ్గిపోతుంది. అయితే త్రివిక్రమ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. కథాంశాన్ని విదేశీ సినిమాల నుంచి స్వీకరించడానికి ఏమాత్రం మొహమాటపడని ఈ రచయిత, దాన్ని తెలుగువారి అభిరుచికి అనుగుణంగా వండి వార్చడంలో ఎంతో ప్రతిభను ప్రద ర్శిస్తారు. ఆయనలోని ఆ ప్రతిభను ఆవిష్కరించిన చిత్రం ‘మల్లీశ్వరి’. అయితే ఈ సినిమా కథ విషయంలో ఒరిజినల్ రచయితలకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వని ఈ రచయిత, తెలుగు వెర్షన్ సినిమాను ప్రెజెంట్ చేయడంలో కూడా ఆ స్థాయిని రీచ్ కాలేకపోయారన్నది కాదనలేని నిజం.
 
1953లో విడుదలైన ‘రోమన్ హాలీడే’ అనే ఆంగ్ల కళాఖండాన్ని... తెలుగులో ఒక సాధారణ కమర్షియల్ సినిమాగా మార్చే శారు త్రివిక్రమ్. రాజ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి, సాధారణ జీవితాన్ని గడపడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ‘రోమన్ హాలీడే’. రాజకుమారి అని తెలీక ఆమెను ప్రేమించే హీరో, అతనిని ఆమె సరదాగా ఏడిపించే తీరు, వీరిద్దరి మధ్య హీరో సహాయకుడు...

ఈ పాత్రల తీరు ‘మల్లీశ్వరి’లో వెంకటేశ్, కత్రినాకైఫ్, సునీల్ పాత్రలకు స్ఫూర్తి అన్నది స్పష్టం. జన సామాన్యంలోకి వచ్చిన రాజకుమారి అమాయకత్వాన్ని ఎలివేట్ చేసే సీన్లలో కూడా ఇరు సినిమాల మధ్య బోలెడు పోలికలుంటాయి. తేడా ఏమిటంటే... తెలుగు వెర్షన్‌లో హీరో, హీరోయిన్ల కథలు సమాంతరంగా నడుస్తాయి. వాటికి ‘పెళ్లి కాని ప్రసాద్’ పాయింట్‌ని యాడ్ చేశారు. హీరోని అంతఃపురంలోకి పంపి సరదా సీన్లను క్రియేట్ చేశారు.
 
అయితే ఈ కాపీ ‘రోమన్ హాలీడే’తో ఆగిపోలేదు. కత్రినా కైఫ్ ప్యాలెస్‌లో కుక్కతో ఉండే కామెడీ, మరికొన్ని సీన్లు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి తస్కరించినవే! ఇలా సీన్ల వారీగా లెక్కగ డితే ‘మల్లీశ్వరి’లో ‘రోమన్ హాలీడే’తో పాటు చాలా హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి!
 మూలకథ ‘రోమన్ హాలీడే’ నుంచి తీసుకొని, హాలీవుడ్ రొమాంటిక్ కామెడీల నుంచి కొన్ని సీన్లను తీసుకుని సినిమాను అల్లుకుంటూ పోయి.. క్లైమాక్స్ దగ్గర మళ్లీ ‘రోమన్ హాలీడే’ మంత్రం పఠించారు రచయిత. ప్రెస్‌మీట్ పెట్టి మల్లీశ్వరిని రాజకుమారిగా పరిచయం చేసే పతాక సన్నివేశాలు సైతం హాలీవుడ్ సినిమా లోనివే.

ఈ సీన్లో వెంకటేశ్, సునీల్‌లు జర్నలిస్టులమంటూ ఆ ప్రెస్ మీట్‌కు వెళతారు కదా! అయితే హాలీవుడ్ సినిమాలో హీరో, అతడి సహాయకుడు నిజంగానే జర్నలిస్టులు.
 ‘మల్లీశ్వరి’లో హీరో, హీరోయిన్లు ఒక్కటవ్వడంతో సినిమా సరదాగా ముగుస్తుంది. కానీ హాలీవుడ్‌లో మాత్రం సెన్సిబుల్ ట్రాజెడీ ఎండింగ్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ ‘రోమన్ హాలీడే’ విలువను పెంచుతుంది. అదే ఆ సినిమాను అకాడెమీ అవార్డు వరకూ తీసుకెళ్లిందని పిస్తుంది. కానీ మనకు విషాదాంతాలు నచ్చవు కాబట్టి, తెలుగులో అదొక్కటీ మార్చి ఉంటారనుకోవాలి!
 - బి.జీవన్‌రెడ్డి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు